నాగశౌర్య ఇచ్చిన కారును అమ్మలేదు 
close
Published : 20/02/2020 18:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నాగశౌర్య ఇచ్చిన కారును అమ్మలేదు 

నా సెంటిమెంట్‌ త్రివిక్రమ్‌: వెంకీ కుడుముల

హైదరాబాద్‌: ‘ఛలో’ సినిమాతో తెలుగు తెరకు దర్శకుడిగా పరిచయమై.. మొదటి సినిమాతోనే థియేటర్‌లో ప్రేక్షకులతో నవ్వులు పూయించిన దర్శకుడు వెంకీ కుడుముల. ఈ సినిమాతో టాలీవుడ్‌ యువకథానాయకుడు నాగశౌర్యకు బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని అందించడంతోపాటు మొదటి సినిమాతోనే హిట్‌ అందుకున్నారు వెంకీ. ప్రస్తుతం ఆయన దర్శకత్వం వహించిన చిత్రం ‘భీష్మ’. నితిన్‌ కథానాయకుడిగా నటించిన ఈ సినిమాలో రష్మిక కథానాయిక. శుక్రవారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో వెంకీ కుడుముల విలేకర్లతో సరదాగా ముచ్చటించారు. ఆ విశేషాలివే..   

అనంత్‌ నాగ్‌ అలా..

‘భీష్మ’ సినిమా అనుకున్నప్పుడు ఒకరోజు నా ఫ్రెండ్‌, అనంత్‌ నాగ్‌కు సంబంధించిన ఓ వీడియోను షేర్‌ చేశాడు. ఆయన నటన నాకెంతో నచ్చింది. వెంటనే నేను ఈ పాత్రకు ఆయనైతేనే కరెక్ట్‌ అనిపించింది. అలా ఒకరోజు ఆయన్ని కలిశాను. వేరే భాషల్లో సినిమాలు చేయనని చెప్పారు. కానీ నేను.. ‘ఒక్కసారి కథ వినండి సర్‌’ అని అడిగాను. ఆయన కథ విన్నారు. నేను చెప్పిన కథ, పాత్ర బాగా నచ్చడంతో ఆయన వెంటనే ‘భీష్మ’ సినిమా చేయడానికి ఓకే చేశారు.

నితిన్‌ను వెయిట్‌ చేయించా..

‘ఛలో’ సినిమా తర్వాత నితిన్‌తో సినిమా చేయాలనుకున్నాను. అయితే ఆ సమయంలో నితిన్‌కి తగ్గట్టు సరైన కథ రాయాలనుకున్నాను. అప్పట్లో అందరూ ఆయన్ని మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌ అనేవాళ్లు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ‘భీష్మ’ మెయిన్‌ లైన్‌ రాశాను. నితిన్‌ని కలిసి మెయిన్‌ లైన్‌ చెప్పాను. ఆయన ఓకే అన్నారు. కాకపోతే పూర్తి స్ర్కిప్ట్‌తో రమ్మన్నారు. అలా ఏడాది సమయం తీసుకుని పూర్తి స్ర్కిప్ట్‌ రాసుకున్నాను. నిజం చెప్పాలంటే నావల్ల ఆయన ఏడాది వెయిట్‌ చేశాడు.

ఆలోచింపచేసే చిత్రం..

ఇంట్లోవాళ్లు డిగ్రీ చేయమని అడిగితే.. వాళ్ల కోరిక మేరకు అగ్రికల్చర్‌ బిజినెస్‌ మేనేజిమెంట్‌లో గ్రాడ్యూయేట్‌ అయ్యాను. కాకపోతే నాకు చిన్నప్పటి నుంచి సినిమా అంటే చాలా ఇష్టం. అలా గ్రాడ్యూయేట్‌ని అయ్యాక సినిమాల్లోకి వెళ్తానని ఇంట్లో వాళ్లకి చెప్పాను. వాళ్లు ఒప్పుకున్నారు. అందుకే ఈ సినిమాలో సేంద్రియ వ్యవసాయం గురించి చూపించాను. పంట త్వరగా చేతికి రావాలని వ్యవసాయంలో కొందరు రసాయనాలను ఎక్కువగా వాడుతుంటారు. అలా చేయడం వల్ల వచ్చే సమస్యలేంటి అనేది చూపిస్తూనే.. రొమాంటిక్‌, కామెడీ జోనర్లలో ‘భీష్మ’ని తెరకెక్కించాం. ఈ సినిమా అందర్నీ ఆలోచింప చేస్తుందని భావిస్తున్నాను. 

మాది వ్యవసాయమే..

మాది అశ్వారావుపేట. అక్కడ మా నాన్నగారు వ్యవసాయం చేస్తున్నారు. నేను కూడా ఖాళీ సమయాల్లో అక్కడికి వెళ్లినప్పుడు వ్యవసాయం చేస్తుంటాను. ‘భీష్మ’ అనుకున్నప్పటి నుంచి ఆయన కూడా సేంద్రియ పద్ధతులతో వ్యవసాయం చేయడం మొదలుపెట్టారు. నాకు మెడిసిన్‌ తర్వాత అగ్రికల్చర్ అంటే బాగా ఇష్టం.

ప్రతీది పరీక్షే..

నాకు ప్రతి సినిమా ఒక పరీక్ష లాంటిదే. ఎందుకంటే మొదటి సినిమాకు ఎలా పనిచేశానో.. ఇప్పుడు కూడా అలాగే వర్క్‌ చేశాను. నా వర్కింగ్‌ స్టైల్‌లో ఎలాంటి మార్పు రాలేదు. కాకపోతే మొదటి సినిమా టైంలో నేను రాసిన డైలాగులు నాకే కామెడీగా అనిపిస్తున్నాయా? లేక ప్రేక్షకుడిని కూడా మెప్పిస్తాయా? అనే డౌట్‌ ఉండేది. ఒక్కసారి ఆ సినిమా ప్రేక్షకులను అలరించాక నాకు ధైర్యం వచ్చింది.  

‘తెలుగు’ తప్పా తెలుగు రాదు

రష్మిక మంచి నటి. నా మొదటి సినిమా ‘ఛలో’ చేస్తున్నప్పుడు రష్మికకు ‘తెలుగు’ అనే పదం తప్పా వేరే తెలుగు రాదు. ఆ తర్వాత తను తెలుగు నేర్చుకుని డబ్బింగ్‌ చెప్పింది. ‘ఛలో’ సినిమాలో రష్మిక హావభావాలు నాకు బాగా నచ్చాయి. కాకపోతే నేను రెండో సినిమా చేసేసరికి తను సూపర్‌స్టార్‌ అయ్యింది. అసలు నా కథ ఒప్పుకుంటుందో, లేదో అని భయపడ్డాను. నిజం చెప్పాలంటే ఈ కథలో చైత్ర పాత్ర రాస్తున్నప్పుడు తనని దృష్టిలో ఉంచుకునే రాశాను. ‘భీష్మ’ కథ చెప్పగానే వెంటనే ఓకే చేసింది.

కారు అమ్మలేదు..

‘ఛలో’ సినిమా విజయం సాధించడంతో నాగశౌర్య నాకు కారు గిఫ్ట్‌గా ఇచ్చారు. నా ఫస్ట్‌ సినిమాకు వచ్చిన బహుమతి. దానిని నేను అమ్మలేదు. అమ్మను. మా ఇద్దరి వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయాలను తెలుసుకోవడానికి ప్రేక్షకులు ఆసక్తి కనబరచరని నా ఉద్దేశం.

త్రివిక్రమ్‌ నా సెంటిమెంట్‌..

టాలీవుడ్‌లో ఉన్న ఉత్తమ రచయిత త్రివిక్రమ్‌ గారు. మనం ఏం రాసినా త్రివిక్రమ్‌గారు చెప్పిన డైలాగ్‌లాగానే అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన అన్ని రాసేశారు. నేను ఆయనకు పెద్ద అభిమానిని. అందుకే నేను రాసే మాటలు.. చాలా వరకూ ఆయన డైలాగ్స్‌లా అనిపిస్తుంటాయి. ఆయన నాకు ఒక సెంటిమెంట్‌. ‘ఛలో’ సినిమా టైంలో ట్రైలర్‌ విడుదల చేశారు. సినిమా విజయం సాధించింది. ఇప్పుడు ‘భీష్మ’ కూడా విజయం సాధిస్తుందని భావిస్తున్నాను.

 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని