‘ఆ పాత్రకు రవి.. డబ్బింగ్‌ ఏం చెబుతాడు’అన్నారు!
close
Published : 04/03/2020 11:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘ఆ పాత్రకు రవి.. డబ్బింగ్‌ ఏం చెబుతాడు’అన్నారు!

‘అరుంధతి’ ముందు, తర్వాత నా పరిస్థితి అదే!

సింహం నుంచి వచ్చే శ్వాస కూడా అడవిని దద్దరిల్లేలా చేస్తుంది. ఆయన నుంచి వచ్చే శ్వాస కూడా మహా అరణ్యంలాంటి సినీ పరిశ్రమను అదిరిపోయేలా చేస్తుంది. ఎందుకంటే ఆయన మాట కంచుకోట.. ఆయన మాట అందరి మనుసులో కచ్చితంగా దిగే తూటా.. ఆయన మాట కళామ్మతల్లికి కాసుల మూట.. ఆయనే ప్రముఖ డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌, నటుడు రవిశంకర్‌. ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే ఆలీతో సరదాగా కార్యక్రమానికి విచ్చేసి తన డబ్బింగ్‌, నటన కెరీర్‌, మైలురాళ్లు ఇలా ఎన్నో విశేషాలను పంచుకున్నారు. 

మీరు డబ్బింగ్‌, యాక్టింగ్‌, సింగింగ్‌లతో భయపెట్టారు. మరి ఇంట్లో భయపడేది మీరా? మీ భార్య?

రవి శంకర్‌: ఇంట్లో ఎప్పుడూ భయపడేది మనమే. ఆ విషయం మీకూ తెలుసు. (నవ్వులు)

మీ తండ్రి పీజే శర్మ ఆస్తులు ఇవ్వకపోయినా వాయిస్‌ ఇచ్చారని ఇండస్ట్రీలో టాక్‌. దాని వల్ల మంచి జరిగిందా? చెడు జరిగిందా? 

రవి శంకర్‌: చాలా మంచి జరిగింది. ఆస్తి ఇచ్చి ఉంటే, ఏదో పిచ్చి పనులు చేసి మొత్తం పొగొట్టేవాళ్లవేమో. కానీ, ఆయన తరగని ఆస్తి గొంతు ఇచ్చారు. దీన్ని పెట్టుకుని ఇప్పటి వరకూ దక్షిణాది భాషల్లో  3500 సినిమాలకు డబ్బింగ్‌ చెప్పా. 

హిందీ ఆర్టిస్ట్‌లకు డబ్బింగ్‌ చెబుతారు. హిందీలో డబ్బింగ్‌ చెప్పలేదా?

రవి శంకర్‌: అవును! చాలా మంది హిందీ ఆర్టిస్ట్‌లకు డబ్బింగ్‌ చెప్పా. అమితాబ్ బచ్చన్‌, డానీ, అంబ్రేష్‌ పూరి, ఆషిశ్‌ విద్యార్థి, సాయాజీ షిండే, సోనూసూద్‌, ముఖేశ్‌ రుషి, అశుతోష్‌ రాణా ఇలా మంది ఉన్నారు. అలాగే, కన్నడ నుంచి వచ్చిన దేవరాజ్‌, ప్రకాశ్‌రాజ్‌లకు నేనే డబ్బింగ్‌ చెప్పా. ‘స్నేహం కోసం’ వరకూ ప్రకాశ్‌రాజ్‌కు నేనే డబ్బింగ్‌ చెప్పేవాడిని. ‘అంతఃపురం’ చిత్రం నుంచి ఆయనే స్వయంగా డబ్బింగ్‌ చెప్పుకోవడం మొదలు పెట్టారు. 

‘సన్నాఫ్‌ సత్యమూర్తి’కి మీరు డబ్బింగ్‌ చెప్పారు కదా! అందుకు మీకు ఇచ్చిన రెమ్యునరేషన్‌లో సగం నాకివ్వాలి!

రవి శంకర్‌: అవునా! ఒక స్నేహితుడిగా నువ్వు అడిగితే ఇస్తా. కానీ, ఎందుకో తెలుసుకోవాలని ఉంది. (వెంటనే ఆలీ సమాధానం ఇస్తూ.. అప్పటికే షూటింగ్‌ అయిపోయింది. ఉపేంద్రకు ఎవరో డబ్బింగ్‌ చెప్పారు. నేను డబ్బింగ్‌ చెబుదామని వెళ్లిన సమయంలో.. ఉపేంద్రకు డబ్బింగ్‌ చెప్పిన వారి వాయిస్‌ విని, త్రివిక్రమ్‌గారిని పిలిచి ‘సర్‌ ఈ వాయిస్‌నే ఉంచుతారా? అంతగా బాగోలేదు. ఈ పాత్రకు రవి వాయిస్‌ అయితే చాలా బాగుంటుంది’ అని అన్నా. ఆయన కూడా ‘మీకూ అదే అనిపించిందా? నాకూ కూడా అలాగే ఉంది. ఈ పాత్రకు రవితోనే చెప్పిస్తా’ అని అప్పుడు నిన్ను పిలిచి డబ్బింగ్‌ చెప్పించారు. ఆ తర్వాత రెండు రోజులకు నేను మళ్లీ డబ్బింగ్‌ చెప్పడానికి వెళ్తే, ఉపేంద్రకు కరెక్ట్‌ వాయిస్‌ దొరికింది అనిపించింది. ఒక పాత్రకు సరైన వాయిస్‌ ఉంటే ఆ పాత్రకు న్యాయం జరుగుతుంది. ఒక వేళ ‘అరుంధతి’లో సోనూసూద్‌ పాత్రకు నువ్వు కనుక డబ్బింగ్‌ చెప్పకపోతే, ఆయనకు అవార్డు వచ్చేది కాదు, అంత గొప్ప యాక్టర్‌ అయ్యేవాడు కాదు. చప్పట్లు)

అరుంధతి ముందు.. తర్వాత మీ కెరీర్‌ పరిస్థితి ఏంటి?

రవి శంకర్‌: సాయికుమార్‌ తమ్ముడిని కావడంతో ‘అరుంధతి’ ముందు వరకూ సాయిరవి అని పిలిచేవారు. ఆ సినిమా తర్వాత ‘బొమ్మాళి రవిశంకర్‌’ అయ్యాను. మొదటిసారి నా పేరుకు గుర్తింపు వచ్చింది. అరుంధతి లైఫ్‌లో టర్నింగ్‌. ఆ సినిమా తర్వాత సోనుసూద్‌ రెండు, మూడుసార్లు కలిశాడు. చాలా సంతోషించాడు. 

ప్రస్తుతం కన్నడలో ఏం చేస్తున్నారు?

రవి శంకర్‌: ప్రస్తుతం నాకు కన్నడ నటుడిగా మంచి అవకాశాలు వస్తున్నాయి. తమిళంలో సూర్య నటించిన ‘సింగం’ను కన్నడలో సుదీప్‌ హీరోగా ‘కెంపెగౌడ’గా తీశారు. అందులో నాది ప్రకాశ్‌రాజ్‌ పోషించిన పాత్ర. ఆ క్యారెక్టర్‌కు మంచి పేరు వచ్చింది. అప్పటి నుంచి వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నాయి. 

కర్ణాటకలో మిమ్మల్ని చూస్తూ మహిళలు భయపడతారట!

రవి శంకర్‌: మొదటి ఐదేళ్లు అలాగే ఉండేది. ‘కెంపెగౌడ’ తర్వాత నేను నటించిన చిత్రాలన్నీ వరుసగా హిట్టయ్యాయి. తెలుగులో ‘మిర్చి’ని సుదీప్‌ తీశారు. అందులో సంపత్‌ చేసిన క్యారెక్టర్‌ నేను చేశా. దానికీ మంచి పేరొచ్చింది. ఆ తర్వాత ‘దండుపాళ్యం’ చేశా. తమిళంలో విజయ్‌తో ఒక సినిమా  చేశా. ఆ సినిమాను మా ఆవిడతో కలిసి థియేటర్‌లో చూసి వస్తుంటే ‘వీడితో ఎలా సంసారం చేస్తున్నరమ్మా’ అని అక్కడి మహిళలు అన్నారు. ఆ తర్వాత ‘విక్టరీ’, ‘అధ్యక్ష’ తదితర చిత్రాల్లో మంచి క్యారెక్టర్‌లు చేశా. అప్పటి నుంచి పర్వాలేదు. 

మరి ఇంత భారీ పర్సనాలిటీ, అద్భుతమైన వాయిస్‌ ఉన్న మీకు తెలుగులో అవకాశాలు ఎందుకు రాలేదు?

రవి శంకర్‌: ఇక్కడ రాసిపెట్టిలేదేమో. బహుశా నాకు కర్ణాటకలో రాసిపెట్టి ఉందేమో. ఇప్పటికే 50ఏళ్లు దాటేశాం. అన్నయ్య సాయికుమార్‌ కన్నా కూడా నా విషయంలో అమ్మ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. నాకు ఎన్నో నేర్పించారు. వెంపటి చిన సత్యంగారి దగ్గర కూచిపూడి నేర్చుకున్నా, బాల మురళీకృష్ణగారి దగ్గర సంగీతం నేర్చుకున్నా. డ్యాన్స్‌లు, ఫైట్‌లు, హార్స్‌రైడింగ్‌ అన్నీ నేర్పించారు. నన్ను ఒక స్టార్‌ను చేద్దామని ఆమె ఉద్దేశం. మంచి వేషాలు వచ్చినా, గుర్తింపు రాలేదు. అయితే, తెలుగు సినిమాల్లో చేస్తున్న అందరి విలన్‌లు, ప్రముఖ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌లకు నేనే డబ్బింగ్‌ చెప్పా. రాజమౌళిగారి ‘సింహాద్రి’ నుంచి ఆయన సినిమాల్లో విలన్‌లకు నేనే డబ్బింగ్‌ చెబుతున్నా. ‘సింహాద్రి’లో అటు ముఖశ్‌రుషి, ఇటు నాజర్‌కు నేనే డబ్బింగ్‌ చెప్పా, ‘సై’లో ప్రదీప్‌రావత్‌, ‘విక్రమార్కుడు’లో బావోజీ పాత్రకు, ‘బాహుబలి’లో కట్టప్ప పాత్రకు నేనే వాయిస్‌ ఇచ్చా. అందరికీ నా గొంతు నచ్చింది తప్ప నాకు మంచి వేషాలు పడలేదు. అయితే నేను చేసిన కొన్ని చిత్రాలు ఆడలేదు. గోపీచంద్‌ ‘తొలి వలపు’ లో నాది మంచి పాత్ర కానీ, బాగా ఆడలేదు. ‘ఢమరుకం’తో నాకు బ్రేక్‌ వస్తుందనుకున్నారు. నాన్నకూడా ఈ సినిమా చూసి మెచ్చుకున్నారు.

అమ్మానాన్నల్లో మీకు ఎవరంటే ఇష్టం?

రవి శంకర్‌: అమ్మానాన్నలు ఇద్దరూ ఇష్టమే. (మధ్యలో ఆలీ అందుకుని, సాయి ఎక్కువగా అమ్మను ప్రేమిస్తే, శర్మగారు ఎక్కువగా నిన్ను ఇష్టపడేవారట. ఎందుకంటే ఆ హైటు, వాయిస్‌ అంతా ఆయనలా ఉంటావని అనుకునేవారట. ఇక మా ఇంట్లో చిన్నవారు అయ్యప్ప) 

మీది ప్రేమ వివాహమా? పెద్దలు కుదిర్చిన పెళ్లా?

రవి శంకర్‌: ప్రేమ వివాహమే. నేను పుట్టి పెరిగిందంతా చెన్నైలోనే. నేను ఇంటర్‌ చదువుతుండగా కల్చరల్‌ యాక్టివిటీస్‌లో బాగా ఉండేవాడిని. నేను, సింగర్‌ ఉన్ని కృష్ణన్‌, చక్రవర్తిగారి అబ్బాయి శ్రీ మేమంతా ఫ్రెండ్స్‌. తొలిసారి అక్కడే ఆమెను మొదటిసారి చూశా. సాధారణంగా అమ్మాయిని చూడగానే ‘చాలా బాగుంది’ అని అనుకుంటాం. కానీ నేను నా ఫ్రెండ్స్‌తో ‘నేను పెళ్లి చేసుకుంటే, ఈ అమ్మాయినే చేసుకుంటా’ అని చెప్పా. తను పంజాబీ. 1992లో మాకు పెళ్లయింది. 

అమ్మాయిని ప్రేమిస్తే, గిఫ్ట్‌లు ఇవ్వడం సహజం. కానీ, మీరేంటి ఓ పెద్ద క్రిస్మస్‌ చెట్టు ఇచ్చారట!

రవి శంకర్‌: అన్ని రకాల పండగలను వాళ్లు బాగా చేసుకుంటారు. మా మామగారు క్రిస్టియన్‌. నాకు పరిచయం అయిన ఏడాది డిసెంబరు 23న వాళ్లింటికి వెళ్లాను. అప్పుడు ‘క్రిస్మస్ చెట్టు దొరకలేదు’ అని చెప్పింది. అప్పుడు వరద అనే స్నేహితుడిని తీసుకుని బైక్‌పై మహాబలిపురం వరకూ వెళ్లి 9 అడుగుల చెట్టును తీసుకొచ్చా. ఆమె ఇంటికి వెళ్లి తలుపు ముందు పెట్టి, బెల్‌ కొట్టి దాక్కున్నా. తను సర్‌ప్రైజ్‌. అలా జరిగింది. మాకు ఒక్కడే అబ్బాయి. అమెరికాలో ఫిల్మ్‌, యాక్టింగ్‌ స్కూల్లో చదువుకుంటున్నాడు. ఇప్పటికే రెండేళ్లు పూర్తయింది. త్వరలోనే ఇండియాకు వస్తాడు. ఆ తర్వాత వెండితెరకు పరిచయం చేస్తాం. 

మరి మీ ఇంట్లో ప్రేమ వివాహం ఒప్పుకొన్నారా?

రవి శంకర్‌: నాన్నగారు కూడా ప్రేమించే వివాహం చేసుకున్నారు కదా! మా ఇంట్లో ఆ సమస్య లేదు. ఇంట్లో ఆయన ఉంటే మాకు టెర్రరే.

మీ నాన్న తర్వాత సాయికుమార్‌ నుంచి మీకు సపోర్ట్‌ ఎలా ఉండేది?

రవి శంకర్‌: 1982 వరకూ నాన్నగారే కుటుంబం బాధ్యతలు ఎక్కువగా తీసుకునేవారు. మా అందరినీ డిగ్రీ వరకూ చదివించారు.  ‘తరంగణి’ నుంచి మా అన్నయ్య సాయినే అన్నీ చూసుకునేవారు. చన్నీళ్లకు వేడి నీళ్లు తోడైనట్లు సాయి సంపాదన తోడైంది. 

సాయి గురించి ఒక్కమాటలో చెప్పాలంటే..?

రవి శంకర్‌: మా కుటుంబానికి దేవుడిలాంటివాడు. అన్నయ్య ఎంత గ్రేటో.. ఆయనకంటే డబుల్‌ గ్రేట్‌ మా వదిన. ఎందుకంటే ఒక అన్నయ్యగా సాయి కుటుంబ బాధ్యతలు తీసుకోవడం సహజం. బయట నుంచి వచ్చి, అన్నీ అర్థం చేసుకుని ఆయనకు సపోర్ట్‌గా నిలిచారు మా వదిన. అందుకు ఆమెకు నిజంగా హ్యాట్సాఫ్‌ చెప్పాలి. ఈ రోజు మా కుటుంబమంతా కలిసే ఉందంటే అందుకు సాయినే కారణం.

మనిద్దరం(ఆలీ) ఎక్కడ కలిశామో గుర్తుందా?

రవి శంకర్‌: 1979లో ‘దేవుడు మామయ్య’ షూటింగ్‌లో కలిశాం. అందులో నేను శోభన్‌బాబుగారి చిన్నప్పుడు పాత్ర వేశా. 

సాయికుమార్‌ డైరెక్షన్‌ చేస్తుంటే, మీరు ట్రిపుల్‌రోల్‌, మీ నాయనమ్మ హీరోయిన్‌ అట. ఆ కథేంటి?

రవి శంకర్‌: చిన్నప్పుడు మాకు సినిమాయే ప్రపంచం. ఇనుప కుర్చీని కెమెరేగా పట్టుకుని సాయి డైరెక్షన్‌ చేసేవాడు. మా అమ్మానాన్న ఎక్కడికైనా బయటకు వెళ్తే, వెంటనే ఇంట్లో షూటింగ్‌ మొదలైపోయేది. కృష్ణగారు నటించిన ‘కుమారరాజ’లో ఆయన ట్రిపుల్‌ రోల్‌ చేశారు. దాన్ని తమిళంలో ‘త్రిశూలం’ పేరుతో తీశారు. ఆ కథతో ఇంట్లో షూటింగ్‌ జరిగేది. చాలా సరదాగా ఉండేది.

బాత్రూమ్‌లోకి వెళ్తే గంట గంటలు మాట్లాడుతూ ఉంటారట!

రవి శంకర్‌: ఇది చిన్నప్పటి నుంచి ఉండేది. సడెన్‌గా మనకు నంది అవార్డు, జాతీయ అవార్డు వస్తే ఎలా మాట్లాడాలి? అనుకుంటూ దాన్ని సాధన చేస్తా. నేను చేసే ప్రతి పాత్రను అద్దం ముందు నిలబడి డైలాగ్‌లు చెబుతూ నన్ను నేను చూసుకుంటా. 

మీ ముగ్గురు అన్నదమ్ములను కూర్చో బెట్టి నాన్న మాట్లాడేవారా?

రవి శంకర్‌: చాలాసార్లు. అమ్మకూడా మాకు అంతా మంచే చెప్పేది. సహనంగా ఉండాలనేది. మీ నాన్నకు జరిగిన దాన్ని మీరు ఫెయిల్యూర్‌గా తీసుకోవద్దు. ఎందుకంటే నాన్నకు సరిగా అవకాశాలు రాలేదన్న కోపం ఉండేది. అనుకున్న స్థాయికి వెళ్లలేకపోయారు. దాంతో అమ్మ మాకు అన్నీ వివరించి చెప్పేది. ప్రతి ఫెయిల్యూర్‌ను ఒక్కో మెట్టుగా భావించి దాన్ని ఎక్కాలని చెబుతుండేవారు. అలాంటి అనుభవాన్ని పాజిటివ్‌గా తీసుకోవడం వల్లే మేము ఈ స్థాయిలో ఉన్నాం. అసలు కర్ణాటకలో నేను ఎవరో తెలియదు. నాకన్నా కూడా అయ్యప్ప బాగా ఫేమస్‌. అలాంటిది నన్ను బాగా ఆదరించారు. 1975 నుంచి వేషాలు వేస్తూ, డబ్బింగ్‌లు చెబుతూ వస్తున్నా. ఇండస్ట్రీకి వచ్చి  46ఏళ్లు దాటిపోయాయి. అయితే, నా కెరీర్‌ను మలుపు తిప్పింది 2010. ‘దండం దశ గుణం’ అనే చిత్రం కాస్త పేరు తీసుకొచ్చింది. ఆ తర్వాత  సుదీప్‌ పిలిచి ‘కెంపెగౌడ’లో అవకాశం ఇచ్చారు. నాకు ఫోన్‌ చేసి సినిమా చేయాలని చెబితే, డబ్బింగ్‌కు పిలుస్తున్నారనుకున్నా. కానీ, యాక్టింగ్‌ అని చెప్పారు. బహుశా ప్రకాశ్‌రాజ్‌ పక్కన ఆయన తమ్ముడిగానో, లేదా ఆయన పక్కన ఉండే రౌడీ పాత్రో అనుకున్నా. తీరా అక్కడికి వెళ్తే, ‘ప్రకాశ్‌రాజ్‌ పోషించిన పాత్ర మీరు చేయాల’న్నారు. ఆ సినిమా సూపర్‌హిట్ అయింది.  దాదాపు 100కు పైగా కన్నడ చిత్రాల్లో నటించానంటే అందుకు కర్ణాటకు జై కొట్టాల్సిందే. 

ఇప్పటివరకూ ఎన్ని అవార్డులు వచ్చాయి?

రవి శంకర్‌: 10 నంది అవార్డులు డబ్బింగ్‌కే వచ్చాయి. నటుడిగా రెండు ఫిల్మ్‌ఫేర్‌లు వచ్చాయి.

మీ పేరుకు, హిందూ పేపర్‌కు, డైరీకి ఏదో సంబంధం ఉందట!

రవి శంకర్‌: అమ్మ చనిపోయిన తర్వాత ఆమె డైరీని అన్నయ్య చదివారు. ‘నీకు వినే ధైర్యం ఉందా’ అని అడిగి, అమ్మ నా గురించి రాసుకున్నది చదివి వినిపించారు. ‘రవి ఒక పెద్ద ఆర్టిస్ట్‌ అవుతాడనుకున్నా. అందుకోసమే వాడికి అన్నీ నేర్పించా. కానీ, అనుకున్న స్థాయికి రాలేదు. వాడు డబ్బింగ్‌లు చెప్పుకొంటూ, ఇదే జీవితం అనుకుని రిలాక్స్‌ అయిపోయాడు. అందుకే అవకాశాలు రాలేదు. వాడిలో ఉన్న నమ్మకాన్ని వాడే బయటకు తీసుకురావాలి’ అని రాసుకొచ్చారట. అప్పటికి నేను కర్ణాటక కూడా వెళ్లలేదు. అది నాకు చాలా స్ఫూర్తిని ఇచ్చింది. అవకాశాలు రాలేదు.. అనడం సరికాదేమో. ఎందుకంటే రెండు చేతులు కలిపితేనే చప్పట్లు కొట్టగలం. నా వైపు కూడా తప్పు ఉండొచ్చు. ఆ తర్వాత ఒక్కసారిగా దమ్ము దులుపుకొని, సింహంలా పైకి లేచా. వెంటనే ‘అరుంధతి’ పడింది. ఆ తర్వాత తమిళ్‌లో విజయ్‌తో ఒక సినిమా చేశా. ఆ తర్వాత ‘కెంపెగౌడ’. ఇక వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. ఇక హిందూ పేపర్‌ ఏంటంటే.. ఆమె ఎప్పుడూ ఆ పేపర్‌ చదువుతూ ఉండేవారు. ‘నీకు పుట్టుక ఎవరికీ తెలియదు రా. కానీ, నీ మరణం దేశానికి, ప్రపంచానికి తెలియాలి. నువ్వు చనిపోయిన రోజున ‘రవి శంకర్‌ మరణించాడు’ అని హిందూ పేపర్‌లో హెడ్‌లైన్‌గా రావాలి’ అనేవారు. (ఇటీవల చనిపోయిన తన తల్లి గుర్తొచ్చి భావోద్వేగంతో కన్నీటి పర్యంతమైన ఆలీ)

చిన్నప్పుడు బాగా పాటలు పాడేవారట!

రవి శంకర్‌: అవును! అమ్మ నాకు సంగీతం నేర్పించారు. శాస్త్రీయ సంగీతం కూడా తెలుసు. ‘శంకరాభరణం’ చూసి, తులసి పాత్రలో నన్ను తీసుకుని ఉంటే బాగుండేది కదా! అనిపించింది. ఇదే విషయాన్ని విశ్వనాథ్‌గారిని కూడా అడిగా. ఆ తర్వాత ‘సప్తపది’లో మంచి క్యారెక్టర్‌ ఇచ్చారు. 

బాల సుబ్రహ్మణ్యం ముందు కూడా పాడారట!

రవి శంకర్‌: ఆయనకు ఏకలవ్య శిష్యుడిని. యూట్యూబ్‌లో ఆయన పాట విననిదే నా రోజు గడవదు. ఆయన కనిపిస్తే ఏదో ఒక పాట పాడి తినేసేవాడిని. చాందినీ అనే సినిమా తెలుగులో డబ్‌ చేస్తే, అందులో బాలుగారు రుషి కపూర్‌కు పాడితే, నేను వినోద్‌ఖన్నాకు పాడాను. నా లైఫ్‌లో ఫస్ట్‌ సాంగ్‌ ఆయనతో కలిసి పాడా. 

విలన్‌లకు డబ్బింగ్‌ చెప్పేటప్పుడు వేరియేషన్స్‌ ఎలా ఉంటాయి?

రవి శంకర్‌: నేను సింగర్‌ను కావడం నాకు పెద్ద ప్లస్‌. దాని వల్ల స్థాయులు తెలుస్తాయి. నేను మిమిక్రీ ఆర్టిస్ట్‌ను కాదు. ఒక విలన్‌కు భాష రాకపోయినా, ఆయన గాత్రానికి ఒక ధర్మం ఉంటుంది. ఆయన శరీరానికి భగవంతుడు ఎంత వాయిస్‌ ఇచ్చాడో చూసి దాన్ని పట్టుకుంటా. అందుకు అనుగుణంగా డబ్బింగ్‌ చెబుతా. కొన్నింటిని ఎవరూ గుర్తు పట్టలేరు. 

పరేశ్‌రావల్‌కు తొలుత చక్రవర్తిగారు చెప్పేవారు. ‘శంకర్‌దాదా ఎంబీబీఎస్‌’ సినిమాకు నన్ను సూచిస్తే, డైరెక్టర్‌ జయంత్‌ అస్సలు ఒప్పుకోలేదు. ‘రవి ఏంటయ్యా.. ఆయన ముఖశ్‌రుషి, అంబ్రేష్‌ పూరిలకు గంభీరమైన స్వరంతో చెబుతాడు. మనది పెర్‌ఫార్మెన్స్‌, సాఫ్ట్‌గా ఉండాలి. రవి చెప్పలేడు’ అన్నారు. చాలా పెద్ద పెద్దవాళ్లను ప్రయత్నించారు. ఎవరు చెప్పినా నచ్చడం లేదు. అప్పుడు ఒకరోజు నేను చిరంజీవిగారిని కలిశా. ‘ఆ సినిమాకు డబ్బింగ్‌ నువ్వు చెప్పొచ్చు కదా’ అన్నారు. ‘మీరు చెప్పమంటే చెబుతాను. కానీ, వాళ్లు వద్దంటున్నారు అన్నయ్యా’ అని అన్నా. చిరంజీవిగారు చెప్పడంతో అందరూ ఒప్పుకొన్నారు. ‘మూడు రోజులు నన్ను వదిలేయండి. తర్వాత చూడండి’ అని చెప్పి ఫినిష్‌ చేసి ఇచ్చేశా. చిరంజీవిగారు చాలా మెచ్చుకున్నారు. బాగా కష్టపడిన పాత్ర అది. 

చంద్రుడిపైకి వెళ్తే, మీతో పాటు ఏ హీరోయిన్‌ను తీసుకెళ్తారు?

రవి శంకర్‌: మా ఆవిడను తీసుకెళ్తా. హీరోయిన్లలో అయితే, శ్రీదేవిగారిని. ఆమెకు చాలా పెద్ద అభిమానిని.

మీ అన్నయ్య సాయి గురించి పుస్తకం రాస్తే ఏం పేరు పెడతావ్‌?

రవి శంకర్‌: ఆపద్బాంధవుడు.

మీ భార్య చెవిలో చెప్పిన రహస్యం ఏంటి?

రవి శంకర్‌: ఐ లవ్‌ వ్యూ(నవ్వులు)మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని