ఆ సినిమా నుంచి తీసేశారు...
close
Published : 17/03/2020 12:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ సినిమా నుంచి తీసేశారు...

విష్వక్‌సేన్‌ హీరోగా చేసిన ‘ఈ నగరానికి ఏమైంది?’, ‘ఫలక్‌నుమా దాస్‌’, తాజాగా హిట్టుకొట్టిన ‘హిట్‌’... అన్నింట్లోనూ అతనిది కోపిష్టి పాత్రే. సినిమాల్లోనే కాదు నిజజీవితంలోనూ అలాంటివాడేనని ముద్రపడింది విష్వక్‌పైన. ఆ ముద్రలన్నీ పక్కనపెట్టి చూస్తే... ఏ ఆసరా లేకుండా సినిమారంగంలో అతను నడిచొచ్చిన తీరు పట్టువదలని విక్రమార్కుడి కథని తలపిస్తుంది. ఆ కథ విష్వక్సేనుడి మాటల్లోనే...

ప్పట్లో నాకు పదేళ్లు ఉండొచ్చేమో... హైదరాబాద్‌లోని దిల్‌సుక్‌నగర్‌లో ఉండేవాళ్లం. మా ఇంటిపైన అద్దెకుండే బ్యాచిలర్స్‌ కొందరు మల్టీమీడియా కోర్సు చదువుతుండేవారు. ఖాళీగా ఉన్నప్పుడు నేను వాళ్ల కంప్యూటర్‌లో వీడియోగేమ్స్‌ఆడుతుండేవాణ్ని. అప్పుడే నాకు వాళ్లు ఉపయోగిస్తున్న ఎడిటింగ్‌ సాఫ్ట్‌వేర్‌పైన ఆసక్తి కలిగింది. దాన్ని నేర్చుకుని వీడియోగేమ్‌లోని పాత్రల్ని చిత్రవిచిత్రంగా మార్చడం మొదలుపెట్టాను. నా దృష్టి చదువుకన్నా ఎక్కువగా మల్టీ మీడియావైపు  వెళ్లడంతో... అమ్మానాన్నల్ని ఒప్పించి పదకొండేళ్లప్పుడు అరెనా మల్టీమీడియాలో చేరాను. యానిమేషన్‌తోపాటు ఎడిటింగ్‌పైనా పట్టు సాధించాను. ఏడో తరగతి చదివేటప్పుడు-మా ఇంట్లో ఉన్న పాత సినిమాల వీసీడీలని తీసి... వాటిని నేటితరానికి తగ్గట్టు ఎడిటింగ్‌ చేయడం మొదలుపెట్టాను. చూసినవాళ్లందరూ ‘అరె ఇదేదో కొత్త సినిమా అనిపించేలా ఉందే!’ అని పొగుడుతుంటే- ఇక నేను సినిమా రంగానికి వెళ్లితీరాల్సిందేనని నిశ్చయించుకున్నాను. పదిహేనేళ్లు వచ్చాక టెక్నికల్‌ విషయాలకన్నా నటనపైన ఆసక్తి మొదలైంది. నాన్నతో చెబితే నాకు నటనలో ట్యూషన్‌ పెట్టించారు. పదో తరగతి ముగించేనాటికల్లా... నాకీ హోమ్‌ ట్యూషన్‌ సరిపోదు అనిపించింది. దాంతో నాన్న నన్ను బాలీవుడ్‌ నటుడు అనుపమ్‌ఖేర్‌ నిర్వహిస్తున్న ‘యాక్టర్‌ ప్రిపేర్స్‌’ ఇన్‌స్టిట్యూట్‌లో చేర్చారు. ముంబయిలో అలా నటన నేర్చుకుంటూనే ఇంటర్‌ పరీక్షలు రాశాను. ఆ తర్వాత డిగ్రీలో చేరి... సినిమా వేషాల కోసం వెతుకులాట మొదలుపెట్టాను.

వాళ్ల చలవే ఇదంతా...
చిన్నప్పుడే యానిమేషన్‌ రంగంలోకి పంపించడం, నటనకి ట్యూషన్‌ చెప్పించడం, ముంబయిలో శిక్షణకి పంపించడం... ఇవన్నీ చూసి మాది బాగా డబ్బున్న కుటుంబం అనుకునేరు! మేం మధ్యతరగతి వాళ్లమే. నాన్న రాజు కరాటే మాస్టర్‌. స్కూళ్లలోనూ, ప్రైవేటుగానూ ఆయన నేర్పించే కరాటే విద్యే మాకు చాలా కాలం దాకా అన్నంపెట్టింది. నాన్న స్థిరాస్తి రంగంవైపు వెళ్లాక మేం కొద్దిగా కుదురుకుని... సొంతిల్లు కొనుకున్నాము. నాన్న కూడా ఒకప్పుడు సినిమాల్లో ప్రయత్నించాడు కానీ అవకాశాలు రాలేదట. ఆ కలల్ని నాపైన రుద్దలేదుకానీ... నాకై నేను వెళతానన్నప్పుడు ప్రోత్సహించడానికి అదే ప్రధాన కారణం. అయితే అమ్మావాళ్లు ఏ పెళ్ళీ పేరంటాలకి వెళ్లినా మా బంధువులు ‘మీ వాణ్ణి కనీసం ఇంజినీరింగ్‌ కూడా చేయించకుండా సినిమాలంటూ తిప్పి చేతులారా నాశనం చేస్తున్నారు!’ అనేవాళ్లట. దాంతో ఒకస్థాయిలో పేరంటాలకి పోవడం మానుకున్నారు. నా కోసం ఫిల్మ్‌నగర్‌లోని ఓ అద్దె ఇంటికి షిఫ్ట్‌ అయ్యారు. కొన్నేళ్లపాటు నాకు ఏ అవకాశాలూ రాలేదు... కొన్ని వచ్చినట్టే వచ్చి జారిపోయేవి. అప్పుడు నాన్నకి న్యూమరాలజీపైన నమ్మకం వచ్చి... దినేష్‌ నాయుడు అనే నా పేరుని విష్వక్‌సేన్‌ అని మార్చాలనుకున్నాడు. ఊరికే మార్చేయడం కాదు... ఇందుకోసం జీవితంలో నాకు రెండోసారి బారసాల చేశారు! చెట్టంత ఎదిగిన నన్ను నాన్న ఒడిలో కూర్చోబెట్టుకుని కొత్తపేరు పెడుతుంటే ఏదోలా అనిపించింది. బంధువుల ఎగతాళైతే చెప్పక్కర్లేదు. న్యూమరాలజీని నమ్మాలా వద్దా అనే విషయాన్ని పక్కనపెడితే... నా కల నెరవేర్చడం కోసం నా కుటుంబం ఎన్నెన్ని ప్రయాసలు పడిందో చెప్పడానికి ఇదో ఉదాహరణ. భవిష్యత్తు చీకటిగా అనిపించినా సరే... నాపైన నాకున్న నమ్మకం, అంతకన్నా నా వాళ్లు నాపై పెట్టుకున్న విశ్వాసాలే నన్ను నడిపించాయి.

ఎన్నెన్నో ఆడిషన్‌లు...
ఫిల్మ్‌నగర్‌లో అవకాశాల కోసం ఎవరి దగ్గరికెళ్ళినా ‘మీ నాన్న ఏం చేస్తాడు... డబ్బు పెట్టగలడా?’ అనేవారు. యాభై ఆడిషన్స్‌ తర్వాత ఒకదానికి సెలెక్టయ్యాను. అదో టీనేజ్‌ లవ్‌స్టోరీ అన్నారు. నేనే హీరోనని చెప్పారు... షూటింగ్‌ కూడా చేశారు కానీ సినిమా మాత్రం రిలీజ్‌ కాలేదు. అది నాలో బాగా నిస్పృహని పెంచింది. అందులోనే ఉంటే మంచిది కాదని దర్శకుడిగా మారి షార్ట్‌ ఫిల్మ్స్‌ తీయడం మొదలుపెట్టాను. నాతో పనిచేసిన అలీ మహ్మద్‌ ‘మనందరం కలిసి తలాకొంత డబ్బు వేసుకుని సినిమా తీద్దాం!’ అన్నాడు. అలా ఎనిమిదిమంది మిత్రులం కలిసి ‘వెళ్లిపోమాకే...’ అనే సినిమా తీశాం. కమర్షియల్‌ హంగులు ఏమీ లేకుండా తీసిన సినిమా అది. అందువల్లనో ఏమో ఏడాదిపాటు దాన్నెవరూ ముట్టుకోలేదు. చివరికి మా ప్రయత్నాన్ని మెచ్చుకున్న దిల్‌రాజుగారు సినిమా డిస్ట్రిబ్యూషన్‌కి ముందుకొచ్చారు. అలా సినిమాలో నా తొలి ప్రయాణం మొదలైంది.

అచ్చం నా క్యారెక్టరే!
స్థానిక సంస్కృతిని ఉన్నదున్నట్టు చూపిస్తూ సార్వజనీనమైన ఎమోషన్స్‌ని క్రియేట్‌ చేయడం అన్నది... ఓ ప్రపంచస్థాయి సినిమా టెక్నిక్‌. అలాంటి ‘హైపర్‌ లోకల్‌’ సినిమాలని తెలుగులోకి తేవాలనుకున్నాను నేను. మలయాళంలో వచ్చిన ‘అంగమలై డైరీస్‌’ అలాంటిదే. నా ఫ్రెండ్స్‌ దగ్గర అప్పుచేసి మరీ ఆ సినిమా తెలుగు రైట్స్‌ కొన్నాను. ఆ కథకి హైదరాబాద్‌లోని ‘ఫలక్‌నుమా’ నేపథ్యాన్ని జోడించి స్క్రిప్టు రాసుకున్నాను. నేను ఈ ప్రయత్నంలో ఉండగానే... తరుణ్‌భాస్కర్‌ దర్శకత్వంలో ‘పెళ్ళి చూపులు’ సినిమా వచ్చింది. నేను కోరుకున్న స్థానికత, అద్భుతమైన టెక్నిక్‌, డార్క్‌ కామెడీ... అన్నీ ఉండటం చూసి చాలా ఆనందమేసింది నాకు. అప్పట్లో తరుణ్‌ మాకు తెలిసిన ఓ ఫ్రెండ్‌ బర్త్‌ డే పార్టీకి వచ్చాడని తెలిసి వెళ్లాను. పరిచయాలయ్యాక అతణ్ని పక్కకు లాక్కెళ్లి ‘గురూ! నీ సినిమాలో నాకు ఒక్క అవకాశం ఇవ్వు... ప్లీజ్‌!’ అని అడిగాను. నా తీరుకి తరుణ్‌ ఇబ్బంది పడ్డా... ‘ఓకే బ్రో!’ అని నవ్వుకుంటూ వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఏడాదికి తరుణ్‌ ‘ఈ నగరానికి ఏమైంది’  సినిమా మొదలుపెట్టాడు. అందులో ఒక పాత్రకి ఆడిషన్స్‌ జరుగుతున్నాయని తెలిసి సురేష్‌ ప్రొడక్షన్స్‌ ఆఫీసుకెళ్లాను. తరుణ్‌ ఆడిషన్స్‌ చేసి స్క్రిప్టు ఇచ్చి చదవమన్నాడు. అందులో వివేక్‌ పాత్ర నాది. ఫ్రెండ్స్‌పైన అభిమానం ఉన్నా కోపంతో చిర్రుబుర్రులాడే పాత్ర... అచ్చం నా నిజజీవిత క్యారెక్టర్‌ అది! స్క్రిప్టులో ఉన్న ఓ సిట్యుయేషన్‌ని నటించి చూపగానే ‘ఓకే’ అనేశాడు. ‘మరి నీ సొంత సినిమా సంగతేమిటీ?’ అని అడిగాడు. ‘దీని కోసం వాయిదా వేస్తాను..!’ అని చెప్పాను.

నేలకుంగినట్టు...
షూటింగ్‌ మొదలైన వారం తర్వాత ఏమైందో తెలియదు... నన్ను ఇక రావొద్దన్నారు. నా స్థానంలో ఇంకెవర్నో తీసుకున్నారు. తరుణ్‌కి ఫోన్‌ చేస్తే ‘ఎవరో అమ్మాయి మెయిల్‌ పంపింది విష్వక్‌... నువ్వు ఆమెకి అవకాశం ఇప్పిస్తానని మిస్‌బిహేవ్‌ చేశావని. అందుకే...’ అని చెప్పాడు. ఒక్కసారిగా నిల్చున్న నేల కుంగి పాతాళంలోకి పడిపోతున్నట్టు అనిపించింది. కాలేజీ రోజుల నుంచే నాకు ఎందరో అమ్మాయిలతో ఫ్రెండ్షిప్‌ ఉన్నా... ఓ బ్రేకప్‌ కూడా అయినా ఎవరితోనూ మిస్‌ బిహేవ్‌ చేయలేదు నేను. తరుణ్‌కి ఫోన్‌ చేసి ఒకటే సాయం అడిగాను... తనకొచ్చిన మెయిల్‌ నాకు ఫార్వార్డ్‌ చేయమని. అలాగే చేశాడు తరుణ్‌. ఆ మెయిల్‌లోని విషయమూ... రాసిన తీరూ చూశాక అది నాకు పరిచయమున్న మరో వ్యక్తి పని అని అర్థమైపోయింది. అతను ఓ మంచి ఉద్యోగంలో ఉంటూ... నాలాగే అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నాడు. నేను అతని దగ్గరకెళ్లి ‘ఇది ఈ ఒక్క సినిమాతో ఆగిపోదు. పరిశ్రమలో ఇంకెవరూ నాకు అవకాశం ఇవ్వకపోవచ్చు. దయచేసి ఆ మెయిల్‌ పంపింది నువ్వేనని ఒప్పుకో!’ అని అడిగాను. అతను విన్లేదు. నాకు నిద్రపట్టలేదు... ఏం చేయాలో అర్థంకాలేదు. వారం రోజులు గడిచాయి.

అప్పుడే ఆ కథ అనుకోని మలుపు తిరిగింది. అతను ఎవరి పేరుమీద మెయిల్‌ పెట్టాడో ఆ అమ్మాయి తన పేరుని ఇలా వాడుకున్నందుకు సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది!

ఆ దెబ్బతో వాడి దెయ్యం దిగొచ్చింది. డి.సురేష్‌గారితోనూ మెయిల్‌ పంపింది తనేనని చెప్పాడు. ఆ తర్వాతే నన్ను మళ్లీ సినిమాలోకి తీసుకున్నారు! అలా ‘ఈ నగరానికి ఏమైంది’ పూర్తయింది. సినిమా హిట్టయి అన్ని వర్గాల నుంచీ ప్రశంసలందుకుంది. నేను ఎప్పట్నుంచో కోరుకుంటూ ఉన్న గుర్తింపు అది. ఆ రోజు తరుణేకానీ ఆ మెయిల్‌ నాకు ఫార్వార్డ్‌ చేయకుండా ఉండి ఉంటే... నాటితో నా కెరీర్‌ ముగిసేదే. అందుకే తననెప్పుడూ నా బ్రదర్‌ అని చెప్పుకుంటూ ఉంటాను.

మళ్లీ ఫలక్‌నుమా...!
‘ఈ నగరానికి ఏమైంది’ నాకు చాలా ధైర్యాన్నివ్వడంతో నేను తీయాలనుకున్న ‘ఫలక్‌నుమా దాస్‌’ పనుల్లో దిగిపోయాను. నాన్న దగ్గరా, నా ఫ్రెండ్స్‌ దగ్గరా, ఫైనాన్షియర్ల దగ్గరా అడిగి 3.3 కోట్ల రూపాయలు తీసుకుని షూటింగ్‌ మొదలుపెట్టాను. దర్శకుడిగా 90 మంది నటుల్ని పరిచయం చేశాను. ఎన్నో కష్టాలు పడి సినిమా పూర్తిచేశాను కానీ... ప్రమోషన్స్‌కి నయా పైసా మిగల్లేదు. దాంతో సురేష్‌గారి దగ్గరే మరో 2.5 కోట్ల రూపాయలు అప్పుతీసుకున్నాను. ఆ సినిమా ఏమాత్రం బెడిసికొట్టున్నా... నా పరిస్థితీ, నాకు అప్పు ఇచ్చిన ఫ్రెండ్స్‌ పరిస్థితీ ఏమయ్యేదో ఊహించాలంటే ఇప్పటికీ భయమేస్తోంది. ఎలాగోలా సినిమా లాభాలనే తెచ్చింది కానీ నేను ఆశించినంత కాదు. పైగా, దానిపైన వచ్చిన వివాదాలూ, విమర్శలూ, వాటిపైన నా స్పందనలూ, మళ్లీ ట్రోల్‌లూ నాకు చాలా చికాకు తెప్పించాయి. ఇకపైన నేను కాదు... నా సినిమాలే మాట్లాడాలని అనుకున్నాను. ఓ మంచి అవకాశం కోసం చూశాను. అప్పుడే ‘హిట్‌’ సినిమా నా తలుపుతట్టింది. నా వయసుకన్నా ఐదేళ్లు పెద్దవాడిగా, పరిణతితో నటించాల్సిన పాత్ర అది. నాలుగు నెలలపాటు దీనికి హోమ్‌ వర్క్‌ చేశాను. ఏదో కొత్తగా చేయాలనే తపనకి  శ్రమ తోడైతే మంచి విజయం వచ్చితీరుతుందన్న నా నమ్మకాన్ని నిజం చేస్తూ... ఆ సినిమా హిట్టయింది.

అసలైన హీరోయిన్స్‌ కదా!
నాకు కోపిష్టిగా పేరున్నా... నాలో స్నేహశీలత ఎక్కువంటారు నా ఫ్రెండ్స్‌. అందుకు కారణం అమ్మే. ఎదుటివాళ్లతో ఎంత ప్రేమగా ఉండాలో తన దగ్గరే నేర్చుకున్నాను. నాకు ఊహ వచ్చినప్పటి నుంచీ ఇప్పటిదాకా రోజూ కనీసం పాతికమందికి అన్నం పెట్టకుండా అమ్మ తిన్నది లేదు! ఇక ప్రపంచంలో నేను భయపడే ఏకైక వ్యక్తి మా అక్క వన్మయి. మా నాన్న బిజినెస్‌ని తనే చూసుకుంటోంది. పార్టీల పేరుతో నేను ఏమాత్రం అదుపుతప్పినా చెడామడా వాయించేస్తుంది. కానీ నా పరోక్షంలో మాత్రం నాపైన ఈగ వాలనివ్వదు. మీకో విషయం చెప్పాలి. ‘ఫలక్‌నుమా దాస్‌’ సినిమాకి అమ్మ, అక్కలే కాస్ట్యూమ్‌ డిజైనర్స్‌. వాటిని వాడిన ముంబయి హీరోయిన్‌కి అవి నచ్చక ఏదో దురుసుగా మాట్లాడిందట. ఆ విషయం తెలిసి అప్పటికప్పుడే తనని తీసేశాను. సినిమా బిజినెస్‌ పరంగా ముంబయి హీరోయిన్‌ మాకు ముఖ్యం కావొచ్చు కానీ... అమ్మా, అక్కా నా నిజజీవితంలో అసలైన హీరోయిన్స్‌. వాళ్లు చేసిందాంట్లో వంకలు పెడితే ఊరుకోవాలా మరి?!మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని