‘‘వి’ పవన్‌, మహేశ్‌ చేస్తే బాగుంటుంద’’న్నారు!
close
Updated : 25/03/2020 09:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘‘వి’ పవన్‌, మహేశ్‌ చేస్తే బాగుంటుంద’’న్నారు!

ఆనాడు నాని అన్న మాటలు నిజమయ్యాయి!

సూపర్‌ స్టార్‌కు వరసైన వాడు.. 70 ఎం.ఎం. అంత మనసున్నవాడు.. కళమ్మతల్లికి కావాల్సిన వాడు.. బాక్సాఫీస్‌ అంత బాడీ ఉన్నవాడు.. ఎందుకంటే ఆడు మగాడ్రా బుజ్జీ అని అందరితోనూ అనిపించుకున్నోడు.. అతనే యువ కథానాయకుడు సుధీర్‌బాబు. ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి విచ్చేసి ఎన్నో సరదా సంగతులు పంచుకున్నారిలా...

పోసాని నాగ సుధీర్‌బాబు ఎలా ఉన్నారు?

సుధీర్‌బాబు: మొదటిసారి నా పూర్తి పేరు బయటపెట్టారు. (నవ్వులు)చాలా మందికి తెలియదు.

హీరో, ప్రొడ్యూసర్‌, డిస్ట్రిబ్యూటర్‌, మంచి భర్త, మంచి ఫాదర్‌, బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌.. ఇన్ని క్వాలిటీలు ఉన్నాయేంటి? మీరు బ్యాడ్మింటన్‌ ఫ్రొఫెషనల్‌ ప్లేయర్‌ కదా?

సుధీర్‌బాబు: అవును. ఏపీ, కర్ణాటక స్టేట్‌ నెంబర్‌.1, జూనియర్స్‌ నేషనల్‌ స్కూల్‌ గేమ్స్‌లో ఇండియా నెంబర్‌.2, జూనియర్‌ వరల్డ్‌కప్‌ ప్రాపబుల్స్‌ బాగా ఆడాను. 

నాగ సుధీర్‌బాబు.. ఘట్టమనేని ఫ్యామిలీకి ఎలా అల్లుడు?

సుధీర్‌బాబు: మా అమ్మగారు.. మహేశ్‌బాబుగారి అమ్మమ్మ మంచి స్నేహితులు. వాళ్లు ఈ సంబంధం తీసుకొచ్చారు. అప్పుడు మా ఇద్దరికీ పెళ్లి చేసుకుందామన్న ఆలోచన కూడా లేదు. వద్దని చెప్పాం. అయితే, మా ఇద్దరి వద్దా ఒకరి నెంబరు మరొకరి దగ్గర ఉంది. ఏడాది తర్వాత కొత్త సంవత్సరం రోజున నా ఫోన్‌లోని కాంటాక్ట్స్‌ అన్నింటినీ సెలక్ట్‌ చేసి, ‘హ్యాపీ న్యూయర్‌’ పంపాను. తనకి కూడా వెళ్లిపోయింది. అలా మళ్లీ మాట్లాడుకున్నాం. 

మీ సొంతూరు ఏది?

సుధీర్‌బాబు: విజయవాడ. కానీ, ఎప్పటి నుంచో హైదరాబాద్‌లో ఉంటున్నాం. మా నాన్నగారికి పెస్టిసైడ్‌ల తయారీ కర్మాగారం ఉంది. 1998-99లో ఇక్కడకు వచ్చేశాం.

మీ కుటుంబంలో ఆర్టిస్ట్‌లు ఎవరైనా ఉన్నారా?

సుధీర్‌బాబు: ఎవరూ లేరు. నాకే ఆసక్తి. విజయవాడలో ఉన్నప్పుడు బాగా సినిమాలు చూసేవాడిని. 

సుధీర్‌బాబును హీరో చేయాలన్న ఆలోచన ఎవరికి వచ్చింది?

సుధీర్‌బాబు: హీరో కావాలన్న ఆలోచన నాకే వచ్చింది. పెళ్లికాక ముందు సినిమాల్లో నటించాలని ఉండేది. అయితే, కొన్నిరోజులకు దానిపై ఆసక్తిపోయింది. నటుడు కావాలని ఎక్కడో ఉంటుంది కదా! దాంతో మళ్లీ సరైన ట్రైనింగ్‌ తీసుకుని సినిమాల్లోకి వచ్చా .

బ్యాడ్మింటన్‌లో మీకు గురువు ఎవరు?

సుధీర్‌బాబు: విజయవాడలో ఉండగా, భాస్కర్‌ బాబుసర్‌ ఉండేవారు. బెంగళూరులో దీపికా పదుకొణె తండ్రి ప్రకాశ్‌ పదుకొణె దగ్గర నేనూ, పుల్లెల గోపీచంద్‌ శిక్షణ తీసుకున్నాం. ప్రస్తుతం గోపీచంద్‌ బయోపిక్‌లో నటిస్తున్నా. చాలా ఆసక్తిగా ఉంది. ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతోంది. తొలుత తెలుగులో నేను, హిందీలో మరో నటుడితో తీద్దామని అనుకున్నారు. నేను కొన్ని సలహాలు చెప్పిన తర్వాత వాళ్లకు నచ్చి రెండు భాషల్లోనూ నన్నే చేయమన్నారు. ఎందుకంటే బ్యాడ్మింటన్‌ అనేది రాత్రికి రాత్రే నేర్చుకునే ఆట కాదు. ఎన్నో ఏళ్లు కష్టపడితే కానీ, మాస్టర్స్‌ కాలేం. ప్రస్తుతం నేను సినిమాల్లో కాస్త నిలదొక్కుకున్నానంటే అందుకు కారణం బ్యాడ్మింటన్‌. దాని వల్లే యాక్టింగ్‌, ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ వచ్చాయి. 

మీ తొలి సినిమా ఏది?

సుధీర్‌బాబు: ఎస్‌ఎంఎస్‌. నేను నటించిన ప్రతి సినిమా నన్ను ఒక్కో మెట్టు ఎక్కిస్తూ వచ్చాయి. ఒకట్రెండు సినిమాలు తప్ప.. అన్నింటికీ మంచి రివ్యూలు వచ్చాయి. బాక్సాఫీస్‌పరంగా తీసుకుంటే, కొన్ని మంచి కలెక్షన్లు తెచ్చాయి. ఇంకొన్ని పర్వాలేదు. నాకు బ్రేక్‌నిచ్చిన చిత్రం ‘ప్రేమ కథా చిత్రం’. 

‘బాఘీ’లో విలన్‌గా చేసే అవకాశం ఎలా వచ్చింది?

సుధీర్‌బాబు: నేను చిన్నప్పటి నుంచి జాకీచాన్‌కు పెద్ద అభిమానిని. ఆయన సినిమా అయిపోయిన తర్వాత టైటిల్స్‌ వేసేటప్పుడు ఫెయిల్‌ అయిన స్టంట్స్‌ వీడియో వేసేవారు. అది చూడటానికి ప్రత్యేకంగా మళ్లీ వెళ్లేవాడిని. ఆ స్ఫూర్తితోనే పాటల్లో కొన్ని స్టంట్స్‌ చేశా. అవన్నీ SMS రోలింగ్‌ టైటిల్స్‌లొ వేయించా. అది షాజిద్‌ నదియాడ్‌ వాలా చూశారు. ఆ తర్వాత ఫేస్‌బుక్‌లో సంప్రదించారు. తొలుత ఎవరో కావాలని చేస్తున్నారనిపించింది. రెండోసారి కూడా మెస్సేజ్‌ పెడితే, ఫోన్‌ నెంబరు ఇచ్చాం. ‘బాఘీ’లో చేయాలని అడిగారు. ఫోన్‌లో నో చెబితే బాగుండదని వెళ్లి కలిసి చెబుదామని అనుకున్నాం. అక్కడికి వెళ్తే కథ చెప్పారు. నాకు బాగా నచ్చింది. వెంటనే ఒకే చెప్పా. 

మరో ఆఫర్‌ కూడా వస్తే చేయనని చెప్పారట!

సుధీర్‌బాబు: రెండు, మూడు వచ్చాయి. వాటిల్లో ‘బ్రహ్మాస్త్ర’ కూడా ఉంది. త్వరలో పుల్లెల గోపీచంద్‌ బయోపిక్‌ చేయబోతున్నా. దానికి సన్నగా ఉండాలి. వాళ్లేమో 90 రోజులు అడిగారు. దానికి బాడీ ఫిజిక్‌ కూడా అవసరం. రెండు క్లాష్‌ అవుతున్నాయని వద్దని చెప్పా.

మరి బయోపిక్‌ మొదలు పెట్టారా?

సుధీర్‌బాబు: లేదు. ఇంత ఆలస్యమవుతుందని అనుకోలేదు. గోపీచంద్‌ విద్యార్థులు ఏదో ఒకటి గెలుస్తూ ఉన్నారు. దాంతో స్క్రిప్ట్‌లో మార్పులు చేస్తూ వెళ్లాం. అందుకే ఆలస్యమవుతోంది. 

మరి నటుడైనందుకు సంతృప్తిగా ఉందా?

సుధీర్‌బాబు: సంతృప్తిగానే ఉంది. నాకు నచ్చింది చేస్తున్నా. మన లక్ష్యాలు ఎప్పుడూ మారుతూ ఉంటాయి. 

ప్రస్తుతం ‘వి’ చేస్తున్నారు కదా! దాని అర్థం ఏంటి? నాని దృష్టిలో పెట్టుకుని స్టోరీ సిద్ధం చేశారా? లేక స్టోరీ పూర్తయిన తర్వాత నానిని తీసుకున్నారా?

సుధీర్‌బాబు: ఇంద్రగంటి మొదట కథ రాసుకుంటారు. ఆ తర్వాత దానికి సరిపోయే హీరోని తెచ్చుకుంటారు. ఆయనెప్పుడూ స్టార్‌ల వెనుక పరిగెట్టరు. ఆయన దగ్గర ఎప్పుడూ 10-15 కథలు ఉంటాయి. ‘సమ్మోహనం’ డబ్బింగ్‌ మధ్యలో ‘వి’కథ చెప్పారు. చాలా ఆసక్తిగా అనిపించింది. నా పేరు చెబుతారేమోనని ‘ఎవరు చేస్తే బాగుంటుంది’ అని అడిగా, ‘మహేశ్‌బాబు, పవన్‌కల్యాణ్‌ నటిస్తే బాగుంటుంది’ అని అన్నారు. ‘అరె నా పేరు చెబితే బాగుండేది’ అనుకున్నా. మొదట నానిని తీసుకున్నారు. ఆ తర్వాత మరో హీరో కోసం ఇద్దరు, ముగ్గురు పేర్లు అనుకున్నారు. చివరకు నా దగ్గరకు వచ్చింది. ఆ రోజు అవకాశం నాకు వస్తే బాగుండు అని గట్టిగా అనుకున్నా, అలా జరిగిపోయింది. ఇప్పుడు కూడా మరో కథ సిద్ధం చేస్తున్నారు. దానికి కూడా బలంగా కోరుకున్నా. 

‘వి’ సినిమా కోసం కండలు పెంచారా?

సుధీర్‌బాబు: ఈ సినిమాలో పాత్ర డిఫరెంట్‌గా ఉండాలని ఇంద్రగంటి అన్నారు. బ్రాడ్‌పిట్‌ ఫొటో చూపించి ‘ఇలా ఉండాలి’ అన్నారు. మా కమ్యూనిటీలో నన్ను ‘సిక్స్‌’ ప్యాక్‌ అనిపిలుస్తారు. 

హీరో కాకముందు సినిమా డిస్ట్రిబ్యూషన్‌ చేశారట!

సుధీర్‌బాబు: నేను డిస్ట్రిబ్యూట్‌ చేసిన సినిమాలు బాగానే ఆడాయి. అల్లు అర్జున్‌, సిద్ధార్థ్‌, నితిన్‌ ఇలా చాలా మంది సినిమాలు డిస్ట్రిబ్యూట్‌ చేశాం. 90శాతం బాగా ఆడాయి. ప్రభాస్‌ ఫ్రెండ్స్‌ బ్యాచ్‌లో నేనూ ఒకడిని. ఒకరోజు రాజుగారు నన్ను, యూవీ వంశీ, విజయ్‌ అందరినీ పిలిచి కథ చెప్పారు. ఎందుకంటే ఆ కథ మేము ప్రభాస్‌కు చెబుతామని ఆయన ఉద్దేశం. మాకూ నచ్చింది. అయితే, కుదరలేదు. ఆ కథతో బన్ని హీరోగా తీశారు. 

సెట్‌లో నానితో ఎలా ఉండేది?

సుధీర్‌బాబు: మామూలు ఫ్రెండ్స్‌లా మాట్లాడుకుంటూ ఉంటాం.. అలాగే వెళ్లి షాట్‌ చేసేస్తాడు. నేను బాగా ప్రిపేర్‌ అవ్వాలన్న ఆలోచనతో ఉంటా. అందుకే అందరూ అతన్ని ‘నేచురల్‌ స్టార్‌’ అంటారేమో. తన పాత్రను ఇంకా బెటర్‌గా ఎలా చూపించాలి? అనే తపన ఉంటుంది. నటుడి కన్నా ఎక్కువ నానిలో దర్శకుడు కనపడతాడు. అతను సినిమాల్లోకి రాకముందు నుంచే ఫ్యామిలీ ఫ్రెండ్‌గా పరిచయం. మేమిద్దరం హీరోలం అవుతామని అనుకోలేదు. 

‘ప్రేమకథా చిత్రమ్‌’ చేస్తున్నప్పుడు హిట్‌ అవుతుందని అనుకున్నారా?

సుధీర్‌బాబు: నేను చాలా నమ్మకంతో ఉన్నా. నాకు నాలుగు కథలు చెప్పారు. అందులో ఇదొకటి. నాకు బాగా నచ్చింది. పదిరోజుల్లో షూటింగ్‌కు వెళ్దామని అనుకున్నాం. అప్పుడు మారుతీగారు మరో కథ చెప్పారు. దానిలో యాక్షన్‌, డ్యాన్స్‌ ఉంటుందన్నారు. ‘నేను ఈ కథే చేస్తా’ అని చెప్పా. ఎందుకంటే యాక్షన్‌ సన్నివేశాలు చేయాలంటే మంచి బడ్జెట్‌ ఉండాలి. టాప్‌ టెక్నీషియన్లు ఉండాలి. కానీ, నా మార్కెట్‌ను బట్టి ఐదారు కోట్లలోనే సినిమా తీయాలి. అందుకే ‘ప్రేమకథా చిత్రమ్‌’ తీశాం. 

ఈ సినిమాకు మారుతీ తన పేరు వేసుకోలేదట!

సుధీర్‌బాబు: సినిమాను ఆయనే డైరెక్ట్‌ చేశారు. ముందే ఈ విషయం నాకు చెప్పారు. అయితే, అప్పటికి ఆయన సునీల్‌తో ఓ సినిమా చేయాల్సి ఉంది. దాంతో రెండు తనే చేస్తానని అన్నారు. మొదట ఓ ఫైట్‌ సీన్‌ తీశారు. దానికి మారుతీ రాలేదు. ‘మీరు వస్తేనే షూటింగ్‌కు వస్తా’ అని చెప్పడంతో మరుసటి రోజు నుంచి ఆయనే దగ్గరుండి షూటింగ్‌ పూర్తి చేశారు. 

ఎస్‌ఎంఎస్‌ చేస్తుండగా కొన్ని మంచి విషయాలు, ఇంకొన్ని చెడు విషయాలు జరిగాయట ఏంటవి?

సుధీర్‌బాబు: ఆ సినిమాకు ఫండింగ్‌ మొత్తం నేనే పెట్టుకున్నా. మంచి రివ్యూలు వచ్చాయి. అయితే, బడ్జెట్‌ పరంగా ఎక్కువ ఖర్చు పెట్టాం. దీంతో నష్టాలు వచ్చాయి. 

సుధీర్‌బాబుకు కథ చెప్పి ఒప్పించాలంటే చాలా కష్టమట. 

సుధీర్‌బాబు: కథ ఎంపికలో చాలా జాగ్రత్తగా ఉంటాను. ఎందుకంటే నాకు చెప్పిన కథ సరిగా తీయగలరా? లేదా? బడ్జెట్‌ సరిపోతుందా? సలహాలు ఇస్తే తీసుకుంటారా? లేదా? ఈ లెక్కలన్నీ వేసుకుంటా. ఎందుకంటే ఒక్క సినిమా చాలు.. కెరీర్‌ మారిపోవడానికి. 

షూటింగ్‌ సమయంలో మీకు స్వీట్‌రూమ్‌ ఇచ్చినా తీసుకోరట!

సుధీర్‌బాబు: నిద్రపోతే నా జీవితంలో ఏదో మిస్సయిపోతున్నానన్న భావన ఉంటుంది. కుదిరినంత వరకూ మెలకువగా ఉంటా. అందుకే స్వీట్‌ రూమ్‌లో పడుకోను.

మీ ఇద్దరు అబ్బాయిలు సినిమాల్లో నటించారు కదా!

సుధీర్‌బాబు: అవును. ‘భలేభలే మగాడివోయ్‌’లో చిన్నప్పటి నానిగా ఒక అబ్బాయి, ‘గూఢచారి’లో చిన్నప్పటి అడవి శేష్‌గా మరో అబ్బాయి నటించారు. రెండూ ఘన విజయం సాధించాయి. 

‘సూపర్‌ స్టార్‌’ కృష్ణ ఏమైనా సలహాలు ఇస్తారా?

సుధీర్‌బాబు: సలహాలు ఇవ్వరు కానీ, ఆయన అనుభవాలు చెబుతారు. వాటి నుంచి మనం నేర్చుకోవడమే. నేను సినిమాల్లోకి రావడం వల్ల ఆయనకు బాగా దగ్గరయ్యానన్న భావన కలిగింది. తొలి రెండు సినిమాలు చేసినప్పుడు పిలిచి మెచ్చుకున్నారు. నా గురించి ఆయన చాలా సంతోషంగా మాట్లాడతారు. ఆయన పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి వచ్చేద్దామన్న ఆలోచన నాకు లేదు. ‘సుధీర్‌బాబు బాగా చేశాడు’ అని బయట వాళ్లు మెచ్చుకుంటే ఆయన హ్యాపీ ఫీలవుతారు. 

ఇండస్ట్రీకి వచ్చి ఎన్నేళ్లు అవుతోంది?

సుధీర్‌బాబు: ఏడేళ్లు. ఇప్పటివరకూ దాదాపు 10 సినిమాలు చేశా. వీటిలో నాకు ‘సమ్మోహనం’ అంటే బాగా ఇష్టం. సినిమాపరంగానే కాదు, ఇంద్రగంటిగారి నుంచి ఎంతో నేర్చుకున్నా. 

ఇంట్లో వాళ్లు ‘ఆటలు వద్దు’ అన్నారని ఒకరోజంతా గుడికెళ్లి దాక్కున్నారట!

సుధీర్‌బాబు: మాకు కంపెనీ ఉంది. పెట్టుబడులు ఉన్నాయి. దాన్ని చూసుకుంటే సరిపోతుంది. నేనేమో చదువకోకుండా ఆటలంటూ తిరుగుతున్నా. దీంతో ‘అమ్మ.. నాన్నా బ్యాడ్మింటన్‌ వద్దు.. వారంలో రెండు రోజులు మాత్రమే ఆడు’ అని అన్నారు. ‘రోజూ ఆడకపోతే నేను ఎలా గెలుస్తా. ఇలా అయితే, నేను ఇంట్లో నుంచి వెళ్లిపోతా’ అని చెప్పి మా ఇంటి దగ్గరలో సాయిబాబా గుడి ఉంటే అక్కడికి వెళ్లి కూర్చొన్నా. అప్పుడే అక్కడికి సైమా ఫౌండర్‌, నా స్నేహితుడు ఇందూరి విష్ణు వచ్చాడు. విషయం తెలిసి బండి మీద నన్ను ఇంటికి తీసుకెళ్లాడు. 

సుధీర్‌ విషయంలో మీ తల్లిదండ్రులు హ్యాపీనా?

సుధీర్‌బాబు: చాలా హ్యాపీ. ‘నేను ఇంత కష్టపడ్డాను కదా! నువ్వు కూడా ఎందుకు కష్టపడాలి’ అని నాన్న అనేవారు. కానీ, నేను కాస్త నిలదొక్కుకున్న తర్వాత ఆయన హ్యాపీ.

‘వి’లో విలన్‌ ఎవరు?

సుధీర్‌బాబు: నాని (వెంటనే ఆలీ అందుకుని.. నాకెందుకో చివరిలో సుధీర్‌బాబు విలన్‌ అంటారేమో అనిపిస్తోంది. వెన్నెల కిషోర్‌ను కూడా నమ్మడానికి లేదు. తనైనా కావచ్చు అన్నారు) ఏమో మీ ఊహకే వదిలేస్తున్నాం. ఇంద్రగంటిగారి సినిమా అంటే ఎవరూ ఊహించలేరు. యాక్షన్‌తో పాటు డ్రామా కూడా ఉంటుంది. ఈ సినిమాతో తెలుగు తెరపై ఒక కొత్తదనం కనిపిస్తుంది. 

భవిష్యత్‌లో సుధీర్‌బాబు బాలీవుడ్‌ వెళ్తాడని టాక్‌ నడుస్తోంది నిజమేనా?

సుధీర్‌బాబు: ఇక్కడ ఎదగడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ వదిలేసి బాలీవుడ్‌కు ఎలా వెళ్తాను. అవకాశాలు వస్తే చేస్తానేమో కానీ, ఇక్కడ వదిలేసి వెళ్లను. 

టీ కోసం సెంటిమెంట్‌గా భావించిన వాచీని కూడా ఇచ్చేసి తాగారట! ఆ టీ అంత స్పెషలా?

సుధీర్‌బాబు: ‘ఎస్‌ఎంఎస్‌’ షూటింగ్‌ చేస్తుండగా బాగా అలసిపోయాం. ఆ పక్కనే టీ స్టాల్‌ ఉంటే, అక్కడి నుంచే అన్నీ తెచ్చుకునేవాళ్లం. బిల్లు పెరిగిపోయింది. ఒక రోజు ఆ టీ స్టాల్‌ అతను ఆఫీస్‌కు వచ్చి డబ్బులు అడిగాడు. ఆ సమయంలో నేను తప్ప ఎవరూ లేరు. దాంతో మావయ్యగారు ఇచ్చిన వాచ్‌ తీసి ‘దీన్ని నీ దగ్గర పెట్టుకో తర్వాత డబ్బులు ఇచ్చి తీసుకుంటా’ అని చెప్పాను. అతను తీసుకోలేదు.

త్వరలో చేయబోయే సినిమాలు ఏంటి?

సుధీర్‌బాబు: పుల్లెల గోపీచంద్‌ బయోపిక్‌ ఒకటి. 70 ఎం.ఎం.ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌లో మరొకటి చేస్తున్నా. 

భవిష్యత్‌లో సుధీర్‌బాబు పిల్లల్ని నటులుగా చూడొచ్చా?

సుధీర్‌బాబు: ప్రస్తుతం వాళ్లకు నటనపై ఆసక్తి ఉంది. అన్నీ నేర్చుకుంటున్నారు. 

జాకీచాన్‌ హీరోగా, సుధీర్‌బాబు విలన్‌గా అవకాశం వస్తే?

సుధీర్‌బాబు: కళ్లు తిరిగి పడిపోతా. ఆ అవకాశం వస్తే, నేనే ఎదురు డబ్బులు ఇస్తా. (వెంటనే ఆలీ అందుకుని.. వాళ్లు చైనా రమ్మంటారు. వెళ్తారా?) అయ్య బాబోయ్‌ ఈ సమయంలో రిస్క్‌ చేయను. 

మహేశ్‌బాబు హీరోగా, సుధీర్‌బాబు నిర్మాతగా ఓ సినిమా చేస్తున్నారని విన్నాం నిజమేనా?

సుధీర్‌బాబు: ప్రస్తుతానికి ఏమీ లేదు. ఒక వేళ నేను అడిగితే మహేశ్‌ డేట్స్‌ ఇస్తారు. 

మహేశ్‌బాబు నుంచి మూడు క్వాలిటీలు తీసుకోమంటే ఏం తీసుకుంటారు?

సుధీర్‌బాబు: తల్లిదండ్రులు పిల్లల్ని చూసుకోవడం సాధారణం. అయినా, మహేశ్‌ కుటుంబానికి ఒక పెద్దన్నలా ఉండి అందరికీ సాయం చేస్తుంటారు. అందుకే ఆయనపై నాకు ఎంతో గౌరవం ఏర్పడింది. ఇంకో విషయం ఏంటంటే.. ఆయన చాలా వినమ్రంగా ఉంటారు. నా కబోర్డ్‌లో చాలా బట్టలు ఉంటాయి. అందులో సగం అసలు వేసుకోనివే ఉంటాయి. అదే మహేశ్‌ కబోర్డ్‌లో చూస్తే, ఐదారు జతలకు మించి ఉండవు. అంతేకాకుండా సినిమా కోసం చాలా కష్టపడతారు. 

బ్యాడ్మింటన్‌ ఆడే రోజుల్లో పేరు ఎందుకు మార్చుకోవాల్సి వచ్చింది?

సుధీర్‌బాబు: నేను బెంగళూరులో చదువుకుంటూ ఆ రాష్ట్రం తరపున నేషనల్స్‌ ఆడేవాడిని. అప్పుడు వార్తల్లో నా పేరు వచ్చేది. అమ్మానాన్నలకు నేను ఆడుతున్నట్లు తెలియకూడదని నా పూర్తి పేరు పోసాని నాగ సుధీర్‌బాబును పీఎన్‌ఎస్‌బి లేదా పీఎన్‌ఎస్‌ బాబు అని పెట్టేవాడిని. ఒక టోర్నమెంట్‌కు పీఎస్‌బీ నాగేంద్ర అని పెట్టాను. జాబ్‌ వస్తుందనే ఉద్దేశంతో నేను బ్యాడ్మింటన్‌ ఆడలేదు. 

నాని మీ గురించి ఏదో ట్వీట్‌ పెట్టారట!

సుధీర్‌బాబు: ‘బాఘీ’ చూసిన తర్వాత ‘సుధీర్‌బాబు బాగా చేశాడు. నేను కూడా అలాంటి పాత్ర చేయాలి’ అని ట్వీట్‌ చేశాడు. అందుకు నేను సమాధానం ఇస్తూ, ‘నాని నువ్వు అలాంటి పాత్రకు సరిపోవు’ అని అన్నా. ‘ఈ సారి ఫిక్స్‌ నువ్వు హీరో.. నేను విలన్‌ చూద్దాం’ అన్నాడు. చాలా రోజుల తర్వాత ‘వి’ కుదిరింది. 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని