నల్లకుంట నుంచి కృష్ణానగర్‌కు నడిచేవాడిని..
close
Published : 27/03/2020 13:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నల్లకుంట నుంచి కృష్ణానగర్‌కు నడిచేవాడిని..

భీమవరానికీ సినిమాలకీ మంచి అనుబంధం ఉంది. త్రివిక్రమ్‌, సునీల్‌, అబ్బూరి రవి... అక్కణ్నుంచి పరిశ్రమకి వచ్చి తమ ప్రతిభాపాటవాలను చూపిస్తున్నవారెందరో! ఆ జాబితాకే చెందిన మరో భీమవరం బుల్లోడు సుబ్బరాజు. భిన్నమైన పాత్రలు పోషిస్తూ తనకంటూ పరిశ్రమలో ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు. బాహుబలి-2లో కుమారవర్మగా ప్రేక్షకుల మన్ననలు పొందాడు. త్వరలో అనుష్క ప్రధాన పాత్రలో హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘నిశ్శబ్దం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ నేపథ్యంలో గతంలో సుబ్బరాజు పంచుకున్న విశేషాలు మీకోసం..

నాకెప్పుడూ ఫస్ట్‌క్లాస్‌ మార్కులే..

నాకు 20 ఏళ్లు వచ్చేంతవరకూ భీమవరం తప్ప బయటి ప్రపంచం గురించి తెలీదు. భీమవరం అందరికీ పట్టణమేమోగానీ నాకు మాత్రం పెద్ద పల్లెటూరు. ఇలా ఎందుకు అంటున్నానంటే... రోడ్డు మీద నేను నిల్చుంటే రామకృష్ణరాజు గారి అబ్బాయినని అందరూ గుర్తుపట్టేస్తారు. నన్నే కాదు, అలా అందరినీ అందరూ పోల్చేస్తారు. మా సొంతూరు భీమవరం దగ్గర్లోని లింగరాజు పాలెం. నేను పుట్టి పెరిగింది మాత్రం భీమవరంలోనే. అక్కడ డీఎన్‌ఆర్‌ కాలేజీలో నాన్న తెలుగు లెక్చరర్‌గా పనిచేసి రిటైరయ్యారు. నేనూ ఆ విద్యాసంస్థకు చెందిన స్కూల్‌, కాలేజీల్లోనే చదువుకున్నాను. త్రివిక్రమ్‌, సునీల్‌ కూడా అదే కాలేజీలో చదువుకున్నారు. మా పెదనాన్న తెలుగు మాస్టారు. అన్నయ్య సంస్కృతం లెక్చరర్‌. కుటుంబంలో అందరూ సాహిత్యం చదివారు. నేను మాత్రం సైన్స్‌(బిఎస్సీ) చదివాను. అప్పట్లో బయటి కాలేజీల్లో జరిగే ర్యాగింగ్‌ గురించి వింటుంటే వింతగా అనిపించేది. ‘స్ట్రిక్ట్‌’ అనే మాట మా కాలేజీలో వినిపించేది కాదు. కానీ ఆకతాయి తనమూ ఉండేదికాదు. నాకెప్పుడూ ఫస్ట్‌క్లాస్‌ మార్కులు వచ్చేవి.

వైజాగ్‌ ప్రయాణం

20 ఏళ్ల తర్వాత కూడా పిల్లలు ఇంట్లో ఉంటూ తల్లిదండ్రులమీద ఆధారపడటం తనకు ఇష్టం ఉండదని మాకు 15 ఏళ్ల వయసు నుంచీ చెబుతూ వచ్చారు నాన్న. అందుకే డిగ్రీ అయిపోగానే నా బతుకు నేను బతకాలనుకున్నాను. ఆఖరి పరీక్ష రాసిన మర్నాడే ఉద్యోగం చూసుకుందామని వైజాగ్‌ వెళ్లాను. అక్కడ దాదాపు రెండేళ్లు వివిధ సంస్థల్లో పనిచేశాను. కొన్ని రోజులు పనిచేయడం, నచ్చకపోతే మళ్లీ ఇంటికి రావడం, మళ్లీ నాన్న మాటలు గుర్తొచ్చి బయటకు వెళ్లడం చేసేవాణ్ని. వైజాగ్‌లో కంప్యూటర్స్‌కు సంబంధించిన కోర్సు చేసి ఓ సంస్థలో పనిచేస్తూ మోడలింగ్‌ కూడా చేశాను. రోజులు గడుస్తున్నాయి కానీ అవేవీ నచ్చడంలేదు. కొందరికి రోజూ ఒకేలాంటి పనుంటే బావుంటుందనుకుంటారు. నాకు మాత్రం పనిలో కొత్తదనం ఉండాలి, మనచుట్టూ ఉండే మనుషులు మారాలి... అనిపించేది. అందుకు సినిమా రంగం సరైనదనిపించింది. స్కూల్‌ రోజుల్లో ఎదురైన ఓ అనుభవం మాత్రం నటుడిగా గుర్తింపు తెచ్చుకోవాలన్న కసిని తెచ్చింది. అదేంటంటే... స్కూల్‌ వార్షికోత్సవ సమయంలో నాటకం వేయడానికి ఆసక్తి ఉన్న పిల్లల్ని పిలిచారు. ఆ నాటకాన్ని మాచేత వేయించడానికి గజల్‌ శ్రీనివాస్‌ వచ్చారు. శ్రీనివాస్‌వాళ్ల అన్నయ్య మా స్కూల్లో టీచర్‌. ఆయన శ్రీనివాస్‌ని తీసుకొచ్చారు. నేను కూడా వేషం వేద్దామని వెళ్లాను. ఏదో గురుశిష్యుల కథ. కాస్త ఎత్తుగా కనిపిస్తున్నానని నన్ను గురువుగా వెయ్యమన్నారు. కానీ డైలాగులు సరిగ్గా చెప్పలేకపోయాను. ఆయన కోపంగా ‘నువ్వొద్దు వెళ్లిపో’ అన్నారు. మరో ఛాన్స్‌ ఇవ్వండన్నా ఇవ్వలేదు. దాంతో కసి పెరిగిపోయింది. ఎప్పటికైనా నటుడిగా నిరూపించుకోవాలి అనుకున్నాను కానీ తర్వాత ఆ సంగతి మర్చిపోయాన్లెండి.

‘ఖడ్గం’తో మొదలు

సినిమాల్లో ఓ ప్రయత్నం చేసి చూద్దామని హైదరాబాద్‌ బయలుదేరాను. సినిమాల్లోకి వెళ్తానని చెప్పినపుడు ఇంట్లో ఏమీ అనలేదు. రంగం ఏదైనా నా వ్యక్తిత్వం ఒకేలా ఉంటుందని వాళ్లకి నమ్మకం. ఏదైనా రంగం నచ్చనపుడు అది నరకంలా ఉంటుంది. నచ్చితే ఎంత కష్టమైనా ఆనందాన్నిస్తుంది. దీనికో ఉదాహరణ చెబుతాను. హైదరాబాద్‌ వచ్చిన కొత్తలో నల్లకుంటలో ఉండేవాణ్ని. ఒక్కోసారి చేతిలో డబ్బు లేకుంటే నల్లకుంట నుంచి కృష్ణానగర్‌... దాదాపు 10 కి.మీ. నడిచి వచ్చేవాణ్ని. అదే వైజాగ్‌లో బైక్‌ పాడైనపుడు బస్సులోనో ఆటోలోనో ఆఫీసుకి వెళ్లాలన్నా కష్టంగా ఉండేది. 2001లో ఇక్కడికి వచ్చాను. 2002లో కృష్ణవంశీ గారి ‘ఖడ్గం’లో నటించే అవకాశం వచ్చింది. సినిమాల కోసం ప్రయత్నిస్తూనే మరోవైపు ఉద్యోగం చేసుకుంటున్న రోజులవి... కృష్ణవంశీగారి కంప్యూటర్‌కి ఏదో ప్రాబ్లమ్‌ ఉంటే నాకు కంప్యూటర్స్‌లో టచ్‌ ఉందని తెలిసి ఆయన పర్సనల్‌ మేనేజర్‌ వెంకట్‌ నన్ను తీసుకువెళ్లారు. పని పూర్తయ్యాక సినిమాలపైన నాకున్న ఆసక్తి గురించి వంశీగారికి వెంకట్‌ చెప్పారు. దాంతో ఖడ్గంలో ఉగ్రవాదిగా చిన్న వేషం ఇచ్చారు. తర్వాత కె.ఎస్‌.రామారావు గారు ‘ఎవరే అతగాడు’ సినిమాలోనూ మరో చిన్న పాత్ర ఇచ్చారు.

పూరీతో దోస్తీ

మంచి అవకాశం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న సమయంలో- ‘అమ్మానాన్న ఓ తమిళమ్మాయి’ షూటింగ్‌ మరో వారం రోజుల్లో ప్రారంభమవుతుందనగా పూరీ గారిని కలిశాను. కె.ఎల్‌.ఎన్‌.రాజు ఆ సినిమాకి సమర్పకులు. ఆయనే పూరీకి పరిచయం చేశారు. అప్పటికే అన్ని పాత్రలకూ నటుల్ని ఎంపికచేసిన్పటికీ, నాకో ప్రాధాన్యం ఉన్న పాత్ర ఇచ్చారు. అది నిజంగా నా అదృష్టమే. సెట్‌లో ప్రతి రోజూ పనిని ఎంజాయ్‌ చేశాను. ‘...తమిళమ్మాయి’లో చూసి ‘ఆర్య’లో సుకుమార్‌ ఛాన్స్‌ ఇచ్చారు. రెండూ విలన్‌ తరహా పాత్రలే. ఆర్యలో మొదట ఒక వారం షూటింగ్‌ ఉండే పాత్ర అన్నారు. క్యారెక్టరైజేషన్‌ నచ్చిందేమో, నెల రోజులకు పెంచారు. దానికీ మంచి గుర్తింపు వచ్చింది. తర్వాత దర్శకుడు హరీష్‌ శంకర్‌ ‘షాక్‌’లో మంచి పాత్ర ఇచ్చారు. కానీ సినిమా ఆడకపోవడంవల్ల పేరు రాలేదు. హీరో అవ్వాలనో, విలన్‌ అవ్వాలనో నేను పరిశ్రమకి రాలేదు. నటుణ్ని అవ్వాలని మాత్రమే వచ్చాను. అందుకని ఏరోజూ నాకు వచ్చిన పాత్రల్ని తిరస్కరించలేదు. ‘... తమిళమ్మాయి’లో చేశాక పూరీతో మంచి స్నేహం ఏర్పడింది. సినిమాలే కాకుండా స్నేహితుల్లా అన్ని విషయాల్నీ చర్చించేవాళ్లం. కొన్నిసార్లు కథల్ని వినిపించి అభిప్రాయం చెప్పమనేవారు. ‘...తమిళమ్మాయి’ చేశాక ఆయన నాలుగైదు సినిమాలు చేశారు. అందులో నాకు అవకాశం ఇవ్వలేదు. వ్యక్తిగత బంధం వేరు, వృత్తివేరు అనుకొని ఏరోజూ ఆయన్ని వేషాలివ్వమని అడగలేదు. మళ్లీ ‘పోకిరి’లో మంచి పాత్ర ఇచ్చారు. ఆ తర్వాత నుంచి అవకాశాల గురించి చూడాల్సిన అవసరం రాలేదు. ఏటా పదికిపైగా సినిమాల్లో చేస్తూ వచ్చాను. అప్పట్నుంచీ పూరీ సినిమాలో ఎలాంటి పాత్ర ఉన్నా ‘ఇది నువ్వు చెయ్యి అన్నయ్య’ అంటాడన్న నమ్మకం వచ్చింది. ఆయనతో పదికిపైగా సినిమాల్లో చేశాను. పరిశ్రమలోకి వచ్చి అయిదేళ్లపాటు ఒకేలాంటి పాత్రలు చేస్తున్న సమయంలో శేఖర్‌ కమ్ముల ‘లీడర్‌’లో భిన్నమైన, పూర్తి నిడివి ఉన్న క్యారెక్టర్‌ దొరికింది. లీడర్‌ తర్వాత ప్రాధాన్యం ఉన్న పాత్రలు రావడం పెరిగింది. అలాంటి వాటిలో ‘మిర్చి’లో చేసిన పాత్ర ఒకటి. నాలోని కామెడీ యాంగిల్‌ను చూపిందా సినిమా.

అలా హీరోనయ్యా

గుర్తింపు వచ్చిన తర్వాత ఎవర్నీ అవకాశాల కోసం అడగలేదు. ఓ సినిమా కోసం తొలిసారి పూరీ గారిని అడుగుదామా అనుకున్నాను. అదే ‘బుడ్డా’. ఆయన అమితాబ్‌ బచ్చన్‌తో సినిమా చేస్తున్నారని తెలిసిన రోజునుంచీ అడుగుదామనే అనుకునేవాణ్ని. కానీ ఏదో మొహమాటం. అంతలో పూరీనుంచే పిలుపొచ్చింది. ‘బుడ్డా’లో నాకు వేషం ఇస్తున్నట్లు చెప్పగానే కల నిజమైనట్టనిపించింది. షూటింగ్‌ సమయంలో పక్కన బిగ్‌బీ ఉంటే ఇది నిజమేనా అని సందేహం వచ్చేది. ఆ సినిమా పని వాతావరణం కూడా గొప్పగా ఉండేది. ప్రతి సీన్‌నూ షూట్‌ చేసేముందు అందులోని వారంతా ముందు స్టేజ్‌మీద చేసినట్టు రిహార్సల్స్‌ చేయాలి. రిహార్సల్స్‌ తర్వాతే టేక్‌ తీసుకునేవాళ్లు. ఓ సీన్లో అమితాబ్‌ ముఖంమీదకి పొగ ఊది డైలాగ్‌ చెప్పాలి. నావల్ల కాదని పూరీకి చెబుతుంటే, అమితాబ్‌ అక్కడికి వచ్చి ఏమైందని అడిగారు. పూరీ విషయం చెప్పారు. ఆయన వెంటనే ‘లెట్స్‌ డు ఇట్‌...’ అన్నారంతే. బుడ్డా సమయానికి జీవితంలో ఉన్నత శిఖరాన్ని చేరుకున్నట్టనిపించింది. పూరీ గారి భార్య లావణ్య నన్ను ఇంట్లో మనిషిలా చూస్తారు. ఆ అభిమానంతో సుబ్బరాజుని హీరో చేయమని తరచూ పూరీని అడిగేవారు. అలా చాలారోజులు అడిగితే ఓరోజు నన్నూ, లావణ్య వదిననీ కూర్చోబెట్టి... ‘సుబ్బూకోసం కథ రాయడం, నిర్మాతని వెతుక్కోవడం... ఇప్పుడు నేనంత కష్ట పడలేను. కానీ నీ కోరిక తీరే మార్గం ఒకటుంది’ అంటూ, ఒక కథ వినిపించారు. అందులో నేను హీరో- అంటే అందులో నాది సినిమా హీరో పాత్ర. అదే రవితేజ హీరోగా వచ్చిన ‘నేనింతే!’.

కుమార వర్మ... అంటున్నారు

ఆర్య సుబ్బరాజు, పోకిరి సుబ్బరాజు, లీడర్‌ సుబ్బరాజు... ఏ సినిమా చేసినా నాపేరు ముందు ఆ సినిమా పేరు పెట్టుకునేంత గుర్తింపు వచ్చింది. కానీ ‘బాహుబలి-2’తో అంతకు మించిన పేరొచ్చింది. ఇప్పుడు అందులోని నా పాత్ర ‘కుమారవర్మ’ పేరుతోనే స్నేహితులంతా పిలుస్తున్నారంటే నమ్మండి. ఇంత పేరు రావడానికి కారణం పాత్ర పలికించే భావోద్వేగాలూ, ఆ పాత్రకు ఉన్న ప్రాధాన్యం. సినిమాలో ప్రధాన పాత్రలన్నీ మొదటి భాగంలో కనిపిస్తాయి. కుమారవర్మ మాత్రం రెండో భాగంలోనే ఉంటాడు. కొత్త క్యారెక్టర్‌ కాబట్టి ప్రేక్షకులూ ఆసక్తిగా చూశారు. అందులోనూ ముందు అమాయకుడిగా, భయస్తుడిగా ఉన్నవాడు కాస్త ధైర్యవంతుడవుతాడు. ఇలా మార్పు రావడం కూడా పాత్రకు బలాన్నిచ్చింది. చరిత్ర, పురాణగాథలకు సంబంధించిన సినిమాల గురించి వినడమే తప్ప ఎప్పుడూ చెయ్యలేదు. షూటింగ్‌లో కత్తి పట్టుకుంటుంటే మొదట్లో కొత్తగా అనిపించింది. ఆ బట్టలూ, నగలూ, గుర్రాలూ, రథాలూ, కోటలూ... అదో కొత్త ప్రపంచం. రాజమౌళి గారితో పనిచేయడం కూడా ఇదే మొదటిసారి. ఆయన మనం ఎలా చేయాలో చేసి చూపిస్తారు. ఆయన చేసినట్టు మనం చేస్తే చాలు. అయితే అందులో సుఖమూ, ఉంది కష్టమూ ఉంది. ఆయనే చేసి చూపిస్తారు- అది సుఖం. ఆయన్ని అందుకోవడం- కష్టం. కుమారవర్మ ట్యాగ్‌ని ఆస్వాదిస్తున్నాను.

అది తాతయ్య పేరు

మా తాతగారి పేరు సుబ్బరాజు. పరిశ్రమలోకి వచ్చాక, పేరు మార్చుకోవాలన్న ప్రతిపాదన వచ్చినపుడు నాన్న ఒప్పుకోలేదు. తాతయ్య ఆ కాలంలో బనియన్‌ తయారీ కంపెనీని నడిపేవారు. అందుకే మిషన్‌ సుబ్బరాజు గారని పేరు.

* ఒకరిలా ఉండడం నచ్చదు. అలా ఉంటే అది సెకెండ్‌ హ్యాండ్‌ లైఫ్‌. నచ్చింది చేయడం చిన్నప్పట్నుంచీ అలవాటు.

* నా ఎత్తు ఆరడుగుల మూడు అంగుళాలు ‘మంచి ఎత్తూ, రంగూ ఉన్నావ్‌. హీరోగా ట్రైచేయొచ్చుగా’ అంటుంటారు. హీరోకి కావాల్సింది ఎత్తూ, రంగూ కాదు, రెండున్నర గంటలపాటు ప్రేక్షకుల్ని కట్టిపడేసే సామర్థ్యం అని నా అభిప్రాయం.

* ఇండస్ట్రీలోకి వచ్చాక హీరోల్లో బన్నీ, ప్రభాస్‌, తారక్‌... ఇలా కొందరితో స్నేహం కుదిరింది. అప్పుడప్పుడూ కలిసి సరదాగా మాట్లాడుతాను.

* సినిమాలు ఎక్కువగా చూడను. మంచి సినిమా అంటేనే చూస్తాను. ఖాళీ దొరికితే విహార యాత్రలకు వెళ్తుంటాను.

* తెలుగుతోపాటు కన్నడలో పది వరకూ సినిమాలు చేశాను.

* ఇప్పటివరకూ తన కోసం జీవితం ఇవ్వాలనిపించే అమ్మాయి కనిపించలేదు. ఆరోజు వస్తే కచ్చితంగా పెళ్లి చేసుకుంటాను. ‘అందరిలా నాకూ పెళ్లి జరిగిపోవాలి’ అని మాత్రం చేసుకోను.

* సోషల్‌ నెట్‌వర్కింగ్‌లో స్నేహాలూ, చర్చలూ నాకు నచ్చవు. ప్రజలకు మనమేంటో చూపించి, మనకి ప్రజలేంటో చూపించే పరిస్థితి ఇష్టం ఉండదు.

* ప్రకృతి చికిత్స చేయడం నాన్నకు హాబీ. ఆయన్నుంచి నేనూ కొంత నేర్చుకున్నాను.

 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని