ఈ టాపిక్‌ అడక్కుండా ఉంటే బాగుండేది!
close
Published : 30/03/2020 09:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఈ టాపిక్‌ అడక్కుండా ఉంటే బాగుండేది!

కొందరు అవకాశాల కోసం చూస్తుంటారు. ఇంకొందరు అవకాశాలను సృష్టించుకుంటారు. రెండో కోవకు చెందిన వ్యక్తి యువ కథానాయకుడు విశ్వక్‌సేన్‌. ‘వెళ్లిపోమాకే’ చిత్రంతో కథానాయకుడిగా పరిచయం అయిన ఆయన ‘ఈ నగరానికి ఏమైంది’తో మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక ‘ఫలక్‌నుమా దాస్‌’గా మాస్‌లో మంచి ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. ఇటీవల శైలేష్‌ కొలను దర్శకత్వంలో నాని నిర్మించిన ‘హిట్‌’ మూవీతో మంచి విజయాన్ని అందుకున్నారు. దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ వ్యాఖ్యాతగా ‘ఈటీవీ ప్లస్‌’లో ప్రసారమయ్యే ‘నీకు మాత్రమే చెప్తా’ కార్యక్రమానికి విచ్చేసి ఎన్నో సరదా సంగతులు పంచుకున్నారిలా..

ఒక్క సినిమాకు దర్శకత్వం వహించినా ఈ షోకు మిమ్మల్ని పిలించాం. ‘ఫలక్‌నుమా దాస్‌’ చూసి సుకుమార్‌ కూడా మెచ్చుకున్నారు. దర్శకత్వం ఎందుకు చేయాల్సి వచ్చింది?

విశ్వక్‌సేన్‌: ‘వెళ్లిపోమాకే’ నా తొలి చిత్రం. నేను షార్ట్‌ఫిల్మ్స్‌ చేసినప్పుడు ఏ కెమెరామెన్‌ అయితే పనిచేశాడో అదే వ్యక్తి, నా స్నేహితులం కలిసి రూ.12 లక్షల్లో సినిమా తీశాం. అదృష్టవశాత్తూ దిల్‌రాజుగారు ఆ సినిమా చూసి, థియేటర్‌లో విడుదల చేశారు. ఆయన సినిమా తీసుకున్న దానికీ, విడుదల చేసి దానికి ఏడాదిన్నర విరామం వచ్చింది. అందుకు చాలా కారణాలు ఉన్నాయి. ఆ సమయంలో చిరాకొచ్చేసింది. ఏడాది తర్వాత ఒక నిర్మాత ఆఫీస్‌కు పిలిచి కథ చెప్పారు. నాకూ నచ్చింది. అందులో నలుగురు హీరోలు. సినిమా చేయడం కోసం ఐదు నెలల పాటు రోజూ ఆ ఆఫీస్‌ చుట్టూ తిరగడం మొదలు పెట్టా. లీడ్‌రోల్‌ నాకిచ్చారు. నెల రోజుల తర్వాత ఆ పాత్ర ఇంకొకరికి ఇచ్చి, నాకు మరో పాత్ర అని చెప్పారు. ఆ తర్వాత మరో పాత్ర, ఇంకొన్ని రోజులు ఇంకో పాత్ర, చివరకు నాకు నాలుగో పాత్ర దక్కింది. మొదట బాధపడినా.. నాకు ఏదో ఒక పాత్ర దక్కిందని సంతోషపడ్డా. ఐదు నెలల్లో నన్ను దాదాపు 20 సార్లు ఆడిషన్‌ చేశారు. 20 సార్లూ ఏదో కారణం చెప్పేవారు. ‘నాకసలు నటన వచ్చా’ అన్న అనుమానం కలిగింది. నాలుగో పాత్రకు ఎంపికైన నెల రోజుల తర్వాత ఆ పాత్ర నుంచి కూడా నన్ను తీసేశారని ఎవరో చెబితే తెలిసింది. దీంతో ఆఫీస్‌కు వెళ్లి కూర్చున్నా. నన్ను చూసి కూడా ఎవరూ పట్టించుకోలేదు. ఒకతను నా దగ్గరకు వచ్చి, ‘డైరెక్టర్‌తో ఏదైనా మాట్లాడాలా? వెళ్లి మాట్లాడవచ్చు కదా’ అన్నాడు. నాకు చిర్రెత్తుకొచ్చింది. నేను బాధలో ఉన్నా, సంతోషంగా ఉన్నా సినిమాలే చూస్తా. అప్పుడే ‘అంగమలై డైరీస్‌’ చూసి, ‘నాకు ఎవరో అవకాశం ఇచ్చేదేంటి? నేనే చేస్తా’నని ఫలక్‌నామా నేపథ్యంలో కథ రాసుకున్నా. 

ఈలోగా నటుడు అయిపోయారనుకుంటా!

విశ్వక్‌సేన్‌: అవును! మరికొద్దిరోజుల్లో ‘ఫలక్‌నుమా దాస్‌’ షూటింగ్‌కు వెళ్దామనుకున్నాం. రామానాయుడు స్టూడియోస్‌లో నా స్నేహితుడు ఉంటే కలవడానికి వచ్చా. అప్పుడు అతను నా ఫొటోను నీకు (తరుణ్ భాస్కర్‌)కు పంపాడు. దాంతో నువ్వు చేస్తున్న సినిమాకు సంబంధించి స్క్రిప్ట్‌ నా చేతిలో పెట్టావు. ఆ రాత్రి ఇంటికి వెళ్లి చదివా. మరుసటి రోజు కూడా టైమ్‌ తీసుకుని జైలు సీన్‌లో నటించి నా ఫ్రెండ్‌కు చూపించా. అతను ‘బాగుంది’ అని చెప్పాడు. తాగుబోతు పాత్ర కావడంతో ఆడిషన్‌కు వచ్చే ముందు దెబ్బలు తగినట్లు కనపడటానికి ముఖానికి లిప్‌స్టిక్‌ రాసుకుని తాగినట్లు ఊగుతూ మీ ఆఫీస్‌ వచ్చా. అందరూ ‘ఏమైంది... ఏమైంది’ అని అడగడం మొదలు పెట్టారు. నీకు విషయం అర్థమై, ‘క్యారెక్టర్‌లో వచ్చావు కదా’ అన్నావు. అలా ‘ఈ నగరానికి ఏమైంది’లో నటించా.

డైరెక్షన్‌ టీమ్‌ను ఎలా సెలక్ట్‌ చేసుకున్నావు?

విశ్వక్‌సేన్‌: నాకు నచ్చిన సినిమాలు నాలుగు.. నచ్చని సినిమాలు ఇంకో నాలుగు సెలక్ట్‌ చేశా. ‘ఇందులో మీకు ఏ సినిమాలంటే ఇష్టం’ అని అడిగేవాడిని. వాళ్లు నాకు నచ్చని సినిమాలు చెబితే వాళ్లను తీసుకునేవాడిని కాదు. 

నీకు నచ్చని సినిమాలు ఏవి?

విశ్వక్‌సేన్‌: ఆ పేర్లు చెబితే, ఆ నలుగురు డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లకు వ్యతిరేకంగా చేద్దామని అనుకుంటున్నారా?(నవ్వులు) నేను చేసే కామెడీలో డార్క్‌ హ్యూమర్‌ ఉంటుంది. ఒక సన్నివేశంలో ఇద్దరి మధ్య జరిగే సంభాషణ నుంచి కామెడీ పుట్టాలి. అదే కామెడీ చేసే వాడే ఎగిరెగిరి కామెడీ చేస్తే, అది నచ్చదు. ‘ఎఫ్‌2’ సినిమా ఫస్ట్‌ 15 నిమిషాలు చూసి బుర్ర హీటెక్కి బయటకు వచ్చేశా. కానీ, ఆ సినిమా ఘన విజయం సాధించింది. కలెక్షన్లు భారీగా వచ్చాయి. నాకు నచ్చనంత మాత్రాన అది చెడ్డ ఫిల్మ్‌ అని నేను చెప్పను. నేను కనెక్ట్ కాలేకపోయానంతే. 

జీవితం మీద మంచి క్లారిటీ ఉందనుకుంటా!

విశ్వక్‌సేన్‌: జీవితం మీద నాకు స్పష్టత లేదు. నేను ఇంకా చిన్న పిల్లాడినే. 

ఇంటిని నుంచి పారిపోయేటప్పుడు ఎంతమందిని తీసుకుపోయావు?

విశ్వక్‌సేన్‌: సరిగా చదవడం లేదని ఇంట్లో తిట్టడం.. కొట్టడం చేస్తున్నారు. దీంతో ఇంట్లో నుంచి వెళ్లిపోదామని నలుగురం స్నేహితుల నిర్ణయించుకున్నాం. దిల్‌సుఖ్‌నగర్‌ రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న మలక్‌పేట వెళ్లిపోయాం. వెళ్తూ వెళ్తూ ఒక ఫోన్‌ నంబర్‌ వాటర్‌ బాటిల్‌కు అంటించి ఫ్రిజ్‌లో పెట్టి వెళ్లిపోయా. అరగంట తర్వాత ఫోన్‌ మోగింది. ఫోన్‌ ఎత్తి, మా నాన్న మాటలు వినగానే కరిగిపోయి ఇంటికి వెళ్లిపోయా. దానికి ఇంటి నుంచి పారిపోయాం అని అనడం బాగుండదు. అయితే, మా నాన్న నన్ను ఏమీ అనలేదు గానీ, నా ఫ్రెండ్‌ గోపీ వాళ్ల నాన్న వాడిని ఇరగొట్టేశాడట. (నవ్వులు) 

(హీరోయిన్‌ సిమ్రన్‌, కొద్దిసేపటికి నటుడు అభినవ్‌ గోమఠం షోలోకి వచ్చారు)

‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రంలో సిమ్రన్‌కు నేను వేరే పేరు పెడితే, నువ్వు బలవంతంగా నీకు నచ్చిన పేరు పెట్టించావు. ఎందుకు?

విశ్వక్‌సేన్‌: నేను ఒకటో తరగతిలో ఉండగా, రెండు సార్లు గైడ్‌ పోగొట్టుకున్నా. అప్పుడు శిల్ప అనే అమ్మాయి తన గైడ్‌ నాకు ఇచ్చింది. అందుకని ‘శిల్ప’ అని పేరు పెట్టా. ఆ అమ్మాయి చేసిన పనికి కృతజ్ఞతగా ఆ పేరు పెట్టించా. 

విశ్వక్‌సేన్‌ను చూడగానే సిమ్రన్‌ మీకేమనిపించింది?

విశ్వక్‌సేన్‌: ఈ ప్రశ్నకు సమాధానం నేనే చెబుతా. ఈ సినిమా షూటింగ్‌ మొదలైన రోజున తను మేకప్‌ చేయించుకుంటోంది. నేను ఆ పక్కనే తిరుగుతున్నా. మేకప్‌ అయిపోయిన తర్వాత కూడా నేను ఆ పక్కనే నడుస్తూ వెళ్లా. అందరితోపాటు సెట్‌లో పనిచేసేవాడు అనుకొంది. నువ్వు (తరుణ్‌ భాస్కర్‌) నన్ను తీసుకొచ్చి ‘విశ్వక్‌సేన్‌ యాక్టర్‌’ అని చెబితే ‘అవునా.. చాలా సేపటి నుంచి చూస్తున్నా’ అని అన్నది (నవ్వులు) 

సిమ్రన్‌: విశ్వక్‌తో తొలిసారి మాట్లాడినప్పుడు చిన్న పిల్లవాడనుకున్నా. 

డేట్‌కు వెళ్లాలనుకుంటే ఎవరితో వెళ్తావు? సిమ్రన్‌.. అనీషా ఆంబ్రోస్‌?

అభినవ్‌ గోమఠం: అనీషా.

ఫిల్మ్‌ బిజినెస్‌లో కష్టం ఉంటుందని తెలియదా?

విశ్వక్‌సేన్‌: సినిమా చేస్తున్నప్పుడు సాయంత్రం ఇంటికి వెళ్లగానే, ఈరోజు ‘మంచి కంటెంట్‌ తీశా’ అనిపించేది. ‘రేపు ఎలా తీస్తాను’ అనే టెన్షన్‌ ఎక్కువగా ఉండేది. తెల్లవారుజామున 4 గంటలకు పడుకొనే వాడిని మళ్లీ ఉదయం 7 గంటలకల్లా సెట్‌లో ఉండేవాడిని. 2 నుంచి 4 వరకూ నేను తీయాల్సిన సీన్లు గుర్తుకు తెచ్చుకునేవాడిని. ఆ తర్వాత నేను సమాధానం చెప్పాల్సిన భాగస్వాములు గుర్తుకు వచ్చేవారు. ఎందుకంటే 30శాతం బడ్జెట్‌ మా నాన్న పెట్టారు. మిగిలినదంతా నా స్నేహితుల నుంచి తీసుకున్నదే. సురేశ్‌ సర్‌ దగ్గర కూడా దాదాపు రూ.2 కోట్లకు పైగా తీసుకున్నా. అలా మొత్తం ఆరుకోట్లతో సినిమా చేయడం మొదలు పెట్టాం. దీంతో  నాకు చాలా ఒత్తిడిగా ఉండేది. లాభాల సంగతి పక్కన పెడితే నాకు ఇచ్చిన అసలు మొత్తాన్ని ఇవ్వాలి కదా!

మీ నాన్న ఏమీ అనలేదా!

విశ్వక్‌సేన్‌: నేను కథ చెప్పినప్పుడు ఆయన కూడా ఒక ప్రొడ్యూసర్‌లా విన్నారు. ఆయనకు నమ్మకం ఏర్పడింది. 

ఇప్పటి వరకూ మీరు చూసిన సినిమాల్లో ‘నేనైతే ఆ పాత్ర బాగా చేసేవాడిని’ అని అనుకున్న సినిమా ఏదైనా ఉందా?

విశ్వక్‌సేన్‌: ‘జార్జిరెడ్డి’. వాళ్లు బాగానే చేశారు కానీ, నేనైతే ఇంకా బాగా చేసేవాడిని. ఇది నా అభిప్రాయం.

మీ జర్నీలో ఫ్రస్టేషన్‌ మూవ్‌మెంట్‌లు ఏంటి?

అభినవ్‌ గోమఠం: ‘ఈ నగరానికి ఏమైంది’ ఆడిషన్స్‌ కన్నా చాలా రోజుల ముందు ఇది జరిగింది. పెద్ద డైరెక్టర్‌. ఆడిషన్‌కు కాల్‌ వస్తే వెళ్లా. ఒకటి, రెండు రౌండ్‌లు అయిపోయాయి. ‘బాగా చేశారు’ అని మెచ్చుకున్నారు. నా నటనను దర్శకుడికి కూడా చూపించారు. ఆయనకు కూడా నచ్చింది. రెండు నెలలు ఆగి రమన్నారు. అయితే, అప్పటికే సినిమా మొదలైపోయిందన్న విషయం తెలిసింది. ఫోన్‌ చేస్తే, ‘మీ పాత్ర రెండో షెడ్యూల్‌లో యాడ్‌ చేస్తాం. అప్పుడు పిలుస్తాం’ అని చెప్పారు. రెండో షెడ్యూల్ యూఎస్‌లో చేయాలి. దాంతో వాళ్లు ‘మీ దగ్గర యూఎస్‌ వీసా ఉందా’ అని అడిగారు. ‘లేదు’ అని చెప్పా. ‘అయితే యూఎస్‌ వీసా ఉన్నవాళ్లను తీసుకుంటాం’ అని చెప్పారు. ‘ఎనిమిది నెలలు నన్ను ఆపి. ఇప్పుడు ఇలా అంటున్నారేంటి’ అనిపించి, చాలా కోపం వచ్చింది.

విశ్వక్‌సేన్‌: డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నా. నాకు ఒక ఫ్రెండ్‌ ఉండేది. ‘నువ్వు ఇలా సినిమాల్లో నటిస్తున్నావు కదా! నాకు తెలిసిన వ్యక్తి ఉన్నారు. వెళ్లి కలువు’ అని చెప్పింది. అప్పటికి నేను ఇంకా దిల్‌సుఖ్‌నగర్‌లోనే ఉన్నా. సర్లేనని వెళ్తే.. ఆయన ఫోన్‌ చూసుకుంటూ కూర్చొన్నారు. కొద్దిసేపటి తర్వాత ‘ఏంటమ్మా.. సంగతి’ అని అన్నారు. ‘సర్‌.. ఇలా యాక్టింగ్‌ చేద్దామని వచ్చా. అవకాశం ఉంటే ఇస్తారా’ అని అన్నాను. ‘ఇప్పుడు నువ్వు హీరో కాకపోతే ఏమవుతావు. ముందు అది చూసుకో. నేను డైరెక్టర్‌ అవుదామనుకున్నా. ఈవెంట్‌లు ఆర్గనైజ్‌ చేస్తున్నా’ అని అన్నారు. నాకు ఒళ్లు మండిపోయింది. ‘దిల్‌సుఖ్‌నగర్‌ నుంచి ఇక్కడకు వచ్చింది నీ ఉచిత సలహా తీసుకోవడానికి’ అని అనుకున్నా. మరో సంఘటన.. ఇటీవల ఒక హోటల్‌కు వెళ్లి భోజనం చేస్తున్నా. సడెన్‌గా ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి ‘మీరు నటించిన సినిమా యావరేజ్‌.. కానీ, మీ నటన సూపర్‌’ అన్నాడు. నాకెందుకు ఉచిత సలహా ఇవ్వడం అనిపించింది. చాలా కోపం వచ్చింది. 

మీపై మీ అక్క ప్రభావం ఎలా ఉంది?

విశ్వక్‌సేన్‌: పదో తరగతి పూర్తయిన తర్వాత ఇంట్లో తిట్టడం తగ్గించారు. మా ఫ్రెండ్స్‌తో కలిసి ఇంట్లో పార్టీ చేసుకుంటే మరుసటి రోజు అమ్మ చిన్నగా తిట్టేది. నాన్న కాస్త కోపంగా చూసేవారంతే. ఇక అక్క అయితే, బాగా చీవాట్లు పెట్టేది. అందరి ముందు ఇజ్జత్‌ తీసేది. ఆమెను చూస్తే చాలా భయమేసేది. నన్ను మాత్రమే కాదు, నా స్నేహితులను కూడా తిట్టేది. ఇండస్ట్రీలో నా గురించి ఎవరో రూమర్స్‌ సృష్టిస్తే, వాళ్లింటికి వెళ్లి మరీ తిట్టి వచ్చింది. ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమా సమయంలోనూ నన్ను తీసేశారన్న సంగతి ఎవరూ చెప్పలేదు. నువ్వు (తరుణ్‌ భాస్కర్‌) ఫోన్‌ చేసి చెబితే తెలిసింది. ఆ రోజు నువ్వు మెయిల్‌ ఫార్వర్డ్‌ చేయకపోతే ఏం చేయడానికి లేదు. అందరూ అదే నిజమనుకునేవారు. దాదాపు పదిరోజులు తీవ్ర ఒత్తిడి అనుభవించా. నిద్రలేని రాత్రులు గడిపా. 

మీ అక్క స్నేహితులతో ఎలా ఉండేవాడివి?

విశ్వక్‌సేన్‌: వాళ్ల గురించి నన్ను అడుగుతారేంటి. (నవ్వులు) కానీ, వాళ్లు నాతో మాట్లాడితే, మా అక్క వాళ్లకు వార్నింగ్‌ ఇచ్చేది.

స్కూల్లో ఎవరో రాఖీ కట్టారట!

విశ్వక్‌సేన్‌: ఈ టాపిక్‌ అడగకుండా ఉంటే బాగుండేదనుకున్నా. నేను 8వ తరగతి చదువుతున్నా. నాకు పదో తరగతి అమ్మాయిల మీద క్రష్‌ ఉండేది. ఒకరోజు స్టేజ్‌ వెనుకకు పిలిచి, చాక్లెట్‌పై ‘ఐ లవ్‌ వ్యూ’ అని రాసి ఇచ్చా. నవ్వి తీసుకుని వెళ్లిపోయింది. అప్పుడు మా ఇంగ్లీష్ టీచర్‌ నాతో చాలా ఫ్రెండ్లీగా ఉండేది. ఏం జరిగిందో మొత్తం ఆమెకు చెప్పా. మరసటి రోజు ఆ అమ్మాయిని తీసుకొచ్చి నాకు రాఖీ కట్టించింది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని