ఆర్జీవీ అన్న మాటకు కన్నీళ్లాగలేదు!
close
Updated : 01/04/2020 09:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆర్జీవీ అన్న మాటకు కన్నీళ్లాగలేదు!

అతనికి ఎమోషన్స్‌ ఉండవు!

ఆయన కలం కదిపితే ఆ సినిమా సూపర్‌ హిట్‌ అవ్వాల్సిందే.. ఆయన మాటలు, ఆ క్యారెక్టర్స్‌ చిరస్థాయిగా నిలిచిపోవాల్సిందే. తన సెటైరికల్‌ కామెడీకి ఆడియన్స్‌ మంత్రముగ్ధులవుతారు. కడుపుబ్బా నవ్వించే మైండ్‌ గేమ్‌ స్క్రీన్‌ప్లేకి ఫిదా అవుతారు. ఆయన కలానికీ, సంకల్పానికీ హ్యాట్సాఫ్‌ చెబుతారు. ఆయనే రచయిత, దర్శకుడు కోన వెంకట్‌. ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి విచ్చేసి ఎన్నో సరదా సంగతులు పంచుకున్నారిలా..! 

మీలో చాలా క్వాలిటీలు ఉన్నాయని చెబుతారు?

కోన వెంకట్‌: ఎవరి దగ్గరికొచ్చినప్పుడు వారిలా వస్తా. రచన, దర్శకత్వం, ప్రొడ్యూసర్, పార్ట్‌ టైమ్‌ పొలిటీషియన్‌ ఇలా అన్ని కోణాల్లో నన్ను మీరు (ఆలీ) చూశారు. మనద్దరికీ ‘తోకలేని పిట్ట’ సినిమా దగ్గరి నుంచి మంచి అనుబంధం ఉంది. (ఆలీ అందుకుని.. ఆ సినిమాకు ధర్మవరపు సుబ్రహ్మణ్యంగారు దర్శకుడు.. ఈయన ప్రొడ్యూసర్‌. ఆ తోకలేని పిట్టలో ‘పిట్ట’ హీరో అయితే, నేను ‘తోక’ (నవ్వులు).

మీ పూర్తి పేరు ఏంటి?

కోన వెంకట్‌: కోన వెంకటరావు.

కోన వెంకటరావు సడెన్‌గా తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి కొంతకాలం మాయమైపోయి ముంబయి వెళ్లిపోయారు దేనికి?

కోన వెంకట్‌: ‘తోక లేని పిట్ట’ తర్వాత నా తోక కట్‌ అయింది. ప్రతి పక్షికి తోక చాలా ముఖ్యం. ఎటు వెళ్లాలో డైరెక్షన్‌ చేసేది తోక మాత్రమే. సినిమా ఇండస్ట్రీలో నాకు అనుభవం లేకపోవడం, సరిగా విడుదల చేయలేకపోవడం, నిర్మాతగా అనుభవం లేకపోవడాన్ని చాలా మంది తమకు అనుకూలంగా మార్చుకున్నారు. దాన్ని నేను క్యాష్‌ చేసుకోలేకపోయా. సినిమా వర్కవుట్‌ అవలేదు. మాది మంచి స్థితిమంతుల కుటుంబం. ఆ ఒక్క సినిమాతో రోడ్డుపైకి వచ్చేశా. 

సినిమాల్లోకి రాకముందు ఏం చేసేవారు?

కోన వెంకట్‌: నేను ఎంబీఏ చేశా. ఒక కంపెనీలో మార్కెటింగ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా పనిచేసేవాడిని. ఆ ఒక్క సినిమాతో ఉన్న ఇల్లుతో సహా అన్నీ అమ్మి, నా కూతుళ్లను తీసుకుని చిన్న రేకుల షెడ్డులోకి మారాల్సి వచ్చింది. తర్వాతి నెలలో పిల్లల స్కూల్‌ ఫీజులు కూడా కట్టలేని పరిస్థితి. రామ్‌గోపాల్‌వర్మ తమ్ముడూ నేనూ క్లాస్‌మేట్స్‌. దాంతో రామూతో నాకు పరిచయమైంది. ‘రంగీలా’, ‘మనీ’ తీస్తుండగా అప్పుడప్పుడు నేను సెట్స్‌కు వెళ్లేవాడిని. ఒక నిర్మాతగా నా నుంచి సలహాలు అడిగేవాడు. అసలు నేను సినిమాను నిర్మిస్తానని తెలియగానే మొదట ‘వద్దు’ అని చెప్పిన వ్యక్తి రాము. అప్పటికే మాట ఇచ్చి ఉండటంతో వెనక్కి వెళ్లలేనని చెప్పాను. దాంతో సినిమా తీసి పూర్తిగా ‘జీరో’ అయిపోయా. ఆ సమయంలో రామూ దగ్గరకు వెళ్తే ‘నేను చెప్పాను కదా’ అన్నాడు. ‘అవును నీ మాట వినలేదు ఏం చేస్తాం’ అని అంటే, ‘సర్లే, ఇక్కడే నాతో ఉండు’ అన్నాడు. అలా ముంబయి వెళ్లిపోయా. 

మరి రచయితగా ఎలా మారారు?

కోన వెంకట్‌: రామూ దగ్గర తొలుత ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌గా పనిచేశా. అప్పట్లో ‘షూల్‌’ అనే సినిమా తీశాం. పెద్ద హిట్‌. జాతీయ అవార్డు కూడా వచ్చింది. ఆ సినిమా షూటింగ్‌ బిహార్‌లో తీశాం. అక్కడే పుట్టి పెరిగిన ప్రకాశ్‌ ఝా వంటి దర్శకులు అక్కడ షూటింగ్‌ చేయొద్దని సలహా ఇచ్చారు. ఎందుకంటే అప్పట్లో అక్కడ కిడ్నాపింగ్‌ పెద్ద దందా. ఏదో ఒక దానిని కిడ్నాప్‌ చేసి డబ్బులు అడుగుతారు. ఒకసారి అక్కడ ఓ కంపెనీ సర్కస్‌ చేయడానికి వెళ్తే, వాళ్ల ఏనుగును కిడ్నాప్‌ చేసి, డబ్బులు అడిగారట.(నవ్వులు) ఆ స్థాయిలో కిడ్నాప్‌లు జరుగుతాయి. ఏదేమైనా బిహార్‌లో షూటింగ్‌ చేద్దామని రామూకి చెప్పా. ‘నీకేమైనా పిచ్చెక్కిందా. ప్రకాశ్‌ ఝా కూడా చెబుతుంటే వినవా’ అని రామూ మందలించాడు. అయినా నేను వెనక్కి తగ్గలేదు. అక్కడ మోతిహారీ జిల్లాలో షూటింగ్‌. ఆ జిల్లా ఎస్పీ ఏఎస్‌ రాజన్‌ నా స్నేహితుడు. అతనికి ఫోన్‌ చేసి విషయం చెప్పా. ‘నువ్వు ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా షూటింగ్‌ చేసుకోవచ్చు’ అని 150మంది పోలీసులను విత్‌ స్టెన్‌గన్స్‌తో బందోబస్తుకు ఇచ్చాడు. ఆ బందోబస్తు మధ్యే షూటింగ్‌ పూర్తి చేశాం. ఆ సినిమాతోనే షాయాజీ షిండే వెండితెరకు పరిచయం అయ్యారు. అలా రామూ దగ్గర పనిచేస్తూ ‘మనీ’ చిత్రాన్ని హిందీలో రీమేక్‌ చేశాం. ఆ తర్వాత రామూ ‘సత్య’ తీస్తుండగా ఆ టీమ్‌లో ఉండేవాడిని. ఆ సినిమా తెలుగు వెర్షన్‌కు డైలాగ్స్‌ నేనే రాశా. అంతకన్నా ముందు ‘సత్య’లో ఒక పాట రాశా.

ఏ పాట రాశారు?

కోన వెంకట్‌: ‘మామ కల్లు మామ..’ సాంగ్‌ నేనే రాశా. ఒక సన్నివేశం కోసం పాట రాయమని రామూ సిరివెన్నెల సీతారామశాస్త్రిని అడిగారట. ఒక రౌడీ గ్యాంగ్‌ పాడుకునే పాట. ఇందులో కావాల్సింది పాండిత్యం కాదు. రా నెస్‌, క్రిమినల్‌ మెంటాల్టీ కనిపించాలి. రెండు మూడు, వెర్షన్లు రాసినా రామూకి నచ్చలేదు. ఈలోగా ఆ ట్యూన్‌ పెట్టుకుని నేను పాట రాశా. ‘రామూ.. ఆయన పాండిత్యానికి తనని తాను బాగా దించుకుని కింది స్థాయికి వచ్చి రాయాల్సిన పాట ఇది. అందుకే రాయలేకపోతున్నారేమో’ అని నేను చెప్పా. ‘మరెలా? మధ్యాహ్నం రికార్డు చేయాలి’ అని రామూ అన్నాడు. ‘రాత్రి నేను ఒక పాట రాశా’ అని చూపించా. ‘పెగ్గుమీద పెగ్గు కొట్టు.. సోడా వేసి దంచికొట్టు.. పరేషాన్‌లను మూల పెట్టు.. మామ కల్లు మామ.. ’ అని వినిపించా. ‘ఇది కదా! నాకు కావాల్సింది. వెళ్లి రికార్డు చేద్దాం’ అన్నాడు. నేను షాకయ్యా. ‘మరి శాస్త్రిగారు రాసింది ఏం చేస్తారు’ అని అడిగా. ‘ఆ  విషయం ఆయనకు చెబుదాంలే’ అన్నాడు. ఆ పాట మనోతో పాడించి, రికార్డు చేసిన క్యాసెట్‌ నాకిచ్చారు. దాన్ని తీసుకెళ్లి సీతారామశాస్త్రిగారికి వినిపించమన్నారు. ఆయన ఇంటి వెళ్తే, ఏమంటారోనన్న భయంతో వెళ్లా. ‘సర్‌ మీరు రాసిన పాట రికార్డింగ్‌ చేయలేదు’ అని చెప్పా. ‘మరి ఎవరిది చేశారు’ అని అడిగితే, ‘ముందు మీరు ఈ క్యాసెట్‌ వినండి’ అని ఆయనకు ఇచ్చారు. పాట విన్న తర్వాత ‘ఎవరు రాశారు’ అని అడిగారు. ‘నేనే రాశానండీ’ అని సమాధానం చెప్పా. ఆయన ల్యాండ్‌లైన్‌ నుంచి రామూకి ఫోన్‌ చేసి ‘నేను ఇంకో పది వెర్షన్లు రాసినా, దీనికి దరిదాపుల్లోకి కూడా రాలేను. వెంకట్‌ చాలా బాగా రాశాడు’ అని అన్నారు. అది ఆయన గొప్పదనం. ఆ తర్వాత రామూ పిలిచి ‘ఈ కథ నీకు అర్థమైందని ఒక్క పాట ద్వారా నిరూపించావు. తెలుగు వెర్షన్‌కు నువ్వే సంభాషణలు రాయి’ అని ఆ పని అప్పజెప్పాడు. అలా రచయితగా నా ప్రయాణం ప్రారంభమైంది. 

ఆ తర్వాత దర్శకత్వం కూడా చేసినట్లు ఉన్నారు?

కోన వెంకట్‌: అదొక చీకటి అధ్యాయం (నవ్వులు). నేను రచయితను అవ్వడానికి కారణం ఆర్జీవీ. నేను దర్శకుడిని కావడానికి కారణం ఆర్జీవీ. నేను డైరెక్టర్‌ను కాకపోవడానికి కూడా కారణం ఆర్జీవీనే. రామూ నా దగ్గరకు ఒక వ్యక్తిని పంపి ‘నువ్వు సినిమా చేసి పెట్టాలి’ అని అడిగితే, ‘తప్పకుండా చేస్తా’ అని మాట ఇచ్చా. అందులో మాధవన్‌, షమితాశెట్టి తదితరులను పెట్టి ‘నేను తను ఆమె’ పేరుతో హారర్‌ కామెడీ సినిమా ప్రారంభించా. సినిమా పూర్తయింది. అప్పటికే రచయితగా మంచి పొజిషన్‌లో ఉన్నా. ‘అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి’, ‘ఢీ’, ‘కింగ్‌’ ఇలా వరుస హిట్లు వచ్చాయి. దీంతో చాలా మంది వచ్చి నేను డైరెక్ట్‌ చేసిన సినిమాను కొన్నారు. ఆ నిర్మాత డబ్బులన్నీ తీసుకుని పారిపోయాడు. ఈ రోజు వరకూ  కనపడలేదు. రామూకి చెబితే, ‘వాడు చీటర్‌’ అని తిట్టి ఊరుకున్నాడంతే. సినిమాను కొన్న వాళ్ల పరిస్థితి అంతే!

‘నిశ్శబ్దం’లో మీ పాత్ర ఏంటి?

కోన వెంకట్‌: ప్రతి ప్రాజెక్టుకు ఒక టార్చ్‌ బేరర్‌ ఉండాలి. హేమంత్‌ మధుకర్‌ ఒక కథతో నా దగ్గరకు వచ్చాడు. తను నా స్నేహితుడు. అతను చెప్పిన ఒక పాయింట్‌ నాకు బాగా నచ్చింది. దాన్ని డెవలప్‌ చేసుకుంటూ వచ్చాం. అనుష్క, మాధవన్‌లను ఒప్పించి సినిమాలోకి తీసుకున్నాం. సినిమా చేయమని అడిగితే ‘ఈసారి పారిపోరు కదా’ అని మాధవన్‌ అన్నాడు. ఈ సినిమా స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌, ప్రొడ్యూసర్‌.

రచయితగా ఎన్ని సినిమాలు చేశారు? బాగా పేరు తెచ్చిన సినిమా ఏది?

కోన వెంకట్‌: 54 సినిమాలకు పనిచేశా. నాకు బాగా గుర్తింపును తీసుకొచ్చిన చిత్రం ‘ఢీ’. దాని తర్వాత ‘రెఢీ’, ‘కింగ్‌’, ‘దూకుడు’, ‘బాద్‌షా’, ‘అదుర్స్‌’ ఇలా వరుస సినిమాలు హిట్‌ అయ్యాయి. ఎన్టీఆర్‌తో నాలుగు సినిమాలు చేస్తే, రవితేజతో చాలా సినిమాలు చేశా. ఆయనతో చివరి చిత్రం ‘బలుపు’ పెద్ద హిట్‌. నేను రచయితగా పనిచేసిన సినిమాలకు 90శాతం సక్సెస్‌ రేటు ఉంది. నాకు రచయితగా తృప్తిని ఇచ్చిన చిత్రం ‘నిన్నుకోరి’, ‘గీతాంజలి’. కాన్సెప్ట్‌ ఫిల్మ్‌ తీయాలన్న నిర్ణయంతో ‘కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌’పై సినిమాలు తీయడం మొదలు పెట్టా. 

రచయిత కావడానికి ముందు సూసైడ్‌ చేసుకోవాలని అనుకున్నారట నిజమేనా?

కోన వెంకట్‌: ‘తోక లేని పిట్ట’ తర్వాత నా పరిస్థితి మారిపోయింది. ఆ సమయంలో రామూకి ఫోన్‌ చేస్తే, ‘చెన్నైలో నువ్వు వెయిట్‌ చెయ్‌. నేను వస్తా’ అని అన్నాడు. ఫోన్‌లో వస్తానని చెబుతున్నాడు కానీ, రావటం లేదు. రెండు, మూడు రోజులైనా తను రాలేదు. చేతిలో ఉన్న డబ్బులు దాదాపు అయిపోయాయి. మరుసటి రోజు కూడా రామూ రాకపోతే నాకు భోజనం కూడా ఉండదు. మరోవైపు ఇంటి నుంచి ‘పిల్లల స్కూల్‌ ఫీజు కట్టాలి’ అని ఫోన్లు. దీంతో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయా. నా దగ్గర ఉన్న కొద్ది డబ్బులతో నిద్రమాత్రలు, ఒక వాటర్‌ బాటిల్‌ కొనుక్కొని మెరీనా బీచ్‌కు వెళ్లా. మరికాసేపట్లో ఆ మాత్రలు వేసుకుందామని అనుకుంటుండగా, ఏడెనిమిదేళ్ల అమ్మాయి బెలూన్స్‌ అమ్ముతూ కనిపించింది. ఆ పాపకు చేతులూ, కాళ్లూ లేవు. బహుశా వాళ్ల అన్న అనుకుంటా బండిలో కూర్చొబెట్టుకుని తోసుకుంటూ వస్తున్నాడు. ఆ బండికి బెలూన్స్‌ కట్టి ఉన్నాయి. చాలా చలాకీగా మాట్లాడుతూ ఆ పాప వాటిని అమ్ముతోంది. జనాలు కూడా కొంటున్నారు. అది చూసి షాకైపోయా. ‘కాళ్లూ చేతులూ లేకపోయినా, ఇంత సంతోషంగా ఎలా ఉండగలుగుతోంది’ అనిపించింది. అప్పుడు అనుకున్నా, ‘మనకు అన్నీ ఉన్నాయి కదా! ఆత్మహత్య చేసుకోవడం పిరికితనం’ అని! నిద్ర మాత్రలు విసిరేసి, మెరీనా బీచ్‌ నుంచి నడుచుకుంటూ సాలిగ్రామ్‌ వచ్చా. వారంరోజుల నుంచి వస్తానని చెబుతున్న వర్మ మరుసటి రోజు వచ్చాడు. అప్పటి నుంచి రామూ దగ్గర సెటిల్‌ అయ్యా. ఆ తర్వాత నేను మంచి పొజిషన్‌కు వచ్చిన తర్వాత ఆ పాప కోసం మెరీనా బీచ్‌కు వెళ్లా. కానీ, కనిపించలేదు. నాకు జీవితాన్ని ఇచ్చిన దేవత పాప. 

మీ జీవితాన్ని మలుపు తిప్పిన ఆర్జీవీతో శాలరీ విషయంలో గొడవైందట ఏంటి?

కోన వెంకట్‌: ఆర్జీవీలా బతకడం ఎవరి వల్లా కాదు. ఆ పేరులోనే ఉంది. ‘R’ అంటే రేర్‌. ‘రేర్‌ జీవి’. అరుదైన జీవి. హిట్స్‌ వచ్చినా, ఫ్లాప్‌లు వచ్చినా ఏది వచ్చినా మనిషి ఒకేలా ఉంటాడు. అతను తన ధైర్యం ఎప్పటికీ కోల్పోడు. నేను అతని దగ్గర ‘రంగీలా’ టైమ్‌లో చేరాను. ఇప్పటికీ అతని మైండ్‌ సెట్‌ అలాగే ఉంటుంది. దేన్నైనా చాలా ఈజీగా తీసుకుంటాడు. ప్రతి మనిషికీ కొన్ని ఎమోషన్స్‌ ఉంటాయి. వాటితో ప్రయాణిస్తాం. వాటికి అనుగుణంగానే మనం ప్రవర్తిస్తాం. కానీ, ఆర్జీవీకి ఎమోషన్స్‌ ఉండవు. అప్పటికే తన దగ్గర చాలా సినిమాలకు పనిచేశా. రూ.10వేలు జీతం వచ్చేది. అక్కడ ఖర్చులు చూసుకుంటూ, ఇంటికి పంపాలి. ‘జీతం నాకు సరిపోవడం లేదు రామూ’ అని అడిగా. ‘నీ వల్ల కంపెనీకి.. నాకు ఎన్ని కోట్లు లాభం జరిగిందో పేపర్‌పై రాసి చూపించు’ అన్నాడు. నేను చేసిన పనిని పేపర్‌పై ఎలా రాసి చూపించగలను. ఆ మాటలకు కన్నీళ్లు ఆగలేదు. ఇన్నేళ్లు పనిచేస్తే ఇదేనా మనకు దక్కింది? అనిపించింది. ‘ఇండియా టాప్‌ డైరెక్టర్‌ దగ్గర పనిచేస్తూ, పేదరికంలో ఎందుకు ఉండాలి రామూ’ అని అడిగా. అలా అడగడం అతనికి నచ్చలేదేమో. ఉద్యోగికీ యజమానికీ మధ్య జరిగిన క్లాష్‌ కాదు. ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన సంభాషణ. నేను అతన్ని స్నేహితుడిలా భావించా.. బహుశా అతను అలా భావించలేదేమో. దాంతో రామూకి చెప్పకుండానే వెళ్లిపోయాను. అలా వెళ్లడం నా జీవితాన్ని మార్చేసింది. అయితే, నేను ఉన్నప్పుడు రామూ నా ప్రెజెన్స్‌ని గుర్తించలేదు. వెళ్లిపోయిన తర్వాత నేను వెళ్లిపోయానన్న విషయాన్నీ గుర్తించలేదు. కనీసం ఫోన్‌ కూడా చేయలేదు. ఆ తర్వాత నేను ‘ఒకరికి ఒకరు’ సినిమా కథ, మాటలు రాసి సినిమా రచయితగా నా జర్నీ ప్రారంభించా. 

మళ్లీ రాంగోపాల్‌ వర్మను కలవలేదా?

కోన వెంకట్‌: రామూ దగ్గరి నుంచి వచ్చిన తర్వాత రెండు మూడేళ్లలో మంచి సినిమాలు పడ్డాయి. ‘నిన్నే ఇష్టపడ్డాను’, ‘అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి’, ‘ఒకరికి ఒకరు’ సినిమాలు చేశా. అప్పట్లో రోజూ ‘బయోస్కోప్‌’ అని కొత్త సినిమాల ట్రైలర్లు వేసేవారు. వాటిలో నా పేరు కనిపించి ఒక రోజు ఫోన్‌ చేశాడు. ‘ఏంటయ్యా.. బయోస్కోప్‌లో వేసే సినిమా ట్రైలర్లలో నీ పేరు ఎక్కువగా కనిపిస్తోంది’ అని అన్నాడు. ‘అవును రామూ’ అన్నాను. ‘అయితే రేపు నేను హైదరాబాద్‌ వస్తున్నా. వచ్చి కలువు’ అన్నాడు. ‘నిన్ను రిసీవ్‌ చేసుకునేందుకు నేనే ఎయిర్‌పోర్ట్‌కు వస్తా రామూ’ అని చెప్పా. అంతకుముందు వారం కిందట కొత్తగా హ్యుందాయ్‌ యాక్సెంట్‌ కారు కొన్నా. అది వేసుకుని ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లా. ‘కారు నీదేనా?’అని అడిగాడు. ‘అవును రామూ. గత వారమే కొన్నా’ అని చెప్పా. అలా నా కెరీర్‌లో మంచి పొజిషన్‌కు వెళ్లా. 

మీది-శ్రీనువైట్లది మంచి కాంబినేషన్‌ మరి, మీ మధ్య ఎందుకు వివాదం వచ్చింది?

కోన వెంకట్‌: సినిమా అనేది టీమ్‌ వర్క్‌. హిట్టయినా, ఫ్లాప్‌ అయినా అది మొత్తం పనిచేసిన టీమ్‌కు వర్తిస్తుంది. ఆ టీమ్‌ వర్క్‌ ఎక్కడో బ్రేక్‌ అయిందని నేను ఫీలయ్యా. హీరో ఏ కాస్ట్యూమ్‌ వేసుకోవాలి? ఏ షూ వేసుకోవాలి? అన్నది డైరెక్టర్‌ నిర్ణయిస్తాడు. సంగీత దర్శకుడు పది ట్యూన్లు ఇస్తే, ఒకటి దర్శకుడు సెలక్ట్‌ చేస్తాడు. అయితే, ‘సెలక్ట్‌ చేసింది నేనే కాబట్టి, మ్యూజిక్‌ కూడా నేనే చేశాను’ అంటే బాగుండదు కదా! అలా ఒక సన్నివేశం కానీ, పంచ్‌డైలాగ్‌లు కానీ నేను పది వెర్షన్లు రాస్తే, దానిలో ఒకదాన్ని అతను సెలక్ట్‌ చేసుకుంటాడు. అవసరమైతే దానికి మెరుగులు దిద్దుతాడు. అలాంటి సమయంలో ‘అన్నీ నేనే చేశాను’ అన్న ఫీలింగ్‌ అతనికి వచ్చిందని నాకు అనిపించింది. దాంతో దూరంగా వచ్చేశా. నాకు తగిన గుర్తింపు రాలేదని ఫీలయి, బయటకు వచ్చేశా.

త్వరలో మీ కాంబినేషన్‌లో సినిమా చూడొచ్చా?

కోన వెంకట్‌: చూడకూడదని ఏమీ లేదు. ఎందుకంటే మా మధ్య పగ, ప్రతీకారాలు లేవు. కొన్ని కథలకు తానే న్యాయం చేయగలడు. శ్రీనులో కామెడీ టైమింగ్‌ బాగుంటుంది. ఆర్టిస్ట్‌ల నుంచి నటన రాబట్టుకోవడం అతనికి బాగా తెలుసు. ‘ఢీ’, ‘రెఢీ’ కథలు నావే. ఆ కథలు వేరే దర్శకుడికి ఇచ్చి ఉంటే ఇంత పెద్ద హిట్టవుతాయని నేను చెప్పలేను. ఇద్దరి మధ్య ఉన్న అవగాహన అది. ఆ అవగాహన ఎక్కడో తప్పుకొంది అంతే. 

మీ పెళ్లి స్టోరీ కథలు, కథలుగా చెబుతారు. నిజమేనా? 

కోన వెంకట్‌: మాది ప్రేమ వివాహం. తను డిగ్రీలో నా క్లాస్‌మేట్‌. వాళ్ల ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదు. ఆ అమ్మాయిని కామారెడ్డిలో దాచిపెట్టారు. వాళ్ల నాన్న పంచాయతీరాజ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌. అమ్మాయి ఎక్కడికి వెళ్లిపోయిందో అర్థం కాలేదు. వాళ్ల పనిమనిషి ద్వారా విషయం తెలిసి, కారు వేసుకుని కామారెడ్డి వెళ్లా. నన్ను చూడగానే ఒక్కసారిగా ఏడ్చేసింది. ‘నాతో వస్తావా’ అని అడిగా. అంతే, కారులో ఎక్కించుకుని తీసుకొచ్చేశా. వాళ్లు మా వెంట పడ్డారు. పోలీస్‌ కేసులు పెట్టారు. మూడు రోజుల తర్వాత ఆర్య సమాజ్‌లో వివాహం చేసుకున్నాం. అప్పట్లో మా తాతగారు మహారాష్ట్ర గవర్నర్‌. అమ్మాయిని తీసుకురాగానే మా తాతకు ఫోన్‌ చేశా. ‘నాకేమీ ఆశ్చర్యం లేదు’ అన్నారు. పెళ్లి సమయానికి నాకూ, మా ఆవిడకు 20ఏళ్లు. ఒకే వయసు. చట్ట ప్రకారం అమ్మాయిలకు 18ఏళ్లు, అబ్బాయిలకు 21ఏళ్లు నిండితేనే మేజర్‌ అయినట్లు. ఫిబ్రవరి 4న మా వివాహం జరిగింది. ఫిబ్రవరి 19న నాకు 21ఏళ్లు నిండుతాయి. దీన్ని ఆసరాగా తీసుకుని మా మామగారు కేసు పెట్టారు. అప్పుడు ఇక్కడ రొడ్డం ప్రభాకర్‌రావుగారు హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌. ఆయన మా తాతకు స్నేహితుడు. దాంతో ఫోన్‌ చేసి, ‘ఏంటీ క్యాస్ట్‌ గొడవలు. అతను చదువుకున్న వ్యక్తి’ అని మాట్లాడటంతో నా భార్య తరపు బంధువులను పిలిచి, కేసు విత్‌డ్రా చేయించాడు. లేకపోతే జైలుకు వెళ్లేవాడిని. ఏడాది తర్వాత మళ్లీ అందరం కలిశాం. నాకు ఇద్దరు అమ్మాయిలు. పెద్దమ్మాయిది ప్రేమ వివాహం. ఒకరోజు మా అమ్మాయి నా దగ్గరకు వచ్చిన ‘నాన్నా మా క్లాస్‌మేట్‌ను ప్రేమిస్తున్నా’ అంది. ‘ఎవరు? రోజూ మన ఇంటికి వచ్చే రవియేనా’ అని అడిగితే అవునని చెప్పింది. నేను వాళ్ల ప్రేమను ఒప్పుకొన్నా. వాళ్ల హ్యాపీనెస్‌ మాకు ముఖ్యం. చిన్నమ్మాయికి ఇంకా పెళ్లి కాలేదు. లండన్‌లో చదువుకుంది. దుబాయ్‌లో డెలువరూ అనే మల్టీనేషనల్‌ కంపెనీ ఉంది. ఆ సంస్థ కార్యకలాపాలు నిర్వహించే నాలుగు దేశాలకు ఇన్‌ఛార్జ్‌. తన లవ్‌స్టోరీ గురించి ఏమీ చెప్పలేదు (నవ్వులు). ఇప్పటి యూత్‌కు నేనిచ్చే సందేశం ఒక్కటే. మీరు చదువుల ద్వారా ఉన్నత స్థితికి చేరుకుని మీ తల్లిదండ్రులను గర్వపడేలా చేస్తే, మీరు తీసుకునే నిర్ణయాలకు వాళ్లు ఎప్పుడూ అడ్డు చెప్పరు. 

‘నిశ్శబ్దం’ సినిమాకు తొలుత అనుష్కనే అనుకున్నారా?

కోన వెంకట్‌: స్క్రిప్ట్ పూర్తయింది. ఎవరినీ అనుకోలేదు. ఒక రోజు అనుష్క, నేనూ విమానంలో కలిశాం. అంతకుముందే మా ఇద్దరి మధ్య పరిచయం ఉంది. దాంతో ఇద్దరం పక్కపక్కనే కూర్చొన్నాం. హైదరాబాద్‌లో మా విమానం ల్యాండ్‌ అవ్వాల్సి ఉండగా, అప్పటికే రన్‌వేపై ఒక విమానం టైరు పగిలి మంటలు రావడంతో రన్‌వేను తాత్కాలికంగా మూసేశారు. దాంతో మా విమానాన్ని చెన్నై తీసుకెళ్లారు. రాత్రి 10.30. చెన్నైలో దిగిన తర్వాత ఉదయం 5.00గంటలవరకూ విమానంలోనే కూర్చొని ఉన్నాం. మాటల మధ్యలో స్టోరీ చెప్పేశా. తనకు బాగా నచ్చింది. ఆ తర్వాత మేము ఇళ్లకు వెళ్లిపోయాం. మూడు రోజుల తర్వాత తనకి ఫోన్‌ చేసి ‘విమానంలో నీకు చెప్పిన కథ ఎలా ఉంది స్వీటీ’ అని అడిగా. ‘చాలా బాగుంది. మర్చిపోలేకపోతున్నా’ అనడంతో, ‘డెస్టినీ అంటే ఇదేనేమో. మనం అనుకోకుండా అలా కలిశాం. నువ్వు చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం’ అని చెప్పా. తను కూడా ఒప్పుకొంది. 

సినిమా మొత్తం యూఎస్‌లో తీశారనుకుంటా!

కోన వెంకట్‌: మొదటి నుంచి చివరి వరకూ యూఎస్‌లోనే తీశాం. సియాటెల్‌లో తీశాం. ‘కిల్‌బిల్‌’లో విలన్‌గా చేసిన మైఖేల్‌ మ్యాడిసన్‌ను తీసుకున్నాం. 

ఒక సినిమా షూటింగ్‌ జరుగుతుంటే, కొండపైకి ఎక్కి దిగుతూ కాఫీలు అందించారట ఏ సినిమా అది?

కోన వెంకట్‌: ‘నిన్ను కోరి’. నాని-ఆది ట్రెక్కింగ్‌ వెళ్లే సన్నివేశం ఉంది.  పైకి వెళ్లిన తర్వాత విపరీతమైన చలి.  ‘కాఫీ కావాలి’ అని అడిగారు. దీంతో కొండ దిగి కారేసుకుని వెళ్లి కాఫీ తీసుకొచ్చా. పైకి వెళ్లిన తర్వాత చూస్తే, కప్పులు తీసుకురాలేదు. మళ్లీ నడుచుకుంటూ కొండదిగి, కప్పులు పట్టుకొని వచ్చా. 

‘నిన్నుకోరి’ సినిమా విడుదలైన తర్వాత ఒక అమ్మాయి మెయిల్‌ పంపిందట. ఎక్కడి నుంచి ఆ మెయిల్‌ వచ్చింది?

కోన వెంకట్‌: షికాగో నుంచి వచ్చింది. వైజాగ్‌కు చెందిన ఒక అమ్మాయి, అబ్బాయి ప్రేమించుకున్నారు. ప్రేమించిన అబ్బాయి సెటిల్‌ కాలేదని ఇంట్లో వాళ్లు అమెరికా సంబంధం చూసి పెళ్లి చేశారు. తన ప్రేమ విషయాన్ని తన భర్తకు చెప్పింది. అతను చాలా మంచి వాడు. ‘గతం గతః’ అని వదిలేయమన్నాడట. ‘‘నేను ప్రేమించిన అబ్బాయికన్నా నా భర్త నన్ను వందరెట్లు ప్రేమిస్తాడు. చాలా బాగా చూసుకుంటాడు. కానీ, నేను అంతకుముందు వేరే అబ్బాయిని ప్రేమించడం వల్ల మా మధ్య చిన్న గ్యాప్‌ ఉన్న ఫీలింగ్‌ ఉండేది. ఆడవాళ్లు పెళ్లికి ముందు ఒకరిని ప్రేమించి, మరొక వ్యక్తిని పెళ్లి చేసుకుంటే, పాతవి అన్నీ మర్చిపోయి భర్తను ప్రేమిస్తారన్న దాన్ని అతను నమ్మేవాడు కాదు. ఆ సమయంలో మేమిద్దరం ‘నిన్నుకోరి’ సినిమాకు వెళ్లాం. క్లైమాక్స్‌ చూసి నా భర్త నా చేయి మీద తన చేయి వేశాడు. అంతే మా మధ్యన ఉన్న ఆ గ్యాప్‌ వెళ్లిపోయింది సర్‌. థ్యాంక్యూ ఫర్‌ సేవింగ్‌ మై మ్యారేజ్‌ లైఫ్‌ ’’ అని మెయిల్‌ చేసింది. (చప్పట్లు)

‘నిశ్శబ్దం’ తర్వాత ఏం చేస్తున్నారు?

కోన వెంకట్‌: ఈ షో ద్వారా చెబితే బాగుంటుందనిపించింది. త్వరలో ఓ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నా. 

ఆర్జీవీని స్వీట్‌గా తిట్టాలంటే ఏమని తిడతారు?

కోన వెంకట్‌: పప్పు లేదా బాద్‌షా.

పూరీ జగన్నాథ్‌, త్రివిక్రమ్‌ ఎవరు బెస్ట్‌?

కోన వెంకట్‌:  పూరీ జగన్నాథ్‌. 

ఫలానా దర్శకుడితో పనిచేయాలన్న కోరిక ఉందా?

కోన వెంకట్‌: రాజమౌళి. 

పగలు గొప్పదా? రాత్రి గొప్పదా?

కోన వెంకట్‌: పగలు.. రాత్రి కలిసిన రోజు గొప్పది. 

 

 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని