వెంకీ ఆసనం మళ్లీ ఎందుకు వేశాడో ‘ఎఫ్‌3’లో చూస్తారు
close
Published : 12/04/2020 18:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వెంకీ ఆసనం మళ్లీ ఎందుకు వేశాడో ‘ఎఫ్‌3’లో చూస్తారు

చివరి నిమిషం వరకూ ఉత్కంఠే!

‘ ఎఫ్‌2’, ‘సరిలేరు నీకెవ్వరు’
- వరుసగా రూ.వంద కోట్ల సినిమాలు చేసి అగ్ర దర్శకుల జాబితాలో చేరారు అనిల్‌  రావిపూడి. ప్రస్తుతం ‘ఎఫ్‌3’ పనుల్లో బిజీగా ఉన్నారు. ఆయనతో ‘ఈనాడు సినిమా’ ప్రత్యేకంగా ముచ్చటించింది.

ఈ కరోనా సంక్షోభ సమయంలో మీరు ఎక్కడ గడుపుతున్నారు?
నా రచయితల బృందంతో కలిసి మా సొంతూరు ప్రకాశం జిల్లా, చిలుకూరివారి పాలెంలో గడుపుతున్నా. నా సినిమాలకి సంబంధించిన స్క్రిప్టు పనుల్ని విశాఖ పట్నంలో మొదలు పెడుతుంటా. ‘ఎఫ్‌3’ పనుల్నీ అలాగే మొదలుపెట్టాం. కానీ మేం విశాఖలో ఉన్నప్పుడే కరోనా ప్రభావం ఎక్కువవుతోందన్న విషయం అర్థమై మా ఊరొచ్చేశాం. ఇక్కడే స్క్రిప్టు పనులు చేసుకుంటున్నాం.
విశాఖలోనే కథ రాసుకోవడం మీకు సెంటిమెంటా?
ఒక రకంగా అలాంటిదే. హైదరాబాద్‌లో ఉన్నామంటే రచయితల బృందంలో  ఒకొక్కరు ఒక్కో సమయానికి వస్తుంటారు. అలా కాకుండా అవుట్‌డోర్‌ వెళ్లామంటే అందరూ అక్కడే ఉంటాం కాబట్టి, పనులన్నీ అనుకున్నట్టుగా జరిగిపోతుంటాయి.
మరి స్క్రిప్టు పనులకు ఊళ్లో తగిన ఏర్పాట్లు ఉంటాయా?
మా ఊళ్లో మా ఇంటి ముందే పెద్ద చెరువు ఉంది. బాల్కనీలో నిలబడి చెరువునీ, సూర్యోదయం, సూర్యాస్తమయాల్ని ఆస్వాదించడం ఒక అద్భుతమైన అనుభూతి. ఎంత డబ్బు పెట్టినా అది దొరకదు. దర్శకుణ్నయ్యాక ఊళ్లో కొత్తగా ఇల్లు కట్టించాం. పాత ఇంటిని అతిథి గృహంలా వాడుకుంటున్నా. మా అమ్మకి ఇబ్బంది లేకుండా మేం ఓ వంట మనిషిని మాతోపాటే తీసుకొచ్చాం.

అజయ్‌ సూర్యాన్ష్‌

‘‘మహేష్‌తో సినిమా చేయడానికి ఎప్పుడైనా రెడీనే. ఆయనిచ్చిన అవకాశంతోనే ‘సరిలేరు  నీకెవ్వరు’తో దర్శకుడిగా మరో స్థాయికి చేరా. ఆ సినిమా సమయంలోనే నాకు బాబు పుట్టాడు. అందులో హీరో పేరుని కలుపుతూ అజయ్‌ సూర్యాన్ష్‌ అని పేరు పెట్టుకున్నాం. అనిల్‌ ఇలాంటి సినిమాలే చేస్తాడని కాకుండా, అన్నిరకాల సినిమాలు చేస్తాడనిపించుకునేలా నా ప్రయాణం ఉండబోతోంది’’.

కరోనా విషయంలో ఊళ్లో ఆందోళన కనిపిస్తోందా?
అందరిలోనూ ఒక రకమైన భయమైతే కనిపిస్తోంది. ఈ పరిస్థితి తీవ్రమైనదే. దీనిపై పోరాటానికి ఒకే ఒక్క ఆయుధం... సామాజిక దూరం. అది పాటించకపోతే సమస్య కొని తెచ్చుకున్నట్టే. మిగతా దేశాలతో పోలిస్తే మనం తొందరగా మేల్కొన్నాం. ప్రజలు కూడా చైతన్యంతో వ్యవహరిస్తున్నారు. ఈ పోరాటం మన ఐక్యతని చాటిచెబుతోంది. అయితే రాబోయేది మరింత గడ్డు కాలం అనిపిస్తోంది. అందుకే మరింత జాగ్రత్తగా ఉండాలి.
మీ ఊళ్లో మిమ్మల్ని సెలబ్రిటీలాగే చూస్తుంటారా? ఇదివరకటితో పోలిస్తే మీ ఊళ్లో ఎలాంటి మార్పులు కనిపిస్తున్నాయి?
నేనొచ్చానని తెలిస్తే సన్నిహితులు, బంధువులందరూ వచ్చి మాట్లాడుతుంటారు. ఎప్పుడూ నా మూలాల్ని మరిచిపోను. దాంతో నాకు ఊళ్లో మార్పులేమీ కనిపించవు. అదే మనుషులు, అవే వ్యక్తిత్వాలు. గ్రామాల్లో ఇప్పటికీ అదే స్వచ్ఛత.
కరోనా గురించి ఒక దర్శకుడిగా మీకెలాంటి ఆలోచనలు వస్తున్నాయి?
ప్రకృతికి ఏం ఇస్తే అదే మనకు తిరిగొస్తుంది. మనం క్రమశిక్షణతో ఉంటే అదే మనల్ని చూసుకుంటుంది. మన నమస్కారాన్ని ఇప్పుడు ప్రపంచం మొత్తం పాటిస్తోంది. మన పద్ధతులు మనం అనుసరిస్తే చాలు. దర్శకుడిగా ఇలాంటి అంశాలపై కథల గురించి ఎప్పుడూ ఆలోచించలేదు కానీ.. కొంతమంది ముందే ఆలోచించి తీస్తుంటారు. వాళ్లు తీసినట్టే జరిగాయి కూడా. ఈమధ్యే ‘కాంటాజెన్‌’ సినిమా చూశా. అది వైరస్‌ గురించి తీసిందే. మురుగదాస్‌ ‘సెవెన్త్‌ సెన్స్‌’ తీశారు. అలాగే ‘ఐయామ్‌ లెజెండ్‌’ అనే సినిమాలో ప్రపంచంలో ఒక్కడే మిగులుతాడు. ఇంత భయంకరంగా ఉంటుందా అని అది చూశాక నాకు నిద్రపట్టలేదు. కరోనాపై కామెడీ చేసుకుంటున్నారు కానీ... ఇది నవ్వుకునే అంశం కాదు. మనం ఒకరికొకరు అండగా నిలవాల్సిన తరుణమిది.
ఇంతకీ ‘ఎఫ్‌ 3’ ఎలా ఉండబోతోంది? మూడో ‘ఎఫ్‌’ దేని గురించి?
మోర్‌ ఫన్‌ అన్నదానికి సంకేతమే మూడో ఎఫ్‌.  ‘ఎఫ్‌ 2’ నచ్చినవాళ్లు మరింత ఆస్వాదించేలా ఉంటుంది ‘ఎఫ్‌3’. ఒక విభిన్న కథతో ‘ఎఫ్‌2’లో  నటించిన వెంకటేష్‌, వరుణ్‌తేజ్‌, తమన్నా, మెహరీన్‌ ప్రధాన పాత్రల్లో రూపొందుతోంది.
మరో కథానాయకుడు కూడా ఉండబోతున్నారని ప్రచారం సాగుతోంది, నిజమేనా?
ఈ కథలో మరో కథానాయకుడికి చోటు దక్కేలా కనిపించడం లేదు. ఒకవేళ ద్వితీయార్ధంలో ఏమైనా ఆ అవకాశం ఉందంటే అప్పుడు ఆలోచిస్తాం. ఆ విషయం చివరి నిమిషం వరకు మాక్కూడా ఉత్కంఠే.
‘ఎఫ్‌2’కి ఇది సీక్వెలా? ఇందులో ఎలాంటి కథని చెప్పబోతున్నారు?
ఇదొక ఫ్రాంచైజీ సినిమా. హిందీలో ‘గోల్‌మాల్‌’, ‘హౌస్‌ఫుల్‌’ తరహా ఫ్రాంచైజీని తెలుగులో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ‘ఎఫ్‌2’లోని పాత్రలే ‘ఎఫ్‌3’లోనూ ఉంటాయి. ఇందులోనూ ఫన్‌, ఫ్రస్ట్రేషన్‌ ఉంటుంది. కానీ ఈసారి అది పెళ్లి గురించి కాదు. మరి కోబ్రో అంటూ వెంకీని వరుణ్‌ ఎందుకు కలిశాడు? వెంకీ ఆసనం ఈసారి ఎందుకు వేశాడు?అనే విషయాల్ని తెరపైనే చూడాలి. ఈసారి మరో మంచి థీమ్‌ దొరికింది. దానికి మరిన్ని విభిన్నమైన అంశాల్ని, మరింత మజాని  జోడించి తెరకెక్కించబోతున్నాం.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని