ఆ మూడు సినిమాలు పవన్‌తో చేయాల్సింది!
close
Updated : 20/04/2020 15:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ మూడు సినిమాలు పవన్‌తో చేయాల్సింది!

నేను సంపాదించినంత డబ్బు ఏ దర్శకుడూ సంపాదించలేదు

పూరి జగన్నాథ్‌. ఈ పేరు వినగానే ప్రేక్షకుల్లో పూనకం వస్తుంది. యూత్‌కు జోష్‌ వస్తుంది. డైలాగ్స్‌ పేల్చడంలో ఆయనది ప్రత్యేకమైన స్టైల్‌. పవన్‌కల్యాణ్‌తో ‘బద్రి’లాంటి హిట్‌తో బోణీ కొట్టి, ఇండస్ట్రీలో ఎలాగొలా బతకడానికి రాలేదు. హిట్‌ సినిమాలు తీయడానికే వచ్చానంటూ సక్సెస్‌ల పరంపర కొనసాగించారు. టాప్‌ హీరోలతో బ్లాక్‌బస్టర్స్‌ తీసి అశేష అభిమానులను సొంతం చేసుకున్నారు‌. ఏప్రిల్‌ 20, 2000న ఆయన తొలిసారి దర్శకత్వం వహించిన ‘బద్రి’ చిత్రం విడుదలై నేటితో 20ఏళ్లు పూర్తి చేసుకుంది. అంటే దర్శకుడిగా పూరి ప్రస్థానం ప్రారంభమై కూడా రెండు దశాబ్దాలు పూర్తయినట్లే. ఈ సందర్భంగా ఆలీ వ్యాఖ్యాతగా గతంలో ఈటీవీలో ప్రసారమైన ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి విచ్చేసి ఎన్నో సరదా సంగతులు పంచుకున్నారు. మరోసారి అవేంటో చూసేద్దామా!

‘ఇండస్ట్రీకి ఎందుకొచ్చానురా బాబూ’ అని ఎప్పుడైనా అనిపించిందా?

పూరి జగన్నాథ్‌: ఎప్పుడూ అనిపించలేదు. ఆ ఆలోచనే రాలేదు. ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నేను దర్శకుడిని అవుతానా? లేదా? అన్న టెన్షన్‌ కూడా లేదు. సినిమాలు చేద్దామని వచ్చానంతే.

మీరు రాసిన మొదటి కథ ‘తొలి చినుకు’ ఎక్కడా పబ్లిష్‌ కాలేదు. అది మంచి లవ్‌స్టోరీ అని తెలిసింది నిజమేనా? 

పూరి జగన్నాథ్‌: ఆరో తరగతిలో రాశా. నాకు చిన్నప్పటి నుంచి కథలు రాయడం అలవాటు. అలా రాసిన వాటిని బుక్‌షెల్ఫ్‌లో పెట్టేవాడిని. అవి మా నాన్న చదివి. ‘బాగుంది’, ‘బాగోలేదు’ అని కామెంట్‌ పెట్టి అక్కడే ఉంచేవారు. దానిపై చర్చలు ఉండేవి కావు. నాకూ ఆ కథ గురించి పెద్దగా గుర్తు లేదు. 

మీ ఊళ్లో పూరి జగన్నాథ్‌ టూరింగ్‌ టాకీస్‌ అని ఉండేదట.

పూరి జగన్నాథ్‌: అవును. మా నాన్న నడిపేవారు. రోజూ స్కూల్‌ అయిపోగానే వెళ్లి అందులో సినిమాలు చూసేవాడిని. అలా సినిమాలపై ఆసక్తి ఏర్పడింది. దీంతో పాటు మా నాన్నగారు కొన్న పుస్తకాలను చదవడం వల్ల కూడా ఇంట్రెస్ట్‌ పెరిగింది. 

‘శత్రువు విసిరిన కత్తి కంటే.. స్నేహితుడు విసిరిన కత్తి బలంగా గుచ్చుకుంటుంది’ అని ఒక డైలాగ్‌ రాశారు. మీ నిజ జీవితంలో జరిగిందా?

పూరి జగన్నాథ్‌: జరిగింది. చాలా మంది స్నేహితులను నమ్ముతాం. వాళ్లు కత్తి విసరనక్కర్లేదు. పక్క నుంచే పొడుస్తారు. దిగినట్టు కూడా తెలియదు. చాలా మంది స్నేహితులు మోసం చేశారు. ఆస్తి అంతా పోయింది. నడి రోడ్డుపై నిలబడ్డా. 

మీరు ఎందుకు జాగ్రత్త పడలేకపోయారు?

పూరి జగన్నాథ్‌: ఇది క్రియేటివ్‌ జాబ్‌. సినిమాలు తీసుకోవడంపైనే దృష్టి ఉంటుంది తప్ప, ఇతర విషయాలపై ఉండదు. ‘భారీ రెమ్యునరేషన్‌ తీసుకుందాం. భూములు కొందాం. వ్యాపారం చేద్దాం’ ఇలా ఎప్పుడూ ఆలోచించలేదు. నాకు డబ్బుపై ఆసక్తిలేకపోవడం, అంతా వాళ్లు చూసుకుంటారులే అని నమ్మడం వల్ల ఇలా జరిగింది. 

మీ కెరీర్‌లో ఎంత డబ్బు పోగొట్టుకున్నారు?

పూరి జగన్నాథ్‌: దాదాపు రూ.100కోట్లపైనే పొగొట్టుకున్నా. దర్శకుడిగా నేను సంపాదించినంత డబ్బు ఏ దర్శకుడూ సంపాదించి ఉండరేమో. నన్ను మోసం చేసిన వాళ్లు ఇప్పుడు కనిపించినా వాళ్లను పట్టించుకోను. 

ఈ ప్రపంచంలో మనందరినీ ఒక శక్తి నడిపిస్తోందని అనుకుంటారు. మీరు నమ్ముతారా?

పూరి జగన్నాథ్‌: దేవుడు ఉన్నాడని నేను నమ్ముతా. కానీ, మనల్ని మంచివైపు నడిపించాలి.. వీళ్లను దీవించాలి.. ఇలాంటి కార్యక్రమాలు దేవుడు పెట్టుకోడని అనుకుంటా. దేవుడు చాలా పెద్దోడు. మన గురించి ఆలోచించేంత సమయం ఆయనకు ఉండదని నా భావన. దేవుడి గురించి ఆలోచించే శక్తి మనకు లేదని అనుకుంటా. ఇంట్లో అమ్మ, భార్య వీళ్లు పూజ చేస్తే దండం పెట్టుకుంటానంతే. 

బాలకృష్ణతో ‘పైసా వసూల్‌’ తీయాలని ఎందుకు అనిపించింది?

పూరి జగన్నాథ్‌: నాకు బాలకృష్ణగారి నవ్వంటే చాలా ఇష్టం. అప్పటివరకూ ఆయన పోషించిన పాత్రలన్నీ సీరియస్‌గా ఉంటాయి. సరదాగా సాగిపోయే పాత్ర చేసి చాలా రోజులైంది. అందుకే ఆయనతో ‘పైసా వసూల్‌’ చేశా. 

‘తేడా సింగ్‌’ అని పేరు పెడితే ఆయన ఒప్పుకొన్నారా?

పూరి జగన్నాథ్‌: ఏమీ అనలేదు. నా సినిమాలో ఎంత ఎనర్జీతో ఉన్నారో బయట కూడా అంతే ఎనర్జీతో ఉంటారు. నేనేమీ కొత్తగా చూపించలేదు. నాతో సినిమా చేయొద్దని బాలకృష్ణగారికి చాలామంది చెప్పారట. ‘ఆయనతో కష్టమండీ’ అని నాకూ కొంతమంది చెప్పారు. కలిసిన తర్వాత ఆయనేంటో నాకు అర్థమైంది. మా ఇద్దరి మధ్య ఫ్రెండ్‌షిప్‌ ఎక్కువైపోయింది. నేను ఆయనకు కేవలం 10నిమిషాలు మాత్రమే కథ చెప్పా. వారం రోజుల్లో పూర్తి స్క్రిప్ట్‌ చెబుతానని అన్నా. ఆయన వద్దన్నారు. ‘నీ సినిమాలు చూశా. నువ్వేంటో నాకు తెలుసు. మనం షూటింగ్‌కు వెళ్లిపోదాం’ అన్నారు. తేడా సింగ్‌ అన్న పేరు కూడా ఆయనకు తెలియదు. 

మీరు డైరెక్ట్‌ చేసిన వాళ్లలో ఏ హీరోతో మళ్లీ పని చేయాలని మీకు అనిపించింది?

పూరి జగన్నాథ్‌: బాలకృష్ణ. ఆయన సినిమాల్లో నటిస్తారు కానీ, బయట నటించడం తెలియదు. కోపం, ప్రేమ, ఏదైనా ముఖం మీదే చెప్పేస్తారు. మనసులో ఏది ఉంటే అదే మాట్లాడతారు.

సినిమా ఫీల్డ్‌కు రావాలని మీకు చిన్నప్పటి నుంచి ఉండేదా?

పూరి జగన్నాథ్‌: నేను సినిమా ఫీల్డ్‌కు వెళ్తానని మా ఇంట్లో అడగలేదు. వాళ్లే డబ్బిచ్చి ‘నువ్వు సినిమా ఫీల్డ్‌కు వెళ్తే బాగుపడతావు’ అని పంపించారు. వాళ్లు తీసుకున్న నిర్ణయం అది. 

సుమన్‌తో ‘పాండు’, కృష్ణతో ‘థిల్లాన’ సినిమాలు ఎందుకు ఆగిపోయాయి?

పూరి జగన్నాథ్‌: ఫైనాన్షియల్‌ ప్రాబ్లమ్స్‌ వల్ల ఆగిపోయాయి. లేకపోతే నా మొదటి సినిమా కృష్ణగారితో తీసేవాడిని. 

‘ఇడియట్‌’ కథ పవన్‌కల్యాణ్‌కు చెప్పారట?

పూరి జగన్నాథ్‌: కథ చెబుతున్నప్పుడు ఎంజాయ్‌ చేశారు కానీ, ఎందుకో ఓకే చేయలేదు. ‘ఇడియట్‌’, ‘అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి’, ‘పోకిరి’ ఈ మూడు పవన్‌కల్యాణ్‌కు చెప్పిన కథలు. బాగున్నాయన్నారు. కానీ, చేయలేదు. 

అవి రవితేజకు మంచి ప్లస్‌ అయ్యాయనుకుంటా!

పూరి జగన్నాథ్‌: కల్యాణ్‌గారు పరిచయం కాకముందు నేనూ, రవితేజ అసిస్టెంట్‌ డైరెక్టర్లుగా పనిచేసేవాళ్లం. ‘ఎప్పటికైనా నీతో సినిమా చేస్తా’ అని రవితేజతో అనేవాడిని. నమ్మేవాడు కాదు. ‘బద్రి’ తర్వాత సినిమా చేస్తానని చెబితే ‘కల్యాణ్‌గారితో చేసిన తర్వాత నాతో చేస్తావని అనుకోలేదు’ అన్నాడు. అప్పుడు ‘ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం’ చేశాం.

బ్యాంకాక్‌ను ఎందుకంతలా ప్రేమిస్తారు? ఏముంది అక్కడ?

పూరి జగన్నాథ్‌: నేను బ్యాంకాక్‌  వెళ్లను. ఎయిర్‌పోర్ట్‌లో దిగి, పటాయా వెళ్తా. సముద్రం అంటే చాలా ఇష్టం. బీచ్‌ అంటే చాలా ఇష్టం. అక్కడే చచ్చిపోవాలని కోరిక.

ప్రశాంతంగా ఉన్న మీ  చెరువులో పెద్ద పెద్ద బండరాళ్లు వేసి డిస్ట్రబ్‌ చేసింది రాంగోపాల్‌వర్మ అంటారు నిజమేనా?

పూరి జగన్నాథ్‌: నా చెరువులోనే కాదు. అందరి చెరువుల్లోనూ వేశారు. నేనంటే ఆయనకు ఇష్టం. ఎప్పుడొచ్చినా నాతోనే ఉంటారు. ‘జీనియస్‌’లు ఎప్పుడూ ఫ్లాప్‌ ఇస్తారు. ఎక్కువ ప్రయోగాలు చేస్తారు. అందుకే విఫలమవుతుంటాయి. ఆయన దగ్గర పనిచేసిన వాళ్లలో దాదాపు 50మంది దర్శకులం అయ్యాం. ఆయన ఫ్లాఫ్‌లు తీయొచ్చు కానీ, ఆయన చేసి ప్రయోగాల వల్ల చాలా మందికి లైఫ్‌ వచ్చింది. 

మీ ఇంటికి ‘కేవ్‌’ అని ఎందుకు పేరు పెట్టారు?

పూరి జగన్నాథ్‌: ఒకప్పుడు నాకు ఉన్న ఇల్లును అమ్మేయాల్సి వచ్చింది. ఆ తర్వాత డబ్బు సంపాదించి, మళ్లీ కట్టుకున్నా. రాంగోపాల్‌వర్మ మా కొత్త ఇంటికి వచ్చినప్పుడు ‘దీనికి ఏదైనా పేరు పెట్టు’ అని అన్నారు. నేను ‘నో మ్యాడ్‌’ అని పెట్టా. ఆయన అది బాగోలేదని ‘కేవ్‌’ అని పెట్టారు. ఎందుకు అని అడిగితే, ‘ఆల్‌ కేవ్స్‌ ఆక్యుపైడ్‌ బై టైగర్స్‌’ అన్నారు. నాకు నచ్చి ఉంచేశా. 

అమితాబ్‌ బచ్చన్‌తో సినిమా తీసే అవకాశం ఎలా వచ్చింది?

పూరి జగన్నాథ్‌: చిన్నప్పటి నుంచి నేను అమితాబ్‌ అభిమానిని. ఎప్పటి నుంచో ఆయనతో సినిమా చేయాలని ఉండేది. ఒక ఇంగ్లీష్‌ సినిమా చూసిన తర్వాత అందులో పాయింట్‌ నచ్చింది. వెంటనే వర్మకు ఫోన్‌ చేసి, ‘ఒక ఇంగ్లీష్‌ సినిమా చూశాను. బచ్చన్‌గారితో సినిమా చేయాలి’ అని అన్నా. ‘ఇంగ్లీష్‌ సినిమా ఎందుకు? నువ్వు సొంతంగా రాయలేవా’ అన్నారు. ‘రాస్తా’ అని సమాధానం ఇచ్చా. ఈలోగా ఫోన్‌ కట్‌ చేశారు. నాకు కోపం వచ్చింది. వెంటనే వారంలో ఒక కథ రాసి, రామూగారి దగ్గరకు వెళ్లా. ఆయన కథ వినకుండా అమితాబ్‌కు ఫోన్‌ చేసి, ‘జగన్‌ నా దగ్గరకు ఒక కథతో వచ్చాడు. ఫెంటాస్టిక్‌. సర్కార్‌ మీరు తప్పకుండా చేయాలి’ అని అంటే ఆయన ఇంటికి రమ్మన్నారు. ఇద్దరం అమితాబ్‌ ముందు కూర్చొన్నాం. ‘రామూ ఉంటే నేను కథ చెప్పను’ అని అన్నాను. అమితాబ్..‌ వర్మను బయటకు వెళ్లమన్నారు. గంటసేపు కథచెప్పా. ఆ తర్వాత వర్మ లోపలికి వచ్చారు. వారిద్దరూ ఒకరినొకరు ‘సర్కార్’‌ అని పిలుచుకుంటారు. అప్పుడు అమితాబ్‌ మాట్లాడుతూ.. ‘సర్కార్‌.. జగన్‌ చెప్పిన కథలో చిన్న అనుమానం ఉంది’ అని ఏదో చెప్పబోయారు. మధ్యలో వర్మ అడ్డుకుని  ‘సర్కార్‌.. మీరు వంద సినిమాలు చేయొచ్చు.. నేను వంద సినిమాలు చేయొచ్చు. ఇద్దరికీ నాలెడ్జ్‌ ఉంది. వాడు మీ అభిమాని. సినిమా చేస్తానని అంటున్నాడు. వాడిని మీరు డౌట్‌లు అడుగుతారేంటి సర్కార్‌. ఈ సినిమా పోయిందనుకుందాం! అమితాబ్‌ క్రెడిట్‌ పడిపోతుందా? హిట్‌ అయిందనుకుందాం! అమితాబ్‌ రేంజ్‌ పెరిగిపోతుందా?. పిల్లాడిని పట్టుకుని ప్రశ్నలు అడుగుతారేంటి. ఐ హేట్‌ యూ సర్కార్‌’ అని నన్ను తీసుకుని బయటకు వచ్చేశాడు. తర్వాత రోజు అమితాబ్‌ ఫోన్‌ చేసి, సినిమా చేస్తున్నట్లు చెప్పారు. సినిమా పూర్తయిన తర్వాత ఫస్ట్‌ కాపీ చూసి, మా ఇంటికి కూడా వచ్చారు. అప్పుడు మీరు (ఆలీ), చిరంజీవి చాలా మంది వచ్చారు.

‘‘చిరు నాకు చెప్పకుండా నేరుగా మీడియాతో ‘కథ నచ్చలేదు’ అనడం బాగోలేదు. నాకు చెప్పి ఉండాల్సింది’’ అని బాధతో అన్నారా? లేక కోపంతోనా?

పూరి జగన్నాథ్‌: ఆయన రీఎంట్రీ అనుకున్నప్పుడు నా దగ్గర కథ ఏమీ లేదు. ‘నేను మీ సినిమాలు చూస్తూ పెరిగా. ఆటోజానీలాంటి కథ మీరు చేస్తానంటే వెంటనే మొదలు పెడతా. టైటిల్‌ కూడా ‘ఆటోజానీ’ అని పెడదాం’ అని అన్నాను. ‘సరే కథ రాయి...’ అని చిరు అన్నారు. వెంటనే రాశాను. ఆయనకు చెబితే నచ్చింది. నాగబాబుగారికి కూడా చెప్పా. ఆయనకూ నచ్చింది. అయితే, ‘రాజకీయాల్లోకి వెళ్లి రీఎంట్రీ ఇస్తున్న మీ నుంచి సందేశాత్మక చిత్రం వస్తే బాగుంటుంది’ అని ఎవరో సలహా ఇచ్చారు. దాంతో ఆయన ఈ కథపై ఆసక్తి చూపలేదు. ఆయనతో ఎప్పటికైనా సినిమా చేస్తా.

మీ పిల్లల్ని హాస్టల్లో వేయడం వెనుక కారణం ఏంటి? 

పూరి జగన్నాథ్‌: నేను పడిన కష్టాలన్నీ వాళ్లకూ తెలియాలి. హాస్టల్లో ఉంటే వాళ్ల పని వాళ్లు చేసుకుంటారు. అప్పుడప్పుడు పక్కవాళ్లని అప్పు అడుగుతారు. ప్రతి విషయమూ తెలుస్తుంది. అందుకే వాళ్లని హాస్టల్లో వేశా. నా పిల్లలకు ఇప్పటివరకూ ‘ఐ లవ్ ‌యూ’ అని ఎప్పుడూ చెప్పలేదు. ప్రేమ మనిషిని వీక్‌ చేసేస్తుంది. నిన్ను ప్రేమించే వాళ్లు ఎక్కువైపోతే నువ్వు వీకైపోతావు. 

‘చిరుత’లో మొదట నచ్చిమి పాత్ర లేదట? ఎందుకు రాయాల్సి వచ్చింది?

పూరి జగన్నాథ్‌: ‘చిరుత’ కథ రాసిన తర్వాత డైలాగ్‌లు రాసుకునేందుకు బ్యాంకాక్‌ వెళ్తున్నా. ఎయిర్‌పోర్ట్‌లో ఇమిగ్రేషన్‌ స్టాంప్‌ వేస్తూ, ‘ఎక్కడికి వెళ్తున్నారు’అని అడిగారు. ‘బ్యాంకాక్‌. చరణ్‌ సినిమా డైలాగ్‌లు రాయడానికి వెళ్తున్నా’ అని సమాధానం ఇచ్చా. వెంటనే ‘అందులో ఆలీ పాత్ర ఏంటి’ అని అడిగారు. నేను ఏమీ మాట్లాడలేదు. తర్వాత సెక్యురిటీ చెక్‌ దగ్గర అడిగారు. విమానం ఎక్కిన తర్వాత ఇంకెవరో అడిగారు. ఇక లాభం లేదనుకుని, వెంటనే దత్తుగారికి ఫోన్‌ చేసి ఆలీ డేట్స్‌ తీసుకోమని చెప్పా. అప్పుడే నచ్చిమి పాత్ర రాశా. (మధ్యలో ఆలీ అందుకుని, నచ్చిమి పాత్రకు మొదట అనుకున్న డ్రెస్‌లు వేరు. కానీ, సెట్‌ కావటం లేదు. అప్పుడు పూరి తన పర్సులోని నుంచి 30వేల బ్యాంకాక్‌  డాలర్లు ఇచ్చి ‘నీకు నచ్చిన దుస్తులు కొనుక్కో. క్యారెక్టర్‌ అదిరిపోవాలి’ అన్నారు. అలా పాత్రకు వేసుకున్న డ్రెస్‌లన్నీ నేనే కొనుకొన్నా) 

నేను ఆస్తులన్నీ పొగొట్టుకుని, చిన్న ఫ్లాట్‌లోకి మారినప్పుడు ఆలీ నా దగ్గరకు వచ్చి ఒక నెక్లెస్‌లాంటిది ఇచ్చారు. దాని విలువ ఎన్నో లక్షలు ఉంటుంది. ‘ఇది వేసుకో. నీకు అదృష్టం వస్తుంది’ అని చెప్పారు. నాకు సెంటిమెంట్‌లు లేవు కాబట్టి, దాన్ని మా ఆవిడకు ఇచ్చేశా. ఆయన చెప్పినట్లు అన్నీ వచ్చాయి. దేవుడిని నమ్మను.. ఆలీని నమ్ముతా.

మరికొన్ని ప్రశ్నలకు ఒక్క మాటలో సమాధానం

మనీ: డబ్బుకు ప్రేమ అవసరం లేదు కానీ, ప్రేమకు డబ్బు కావాలి.

పార్టీలు: క్లోజ్‌ ఫ్రెండ్స్‌తో అయితే ఒకే.

ఫ్యామిలీ: బాధ్యత

దేవుడు: నాకు ఏ పనీ పాట లేకపోతే దేవుడి గురించి ఆలోచిస్తా. 

రాజకీయాలు: నాకు పెద్దగా ఆసక్తిలేదు. 

బ్యాంకాక్‌: నా ఇష్టమైన ప్రదేశం

రాంగోపాల్‌వర్మ: జీనియస్‌

తమన్నా: డెడికేటెడ్‌ యాక్టర్‌

కాజల్‌: చాలా సరదా మనిషి

ఇలియానా: హాట్‌

 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని