ఇష్టం లేకుండానే మలయాళ చిత్రాలు చేశా!
close
Published : 01/05/2020 14:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇష్టం లేకుండానే మలయాళ చిత్రాలు చేశా!

ఆ ఫంక్షన్‌కు వస్తే నన్ను చంపేస్తానని వార్నింగ్‌ ఇచ్చారు!

ఆమె పేరు చెబితే, అభిమానుల మది మురిసిపోతుంది. ఆమె స్క్రీన్‌పై కనిపిస్తే కుర్ర హృదయాలు ఉర్రూతలూగుతాయి. తన నటనతో నలుగురితోనూ శభాష్ అనిపించుకోగలరు.. మంచితనంతో దగ్గరవ్వగలరు. దక్షిణాది భాషా చిత్రాల్లో నటించి, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు షకీల. ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి గతంలో విచ్చేసి, ఎన్నో సంగతులు పంచుకున్నారిలా..!

షకీల.. అసలు పేరు అదేనా?

షకీల: అవును. మా నాన్నగారిది చెన్నై. అమ్మది నెల్లూరు జిల్లా కోట.

ఏ చిత్రంతో పరిశ్రమలోకి అడుగుపెట్టారు.

షకీల: నా మొదటి చిత్రం తమిళంలో చేశా. సెకండ్‌ హీరోయిన్‌గా ‘ప్లే గర్ల్స్‌’ అనే చిత్రంలో నటించా.

మీ సినిమా విడుదలవుతుంటే, మోహన్‌లాల్‌, మమ్ముటి సినిమాలు కూడా ఆగిపోయేవట నిజమేనా?

షకీల: అలా నేను కూడా విన్నాను. పర్సనల్‌గా నాకు తెలియదు.

కొన్నాళ్లు పోయిన తర్వాత షకీల సినిమాలు తీయకూడదు, విడుదల చేయకూడదు అన్నారట నిజమేనా?

షకీల: ఇది నిజం. ఎందుకంటే వాళ్లు రూ.4కోట్లు సినిమా తీస్తున్నారు. నా సినిమా రూ.20 లక్షలు కూడా ఖర్చు కావడం లేదు. ప్రతి వారం నా సినిమా విడుదలయ్యేది. దాంతో వాళ్లు నష్టపోతున్నారు. అలా నేను నటించిన 23 చిత్రాలకు సెన్సార్‌ ఇవ్వలేదు. అందుకే సినిమాలు ఆగిపోయాయి.

మలయాళంలో షకీల బిజీ అయిపోయిన తర్వాత మీకు గన్‌మెన్స్‌ ఉన్నారట నిజమేనా?

షకీల: లేదు. నా నోరుకే అందరూ భయపడేవారు. ఇంకా గన్‌మెన్స్‌ ఎందుకు. నేను చాలా పవర్‌ఫుల్‌. మంచికి మంచి.. చెడుకు చెడు.. నా నిజ జీవితంలో చాలా మందిని కొట్టాను కూడా.

ఆర్థికంగా బాధల్లో ఉన్న వాళ్లు వెళ్లి అడిగితే కాదనకుండా దానం చేసే షకీల.. ఇప్పుడు ఫైనాన్షియల్‌గా ఇబ్బంది పడుతున్నారట నిజమేనా?

షకీల: అవును నిజమే. అందరినీ నమ్మడం వల్ల అలా జరిగింది. డబ్బులకు సంబంధించిన వ్యవహారాలన్నీ మా అక్క చూసుకునేది ఆమెను మేము నమ్మాం. మమ్మల్ని ఏమార్చింది. మా అక్క మోసం చేస్తుందని నేను నమ్మలేదు. బాలచందర్‌గారి ‘నక్షత్రం’ సినిమాలో ఏ విధంగానైతే జరిగిందో నా నిజ జీవితంలోనూ అలాగే జరిగింది. ‘నేను ఒకతనికి డబ్బులు ఇచ్చాను. అతను పారిపోయాడు’ అని మాకు చెప్పింది. బయటవాళ్లైతే గొడవ చేస్తాం.. కేసులు పెడతాం. సొంత అక్క కదా ఏం చేస్తాం? ఐదేళ్లు ఆమె కూడా నాతో మాట్లాడటం లేదు. ఆమెను నమ్మడం నాదే తప్పు. అలా ఎవరినీ నమ్మకూడదా? అంటే మనం బతకలేం. ఒకరు చేసిన తప్పుకు ఎవరీనీ నమ్మకుండా ఉండలేం. 

షకీల అంటే రొమాంటిక్‌ సినిమాలే గుర్తుకువస్తాయి. బయటకు వెళ్లినప్పుడు మీకు ఇబ్బంది అనిపించలేదా?

షకీల: నేనెప్పుడూ బురఖాలోనే వెళ్తా. కనపడితే మాత్రం ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపేవారు. 

మీ ఇమేజ్‌ వల్ల మీరు ఎప్పుడైనా ఇబ్బంది పడ్డారా? 

షకీల: లేదు. ఇలాంటి సమస్యలు వస్తాయనే నేను ఇల్లు కూడా మారలేదు. 35ఏళ్లుగా ఒకే ఇంటిలో ఉంటున్నా. రూ.650కి ఆ ఇంట్లో అద్దెకు దిగాం. ఇప్పుడు రూ.11వేలు కడుతున్నాం. మధ్యలో కొన్నిరోజులు మారినా, మళ్లీ వెనక్కి వచ్చేశాం. 

అలాంటి సినిమాలు మీరు కావాలని చేశారా? లేదా కుటుంబాన్ని కాపాడుకోవడానికి చేశారా?

షకీల: కుటుంబాన్ని పోషించడం కోసమే నేను అలాంటి పాత్రలు చేయాల్సి వచ్చింది. ఒకానొక సందర్భంలో చేయాల్సిన పరిస్థితి ఏర్పడటంతో ఒకట్రెండు సినిమాలు చేశా. ఆ తర్వాత వరుసగా అవే కథలు రావడంతో చేయాల్సి వచ్చింది. నాకు మలయాళం చదవటం, మాట్లాడటం రాదు. మూడో సినిమా షూటింగ్‌ కోసం కేరళ వెళ్తే, పెద్ద బ్యానర్‌ కనిపించింది. నేను ఆశ్చర్యపోయా. అలాగే నా రెమ్యునరేషన్‌ కూడా నాకు తెలియకుండా పెరిగింది. మూడు రోజుల కాల్షీట్‌కు రూ.లక్ష అడిగితే, ఆ చిత్ర నిర్మాత మూడు రోజులకు రూ.3 లక్షలు ఇచ్చారు. నాకే అర్థం కాలేదు. మేకప్‌ బాక్స్‌ ఫుల్‌ అయిపోయింది. ఆ తర్వాత రోజుకు రూ.3 లక్షలు తీసుకున్న రోజులు కూడా ఉన్నాయి. 

ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్నా. భవిష్యత్‌లో సినిమాలు ఉంటాయో లేదో తెలియదు? డబ్బును జాగ్రత్త చేసుకుందాం. అన్న ఆలోచన ఎప్పుడూ కలగలేదా?

షకీల: నేను సంపాదించిన దానిలో రూపాయి తీసి ఖర్చు పెట్టిన సందర్భం లేదు. అలా చేసినా సంతోషపడేదాన్ని. డబ్బుకు సంబంధించిన వ్యవహారాలన్నీ అమ్మే చూసుకునేది. దాంతో నేను ఏవీ పట్టించుకునేదాన్ని కాదు. పైగా అవన్నీ చూసుకునే సమయం కూడా ఉండేది కాదు. దాంతో ‘ఇక సినిమాలు చేయకూడదు. మంచి ఇల్లు కొనుక్కొని సెటిల్‌ అవ్వాలి’ అనుకున్నప్పుడు అమ్మ దగ్గరకు వెళ్తే, మనం సంపాదించింది ఇస్తుంది కదా! అనుకున్నా. కానీ, అలా జరగలేదు. అమ్మ ఆరోగ్యం పాడవడంతో, అన్నీ అక్కే చూసుకొనేది.

మీరు వివాహం చేసుకున్నారా?

షకీల: కుదరలేదు. నాకు అన్నీ లవ్‌ ప్రపోజల్స్‌ వచ్చేవి. నా దృష్టిలో ఒక్క రోజు ఒకర్ని చూసి, డేటింగ్‌ చేసినా, అది లవ్వే. నన్ను దాదాపు 20 మంది ప్రేమించారు.  వాళ్లందరూ ఏదో ఒక సాకు చెప్పి బ్రేకప్‌ అయ్యే వాళ్లు. కొన్నేళ్లుగా ఒకతనని ప్రేమించా. పెళ్లి చేసుకునేందుకు వాళ్ల ఇంట్లో ఒప్పుకోలేదు. ఎందుకంటే నేను నటి షకీల కావడం. 

మలయాళ సినిమాలు చేస్తున్నప్పుడు వార్నింగ్‌ కాల్స్‌ వచ్చాయా?

షకీల: ఒక కాల్‌ వచ్చింది. కొచ్చిలో బోట్‌ షేప్‌లో ఒక స్టేడియం ఉంది. అక్కడ ఒక షో చేస్తున్నారు. దానికి నన్ను పిలిచారు. ‘ఆమె కనుక అక్కడికి వస్తే షూట్‌ చేసి చంపేస్తాం’ అని ఇంటికి కాల్‌ చేశారు. ఎందుకంటే నాకున్న క్రేజ్‌ తెలిసిపోతుందని. కేరళ పురుషాధిక్య సమాజం. ఒక మహిళకు పేరు రావడం వాళ్లు తట్టుకోలేరు. నేను భయపడలేదు. వెళ్దామనుకున్నా. అమ్మ వద్దని చెప్పింది. 

సిల్క్‌స్మిత్ మిమ్మల్ని కొట్టారా?

షకీల: ఒకసారి సిల్క్‌స్మిత నన్ను కొట్టిన మాట వాస్తవమే. అయితే, ఎందుకు ఆమె నన్ను కొట్టారో నాకూ నిజంగా తెలియదు. ఆమెకు సమానంగా నాకూ పేరు వస్తుందని భావించి నన్ను కొట్టి ఉంటారు. లేకపోతే, తన తర్వాత నేను స్టార్‌గా ఎదిగిపోతాననే అసూయ మనసులో పెట్టుకుని కొట్టారనుకుంటున్నా. అప్పుడు ఏం జరిగిందంటే.. నా తొలి చిత్రంలో ఒక బెడ్‌రూమ్‌ సీన్‌ చేయాలి. ఆమెకు చెల్లి పాత్ర నాది. ఒక సన్నివేశంలో నన్ను చెంపమీద కొట్టాలి. ‘మేడమ్‌ చెంపదెబ్బ సీన్‌ ఎలా చేయాలి’ అని నేను ఉదయం నుంచి ఆమెను అడుగుతూ ఉన్నా. ‘షాట్‌లో వచ్చేస్తుంది. నువ్వు ఏమీ చేయనక్కర్లేదు’ అంటూ చెప్పుకొంటూ వచ్చింది. అప్పుడు ఆ సీన్‌కు సంబంధించి రిహార్సల్స్‌ చేస్తున్నాం. అదే సమయంలో ఆ సినిమా డైరెక్టర్‌కీ నాకూ మధ్య క్రష్‌ నడుస్తోంది. రిహార్సల్స్‌ అయిపోయిన తర్వాత కెమెరా ముందుకు వెళ్లగానే సిల్క్‌స్మిత కోపంతో నా దగ్గరకు వచ్చి అందరి ముందూ లాగి పెట్టి గట్టిగా చెంప మీద కొట్టింది. నాకు కన్నీళ్లు ఆగలేదు. ఆ వెంటనే నన్ను హత్తుకుని ఓదార్చడం మొదలు పెట్టింది. వెంటనే మేకప్‌ తీసేసి నా టీవీఎస్‌ ఛాంప్‌ వేసుకుని ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్లిపోయా. ఇక నేను షూటింగ్‌కు వెళ్లను. ఆమె ఏమైనా పెద్ద చీఫ్‌ మినిస్టరా? అందరి ముందూ కొట్టడానికి’ అని రెండు రోజులు షూటింగ్‌కు వెళ్లలేదు. దర్శక-నిర్మాతలు మా ఇంటికి వచ్చి మా నాన్నగారితో మాట్లాడారు. ‘ఆమెతో మరొకరి కాంబినేషన్‌ దొరకడం లేదట’ అని నన్ను ఒప్పించారు. పోనీలే అని నేను షూటింగ్‌కు బయలుదేరుతుంటే సడెన్‌గా కారులో ఆమె వచ్చింది. ‘షకీలా ఇలా రా’ అని పిలిచింది. ‘నేను రాను’ అని చెప్పా. తనే నా దగ్గరకు వచ్చి, గిఫ్ట్‌ బాస్కెట్‌తో చాకెట్లు తీసుకొచ్చి చేతిలో పెట్టింది. ‘నేను నీకొక విషయం చెబుతా. మనం ఆ సీన్‌ రిహార్సల్స్‌ చేస్తుంటే నువ్వు టవల్‌ కట్టుకుని ఉన్నావు కదా. అది జారిపోతే నీకే పరువు పోతుంది కదా! అందుకే ఒకే షాట్‌లో చెయ్యాలని అలా కొట్టాను. దానికి నీకు కోపం వచ్చిందట కదా!’ అని ఏదో సర్ది చెప్పడానికి ప్రయత్నించారు.

మీరు ప్రేమించిన వాళ్లలో ఎవరైనా మిమ్మల్ని కొట్టారా?

షకీల: అవును కొట్టారు. వాళ్లు చెప్పేది వినేదాన్ని కాదు. అయినా కొట్టిన తర్వాత వాళ్లు సారీ చెబుతూ బతిమిలాడటం నాకు నచ్చేది. ఒకతనితో పెళ్లి కూడా ఫిక్సయింది. ఆయన నాపై ఎక్కువగా చేయి చేసుకునేవాడు. ఒకరోజు తాగి వచ్చి తిట్టడం, కొట్టడం చేశాడు. నాకు బాగా కోపం వచ్చింది. చొక్కాలు తగిలించే ఐరన్‌ హ్యాంగర్‌ తీసి వాడిని పిచ్చి కొట్టుడు కొట్టా. 

తెలుగులో మీకు ఏ చిత్రంలో తొలిసారి అవకాశం వచ్చింది?

షకీల: తేజగారి ‘జయం’. ఆయనను నా జీవితంలో మర్చిపోలేను. మలయాళ చిత్రాలు నటించిన తర్వాత నాలుగేళ్లు ఒక్క సినిమా కూడా చేయలేదు. ఎవరినైనా అవకాశం అడిగితే ‘నా పిక్చర్‌ కలర్‌ మారిపోతుంది’ అనేవారు. తేజగారు గ్రేట్‌ పర్సన్‌. ఆ సినిమా షూటింగ్‌ సమయంలో కంటికి లెన్స్‌ పెట్టుకోవడం ఇబ్బందిగా ఉండేది. ‘డైరెక్టర్‌ గారిని పిలవండి. మాట్లాడాలి’ అంటే ‘తేజగారినా’ అని భయపడేవారు. ఆయనకు విషయం తెలిసి, ‘మీకు ఎలా సౌకర్యంగా ఉంటే అలా చేయండి’ అని ఈజీగా చెప్పేశారు. తేజగారు నా రెండో దేవుడు. 

ఒకానొక సందర్భంలో షకీల ఆత్మహత్య చేసుకోవాలనుకుందట నిజమేనా?

షకీల: అవును! ఒంటరితనం వల్ల అలా అనిపిస్తుంటుంది. నిద్రలేవడం, తినడం, ఫ్రెండ్స్‌తో మాట్లాడటం, మళ్లీ పడుకోవడం. ఇదేనా జీవితం. ఇంకా ఏదో చేయాలి. ఆత్మహత్య చేసుకోవాలనిపించినప్పుడు అలాంటి సమయంలో దేవుడిని ప్రార్థిస్తా. మెడిటేషన్‌ చేస్తా. ఆ ఆలోచనల నుంచి బయపడతా.

ఇష్టం లేకపోయినా డబ్బు కోసం చేసిన సినిమాలు ఏవైనా ఉన్నాయా?

షకీల: నేను చేసిన మలయాళ చిత్రాలన్నీ అలా చేసినవే. వాటిల్లో అసలు కథే ఉండదు. ‘‘మేడమ్‌.. మీరు డ్రైవింగ్‌ స్కూల్‌ పెడతారు. మీ వెంట పదిమంది పడతారు. అందులో ఒకటి బెడ్‌రూం సీన్‌.. ఒకటి ఫాంటసీ సీన్‌..’’ ఇలాంటివన్నీ సబ్జెక్ట్‌లా..! రోజూ చేసేది ఇదే. మనసు చంపుకొనే మలయాళ సినిమాలు చేశా. కానీ, ‘జయం’, ‘నిజం’ సినిమాలు ఇష్టంతో చేశా. 

మీరు ఎలాంటి పాత్రల్లో నటించాలని అనుకునేవారు?

షకీల: దాదాపు అన్నీ పాత్రలు చేశా. ‘కొబ్బరిమట్ట’లో చేసిన పాత్ర నన్నే ఆశ్చర్యపరిచింది. నేను ఏడవగలనా? హావభావాలు పలికించగలనా? అనుకునేదాన్ని. రాజేశ్‌గారు మంచి పాత్ర ఇచ్చారు. 

మీ అభిమాన నటుడు ఎవరు?

షకీల: కమల్‌హాసన్‌. రెండు సార్లు చూశానంతే. తెలుగులో చిరంజీవిగారంటే ఇష్టం. ఒకసారి కలిశా. తెలుగు సినిమా చేయడానికి ఇక్కడికి వచ్చినప్పుడు ఫిలిం ఛాంబర్‌లో మాకు రూమ్‌ ఇచ్చారు. అప్పుడే ఆయన డబ్బింగ్‌ చెప్పడానికి వస్తే, వెళ్లి కలుద్దామని అనుకున్నాం. ఆయన పక్క నుంచి నవ్వుతూ వెళ్లిపోయారు. 

మీకు సొంతిల్లు ఉందా?

షకీల: లేదు. సొంత కారు మాత్రం ఉంది. ఎప్పటికైనా సొంత ఇల్లు కొనుక్కుంటా. ప్రస్తుతం నేను 30ఏళ్లకు పైగా ఒక ఇంట్లో అద్దెకు ఉంటున్నా. నేను ఎక్కడ ఆ ఇల్లు నాది అంటానోనని వాళ్లు భయపడుతున్నారు. అలా ఎప్పుడూ చేయనని వాళ్లకు చెప్పా. 

మీరు నటి అవుతానని అనుకున్నారా?

షకీల: చదువుకుని నర్సు కావాలన్నది నా కోరిక. లేదా కనీసం పోలీస్‌ కానిస్టేబుల్‌ కావాలనుకున్నా. కానీ, పదో తరగతి తప్పా. నాన్న నన్ను బాగా కొట్టేవారు. మా ఇంటికి ఎదురుగా సినిమా కంపెనీ ఉండేది. వాళ్లు మా ఇంటికి వచ్చి, ‘ఎందుకండీ ఎదిగిన పిల్లను కొడుతున్నారు. రేపు మీ అమ్మాయిని షూటింగ్‌కు తీసుకెళ్తాం’ అని తీసుకెళ్లారు. కనీసం ఫొటో సెషన్‌ కూడా లేకుండా, సిల్క్‌స్మిత నటించే సినిమాలో సెకండ్‌ హీరోయిన్‌గా తీసుకున్నారు. 

మీ పైన ఏవైనా గాసిప్స్‌ ఉన్నాయా?

షకీల: నాకు క్యాన్సర్‌ ఉందని కూడా రాశారు. ఒక సినిమా కోసం 25 కేజీల బరువు తగ్గా. అప్పుడు ఒక పార్టీకి వెళ్తే నన్ను ఎవరూ గుర్తు పట్టలేదు. కొద్దిసేపటికి అందరూ గుర్తు పట్టి ఆశ్చర్యపోయారు. అప్పుడు అలా చూసి, నా క్యాన్సర్‌ వచ్చిందని వార్తలు రాశారు. ఒకసారి కారు ప్రమాదంలో చనిపోయానని కూడా రాశారు. ఇంకోసారి మలయాళీ ఇంజినీర్‌తో పెళ్లయినట్లు రాశారు. 

తెలుగు చిత్ర పరిశ్రమలోని ఒకర్ని లవ్‌ చేసినట్లు టాక్‌ నిజమేనా?

షకీల: లేదండి. నన్ను కన్ఫ్యూజ్‌ చేస్తున్నారు. ఉన్నదేమో తెలియదు. 

మీ ఫైనల్‌ టార్గెట్‌ ఏంటి?

షకీల: ఒక అనాథాశ్రమం పెట్టాలి. పిల్లలందరూ నన్ను అమ్మా అని పిలవాలి. వృద్ధులకు నేను ఒక కూతురిగా మిగిలిపోవాలి. అదే నా ఆశయం.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని