రెండు రోజులు కాఫీ తాగలేదని...
close
Published : 20/03/2020 18:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రెండు రోజులు కాఫీ తాగలేదని...

ఇంటర్నెట్‌డెస్క్‌: తనదైన నటనతోనే కాకుండా, అందంతోనూ ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన నటుడు శోభన్‌బాబు. వివిధ పాత్రలతో నటుడిగా వెండితెరపై చెరగని ముద్రవేశారు. అంతేకాదు, సినిమాల నుంచి స్వచ్ఛందంగా విరామం తీసుకున్న తొలి నటుడు కూడా బహుశా ఆయనే కావచ్చు. ఆనాటి అగ్ర కథానాయకులందరూ ఎంతో క్రమశిక్షణతో మెలిగేవారు. ఈ విషయంలో శోభన్‌బాబు ఒక అడుగు ముందుండేవారనడంలో ఎలాంటి సందేహం లేదు. ధూమపానం(సినిమాల్లో తప్ప), మద్యంపానం అలవాటే లేని ఆయన ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న కాఫీ తాగే అలవాటును కూడా మానుకున్నారు. అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో ఓ సందర్భంలో ఇలా చెప్పుకొచ్చారు.

‘‘అలవాట్లలో మితి-పరిమితి ఉండటం చాలా అవసరం. చిన్నప్పటి నుంచి అలాగే పెరిగాను. సినిమాల్లో తప్ప నేనెప్పుడూ సిగరెట్‌ తాగలేదు. మద్యం కూడా సేవించలేదు. ఆల్కహాల్‌ శాతం తక్కువ ఉండే షాంపైన్‌ను కూడా తాగలేదు. పార్టీలకు వెళ్తే, హీరోయిన్లు నవ్వుకున్నారు. వాళ్లు షాంపైన్‌ తాగుతూ నన్ను బలవంత పెట్టేవాళ్లు. నేను కనీసం ముట్టుకోలేదు. ‘ఏవండీ మేము షాంపైన్‌ తీసుకుంటున్నాం. మీరు కనీసం ముట్టుకోవడానికి కూడా భయపడుతున్నారు. ఇక బ్రాంది, విస్కీ ఎలా తీసుకుంటారు’ అని అడిగేవారు. ‘నా జీవనశైలి అలాగే ఉంటుంది’అని చెప్పేవాడిని’’

‘‘45ఏళ్ల నుంచి నాకు ఉదయాన్నే కాఫీ తాగడం అలవాటు. అది కూడా మానేశా. ‘ఏవండీ ఆవిడ వచ్చింది’ చిత్రం షూటింగ్‌ జరుగుతుండగా, ఉదయాన్నే కాఫీ అడిగాను. కానీ, ఎవరూ తెచ్చి ఇవ్వలేదు. షూటింగ్‌కు వెళ్లిపోయాను. రెండో రోజూ అదే పరిస్థితి. ‘రెండు రోజులు కాఫీ తాగకుండా ఉండగలిగాను కదా. అసలు పూర్తిగా మానేస్తే ఏమవుతుంది’ అని అనుకుని అప్పటి నుంచి కాఫీ కూడా తాగలేదు. అయితే, ఒకసారి తమాషా విషయం జరిగింది. ఒకరోజు ఉదయాన్నే విమానంలో వెళ్తున్నాను. అందరూ కాఫీ తాగుతున్నారు. ఆ వాసనకి నా మనసు విపరీతంగా కాఫీపైకి లాగింది. ఇంతలో ఎయిర్‌హోస్టస్‌ కాఫీ తీసుకొచ్చింది. ఒక క్షణం నన్ను నేను అదుపు చేసుకోలేకపోయాను. కానీ, వెంటనే తేరుకుని, ఆ కాఫీని తీసుకుని గట్టిగా వాసన పీల్చి అక్కడ పెట్టేశా’’ అంటూ తన క్రమశిక్షణ, జీవనశైలి గురించి నవ్వుతూ చెప్పుకొచ్చారు శోభన్‌బాబు. అన్నట్లు మార్చి 20 శోభన్‌బాబు వర్థంతి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని