వైజయంతీ మూవీస్‌కు ఆ పేరెలా వచ్చిందంటే..?
close
Published : 28/04/2020 21:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వైజయంతీ మూవీస్‌కు ఆ పేరెలా వచ్చిందంటే..?

హైదరాబాద్‌: తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేని అద్భుతమైన చిత్రాలను అందించిన సంస్థ వైజయంతీ మూవీస్‌. అశ్వినీదత్‌ నిర్మాతగా ఈ బ్యానర్‌పై ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. తెలుగువారి అభిమాన నటుడు ఎన్టీఆర్‌ ‘ఎదురులేని మనిషి’ చిత్రంతో ప్రారంభమైన వైజయంతీ మూవీస్‌ అనతికాలంలోనే అగ్ర కథానాయకులందరితోనూ బాక్సాఫీస్‌ హిట్‌ చిత్రాలను నిర్మించింది. అసలు వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌కు ఆ పేరు ఎలా వచ్చింది? ఎవరు పెట్టారు. దాని వెనకున్న కథేంటి? తదితర వివరాలను యువ నటుడు రానా చెప్పుకొచ్చారు.

‘‘గత ఐదు దశాబ్దాలుగా ప్రతి జనరేషన్‌కూ తగినట్టు బ్లాక్‌ బస్టర్లు ఇస్తూ వస్తున్న సంస్థ వైజయంతీ మూవీస్‌. కానీ, ఈ సంస్థకు ఆ పేరెలా వచ్చింది? ఎవరు పెట్టారో తెలుసా? 1974లో కె.విశ్వనాథ్‌ దర్శకత్వంలో వచ్చిన ‘ఓ సీత కథ’ చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు చలసాని అశ్వినీదత్‌. కానీ, ఆ కుర్రాడి స్వప్నం ఎంతో పెద్దది. నటరత్న నందమూరి తారక రామారావుగారి అంత పెద్దది. ఎన్టీఆర్‌గారితో సినిమా సాధ్యమేనా? పట్టు వదలని విక్రమార్కుడిలా చివరకు ఆయన అపాయింట్‌మెంట్‌ సాధించారు. తనతో ఎందుకు సినిమా తీయాలనుకుంటున్నారో వివరించమని ఎన్టీఆర్‌ అడిగారు. అశ్వినీదత్‌ చెప్పిన మాటలకు ముచ్చటపడి సినిమా చేయడానికి ఒప్పుకొన్నారు. కానీ, అప్పటివరకూ బ్యానర్‌ కూడా స్థాపించలేదు’’

‘‘బ్యానర్‌ ఏంటి’ అని ఎన్టీఆర్‌ అడిగారు. ‘విజయ సంస్థలాంటిదైతే బాగుండు’ అని దత్తుగారి మనసులో ఉంది. కానీ, బయటపెట్టలేదు. క్షణం ఆలోచనలో పడి, ఆ మహనీయుడు ఎన్టీఆర్‌ మనసులో మరో అద్భుతమైన ఆలోచన గుప్పుమంది. అక్కడే ఉన్న కృష్ణుడి ఫొటో చూసి, ‘శ్రీ కృష్ణుడి మెడలో ప్రతీక్షణం పరిమళాలు వెదజల్లుతూ, ఎన్నటికీ వాడిపోని వైజయంతి. అదే నీ సంస్థ’ అని చెప్పారు. అంతేకాదు, తన సువర్ణ హస్తాలతో ‘వైజయంతీ మూవీస్‌’ అని రాశారు. కేవలం రాయడమే కాదు, వైజయంతీ ఎప్పటికీ వాడిపోని, వన్నె తరగని, ఘన విజయాలను అందించే సూపర్‌ పవర్‌ అని ఆశీర్వదించారు కూడా. ఆయన ఆ సంస్థలో చేసిన మొదటి సినిమా ‘ఎదురులేని మనిషి’ ఆ తారక రాముని దివ్య సంకల్పంతో పెట్టిన ఆ పేరు ఏ వేళా విశేషమో.. ఆ మహానుభావుడి హస్తవాసో ఆనాటి నుంచి వైజయంతీ మూవీస్‌ ఈనాటి వరకూ ఎదురులేని సంస్థగా నిలిచింది. 

 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని