24 నిమిషాల్లో ‘సింహా’ ఒకే చేసిన బాలకృష్ణ
close
Updated : 30/04/2020 16:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

24 నిమిషాల్లో ‘సింహా’ ఒకే చేసిన బాలకృష్ణ

ఇంటర్నెట్‌డెస్క్‌: 2004 ‘లక్ష్మీ నరసింహా’ బాలకృష్ణ కెరీర్‌లో ఘన విజయాన్ని అందుకున్న చిత్రాల్లో ఒకటి. ఆ తర్వాత వరుస అపజయాలు. అభిమానుల కోసం కొత్త కథలు ఎంచుకున్నా, విభిన్న పాత్రలు చేసినా నచ్చడం లేదు. ‘విజయేంద్రవర్మ’తో మొదలు పెడితే ‘మిత్రుడు’ వరకూ ఆకట్టుకున్న చిత్రం ఒక్కటీ లేదు. జయాపజయాలను బాలకృష్ణ అస్సలు పట్టించుకోరు. కొత్త టాలెంట్‌ను ప్రోత్సహిస్తూ ఉంటారు. అయితే, వరుస అపజయాల కారణంగా ఆయన అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. మరోవైపు యువ హీరోలు దూసుకుపోతున్నారు. అర్జెంట్‌గా నందమూరి అభిమానులకు ఓ హిట్‌ కావాలి. అది అలాంటి ఇలాంటి హిట్‌ కాదు.. కాలరెగరేసుకుని తిరిగేలా చేయాలి. ఈ క్రమంలో బాలకృష్ణ డేట్స్‌ కోసం నిర్మాతలు కలుస్తున్నారు. అప్పుడే ఎవరో బోయపాటి శ్రీను పేరు చెప్పారు. వెంటనే బోయపాటికి ఫోన్‌ కొట్టారు బాలకృష్ణ. 

సరిగ్గా ఆ సమయంలో బోయపాటి విజయవాడలో బంధువుల పెళ్లికి వెళ్లారు. సడెన్‌గా బాలకృష్ణ నుంచి ఫోన్‌ అనేసరికి పక్కకు వచ్చారు. ఫోన్‌లో అటు నుంచి ‘బోయపాటి మిమ్మల్ని ఒకసారి కలవాలి వస్తారా’, ‘బాబూ నేను హైదరాబాద్‌లో లేను. విజయవాడలో పెళ్లికి వచ్చాను. రేపు వచ్చి మిమ్మల్ని కలవచ్చా’ బోయపాటి సమాధానం. ‘సరే ఫలానా సమయానికి కలుద్దాం రండి’ అని బాలయ్య చెప్పారు. మరుసటి రోజు బాలకృష్ణను బోయపాటి కలిశారు. ‘మీతో సినిమా చేయాలనుకుంటున్నాం. కొత్త సబ్జెక్ట్‌లు ఏవైనా ఉన్నాయా?’ అని బాలకృష్ణ అడిగారు. వెంటనే బోయపాటి ఓ సబ్జెక్ట్‌ చెప్పారు. బాలకృష్ణకూ నచ్చింది. ‘నాకూ నచ్చింది. నా నిర్ణయాన్ని మూడు రోజుల్లో చెబుతా’ అన్నారు బాలకృష్ణ. ఆ తర్వాత మూడు రోజులకు బాలయ్య నుంచి ఫోన్‌ ‘మనం సినిమా చేస్తున్నాం. పూర్తి కథను సిద్ధం చేయండి’ అన్నారు. అదే ‘సింహా’. ఏప్రిల్ ‌30, 2010న విడుదలైన ఈ చిత్రం నేటితో (ఏప్రిల్‌ 30, 2020) పదేళ్లు పూర్తి చేసుకుంది. బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకోవడమే కాదు. ఎప్పటి నుంచో ఎదురు చూసిన బాలకృష్ణ అభిమానుల విజయదాహాన్ని తీర్చింది. 

బాలకృష్ణ సెటిల్డ్‌ పెర్ఫామెన్స్‌

అప్పటివరకూ బాలకృష్ణ సినిమా అంటే భారీ డైలాగ్‌లు, తొడ కొట్టడాలు, ఆవేశంతో ఊగిపోవడం. దర్శకులు సన్నివేశాలన్నీ ఇలాగే తీర్చిదిద్దేవారు. ఒకట్రెండ్‌ సినిమాలు హిట్టయ్యే సరికి అభిమానులు ఇవే ఇష్టపడతారని వారి నమ్మకం. అయితే, పదే పదే ప్రతి సినిమాలోనూ అవే సీన్లు చూడాలంటే ఎవరికైనా ఇష్టం ఉండదు. కానీ, ‘సింహా’లో బాలకృష్ణ క్యారెక్టర్‌ను కొత్తగా తీర్చిదిద్దారు బోయపాటి. ఇందులో బాలకృష్ణ డ్యుయల్‌ రోల్‌ పోషించారు. కాలేజ్‌ లెక్చరర్‌ శ్రీమన్నారాయణగా, ఆయన తండ్రి డాక్టర్‌ నరసింహాగా రెండూ పాత్రలు బాలయ్యే పోషించారు. ఈ సినిమాతో బాలకృష్ణ డైలాగ్‌ డెలవరీ విధానం మారిపోయింది. చాలా కూల్‌గా ఎదుటివాడు గజగజ వణికిపోయేలా వార్నింగ్‌లు ఇచ్చే సన్నివేశాలు అభిమానులను అలరించాయి. ‘పోలీస్‌ ఎక్కడ..’ సన్నివేశంలో బాలకృష్ణ హావభావాలు అదుర్స్‌. ‘చూడు.. ఒకవైపే చూడు..రెండో వైపు చూడాలనుకోకు తట్టుకోలేవు.. మాడిపోతావ్‌’, ‘కుట్లు వేయడమే కాదు.. పోట్లు కూడా వేస్తాను’ వంటి డైలాగ్‌లకు అభిమానుల ఈలలు, చప్పట్లతో థియేటర్లు దద్దరిల్లిపోయాయి. 

నయనతార, స్నేహ ఉల్లాల్‌

ఇందులో బాలకృష్ణకు జోడీగా ఇద్దరు కథానాయికలను తీసుకున్నారు. ఫ్లాష్‌ బ్యాక్‌లో వచ్చే డాక్టర్‌ నరసింహాకు జోడీగా నయనతార, కొడుక పాత్రకు స్నేహా ఉల్లాల్‌ను ఎంపిక  చేశారు. బోయపాటి అప్పటికే నయనతారతో ‘తులసి’ తీయడంతో ఆమెకు కథ నచ్చి వెంటనే ఒప్పుకొన్నారు. 25రోజులు కాల్‌షీట్‌లు ఇవ్వగా, బోయపాటి ఆమెకు సంబంధించిన సన్నివేశాలను 19రోజుల్లోనే పూర్తి చేశారు. అయితే, నయనతార కూడా తన పారితోషికాన్ని 19రోజులకే తీసుకోవడం గమనార్హం. 

112రోజుల్లోనే సినిమా పూర్తి

ఇక ఈ సినిమాను తెరకెక్కించడానికి 125 రోజులు షెడ్యూల్‌ అనుకోగా, 112రోజుల్లోనే పూర్తి చేశారు. సినిమా పట్ల బాలకృష్ణకు ఉన్న నిబద్ధత వల్లే ఇది సాధ్యమైంది. మొత్తం రూ.16కోట్లతో సినిమాను తెరకెక్కించారు. ఇక ఇందులో డాక్టర్‌ నరసింహా పాత్రను ఏపీ మాజీ సభాపతి, దివంగత తెదేపా నేత కోడెల శివప్రసాద్‌ను స్ఫూర్తిగా తీసుకుని రాసుకున్నారట బోయపాటి. ఎందుకంటే బోయపాటి కూడా అదే జిల్లాకు చెందిన వ్యక్తి కావడం, కోడెల చేసిన మంచి పనులను బోయపాటి చూడటంతో తన స్క్రిప్ట్‌కు అదనపు హంగులు జోడించి డాక్టర్‌ నరసింహా పాత్రను తీర్చిదిద్దారు. 

చక్రి సంగీతం అదుర్స్‌

‘సింహా’ సినిమాలో పాటలన్నీ యువతను విశేషంగా ఆకట్టుకున్నాయి. ‘సింహమంటి చిన్నోడే..’ ‘బంగారుకొండ’ పాటలు ఇప్పటికీ ఎవర్‌గ్రీన్‌. ఈ సినిమాలో నటనకు గానూ ఉత్తమ నటుడిగా నందమూరి బాలకృష్ణ నంది అవార్డును అందుకున్నారు. అంతేకాదు, ఉత్తమ హాస్యనటిగా, ఝాన్సీ, ఉత్తమ సంగీత దర్శకుడిగా చక్రిలకు కూడా నంది అవార్డులు వచ్చాయి.  

24 నిమిషాలు మాత్రమే కథ చెప్పా!

బాలకృష్ణ ఒకరోజు తనని పిలిచి ‘సినిమా చేద్దాం. కథ ఉంటే చెప్పు’ అని అడిగారని ఓ సందర్భంలో బోయపాటి చెప్పారు. ‘‘బాలకృష్ణ స్క్రిప్ట్‌ను నమ్ముతారు. అదే సమయంలో మనం చెప్పేది నమ్మకంతో చెప్పాలి. అలా చెబితే బాలకృష్ణ ఎప్పుడూ వద్దని చెప్పరు. నమ్మకంగా చెప్పకపోతే ప్రశ్నిస్తారు. అందుకే నా కథల విషయంలో మొదటి నుంచి క్లారిటీతో ఉంటా. నన్నెప్పుడూ ఆయన ప్రశ్నించలేదు. అంతకుముందు నుంచీ నాకు బాలయ్యబాబుతో పరిచయం ఉంది. ముత్యాల సుబ్బయ్యగారి దర్శకత్వంలో వచ్చిన ‘పవిత్ర ప్రేమ’కు నేను అసోసియేట్‌గా పనిచేశా.  ‘శ్రీనుకు నేనేంటో నీకు తెలుసు. కొత్తగా ఉండటానికి ప్రయత్నిస్తున్నా. కొత్త సబ్జెక్ట్‌ అని చెబుతున్నారు. కానీ, స్క్రీన్‌పైకి వెళ్లే సరికి అది ఉండటం లేదు. ఏదైనా అంటే ‘బాలయ్య ఇలా అంటున్నారు’ అని నన్ను విమర్శస్తున్నారు. ఎంత వరకూ కరెక్ట్’ అని బాలకృష్ణ అనడిగారు. అప్పుడు ‘సింహా ’కథ 24 నిమిషాలు మాత్రమే చెప్పా. ఆయనకూ నచ్చింది. ఆ తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు.’’ అని బోయపాటి చెప్పుకొచ్చారు. 

‘సింహా’ విజయం తర్వాత బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్‌లో ‘లెజెండ్‌’ భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి వీరిద్దరూ కలిసి పనిచేస్తున్నారు. ప్రస్తుతం కరోనా కారణంగా షూటింగ్‌ తాత్కాలికంగా వాయిదా పడింది. మరి హ్యాట్రిక్‌ చిత్రంతో ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి. 
 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని