మోహన్‌బాబు చిరంజీవిల ఆత్మీయ ఆలింగనం
close
Published : 03/01/2020 00:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మోహన్‌బాబు చిరంజీవిల ఆత్మీయ ఆలింగనం

హైదరాబాద్‌: ‘మా’ డైరీ విడుదల కార్యక్రమం ఆద్యంతం రసాభాసగా సాగింది. రాజశేఖర్‌ ప్రవర్తన పట్ల తీవ్ర అసహనానికి గురైన చిరంజీవి, కృష్ణంరాజు ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం మోహన్‌బాబు మాట్లాడుతూ సినిమా పరిశ్రమలో ఉన్నవాళ్లందరం ఒకే తల్లి బిడ్డలం. చిరంజీవికి, నాకు విభేదాలు లేవు. మా మధ్య నడిచేవి ఛలోక్తులు మాత్రమే అని తెలిపారు. దీంతో అక్కడే ఉన్న చిరంజీవి ఆయనను ఆత్మీయ ఆలింగనం చేసుకుని ముద్దుపెట్టుకున్నారు. అంతేకాకుండా తనకి కృష్ణంరాజు తాతయ్య అవుతారంటూ మోహన్‌బాబు ఛలోక్తులు విసిరారు. దీంతో అక్కడ ఉన్న వారు నవ్వుల్లో మునిగిపోయారు.

‘సినిమా పరిశ్రమలోని కళాకారులను గౌరవించాలన్నా, వారికి  సాయం చేయాలన్నా టి.సుబ్బిరామిరెడ్డి గారు ముందుంటారు. అలాంటి గొప్పవ్యక్తి ముందు నేడు ఇలాంటి గొడవలు జరగడం చాలా బాధాకరంగా ఉంది. కృష్ణంరాజు తాతకు నమస్కారం. నేను తిరుపతిలో బిఏ చదువుతున్నప్పుడు మీ సినిమాలు చూశా. బావ మురళీమోహన్‌కు నమస్కారం. చిరంజీవికి నాకు విభేదాలు లేవు. మేమిద్దరం ఒకేచోట కలిస్తే ఛలోక్తులు విసురుకుంటామంతే. నా కుటుంబమే ఆయన కుటుంబం. ఆయన కుటుంబమే నా కుటుంబం. భగవంతుడి సాక్షిగా మా ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవు. ఇంట్లో చిన్న చిన్న గొడవలు సహజం కానీ మేమిద్దరం మాత్రం ఎప్పటికీ ఒక్కటే. ఏది ఏమైనా చిరంజీవి, కృష్ణంరాజుగారు చాలా గొప్పగా మాట్లాడారు. ‘మా’లో గొడవలు జరుగుతున్న మాట వాస్తవం. జరిగింది చూస్తుంటే అర్థమవుతోంది. నీతులు చెప్పాలని మేం రాలేదు. నటీనటులందరం ఒకే తల్లి బిడ్డలం. మళ్లీ ఎన్నికలు వస్తాయి. ఏది శాశ్వతం కాదు. నిజం చెప్పాలంటే మనమే శాశ్వతం కాదు. నరేష్‌ నాకు తమ్ముడిలాంటి వాడు. ‘మా’ అభివృద్ధి పనులు గురించి చర్చించే సమయంలో చిరంజీవి నన్ను కూడా పిలుస్తానని చెప్పారు. కానీ నేను ఒక్కటే చెబుతున్నా ఆరోజు మాత్రం నన్ను పిలవకండి. నేను ఎవరితోనూ ఫైట్‌ చేయాలనుకోవడం లేదు. ఎలాంటి సహాయం కావాలన్నా చేస్తా. నాకు రాజశేఖర్‌ అంటే ఇష్టమే. ఐ లవ్‌ రాజశేఖర్‌. ఐ లవ్‌ దట్‌ ఫ్యామిలీ. ‘మా’ ఎవడి సొత్తు కాదు. ఇది అందరిది. సవాళ్లు చేసుకోవడం మానేసి కలిసి మెలిసి పనిచేద్దాం.’ అని మోహన్‌బాబు అన్నారు.

ఇవీ చదవండి..!మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని