అల్లు అర్జున్‌.. అందరూ ‘ఫీల్‌’ అయ్యారు!
close
Published : 07/01/2020 09:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అల్లు అర్జున్‌.. అందరూ ‘ఫీల్‌’ అయ్యారు!

స్టైలిష్‌ స్టార్‌ కెరీర్‌ మలుపులు..

‘చెలియా.. ఫీల్‌ మై లవ్‌’ అంటూ వెంటపడిన ఆర్య. ప్రేమించిన గీతను అజయ్‌కి ఇచ్చేంత గొప్ప స్నేహితుడు. రాత్రికి రాత్రే రూ.10 వేలని రూ.లక్ష చేస్తానని ఛాలెంజ్‌ చేసే ‘జులాయి’. కుటుంబం కోసం దేనికైనా తెగించే ‘రేసుగుర్రం’. తన తండ్రిని ఓ గొప్పవాడిలాగే అందరూ గుర్తుపెట్టుకోవాలని.. కోట్ల ఆస్తిని వదులుకుని రోడ్డుపైకొచ్చిన కొడుకు. ఇదంతా ఎవరి గురించో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. మన స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ గురించే. ‘ఫీల్‌ మై లవ్‌’ అంటూ తన నటనను అందరూ ఫీల్‌ అయ్యేలా చేసి, ఆకట్టుకున్నారు. మరో వారంలో ఆయన నటించిన ‘అల వైకుంఠపురములో..’ సినిమా సంక్రాంతి కానుకగా రాబోతోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌తో కలిసి ఆయన పనిచేసిన సినిమా కావడంతో అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ చిత్రం బన్నీ కెరీర్‌లో ఏ మైలురాయిని చేరనుందో చూడాలి. ఈ సందర్భంగా ఆయన సినీ కెరీర్‌లో టర్నింగ్‌ పాయింట్‌గా నిలిచిన సినిమాల్ని చూద్దాం..

కుర్రాడిగానే..

రెండేళ్ల వయసులో వెండితెరపై కనిపించిన స్టార్‌ బన్నీ. 1985లో వచ్చిన ‘విజేత’లో ఆయన ఉన్నారు. ‘స్వాతిముత్యం’ సినిమాలో కమల్‌ హాసన్‌ మనవడు బుజ్జిగా బన్నీ నటించారు. 16 ఏళ్ల వయసులో ‘డాడీ’లోని ప్రత్యేక పాత్రలో మెరిశారు. కానీ, పూర్తి స్థాయిలో హీరోగా పరిచయమైన సినిమా మాత్రం ‘గంగోత్రి’ (2003). ఇందులో సింహాద్రిగా ఆయన నటన మెప్పించింది. నటుడిగా బన్నీకి మంచి కెరీర్‌ ఉందని పలు పత్రికలు రివ్యూలు కూడా రాశాయి. కొత్త నటుడైనా.. చక్కగా నటించారని అన్నారు. ఉత్తమ నటుడిగా సినీ ‘మా’ అవార్డు అందుకున్నారు. ఇది దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు వందో సినిమా కావడం మరో విశేషం.

అమ్మాయిల మనసు దోచాడు...

‘గంగోత్రి’తో కేవలం బన్నీలోని నటుడ్ని మాత్రమే చిత్ర పరిశ్రమ గుర్తించింది. కానీ, సుకుమార్‌ దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్య’ సినిమా ఆయన కెరీర్‌కు బ్రేక్‌నిచ్చింది. వన్‌ సైడ్‌ లవర్‌గా బన్నీ నటన, హావభావాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ప్రత్యేకించి అమ్మాయిల్లో ఆయనకు క్రేజ్‌ పెరిగింది. ఇలాంటి అబ్బాయి జీవితంలోకొస్తే చాలనుకున్నారు. అంతలా ఫాలోయింగ్‌ పెరిగింది. ఈ సినిమాలో డైలాగ్‌లు, పాటలు ఇప్పటికీ ఎవర్‌గ్రీన్‌. బన్నీ తనదైన స్టెప్పులతోనూ అలరించారు. ఈ సినిమాతో ఆయన కెరీర్‌ మంచి బ్రేక్‌ అందుకుంది. అంతేకాదు నంది అవార్డు కూడా వరించింది.

మాస్‌ హీరోగా..

‘బన్ని’లో అల్లు అర్జున్‌ పవర్‌ఫుల్‌ పాత్రలో దర్శనమిచ్చారు. ఈ సినిమాతో మాస్‌ ఇమేజ్‌ సొంతం చేసుకున్నారు. ఆపై వచ్చిన ‘దేశముదురు’ మాస్‌లో మరింత క్రేజ్‌ తీసుకొచ్చింది. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆయన సిక్స్‌ప్యాక్‌తో కనిపించారు. ప్రత్యేకించి అమ్మాయి ప్రేమ కోసం తపించే కుర్రాడిగా తెగ సందడి చేశారు. ఈ రెండు సినిమాలు స్టార్‌గా ఆయన్ను గుర్తించేలా చేశాయి. ‘పరుగు’, ‘ఆర్య 2’, ‘వేదం’ వంటి సినిమాలు ఆయనకు హిట్‌లుగా నిలిచాయి. ‘పరుగు’తో నంది అవార్డు అందుకున్నారు.

తొలి వంద కోట్లు..

న్నీకి తొలిసారి వంద కోట్లు తెచ్చి పెట్టిన సినిమా ‘జులాయి’. కష్టపడకుండా డబ్బులు సంపాదించాలి అనుకుంటే జరిగే పరిణామాల చుట్టూ ఓ మైండ్‌గేమ్‌లా సాగిన ఈ సినిమా ఇది. త్రివిక్రమ్‌ దర్శకత్వం, బన్నీ నటన సినిమాకు ప్లస్‌ పాయింట్‌ అయ్యాయి. దానికి తోడు వినోదం ఉండటంతో ప్రేక్షకులు దీనికి ఓటేశారు. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. 2012లో రూ.30 కోట్లతో తీసిన సినిమా రూ.104 కోట్లు సాధించినట్లు విశ్లేషకులు అంచనా వేశారు. 2014 ‘రేసు గుర్రం’ ఆయన కెరీర్‌కు ఊపునిచ్చింది. అటు మాస్‌, ఇటు క్లాస్‌ను ఆకట్టుకునేలా తీసిన ఈ చిత్రం కూడా రూ.130 కోట్లకుపైగా రాబట్టింది. ఆపై ఏడాది వచ్చిన ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ కూడా బన్నీ ఖాతాలో మరో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.

అంచనాల మధ్య వచ్చి..

పెళ్లి, కుటుంబ విలువలు ప్రధానాంశంగా వచ్చిన ‘వరుడు’ పరాజయం పొందింది. ఈ సినిమా కథను ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారు. కొన్ని సాగదీసిన సన్నివేశాలు ఉండటం మైనస్‌గా అయ్యింది. 2018లో అల్లు అర్జున్‌-వక్కంతం వంశీ కాంబినేషన్‌లో వచ్చిన ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ ఊహించని రివ్యూలు అందుకుంది. భారీ అంచనాల మధ్య విడుదలైన సినిమా ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయింది. కానీ ఈ సినిమా కోసం బన్నీ చాలా కష్టపడ్డారు. సైనికుడిలాగా కనిపించేందుకు హెయిల్‌ స్టైల్‌ నుంచి బాడీ ల్యాంగ్వేజ్‌ వరకు అన్నీ మార్చుకున్నారు. ఓ విధంగా చెప్పాలంటే వన్‌ మెన్‌ షో చేశారు. ఆయన పాత్ర కోసం తనని తాను తీర్చిదిద్దుకున్న విధానం తెరపై అడుగడుగునా కనిపించింది. ఈ సినిమాలోని ఆయన నటన కెరీర్‌లోనే హైలైట్‌గా నిలిచినప్పటికీ.. కథ పరంగా పెద్దగా ఆకట్టుకోలేదు.

ముచ్చటగా మూడోసారి

ల్లు అర్జున్‌-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘జులాయి’, ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకున్నాయి. ఇప్పుడు వీరిద్దరూ కలిసి  చేసిన సినిమా ‘అల వైకుంఠపురములో’. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. వీరి కాంబినేషన్‌లో ముచ్చటగా మూడోసారి సినిమా వస్తుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. 

-ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని