అసలు ఎవరీ తానాజీ..?
close
Updated : 10/01/2020 16:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అసలు ఎవరీ తానాజీ..?

​​​​​​ఇంటర్నెట్‌డెస్క్‌: మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ గురించి తెలియని వాళ్లు ఉండరు. మొఘల్‌ చక్రవర్తులను ఎదిరించి దక్షిణా పథంలో అత్యధిక ప్రాంతాన్ని తన ఏలుబడిలోకి తెచ్చుకున్న యోధుడు. ముఖ్యంగా తన తెలివి తేటలు, శక్తియుక్తులతో శత్రు సైన్యాలని చీల్చి చెండాడేవాడు. శత్రు సైన్యాన్ని ఎదుర్కొనేందుకు శివాజీ వద్ద సుశిక్షిత సైన్యం ఉండేది. అన్ని విద్యల్లోనూ ఆరితేరిన వారు ఆయన సైన్యంలో ఉండేవారు. ముఖ్యంగా గెరిల్లా యుద్ధ తంత్రాలు, మెరుపుదాడులతో శత్రు సైన్యం ఎంత బలంగా ఉన్నా వారి వెన్నులో వణుకు పుట్టించేవారు. అలాంటి శివాజీ సైన్యంలో గొప్ప వీరుడు తానాజీ మలుసరే. ఆయన జీవిత కథ ఆధారంగా ఓం రౌత్‌ దర్శకత్వంలో ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘తానాజీ: ది అన్‌సంగ్‌ వారియర్‌’. అజయ్‌ దేవ్‌గణ్‌ టైటిల్‌ రోల్‌ పోషించిన ఈ చిత్రం ఆయన 100వ సినిమా కావడం విశేషం.

అసలు కథ ఏంటి?: ఛత్రపతి శివాజీ సైన్యంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి, యోధుడు తానాజీ. శివాజీని చర్చలకు పిలిచి ఆయనను అంతం చేయడానికి అఫ్జల్‌ఖాన్‌ పన్నిన కుట్రను తానాజీ ఛేదించాడు. శివాజీ తన రాజ్యాన్ని హిందూ స్వరాజ్యంగా ప్రకటించిన తర్వాత ఔరంగజేబుతో చేసుకున్న ఒప్పందం ప్రకారం తన స్వాధీనంలోని కోటలను మొఘల్‌ చక్రవర్తికి తిరిగి అప్పగించాడు. అయితే ఔరంగజేబు నమ్మకద్రోహంతో శివాజీని ఆగ్రా కోటలో బంధించాడు. ఆగ్రా కోట నుంచి తప్పించుకున్న శివాజీ తిరిగి ఆ కోటలన్నింటినీ స్వాధీనం చేసుకోవడం ప్రారంభించాడు. అలా జయించిన వాటిలో పురంధర్, రోహిడ, లోహగఢ్‌, మాహులీ, కొందన్‌ కోటలు ముఖ్యమైనవి.

వీటిని ఆక్రమించుకోవడానికి చేసిన యుద్ధాల్లో కొందన్‌ కోట యుద్ధం ఎంతో ప్రసిద్ధిగాంచింది. ఆ కోటపై కాషాయ జెండా ఎగిరే వరకూ తాను పాదరక్షలు ధరించనని శివాజీ తల్లి జిజియాభాయ్‌ శపథం చేయడంతో ఈ కోటను జయించడానికి తన సైన్యంలో యోధుడైన తానాజీ మలుసరేని నియమిస్తాడు శివాజీ. తన కుమారుడి వివాహం నిశ్చమైనా శివాజీ మహారాజు అప్పగించిన బాధ్యతను నెరవేర్చడానికి వివాహాన్ని వాయిదా వేసి కొందన్‌ కోటను ఆక్రమించేందుకు బయలు దేరతాడు.

కొందన్‌ కోటను జయించడానికి తానాజీ, అతడి తమ్ముడు సూర్యాజీ, మామ శేలార్తో పాటు 1000 మంది యోధులతో బయలుదేరి వెళ్లారు. 1670 ఫిబ్రవరి 4న తానాజీ కొందన్‌ దుర్గంపై దాడి చేయడానికి సిద్ధమవుతారు. ఆ కోటకు కేవలం రెండు ద్వారాలు మాత్రమే ఉన్నాయి. వాటి పొడువునా సైనికుల కట్టుదిట్టమైన పహారా ఉంది. పైగా కోట బురుజుపై ఫిరంగులతో పాటు, అదనంగా మొఘల్‌ సైన్యం కూడా కోటలో ఉంది. ఇక మిగిలిన వైపుల సహజ సిద్ధమైన పర్వతాలు ఉంటాయి. వీటి మీదగా ఎక్కి కోటలోకి ప్రవేశించడం అసాధ్యం. దీంతో తానాజీ పెంచుకుంటున్న యశ్వంత్‌ అనే ఉడుముకు తేనె రాసి ఏటవాలుగా ఉన్న కొండపైకి వదులుతాడు. అది కొండ చివరి అంచు వరకూ వెళ్లి అక్కడ గట్టిగా పట్టుకోవడంతో ఆ ఉడము సాయంతో సైనికులు కోటలోకి ప్రవేశించగలిగారు. అలా కోటలోకి ప్రవేశించిన 300 మందితో తానాజీ యుద్ధం చేసి కొందన్‌ కోటను ఆక్రమించుకున్నాడు. ఈ యుద్ధంలో శివాజీ సైన్యం గెలుపొందినప్పటికీ తానాజీ మరణిస్తాడు. తానాజీ మృతదేహాన్ని పట్టుకుని ‘కోట దక్కింది.. కానీ, నా సింహం వెళ్లిపోయింది’ అంటూ శివాజీ విలపించినట్లు చరిత్ర చెబుతోంది. తన స్నేహితుడు, యోధుడు జయించిన ఆ కోటకు ‘సింహ్ గఢ్‌’ అని పేరు పెట్టాడు శివాజీ. అప్పటి నుంచి ఆ కొందన్‌ కోట కాస్తా ‘సింహ్ గడ్’ కోటగా చరిత్రలో నిలిచిపోయింది.

ఈ కథనే అజయ్‌దేవగణ్‌ కీలక పాత్రలో ఓంరౌత్‌ తెరకెక్కించారు. అద్భుతమైన విజువల్స్‌, యాక్షన్‌ సన్నివేశాలతో తెరకెక్కిన ఈ చిత్రం మంచి టాక్‌ అందుకుంది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని