ఎంత మొండివాడవురా..!
close
Published : 13/01/2020 09:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎంత మొండివాడవురా..!

అతనో సముద్రపు కెరటం.. ఈ వాక్యం తెలుగు సినిమా పరిశ్రమలో నందమూరి కల్యాణ్‌రామ్‌కు సరిపోయినట్లుగా మరెవరికీ సరిపోదేమో. ఎందుకంటే ఆయన సినీ కెరీర్‌లో ఎన్ని ఆటు పోట్లు ఎదురైనా సినిమాపై ఉన్న ప్యాషన్‌తో ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు. ఎగిసిపడే సముద్రపు కెరటంలా మళ్లీ ప్రయత్నిస్తూనే ఉన్నారు. నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు మనవడిగా నటనా వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్నారు. ఈ  సంక్రాంతికి ‘ఎంత మంచి వాడవురా’ అంటూ పలకరించబోతున్నారు. సతీష్‌ వేగశ్న దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 15న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో కల్యాణ్‌రామ్‌ కెరీర్‌ను మలుపు తిప్పిన సినిమాలేంటో చూద్దామా!

బాబాయ్‌తో కలిసి తొలిసారి..

1989లో బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన ‘బాల గోపాలుడు’ చిత్రంతో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా వెండితెరకు పరిచయం అయ్యారు కల్యాణ్‌రామ్‌. ఆ తర్వాత ఉన్నత చదువుల నిమిత్తం అమెరికా వెళ్లారు.  అనంతరం తిరిగి వచ్చిన కల్యాణ్‌రామ్‌ 2003లో వచ్చిన ‘తొలిచూపుతో..’ కథానాయకుడిగా అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అయితే, ఈ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఆ తర్వాత వచ్చిన ‘అభిమన్యు’ కూడా నిరాశపరిచింది.

మలుపు తిప్పిన అతనొక్కడే!

మొదటి రెండు సినిమాలు ఆశించిన విజయం సాధించకపోవడంతో తానే నిర్మాతగా మారి ‘అతనొక్కడే’ తీశారు. సురేందర్‌రెడ్డి తొలిసారి దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. అటు నటుడిగా, ఇటు నిర్మాత కల్యాణ్‌రామ్‌కు మంచి పేరు వచ్చింది.  ఆ తర్వాత వచ్చిన ‘అసాధ్యుడు’, ‘విజయదశమి’ చిత్రాలు మెప్పించలేకపోయాయి. 

‘లక్ష్మీకల్యాణం’ ఓ మంచి ప్రయత్నం

తేజ దర్శకత్వంలో కల్యాణ్‌రామ్‌ నటించిన ‘లక్ష్మీ కల్యాణం’ ఇద్దరికీ ఊరటనిచ్చిందనే చెప్పాలి. ఆ సమయంలో ఇద్దరూ ఫ్లాప్‌ల్లోనే ఉన్నారు. సంచలన దర్శకుడిగా పేరున్న తేజ ‘లక్ష్మీకల్యాణం’ మరోసారి తన సత్తా ఏంటో చాటారు. ఈ చిత్రంతోనే ‘కాజల్‌’ కథానాయికగా పరిచయం అయింది. ఇక నిర్మాతగా రెండో చిత్రం ‘హరేరామ్‌’ బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. కల్యాణ్‌ రామ్‌ ద్విపాత్రాభినయంతో ఆకట్టుకున్నారు. 

‘పటాస్‌’ పేలింది

2008లో వచ్చిన ‘హరేరామ్‌’ తర్వాత కల్యాణ్‌రామ్‌ మరో విజయాన్ని అందుకోవడానికి ఏడేళ్లు పట్టింది. 2015లో అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ‘పటాస్‌’తో మంచి విజయాన్ని అందుకున్నారు. పోలీస్‌ ఆఫీసర్‌గా ఆయన నటన మెప్పించింది. అయితే ఆ తర్వాత మళ్లీ కల్యాణ్‌రామ్‌ను విజయాలు వెక్కిరించాయి. ‘ఇజం’, ‘ఎంఎల్‌ఏ’, ‘నా నువ్వే’ చిత్రాలు మెప్పించలేకపోయాయి. అయితే, గతేడాది కల్యాణ్‌రామ్‌కు మర్చిపోలేని సంవత్సరం. ఎందుకంటే ఎన్టీఆర్‌ బయోపిక్‌లో ఆయన హరికృష్ణగా నటించి మెప్పించారు. ఇక గుహన్‌ దర్శకత్వంలో వచ్చిన ‘118’ సస్పెన్స్‌ థ్రిల్లర్‌తో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. 

ఆ ఇద్దరితోనే ఢీ..

తాజాగా కల్యాణ్‌రామ్‌, మెహ్రీన్‌ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఎంత మంచి వాడవురా’ విడుదలకు సిద్ధమైంది. ‘శతమానం భవతి’తో జాతీయ పురస్కారం గెలుచుకున్న సతీశ్‌ వేగేశ్న ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. గోపీ సుందర్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు మహేశ్‌బాబు ‘సరిలేరు నీకెవ్వరు’, అల్లు అర్జున్‌ ‘అల వైకుంఠపురములో’ సినిమాలు సైతం విడుదలై మంచి టాక్‌ను తెచ్చుకున్నాయి. దీంతో బాక్సాఫీస్‌ వద్ద గట్టి పోటీ నెలకొంది. మరి కల్యాణ్‌రామ్‌ లేటుగా వచ్చినా లేటెస్ట్‌గా విజయాన్ని అందుకుంటారేమో చూడాలి.

-ఇంటర్నెట్ డెస్క్‌‌

 



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని