ఎవరికీ తెలియకుండా 2విషయాలు దాచాం: త్రివిక్రమ్‌
close
Updated : 13/01/2020 18:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎవరికీ తెలియకుండా 2విషయాలు దాచాం: త్రివిక్రమ్‌

ఏనుగును గదిలో దాచాల్సి వచ్చింది

హైదరాబాద్‌: ‘‘బన్నీ ఓ మంచి డ్యాన్సర్‌.. ఇది అందరికీ తెలుసు. స్టైల్‌ సెన్స్‌ ఉన్నోడు.. ఇది కూడా అందరికీ తెలుసు. ఓ అద్భుతమైన నటుడు. ఇది కొందరికి తెలుసు. కొన్ని సినిమాల్లో అక్కడక్కడా అతడిలోని నటన కనిపించింది. కానీ, దాన్ని ఓ చిత్రంలో మొదటి నుంచి చివరి వరకూ చూపించాలి అనుకున్నా. ఈ కోరిక నాలో ఎప్పటి నుంచో ఉంది. ‘అల వైకుంఠపురములో..’తో అది తీరింది’’ అన్నారు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌. ఆయన దర్శకత్వంలో అల్లు అర్జున్‌ నటించిన చిత్రమిది. పూజా హెగ్డే కథానాయిక. జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రాన్ని హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌, గీతా ఆర్ట్స్‌ సంస్థలు నిర్మించాయి. ఈ సినిమా హిట్‌ అందుకున్న నేపథ్యంలో చిత్ర బృందం ‘థ్యాంక్స్‌ మీట్‌’ నిర్వహించింది. సినిమా కోసం పడ్డ తపన, అనుభూతులను పంచుకుంది.

దర్శకుడు త్రివిక్రమ్‌ మాట్లాడుతూ.. ‘ఈ సినిమా కోసం మొదట నిలబడిన వ్యక్తులు రామ్‌లక్ష్మణ్‌ మాస్టర్లు. వారు నా స్నేహితులు, చాలా గొప్పవాళ్లు. మీతో నా ప్రయాణం ఇలానే కొనసాగాలి. ఈ సినిమాలో ఎవరికీ తెలియకుండా రెండు విషయాలు దాచాం. ఒకటి ‘సిత్తరాల..’ అనే పాట. అది శ్రీకాకుళం యాసలో ఉంటుంది. పాట షూట్‌కు ముందు రోజు రాత్రి మా దగ్గరికి ఆ పాట వచ్చింది. అప్పటికప్పుడు షూట్‌ జరిగింది. ఈ పాటను ఫైట్‌గా తీశాం.. అది ఓ ప్రయోగం. ఈ పాటను ఉత్తరాంధ్ర ప్రజలకు అంకితం ఇస్తున్నా. దీన్ని అరగంటలో తమన్‌ ట్యూన్‌ చేశాడు’.

‘‘బ్రహ్మానందం గారు ఈ సినిమాలోని పాటను మాపై ప్రేమతో చేశారు. ఆయన సంధ్య థియేటర్‌లోకి నిన్న రాగానే అందరూ కేకలు పెట్టారు. ఆయన సినిమాలో ఉన్నారనే విషయాన్ని చెప్పకుండా దాచడం చాలా కష్టమైంది. ఓ ఏనుగును గదిలో దాచడం కష్టం కదా. ఓ స్టిల్‌ తీయలేదు, మేకింగ్‌ వీడియోలో చూపించలేదు, ఆడియో ఫంక్షన్‌కు రాలేదు.. ఎట్టకేలకు ఇవాళ ఆయన్ను మీ ముందుకు తీసుకొచ్చాం. ఆయనకు అనారోగ్యంగా ఉందన్నప్పుడు రూ.2500లు పెట్టి పువ్వులు తీసుకెళ్లా. నేను ఇంటికి వెళ్లే సరికీ ఆయన పాటలు పాడుకుంటా, మెట్లు దూకుతూ దిగుతున్నారు. ఆ పూలను చెత్తబుట్టలో వేశా. నవ్వించే వారు ఎప్పుడూ ఆరోగ్యంగానే ఉంటారు. సర్‌ మీరు నాకు రూ.2500లు అప్పు ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. సునీల్‌ ఈ చిత్ర పరిశ్రమకు వచ్చినప్పుడు విలన్‌ అవ్వాలి అనుకున్నాడు. కానీ మంచి హాస్యనటుడు అవుతావని నేను చెప్పా. కానీ, అతడు నమ్మలేదు, ఇప్పటికీ నమ్మడం లేదు. ఇంక ఎప్పుడు నమ్ముతాడో. పద్మశ్రీ, పద్మభూషణ్‌ వస్తే నమ్ముతాడేమో (నవ్వుతూ)’’

‘‘ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్‌ గారు నటించారు. ఆయనకున్న అహంకారానికి, నాకున్న వినయానికి (నవ్వుతూ..) మేమిద్దరం ఈ ప్రయాణం చేస్తున్నాం. కేవలం ఇది నా అతి మంచితనం వల్ల మాత్రమే సాధ్యమౌతోంది. ఆయన సెట్‌లో నన్ను కొట్టడాలు, తిట్టడాలు.. అయినప్పటికీ ‘జులాయి’ నుంచి ఆయనతో పడుతున్నా. ఇంకా ఇలానే భరిస్తా. వజ్రం కఠినంగా ఉంటుంది. అలాగని దాన్ని తలపై పెట్టుకోవడం మానేస్తామా. ఈ సినిమా గురించి సుశాంత్‌కు చెప్పగానే చేస్తాను సర్‌ అన్నాడు. ‘చి.ల.సౌ’లో నటన నచ్చి, ఈ పాత్రకు అనుకున్నాం. అతడి నటన ఎంతో బాగుంది. మురళీ శర్మలాంటి నటుడ్ని అతడు బ్యాలెన్స్‌ చేశాడు. మీ తాతయ్య అక్కినేని నాగేశ్వరరావులా మీరంతా ఎన్నో సినిమాలు చేయాలి. మా అందరి ఆశీర్వాదాలు మీకు ఉన్నాయి’’

‘‘పూజాను మళ్లీ ఎందుకు సినిమాలో పెట్టుకున్నారు? అని కొందరు అడిగారు. తను సమయానికి సెట్‌కు వస్తుంది, పాత్రను అర్థం చేసుకుంటుంది, తెలివితేటలు ఉన్నాయి. అడిగినప్పుడు డేట్స్‌ ఇస్తుంది, అందంగా ఉంటుంది. రాత్రి జైపూర్‌లో పనిచేసి, తర్వాత రోజు మధ్యాహ్నం హైదరాబాద్‌ వచ్చి మాతో కలిసి ‘అరవింద సమేత’లో పనిచేసిన రోజులు ఉన్నాయి. అంతగా కష్టపడుతుంది. పైకి మీకు ఈ తరం అమ్మాయిలు అందంగా, సున్నితంగా కనిపిస్తున్నారేమో కానీ ఎంతో కష్టపడతారు. వాళ్ల రూపాయి వాళ్లే సంపాదించుకుంటున్నారు. అది గొప్ప విషయం’’

‘‘ఈ సినిమా విడుదలకు ముందే తన పాటలతో హిట్‌ అనిపించాడు తమన్‌. మా పని తగ్గించాడు. సగం తను చేసేసి.. మిగిలిన పని మీరంతా చేస్తే చాలు అనిపించాడు. ఈ నెల 18న వైజాగ్‌లో విజయోత్సవ వేడుకల్ని నిర్వహించబోతున్నాం. అక్కడ అల్లు అరవింద్‌, రాధాకృష్ణ గురించి చెబుతా. మేం రూ.1 అడిగితే.. వాళ్లు రూ.1.50 ఇచ్చి.. రూ.2 ముందు జాగ్రత్తగా వాళ్ల దగ్గర పెట్టుకున్నారు. ‘మీరు కల కనండి, మేం సహకరిస్తాం’ అన్నారు. బన్నీ సినిమా కోసం చాలా తపన పడ్డాడు. ఎలా చేయాలి, ఎలా తీయాలి, సెట్‌ ఎలా ఉంటే బాగుంది.. ఎప్పుడూ ఈ ఆలోచనలే. మా ఇద్దరి మధ్య ఇవే చర్చలు. అతడిలోని నటుడ్ని అందరికీ చూపించాలని అనుకున్నా. ఈ సినిమాతో ఆ నా కల నిజమైంది. ఈ సినిమాలో గొప్పగా నటించాడు. బన్నీ నాకు సోదరుడిలాంటి వాడు’ అన్నారు.

మాటపై నిలబడ్డారు

బ్రహ్మానందం మాట్లాడుతూ.. ‘‘బన్నీ వల్ల ఇవాళ నేను ఈ కార్యక్రమానికి వచ్చా. నేను అనారోగ్యం నుంచి కోలుకున్న తర్వాత నా దగ్గరికి వచ్చాడు. ‘ఫిట్‌గా అయ్యారు.. మీరు మా సినిమాలో నటించాల్సిందే’ అన్నాడు. మరోసారి త్రివిక్రమ్‌ వచ్చి.. ‘మీరు మా సినిమాలో నటిస్తారంతే’ అని చెప్పి వెళ్లిపోయాడు. సరేలే.. అని నేను మౌనంగా ఉన్నా. షూటింగ్‌ కూడా పూర్తయిపోందనుకున్నా. కానీ ‘రాములో రాములో..’ పాటలో నాతో యాక్టింగ్‌ చేయించారు. బన్నీ, త్రివిక్రమ్‌ మాటపై నిలబడ్డారు. మా గురువు గారు అల్లు రామలింగయ్య నుంచి అతడికి ఈ గుణం వచ్చింది. ఆయన కూడా అంతే.. ఓ మాట అంటే దాన్ని నిలబెట్టుకుంటారు. అతడిలోని నటన గురించి ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. త్రివిక్రమ్‌ కామెడీకి మేమంతా అభిమానులం’’ చెప్పారు.

దేవుడిచ్చిన వరం త్రివిక్రమ్‌

‘‘జులాయి’ సినిమా నుంచి ఇదే కంపెనీ, ఇదే డైరెక్టరు, ఇదే హీరో, ఇదే రాజేంద్రప్రసాద్‌.. ఈ సారి అల్లు అరవింద్‌ మాత్రం మాతో జాయిన్‌ అయ్యారు. ఇవాళ నాకు ఎంతో ఆనందంగా ఉంది.. మేం జీవితంలో జంధ్యాల గారిని కోల్పోతే.. భగవంతుడు మాకిచ్చిన మరో వరం త్రివిక్రమ్‌. ఆయనతో ప్రయాణం ఎలా ఉంటుందో మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. మీరంతా చూస్తూనే ఉన్నారు. మేమెప్పుడూ సెట్‌లో డబ్బులు తీసుకునే నటులుగా లేం, ఫార్మల్‌గా ఉండం. ‘సర్‌ డేట్స్‌ పంపిస్తున్నాం, చూడండి’ అని నాకు ఫోన్‌ చేసి చెబుతాడు, అలా ఉంటాం. సినిమా అవుట్‌పుట్‌ చక్కగా రావాలని అందరూ కలిసి మాట్లాడుకునేవాళ్లం, పనిచేసేవాళ్లం’’ అని రాజేంద్ర ప్రసాద్‌ పేర్కొన్నారు.

బన్నీని గమనించా..

సుశాంత్‌ మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో పాత్ర కోసం నాకు ఫోన్‌ వచ్చింది. బన్నీని దగ్గర నుంచి గమనించొచ్చు, త్రివిక్రమ్‌తో కలిసి పనిచేయొచ్చు అని ఒప్పుకున్నాను. మీకు తెలియకపోవచ్చు.. బన్నీ నిన్ను చూసి నేను చాలా నేర్చుకున్నా (నవ్వులు). నా తర్వాతి సినిమాలో వాటిని అప్లై చేస్తా (నవ్వుతూ). ఇది బన్నీ కెరీర్‌లోనే ఉత్తమంగా నటించిన సినిమా. పూజా ఎప్పుడూ బొమ్మలాగే ఉంటుంది. అందుకే ‘బుట్టబొమ్మ’ పాట పెట్టారేమో’ అన్నారు.

కష్టపడ్డా..

‘ఇది బన్నీ-త్రివిక్రమ్‌ హ్యాట్రిక్‌. గొప్ప సంస్థలు నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు ట్యూన్స్‌ కట్టడం బాధ్యతగా ఫీల్‌ అయ్యా. ప్రతి ట్యూన్‌ను ఎంతో కష్టపడి చేశా. త్రివిక్రమ్‌ గారు నాకు గురువులాంటి వారు. ఆయన ప్రతి రోజు కొత్తగా కనిపిస్తారు. అలాంటి ఆలోచనతో ఉన్న వ్యక్తంటే నాకిష్టం. ప్రతి పాటను ఛాలెంజింగ్‌గా తీసుకున్నా. దర్శక, నిర్మాతలు నాపై ఎప్పుడూ ఒత్తిడి తీసుకురాలేదు. ఈ సంక్రాంతి రేస్‌ నాకు నచ్చింది. రికార్డింగ్‌ స్టూడియోలో ఇంతగా పరిగెత్తి చాలా రోజులైంది (నవ్వుతూ)’ అని తమన్‌ ప్రసంగించారు.

బన్నీని ఒప్పించారు.. థ్యాంక్స్‌

పూజా హెగ్డే మాట్లాడుతూ.. ‘మొత్తం చిత్ర బృందానికి శుభాకాంక్షలు. నాకు ఇందులో అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. సినిమాలోని ప్రతి శాఖ సరిగ్గా పనిచేస్తే సినిమా మరో స్థాయిలో ఉంటుంది. త్రివిక్రమ్‌గారికి నేను పెద్ద ఫ్యాన్‌ అయ్యా. కేవలం దర్శకత్వంకేకాదు.. వ్యక్తిగా ఆయనపై అభిమానం ఎంతో పెరిగింది. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌తో కలిసి మరోసారి పనిచేయాలని కోరుకుంటున్నా. అల్లు అరవింద్‌ సర్‌ సెట్‌లోకి వస్తే.. ఆయన వచ్చారు అని అందరికీ తెలుస్తుంది (నవ్వుతూ).  ఆయన తర్వాతి సినిమాలోనూ నేను నటిస్తున్నా. నాకు అవకాశం ఇచ్చారు. తమన్‌ మౌనంగా ఉన్నట్లు కనిపిస్తాడు కానీ.. అస్సలు అలాంటి వ్యక్తి కాదు (నవ్వుతూ). సుశాంత్‌, నవదీప్‌, నేను స్నేహితులం అయ్యాం. నన్ను నీకు (బన్నీని ఉద్దేశిస్తూ) జంటగా తీసుకున్నందుకు, దానికి నిన్ను ఒప్పించినందుకు త్రివిక్రమ్‌ సర్‌కు థ్యాంక్స్‌ (సరదాగా నవ్వుతూ). బన్నీ చాలా బాగా నటిస్తాడు. నీతో కలిసి మరోసారి పనిచేయాలని ఆశిస్తున్నా’ అని చెప్పారు.

నా సగం ఆస్తి ఖర్చు చేశా

‘సినిమాలో ‘ఓ మై గాడ్‌ డాడీ..’ అని నా గురించి పాడలేదు. నేను అలాంటి తండ్రిని కాదు. నా సగం ఆస్తి పిల్లల ఖర్చులకు ఇచ్చేశాను (అందరూ నవ్వులు). స్విమ్మింగ్‌ పూల్‌ కావాలంటే నా ఆస్తిలో సగం పెట్టి కట్టాను. అల్లు రామలింగయ్య గారు, ఆ తర్వాత నేను, ఆపై మా అబ్బాయిలు.. అయాన్‌ సంగతి ఇంకా తెలియదు. మేమంతా కలిపి ఇద్దరికి కృతజ్ఞతలు చెప్పాలి. తెలుగు కళామతల్లికి, మమ్మల్ని తరతరాలుగా అభిమానిస్తున్న అభిమానులకు. ఇన్ని తరాల నుంచి మమ్మల్ని అభిమానిస్తున్న ప్రేక్షకులకు రుణపడి ఉంటాం. త్రివిక్రమ్‌ గారు మాకు బోర్డ్‌ రూమ్‌లో ఈ సినిమా కథ చెప్పారు. ఆయన చెప్పి, వెళ్లిన తర్వాత మేం చర్చించుకున్నాం. ‘ఇది బరువైన కథ కాదు.. తేలిగ్గా ఉంది’ అని అభిప్రాయాలు వచ్చాయి. కథ ఉంటే సినిమా హిట్‌ అవుతుందని కాదు.. స్క్రీన్‌ప్లే వస్తేనే హిట్‌ అవుతుందని నా అనుభవంతో అక్కడున్న వారికి చెప్పా. ఈ సినిమా సక్సెస్‌ ఫంక్షన్‌ వైజాగ్‌లో నిర్వహించబోతున్నాం. అక్కడ ఎక్కువగా మాట్లాడతా, ఇక్కడ తక్కువ మాట్లాడతా. ఈ సినిమా విడుదలకు ముందు రషెస్‌ చూసి.. ‘ఏంటి.. డిఫరెంట్‌గా చేశావ్‌?’ అని బన్నీతో అన్నా. ‘డిఫరెంట్‌ అంటే..’ అన్నాడు. ఏం లేదు.. ‘సినిమాను డిఫరెంట్‌గా చేయాలని నిర్ణయించుకుని.. తొక్కేశావు’ అన్నా. అంత సునాయాశంగా నటించేశాడు. కెమెరా ముందు సులభంగా అనిపించినా.. అలా నటించాలంటే వెనుక నరాలు తెగిపోతాయి. అతడి తపన అలాంటిది’ అని అల్లు అరవింద్‌ అన్నారు.

 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని