వారసురాళ్లు.. ఇప్పుడయ్యారు హీరోయిన్లు..!
close
Updated : 29/02/2020 09:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వారసురాళ్లు.. ఇప్పుడయ్యారు హీరోయిన్లు..!

కుటుంబం పేరు చెప్పుకొని చిత్ర పరిశ్రమకు రావడం సులభం. కానీ, స్టార్‌గా నిలదొక్కుకోవడం చాలా కష్టం. ఓర్పు, శ్రమ, పట్టుదల ఉంటే తప్ప ప్రేక్షకుల మన్ననలు దక్కవు. ఇలా కుటుంబ నేపథ్యంతో పరిశ్రమకు వచ్చినప్పటికీ.. శ్రమతో వెండితెరపై తమదైన ముద్ర వేస్తున్నారు కొందరు ముద్దుగుమ్మలు. చక్కటి అభినయం, అందంతో ప్రేక్షకులకు దగ్గర కావడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే అనేక మంది తమ నటనతో గుర్తింపు తెచ్చుకున్నారు. శ్రుతి హాసన్‌, కరీనా కపూర్‌, ఆలియా భట్‌, సోనమ్‌ కపూర్‌ తదితరులు ఈ కోవకు చెందిన వాళ్లే. ఇప్పుడిప్పుడే మరికొందరు వారసురాళ్ల అడుగులు ఇటువైపు పడుతున్నాయి. నటీమణులుగా అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యారు. ఇలా సినీ నేపథ్యం ఉన్న హీరోయిన్ల జాబితాను ఓ సారి చూద్దాం..

కేరళ కుట్టి

పరిశ్రమకు వచ్చిన కొన్ని రోజుల్లోనే  ‘మహానటి’ అనిపించుకున్నారు కీర్తి సురేశ్‌. మలయాళ నిర్మాత సురేష్‌ కుమార్‌, నటి మేనకల కుమార్తె. 2000లో తండ్రి నిర్మాతగా వ్యవహరించిన మలయాళ చిత్రం ‘పైలట్స్‌’ ఆమె తొలి సినిమా. అంతేకాదు ‘అచనేయనెనిక్కిష్టం’, ‘కుబేరన్’ వంటి చిత్రాల్లో, కొన్ని సీరియల్స్‌లో నటించి పేరు తెచ్చుకున్నారు. హీరోయిన్‌గా ఆమె మొదటి సినిమా మలయాళ చిత్రం ‘గీతాంజలి’. 2016లో ‘నేను శైలజ’తో కీర్తి సురేశ్‌ తెలుగులో తెరంగేట్రం చేశారు. ‘మహానటి’తో ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకున్నారు. ఆపై పలు కమర్షియల్‌ సినిమాల్లో నటించి హిట్లు అందుకున్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో ‘మిస్‌ ఇండియా’, ‘పెంగ్విన్‌’, ‘గుడ్‌ లక్‌ సఖి’, రంగ్‌దే’తో పాటు ఓ తమిళ, ఓ మలయాళ సినిమాలు ఉన్నాయి.

శ్రీదేవి తనయ..

నటి శ్రీదేవి, నిర్మాత బోనీ కపూర్‌ల మొదటి కుమార్తె జాన్వి కపూర్‌ ఒక్క చిత్రంతోనే అందరి దృష్టిని తనవైపునకు తిప్పుకొన్నారు. 2018లో ఆమె తొలి సినిమా ‘ధడక్‌’ విడుదలై, మంచి విజయం సాధించింది. దీని తర్వాత ఆమె వరుస చిత్రాలకు సంతకం చేశారు. ‘గుంజన్‌ సక్సేనా’, ‘రూహీ అఫ్జా’, ‘దోస్తానా 2’ సినిమాల్లో సందడి చేయబోతున్నారు. ‘ఘోస్ట్‌ స్టోరీస్‌’ అనే సిరీస్‌లో నటించి, మెప్పించారు.

మెగా వారసురాలు

‘ఒక మనసు’తో హీరోయిన్‌గా పరిచయమైన మెగా వారసురాలు, నాగబాబు కుమార్తె నిహారిక. ఆపై ‘హ్యాపీ వెడ్డింగ్‌’, ‘సూర్యకాంతం’ సినిమాల్లో ఆమె నటించారు. ‘ఒరు నల్లనాల్‌ పాతు సొల్రెన్‌’తో కోలీవుడ్‌ ప్రేక్షకుల్ని కూడా పలకరించారు. ఇటీవల వచ్చిన ‘సైరా నరసింహారెడ్డి’లో ప్రత్యేక పాత్రలో కనిపించారు. మరోపక్క నిర్మాతగా వెబ్‌సిరీస్‌లు కూడా నిర్మిస్తున్నారు. ‘ముద్దపప్పు ఆవకాయ’, ‘నాన్న కూచి’, ‘మ్యాడ్‌ హౌస్‌’ వంటి సిరీస్‌ తీశారు. ఆమె తర్వాతి సినిమా ప్రకటించాల్సి ఉంది.

రాజశేఖర్‌ వారసురాళ్లు..

సీనియర్‌ నటులు రాజశేఖర్‌-జీవితల ఇద్దరు కుమార్తెలు శివానీ, శివాత్మిక కథానాయికలుగా మెప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. చిన్న కుమార్తె శివాత్మిక ‘దొరసాని’ సినిమాతో అరంగేట్రం చేశారు. ఇందులో ఆమె నటనను అందరూ మెచ్చుకున్నారు. అవార్డు కూడా దక్కింది. ఇప్పుడు ఆమె కృష్ణవంశీ ‘రంగమార్తాండా’, దుర్గ నరేష్‌ ‘విధి విలాసం’లో నటిస్తున్నారు.

ఇక రాజశేఖర్‌ పెద్ద కుమార్తె శివానీ కూడా నటిగా అలరించేందుకు సిద్ధమయ్యారు. ఆ మధ్య అడవి శేష్‌తో కలిసి హిందీ హిట్‌ ‘టూ స్టేట్స్‌’  చిత్రంలో నటించారు. కొన్ని కారణాల వల్ల ఈ చిత్రం ఆగిపోయింది.

సైఫ్‌ అలీ ఖాన్‌ బేటీ..

పటౌడీ వారసురాలు, నటులు సైఫ్‌ అలీ ఖాన్‌, అమృత సింగ్‌ల కుమార్తె సారా అలీ ఖాన్‌. ఈ భామ తొలి సినిమాతోనే ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు అందుకున్నారు. 2018లో వచ్చిన ‘కేదార్‌నాథ్‌’ ఆమె అరంగేట్ర చిత్రం. దీని తర్వాత ‘సింబా’, ‘లవ్‌ ఆజ్‌ కల్‌’ సినిమాల్లో కథానాయికగా ఆకట్టుకున్నారు. ప్రస్తుతం వరుణ్‌ ధావన్‌తో కలిసి ‘కూలీ నెంబరు 1’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ దశలో ఉంది.

లిసీ తనయ..

దర్శకుడు ప్రియదర్శన్‌, నటి లిసీ కుమార్తె కల్యాణి ప్రియదర్శన్‌ తెలుగు ప్రేక్షకుల ఆదరణ పొందారు. ‘క్రిష్‌ 3’ అసిస్టెంట్‌ ప్రొడక్షన్‌ డిజైనర్‌, ‘ఇరుముగన్‌’ అసిస్టెంట్‌ ఆర్ట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన ఆమె.. ‘హలో’తో అరంగేట్రం చేశారు. ‘చిత్రలహరి’, ‘రణరంగం’, ‘హీరో’ తదితర చిత్రాలతో అలరించారు. ప్రస్తుతం ఆమె చేతిలో పలు తమిళ, మలయాళ ప్రాజెక్టులు ఉన్నాయి.

చుంకీ పాండే డాటర్‌..

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు చుంకీ పాండే కుమార్తె అనన్య పాండే. 2019  ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2’తో ఆమె సినీ ప్రయాణం మొదలైంది. ‘పతి పత్ని ఔర్‌ ఓ’తో అదే ఏడాది హిట్‌ అందుకున్నారు. మరో హిందీ ప్రాజెక్టులోనూ నటిస్తున్నారు. అదేవిధంగా తెలుగులో పూరీ జగన్నాథ్‌, విజయ్‌ దేవరకొండ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమాకు సంతకం చేశారు. ఇందులో ఆమె ‘అర్జున్‌ రెడ్డి’ సరసన కనిపించనున్నారు.

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకంమరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని