అనుభవం నాపై బాధ్యత పెంచింది: అనుష్క
close
Published : 12/03/2020 23:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అనుభవం నాపై బాధ్యత పెంచింది: అనుష్క

హైదరాబాద్‌: టాలీవుడ్‌లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌ నటి అనుష్కశెట్టి. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో నాగార్జున హీరోగా వచ్చిన సూపర్‌ సినిమాతో ఆమె టాలీవుడ్‌కు పరిచయమైంది. ఆ తర్వాత పెద్దపెద్ద హీరోల సరసన కనిపించిందీ ఈ బెంగళూరు భామ. ఆ తర్వాత విక్రమార్కుడు, లక్ష్యం సినిమాల్లో కనిపించింది. బాహుబలిలో దేవసేనగా దేశ నలుమూలల అభిమానులను సొంతం చేసుకుంది. తాజాగా.. అనుష్కశెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం నిశ్శబ్దం. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పొరేషన్ పతాకాలపై టీజీ విశ్వప్రసాద్, కోనవెంకట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా సినిమాను తెరకెక్కించినట్టు తెలుస్తోంది. ఈ చిత్రం ఏప్రిల్ 2న  థియేటర్లలో సందడి చేయనుంది. అనుష్క తెలుగు సినిమాలోకి అడుగుపెట్టి 15సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్రబృందం ‘15 ఇయర్స్‌ ఆఫ్‌ అనుష్కశెట్టి’ అనే కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.

బాధ్యత పెంచింది
అనుష్క మాట్లాడుతూ.. ‘పదిహేనేళ్ల అనుభవం నాపై బాధ్యత పెంచింది. నా మొదటి నుంచి సినిమా నుంచి ఇప్పటి వరకూ నాతో చేసిన దర్శకులు, నిర్మాతలు, నటులు అందరికీ కృతజ్ఞతలు. ఏప్రిల్‌ 2న నిశ్శబ్దం వస్తుంది. మీకు నచ్చుతుందని అనుకుంటున్నా. అందరూ పెళ్లి ఎప్పుడని అడుగుతున్నారు. నేను కూడా ఇంకా ఏదీ అనుకోలేదు. జరిగినప్పుడు అందరికీ తెలుస్తుంది.’ ఆమె చెప్పింది.

స్వీటీ అందరికీ సన్నిహితురాలు: రాజమౌళి 
రాజమౌళి మాట్లాడుతూ.. ‘ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనిస్తుంది. ఆమెతో దేవసేన పాత్ర క్రియేట్‌ చేసినందుకు చాలా గర్వంగా ఫీల్‌ అవుతున్నాను. కేవలం ఒక వ్యక్తిగానే కాకుండా ఆమె నటిగానూ ప్రత్యేక స్థానం సొంతం చేసుకుంది. ఆమె సినీ నటిగానే కాకుండా మా కుటుంబ సభ్యురాలిలా కలిసి ఉంటాం. నిశ్శబ్దం సినిమా మంచి హిట్‌ సాధించాలని కోరుకుంటున్నా’ అని ఆయన పేర్కొన్నారు.

ఆడిషన్‌ లేకుండానే హీరోయిన్‌గా తీసుకున్నాం: పూరి జగన్నాథ్‌ 
పూరి జగన్నాథ్‌ మాట్లాడుతూ.. ‘రవితేజ, చార్మి, నేను అనుష్కను అమ్మ అని పిలుస్తాం. మంచితనం, తెలివితేటలు కలిస్తే ఆమె. సూపర్‌ సినిమాలో హీరోయిన్‌ కోసం ముంబయి వెళ్లాను. అక్కడ ఒక అమ్మాయి ఉందని చెప్పారు. చాలా బాగుంది. మంచి హైట్‌. హీరోయిన్‌గా బాగా పనికొస్తుందని అనుకున్నాను. పేరేంటి అని అడిగితే.. స్వీటి అని చెప్పింది. స్టాంప్‌ సైజు కన్నా చిన్న ఫొటో ఒకటి ఇచ్చింది. దీంతో ఈమె సినిమా పక్షి కాదనుకున్నాను. యాక్టింగ్ వచ్చా అని అడిగా.. ఎప్పుడు ట్రై చేయలేదు చేస్తా అని చెప్పింది. డ్యాన్స్‌ కూడా వస్తుందో రాదో నాకే తెలియదు అని చెప్పింది. చూడ్డానికి బాగానే ఉంది. కానీ, ఈ పిల్లేంటి నాకు ఇలా షాకులిస్తుందనుకున్నా. అయినా సరే ఫరవాలేదు అవకాశం ఇచ్చి చూద్దాం అని అన్నపూర్ణ స్టూడియోస్‌కు తీసుకొచ్చాను. ఆమెను చూసిన తర్వాత ఆడిషన్‌ లేకుండానే నాగార్జున గారు హీరోయిన్‌గా తీసుకుందాం అని చెప్పేశారు. దీంతో ఆమెనే హీరోయిన్‌గా ఫిక్సయ్యాం. అలా అనుష్క అనే పేరు కూడా పెట్టాం. అలా మొదలైన ఆమె జర్నీ సూపర్‌గా సాగిపోతోంది.

మంచి వ్యక్తిత్వం ఉన్న నటి: శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి 
అరుంధతితో అనుష్కకు మంచి అవకాశం కల్పించిన శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘ఒక పని మీద రష్యాకు వెళ్లినప్పుడు ఒక క్యాబ్‌ డ్రైవర్‌ అనుష్క గురించి అడిగాడు. అప్పుడు నేను షాక్‌ అయ్యాను. అనుష్క గురించి రష్యాలో జార్జ్‌ అనే వ్యక్తి మాట్లాడటం నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. ఆమె సినీ నటిగానే కాదు తన మంచి వ్యక్తిత్వంతో ఆ ఖ్యాతి సంపాదించింది. ఇక సినిమా గురించి మాట్లాడాలంటే.. నిశ్శబ్దం సినిమా హిట్‌ కావాలని కోరుకుంటున్నా. సినిమాకు మంచి నిపుణులు పనిచేశారు’ అని ఆయన పేర్కొన్నారు.
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మాట్లాడుతూ..  ‘సూపర్‌ సినిమా సమయంలో తొలిసారి అనుష్కను చూసినప్పుడు ఆమె దక్షిణాదిలో నంబర్‌వన్‌ హీరోయిన్‌ అవుతుందని నాగార్జున, నేను అప్పుడే అనుకున్నాం. అనుకున్నట్లుగా ఆమె నంబర్‌వన్‌ అయింది’ అని ఆయన అన్నారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని