డైరీ నిండిపోయింది
close
Published : 14/03/2020 09:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

డైరీ నిండిపోయింది


సినిమా తర్వాత సినిమా అనే రోజులు పోయాయి. ఇప్పుడు వేగం పెరిగింది. ఒక సినిమా సెట్స్‌పై ఉండగానే మరో సినిమాకి రంగం సిద్ధం కావల్సిందే. లేదంటే వెనకబడిపోతాం అంటున్నారు కథానాయకులు. తప్పదనిపిస్తే తప్ప... ఒకే సినిమాతో ప్రయాణం చేయడానికి ఇప్పుడెవ్వరూ ఇష్టపడటం లేదు. యువ కథా నాయకులైతే ఆ విషయంలో మరింత పక్కాగా ఉంటున్నారు. వాళ్ల కోసం విరివిగా తయారవుతున్న కథలు కూడా వాళ్లని మరింత ఉత్సాహంగా ముందడుగు వేయిస్తున్నాయి. దాంతో చాలామంది డైరీలు ఏడాది ఆరంభంలోనే నిండి పోయాయి.

థానాయికల తరహాలో ఏడాదికి నాలుగైదు సినిమాలు చేయడం హీరోలకి సాధ్యమయ్యే విషయం కాదు. కథలు, అంచనాలు, సీజన్‌, విడుదల తేదీలు... ఇలా చాలా లెక్కలుంటాయి. వీటన్నింటిని దృష్టిలో     ఉంచుకుని ఆచితూచి అడుగేయాల్సిందే. ఇన్ని ప్రతికూలతలు ఉన్నా... మన కథానాయకులు పక్కా ప్రణాళికలతో సినిమాల్ని పట్టాలెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. విడుదల తేదీలు కాస్త అటూ ఇటూ అయినా... అనుకున్నట్టుగా ఏడాదికి రెండు మూడు సినిమాలు చేసేస్తున్నారు. పోటీ వాతావరణంలో ఈ మాత్రం వేగంతో దూసుకెళ్లడం అవసరమే అనేది వాళ్ల అభిప్రాయం. అగ్ర కథానాయకుల నుంచి, యువతరం హీరోల వరకు అందరిదీ అదే పంథానే. చాలామంది కథానాయకులు ప్రస్తుతం మూడు నాలుగు సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఒక సినిమా సెట్స్‌పైన, మరో సినిమా స్క్రిప్ట్‌ దశలో, ఇంకో రెండు చర్చల దశలో!

మెరుపు వేగం...
యువ హీరోలకి తగ్గ కథలకి కొరత ఎప్పుడూ ఉండదు. అగ్ర కథా నాయకులకి కథలు   కుదరడమే కష్టమైన పని. అలాంటి పరిస్థితుల నుంచి చిత్ర పరిశ్రమ క్రమంగా బయట పడుతున్నట్టు స్పష్టమవుతోంది. అగ్ర హీరోలు సైతం గేరు మార్చి వేగం పెంచుతుండడమే అందుకు కారణం. పొరుగున ఆడిన కథలపై కూడా కన్నేస్తూ రీమేక్‌లకు ప్రయత్నించడం, స్థానికంగా కూడా దర్శకులతో ప్రత్యేకంగా కథలు సిద్ధం చేయించడం... ఇలా ఏదో రకంగా  సినిమాల్ని మాత్రం పట్టాలెక్కిస్తున్నారు. అగ్ర కథానాయకుల్లో ప్రస్తుతం పవన్‌ కల్యాణ్‌ మెరుపు వేగం ప్రదర్శిస్తున్నారు. ఒక పక్క రాజకీయాలతో బిజీగా ఉంటూనే, మరోపక్క మూడు సినిమాలకి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చేశారు. ప్రస్తుతం రెండు సినిమాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి. అందులో ఒకటి ‘వకీల్‌సాబ్‌’. వేణు శ్రీరామ్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. హిందీలో విజయవంతమైన ‘పింక్‌’ రీమేక్‌ ఇది. రెండో చిత్రం క్రిష్‌ దర్శకత్వంలో రూపొందుతోంది. ఆ తర్వాత హరీష్‌శంకర్‌ దర్శకత్వంలో సినిమా ఉంటుంది. ‘గబ్బర్‌ సింగ్‌’ తర్వాత ఆ కలయికలో రూపొందుతున్న మరో చిత్రమిది. ఇవే కాకుండా దర్శకుడు కిశోర్‌ పార్థసాని (డాలి) కూడా పవన్‌ కోసం ఓ కథని సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. రవితేజ కూడా పవన్‌ తరహాలోనే ఒక సినిమా చేస్తూ, కొత్తగా మూడు కథల్ని ఖాయం చేశారు.

యువ హవా
యువ కథానాయకుల్లో నానిది ఎప్పుడూ ఎక్స్‌ప్రెస్‌ వేగమే.  ఆయన్నుంచి ఒక్కో ఏడాదిలో మూడు    సినిమాలు వస్తుంటాయి. గత రెండేళ్లు కొంచెం వేగం తగ్గించినట్టు కనిపించిన ఆయన మళ్లీ జోరు పెంచారు. ఈ ఏడాది ఆయన్నుంచి మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశాలున్నాయి. ఈ ఉగాదికి ‘వి’తో సందడి చేయబోతున్న నాని, ప్రస్తుతం ‘టక్‌ జగదీష్‌’ పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఆ తర్వాత ‘శ్యామ్‌ సింగరాయ్‌’ కోసం రంగంలోకి దిగుతారు. ఈ  చిత్రం డిసెంబరు 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వీటితోపాటు ‘బ్రోచెవారెవరురా’ దర్శకుడు వివేక్‌ ఆత్రేయ చెప్పిన కథ కూడా నానికి నచ్చిందని సమాచారం. యువ హీరోల్లో నితిన్‌ కూడా నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నారు. కొంచెం విరామం తీసుకుని ‘భీష్మ’తో మళ్లీ విజయాల బాట పట్టారాయన. ప్రస్తుతం ‘రంగ్‌దే’లో నటిస్తున్నారు. ఇటీవలే ‘అంధాధున్‌’ రీమేక్‌ను పట్టాలెక్కించారు. మేర్లపాక గాంధీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో నితిన్‌ అంధుడుగా కనిపించబోతున్నాడు. అలాగే చంద్ర శేఖర్‌ యేలేటితో ఓ చిత్రం చేస్తున్నారు నితిన్‌. ‘చెక్‌’ అనే పేరుతో ప్రచారంలో ఉంది ఆ సినిమా. మరోవైపు కృష్ణ చైతన్య దర్శకత్వంలో ‘పవర్‌ పేట’ అనే చిత్రం కోసం సన్నద్ధమవుతున్నారు. ఇందులో ఆయన మూడు విభిన్న పాత్రలు పోషించనున్నాడు.

వీళ్లు ఇలా...
భిన్నమైన కథలతో సినిమాలు చేస్తున్న కథానాయకుడు రానా దగ్గుబాటి. ఇకపై ఆయన్నుంచి వరుసగా   సినిమాలు రాబోతున్నాయి. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రూపొందిన ‘అరణ్య’ ఏప్రిల్‌ 2న రానుంది. ప్రభు సాల్మన్‌ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం వేణు ఊడుగుల దర్శకత్వంలో ‘విరాటపర్వం’ చేస్తున్నారు. 1990ల నాటి రాజకీయ, సామాజిక పరిస్థితుల నేపథ్యంలో రూపొందుతోంది. ఇదివరకే ప్రకటించిన ‘హిరణ్య కశ్యప’ ఈ ఏడాది పట్టాలెక్కే అవకాశాలున్నాయి. సోషియో ఫాంటసీగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి గుణశేఖర్‌ దర్శకుడు. వీటితోపాటు తేజ దర్శకత్వంలో ఇటీవలే ఓ చిత్రం చేయడానికి అంగీకారం తెలిపారు. అది కూడా ఈ ఏడాదే పట్టాలెక్కే అవకాశాలున్నాయి. నాగచైతన్య డైరీ కూడా అస్సలు ఖాళీ లేదు. ఆయన ప్రస్తుతం శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్‌స్టోరీ’ చేస్తున్నారు. ఆ తర్వాత విక్రమ్‌ కె.కుమార్‌, నందినిరెడ్డి, పరశురామ్‌తోపాటు మరో ఇద్దరు యువ దర్శకులు చైతూ కోసం కథలు సిద్ధం చేశారు. ఆయన కథల గురించి ప్రత్యేకంగా ఆలోచించాల్సిన అవసరం లేదు. యువతరమే కాదు, సీనియర్‌ హీరోలు కూడా ఖాళీ లేకుండా గడుపుతున్నారు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్‌, నాగార్జునల దగ్గర కూడా కథల జాబితాలు పెద్దగానే ఉన్నాయి. దాంతో వాళ్లు కూడా శరవేగంగా సినిమాలు పూర్తి చేయడంపై దృష్టిపెట్టారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని