జనతా కర్ఫ్యూ: అభిమానులకు ఎన్టీఆర్‌ పిలుపు
close
Published : 21/03/2020 20:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జనతా కర్ఫ్యూ: అభిమానులకు ఎన్టీఆర్‌ పిలుపు

ఐకమత్యంగా విజయవంతం చేద్దాం..

హైదరాబాద్‌: ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన ‘జనతా కర్ఫ్యూ’కు సినీ ప్రముఖులు ఎస్‌.ఎస్‌.రాజమౌళి, ఎన్టీఆర్‌, రాజశేఖర్‌, బోయపాటి శ్రీను తదితరులు మద్దతు తెలిపారు. అంతేకాదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సోషల్‌మీడియా వేదికగా అభిమానులను,  ప్రజలను కోరారు. ఇప్పటివరకూ మందులేని కరోనా వైరస్‌ నుంచి రక్షించుకోవడానికి సామాజిక దూరం పాటించడమే అసలైన మందని మోదీ గురువారం రాత్రి జాతిని ఉద్దేశిస్తూ అన్నారు. అందుకు నాందిగా ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రాకుండా స్వచ్ఛందంగా ‘జనతా కర్ఫ్యూ’ పాటించాలని కోరారు.

‘ఆదివారం ‘జనతా కర్ఫ్యూ’లో భాగంగా ప్రతి భారతీయుడు ఇంటిలోనే ఉండాలని, బయటికి రాకూడదని కోరుతున్నా. ఐకమత్యంగా కరోనా వైరస్‌పై పోరాడుదాం’ అని రాజమౌళి ట్వీట్‌ చేశారు. ‘కొవిడ్‌-19ని జయించాలంటే మనవంతు కృషి చేయాలి. రేపు జరిగే ‘జనతా కర్ఫ్యూ’ని విజయవంతం చేసి మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం’ అని ఎన్టీఆర్‌ పేర్కొన్నారు.

‘వీలైనంత వరకు ఇంటిలో ఉందాం. జాగ్రత్తలు తీసుకుందాం. ప్రస్తుతానికి మనకున్న ఒకే ఒక్క పరిష్కారం ఇది. తగిన ముందు జాగ్రత్త చర్యలతో ఒకరినొకరం కాపాడుకుందాం. రేపు జరగబోయే ‘జనతా కర్ఫ్యూ’లో పాల్గొనడం మర్చిపోకండి. ఈ వైరస్‌తో పోరాడుతున్న మన సైనికులను ప్రశంసిద్దాం’ అని రాజశేఖర్‌ ట్వీట్‌ చేశారు.

ఒకప్పుడు శుభ్రత అవసరమని, ఇప్పుడు బాధ్యతని దర్శకుడు బోయపాటి శ్రీను పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన వీడియో షేర్‌ చేశారు. ‘కరోనా వైరస్‌ ప్రభావం రోజురోజుకీ పెరుగుతోంది. భారతీయ జీవన విధానం ప్రపంచ దేశాలకు ఆదర్శం. మన ఆహారపు అలవాట్లు, మన ఆరోగ్య సూత్రాలు మన పెద్దలు మనకిచ్చిన ఆస్తులు. క్రమశిక్షణతో వాటిని పాటిస్తే.. దేన్నైనా ఢీకొట్టగలిగే పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఒకానొక సమయంలో శుభ్రత అనేది అవసరం.. ఇప్పుడు బాధ్యత. మోదీ గారికి మద్దతుగా ఉందాం.. ఆయన సూచనల్ని పాటిద్దాం’ అని బోయపాటి చెప్పారు.

‘ఈ ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మనమంతా మన నివాసాల్లో ఉందాం. ఈ కష్ట సమయంలో ఐకమత్యంగా పోరాడుదాం. నేను జనతా కర్ఫ్యూని పాటిస్తున్నా.. మీరు కూడా పాటిస్తారని ఆశిస్తున్నా’ అని వెంకటేష్‌ అభిమానులకు పిలుపునిచ్చారు.

‘రేపు మనమంతా ఇంట్లో ఉందాం. ఏ ఇంట్లో, ఎవరికీ, ఏ ఇబ్బంది రాకుండా జాగ్రత్త పడదాం. మన ఇల్లు, మన దేశం, మన బాధ్యత.. జనతా కర్ఫ్యూ’ అని అనిల్‌రావిపూడి ట్వీట్‌ చేశారు.

‘కరోనా వైరస్‌ ఎంతో ప్రమాదకరం. దీన్ని తేలిగ్గా తీసుకోకూడదు. అందరూ ఎవరి ఇంటిలో వారు ఉండటానికి ప్రయత్నించండి. మన ప్రధాని జనతా కర్ఫ్యూకి పిలుపునిచ్చారు. ఆయనకు మద్దతు తెలుపుదాం. మన కోసం వైద్యులు ఎంతో కష్టపడుతున్నారు. వారి కోసం చప్పట్లు కొడదాం’ అంటూ మంచు మనోజ్ వీడియోను షేర్‌ చేశారు. అంతేకాదు మాలీవుడ్‌ హీరో మోహన్‌లాల్‌, కోలీవుడ్‌ హీరో ధనుష్‌ కూడా జనతా కర్ఫ్యూకి మద్దతిచ్చారు. ఆదివారం ఇళ్లల్లో ఉండాలని అభిమానుల్ని కోరారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని