ఇంటిని ఆసుపత్రిగా మార్చాలనుకుంటున్నా: కమల్‌
close
Updated : 25/03/2020 19:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇంటిని ఆసుపత్రిగా మార్చాలనుకుంటున్నా: కమల్‌

సినీ కార్మికుల ఆకలి తీరుస్తున్న తారలు

కోడంబాక్కం: సినీ కార్మికుల కష్టాలు తీర్చేందుకు తారలు, దర్శక నిర్మాతలు ముందుకొస్తున్నారు. కరోనా నేపథ్యంలో చిత్రీకరణలు నిలిచిపోవడంతో సమస్యలు ఎదుర్కొంటున్న చిత్ర పరిశ్రమలోని కార్మికుల ఆకలి తీర్చేందుకు కమల్‌ హాసన్‌ రూ.10 లక్షలు, ధనుష్‌ రూ.15 లక్షలు, శంకర్‌ రూ.10 లక్షలు విరాళం ప్రకటించారు.

అంతేకాదు తన ఇంటిని కరోనా చికిత్స కోసం ఆసుపత్రిగా మార్చాలనుకుంటున్నానని కమల్‌ పేర్కొన్నారు. ఈ విషయమై ఆయన ట్వీట్ చేశారు. ‘‘ఈ క్లిష్ట పరస్థితుల్లో పేదలకు సేవలందించాలనుకుంటున్నా. అందువల్ల నా పార్టీ ‘మక్కల్‌ మయ్యం’లోని వైద్యులతో కలసి, నా ఇంటిని ఆసుపత్రిగా మార్చాలని భావిస్తున్నా. ప్రభుత్వం అనుమతిస్తే అలా చేసేందుకు సిద్ధంగా ఉన్నా’’ అని కమల్‌హాసన్‌ చెప్పారు. తమ కుటుంబ సభ్యులకు కనీసం భోజనం పెట్టలేకపోతున్నామంటూ ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా (ఫెఫ్సీ) అధ్యక్షుడు ఆర్కే. సెల్వమణికి ఓ కార్మికుడు ఫోన్‌ చేసి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సభ్యుల్ని ఆదుకోవాలని సెల్వమణి సినీ ప్రముఖుల్ని కోరారు.

ఇప్పటికే సూర్య, కార్తి, శివకుమార్‌ కలిసి రూ.10 లక్షలు విరాళం ఇచ్చారు. రజనీకాంత్‌ రూ.50 లక్షలు, విజయ్‌ సేతుపతి రూ.10 లక్షలు, శివకార్తికేయన్‌ రూ.10 లక్షలు ఆర్థిక సాయం చేశారు. దర్శకుడు హరి 100 బస్తాల బియ్యం అందజేశారు. నిర్మాత దిల్లీబాబు 20 బస్తాల బియ్యం వితరణగా ఇచ్చారు. తమిళ సినిమా జర్నలిస్టు డైలీస్‌ అసోసియేషన్‌ తరఫున 100 కిలోల బియ్యం అందజేశారు. నటుడు మనీష్‌కాంత్‌ 40 కిలోల పప్పు దినుసులు ఇవ్వగా పలువురు నటీనటులు ఇతర రూపాల్లో సాయం అందజేశారు.

నటి రోజా బియ్యం అందజేత

సీˆనియర్‌ నటి, నగరి నియోజకవర్గం ఎమ్మెల్యే నటి రోజా ఫెఫ్సీకి 100 బియ్యం బస్తాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె ఓ వీడియోను విడుదల చేశారు. ఫెఫ్సీకి తాను చేసిన ఈ సహాయం గొప్ప విషయం కాదని, అందరూ బయటకు రాకుండా సంతోషంగా ఇంట్లోనే ఉండాలని కోరారు. అదే సమాజానికి చేసే పెద్ద మేలని పేర్కొన్నారు.

విచ్చలవిడిగా తిరుగుతున్నారు

కరోనా వ్యాప్తి చెందుతున్నప్పటికీ ప్రజలు విచ్చలవిడిగా తిరుగుతున్నారని నటి వరలక్ష్మి శరత్‌కుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు వీడియోను విడుదల చేశారు. ‘ఓ గ్రూపు తమకు కరోనా వైరస్‌ సోకదులే అన్న ధైర్యంతో బయట విచ్చలవిడిగా తిరుగుతోంది. వారితోనే ప్రధానంగా ఈ వీడియో ద్వారా మాట్లాడదలచుకున్నా. ఈ వ్యాధి ఎవరికైనా వ్యాపిస్తుంది. సుమారు 27 శాతం మంది మాత్రమే ఇళ్లలో ఉంటున్నారని గణాంకాలు చెబుతున్నాయి. మిగిలినవారు బయట తిరుగుతున్నారు. దీనివల్ల వారితో పాటు సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రమాదం. ముఖ్యంగా వయసు మీదపడిన ఇరుగుపొరుగు వారికి వ్యాధి సోకే అవకాశముంది. వీలైనంత వరకు ఆ వృద్ధులకు సహకరించండి. ఇక ఇంటి అద్దె తీసుకునేవారికి నా వేడుకోలు ఇది. ప్రస్తుతం ఎవరికీ జీతాల్లేవు. అందువల్ల పెద్ద మనసు చేసుకుని ఒక నెల అద్దె అడగకండి. మనది ఇటలీ మాదిరిగా చిన్న దేశం కాదు. 134 కోట్ల మంది జనాభా ఉన్నాం. అలా విచ్చలవిడిగా తిరిగితే ఏం జరుగుతుందోనని ఒక్కసారి బుద్ధితో ఆలోచించండి. అందరూ ప్రభుత్వానికి సహకరించి కరోనాను తరిమికొడుదాం’ అని పేర్కొన్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని