నా భర్తకి కరోనా లక్షణాలున్నాయి: శ్రియ
close
Published : 14/04/2020 18:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నా భర్తకి కరోనా లక్షణాలున్నాయి: శ్రియ

ఆసుపత్రి నుంచి బలవంతంగా పంపేశారు..

హైదరాబాద్‌: తన భర్త ఆండ్రీకి కరోనా లక్షణాలున్నాయని కథానాయిక శ్రియ పేర్కొన్నారు. పొడిదగ్గు, జర్వంతో బాధపడుతున్నాడని ఓ ఆంగ్లపత్రికతో అన్నారు. రష్యాకు చెందిన క్రీడాకారుడు ఆండ్రీని శ్రియ 2018 మార్చిలో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత కూడా ఆమె నటిగా సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం భర్తతో కలిసి స్పెయిన్‌లో ఉంటున్నారు. ఆ దేశంలో కూడా కరోనా వైరస్‌ విజృంభిస్తుండటంతో లాక్‌డౌన్‌ విధించారు. గత కొన్ని రోజులుగా శ్రియ క్వారంటైన్‌లో ఉంటున్న వీడియోలు, ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా షేర్‌ చేస్తున్నారు. ఇంట్లో సమయం గడపడం ఎంతో నచ్చిందని పేర్కొన్నారు.

తాజాగా తన భర్త ఆరోగ్య పరిస్థితి గురించి శ్రియ మీడియాకు వెల్లడించారు. ‘ఆండ్రీకి పొడిదగ్గు వస్తోంది. శరీర ఉష్ణోగ్రత కూడా పెరిగింది. వెంటనే ఆసుపత్రికి వెళ్లాం. అక్కడి డాక్టర్లు మా బాధ్యతాయుత ప్రవర్తనకు సంతోషించారు. పరీక్షించిన వైద్యులు మమ్మల్ని తిరిగి ఇంటికి పంపేశారు. ‘కరోనా వైరస్‌ లేకపోయినా.. ఆసుపత్రిలో ఉంటే వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి’ అని చెప్పారు. అందుకే ఇంటికి వచ్చేశాం. స్వీయ నిర్బంధంలో ఉంటున్నాం. ఇంటి నుంచే వైద్యులు ఆండ్రీని పర్యవేక్షిస్తున్నారు. మేమిద్దరం వేర్వేరు గదుల్లో నిద్రపోతున్నాం. భౌతికదూరం పాటిస్తున్నాం. దేవుడి దయవల్ల అతడి ఆరోగ్యం ఇప్పుడు బాగుంది’ అని ఆమె చెప్పారు.

అనంతరం స్పెయిన్‌లో పరిస్థితుల్ని వివరిస్తూ.. ‘మార్చి 13న మా పెళ్లి రోజు. అందుకే రెస్టారెంట్‌కు వెళ్లాలని ముందుగానే రిజర్వేషన్‌ చేసుకున్నాం. అప్పుడే కరోనా ప్రభావం ఎలా ఉందో అర్థమైంది. అన్ని రెస్టారెంట్లను మూసేశారు. స్పెయిన్‌ మొత్తం లాక్‌డౌన్‌లో ఉంది. అప్పటి నుంచి పరిస్థితులు ఘోరంగా మారాయి. కరోనా ప్రజల జీవితాల్ని తారుమారు చేసింది. పోలీసులు ఇంటిలోని ఓ వ్యక్తిని మాత్రమే బయటికి అనుమతిస్తున్నారు. ఓసారి నేను, ఆండ్రీ కలిసి బయటికి వెళ్లాల్సి వచ్చింది.  ఆ సమయంలో పోలీసులు మమ్మల్ని ఆపారు. నా శరీర రంగు, ఆండ్రీ శరీర రంగు వేరుగా ఉండటంతో.. ఒకే ఫ్యామిలీ కాదనుకోని పంపేశారు’ అని శ్రియ పేర్కొన్నారు. 1,70,000 పైగా కరోనా పాజిటివ్‌ కేసులతో స్పెయిన్‌ ప్రపంచదేశాల్లో రెండో స్థానంలో ఉంది. ఇక ఆ దేశంలో 18,000కు పైగా కరోనా మరణాలు నమోదయ్యాయి. 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని