పాకెట్‌మనీ కోసం చేసిన పని స్టార్‌‌ను చేసింది!
close
Published : 28/04/2020 09:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పాకెట్‌మనీ కోసం చేసిన పని స్టార్‌‌ను చేసింది!

సమంత బర్త్‌డే స్పెషల్‌

ఓ సామాన్య కుటుంబం నుంచి చిత్ర పరిశ్రమకు వచ్చారామె. కాలేజీలో చదివే రోజుల్లో పాకెట్‌ మనీ కోసం ఫంక్షన్‌ హాల్‌లో పనిచేసిన రోజులున్నాయి. ఓ సొంత ఇల్లు కోసం కలలు కన్న సాధారణ అమ్మాయి. బ్యాంక్‌ అకౌంట్‌లో రూ.50 లక్షలుంటే చాలు అనుకుంది. విధి ఆమె కష్టపడేతత్వం చూసి.. ఒక్క ఛాన్స్‌ ఇచ్చింది. అలా 2010లో సినీ రంగంలోకి అడుగుపెట్టి.. దశాబ్ద కాలంగా అందర్నీ మాయ చేసింది. ప్రతి అవకాశాల్ని అందిపుచ్చుకుని నేడు అగ్ర కథానాయికగా వెలుగొందుతోంది. ప్రతి సినిమాను మొదటి చిత్రంగా భావించడం, ఛాలెంజ్‌ను స్వీకరించడమే ఆమె విజయం వెనుక రహస్యం. ఇప్పటికే అర్థమై ఉంటుంది.. ఇదంతా సమంత గురించేనండీ. మంగళవారం సమంత పుట్టినరోజు. అంతేకాదు ఈ ఏడాది ఆమె కెరీర్‌ ఆరంభించి పదేళ్లు పూర్తయింది. ఈ పదేళ్లలో నటిగానే కాదు.. ఓ మంచి వ్యక్తిత్వంపరంగానూ సామ్‌ ఎదిగారు. కష్టాలుపడి పైకిలేచారు కాబట్టి.. పేద చిన్నారుల కన్నీరు తుడుస్తున్నారు. ఓ స్వచ్ఛంద సంస్థను స్థాపించి తన సంపాదనలో కొంత వారి కోసం ఖర్చు చేస్తున్నారు. ఆమె పుట్టినరోజు సందర్భంగా సామ్‌ సినీ కెరీర్‌లోని ప్రత్యేకతలు చూద్దాం..!

సామ్‌ చెన్నైలో డిగ్రీ పూర్తి చేశారు. పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చేస్తున్న సమయంలో పాకెట్‌ మనీ కోసం మోడలింగ్‌ చేశారు. ఆ సమయంలో పలు ప్రకటనల్లో నటించారు. వీటిని చూసిన దర్శకుడు రవి వర్మన్‌ ఆమెను సంప్రదించారు. తన సినిమా ‘మోస్కోవిన్‌ కావేరీ’లో కథానాయికగా సమంతను తీసుకున్నారు. ఈ చిత్రంలో రాహుల్‌ రవీంద్రన్‌ కథానాయికుడు. తమన్‌ సంగీతం అందించారు. సమంత తొలి సినిమా ఇదని చాలా తక్కువ మందికి తెలుసు. 2010 ఆగస్టు 27న ఈ చిత్రం విడుదలైంది. కానీ దీని తర్వాత సామ్‌ నటించిన ‘ఏ మాయ చేసావె’ మాత్రం 2010 ఫిబ్రవరి 26నే ప్రేక్షకుల ముందుకు రావడం విశేషం.

తొలి మాయ..

ప్రపంచంలో ఇంత మంది అమ్మాయిలుండగా నేను జెర్సీనే ఎందుకు ప్రేమించాలి.. అని ‘ఏ మాయ చేసావె’లో నాగచైతన్య తనను తానే ప్రశ్నించుకుంటారు. కథానాయికగా సమంత తొలి సినిమా ఇది. అరంగేట్రంతోనే అందరి మనసులో దోచేశారు. పక్కింటి అమ్మాయి అనిపించుకున్నారు. దీనికి తోడు ఈ సినిమాలో ఆమెకు చిన్మయి చెప్పిన డబ్బింగ్‌ పాత్రకు మరింత బలాన్ని చేకూర్చింది.

సమంత దూకుడు

సామ్‌ కెరీర్‌కు బ్రేక్‌నిచ్చిన చిత్రం ‘దూకుడు’. ఇందులో ఆమె, మహేశ్‌బాబుకు జోడీగా నటించారు. ఇక శ్రీను వైట్ల కామెడీ ట్రాక్‌లు ప్రేక్షకుల్ని తెగ నవ్వించాయి. ఈ సినిమాలో సామ్‌ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇది ఆమెకు వరుస అవకాశాలు రావడానికి కారణమైంది. అలా ‘ఈగ’, ‘సీతమ్మ వాకిట్లో సరిమల్లెచెట్టు’, ‘అత్తారింటికిదారేది’, ‘మనం’, ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించి ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు.

అనసూయ రామలింగం

ప్పటి వరకు సామ్‌ పోషించిన పాత్రలు ఓ ఎత్తు.. ‘అ..ఆ’లో ఆమె పాత్ర మరో ఎత్తు. ‘నేను వర్షాకాలం లాంటిదాన్ని. కురిసేది రెండు నెలలే అయినా పంట సంవత్సరం అంతా వస్తుంది..’ అంటూ అల్లరి పిల్లగా సందడి చేసి వినోదం పంచారు. త్రివిక్రమ్‌ మాటలు, సామ్‌-నితిన్‌ నటన సినిమాను హిట్‌ చేశాయి.

పల్లెటూరి పిల్ల రామలక్ష్మి

ప్పటి వరకు గ్లామర్‌, మోడ్రన్‌గా కనిపించిన సామ్‌ ‘రంగస్థలం’ సినిమాతో ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్‌ చేశారు. పల్లెటూరి అమ్మాయి రామలక్ష్మిగా డీగ్లామర్‌ పాత్రలో నటించి శభాష్‌ అనిపించుకున్నారు. సుకుమార్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రామ్‌చరణ్‌ వినికిడి లోపం ఉన్న పాత్రలో నటించారు. ఈ చిత్రం సామ్‌ కెరీర్‌లో మైలురాయిగా నిలిచింది.

సావిత్రి కోసం మధురవాణి

థానాయికగా మంచి ఫాంలో ఉన్న నటి చిన్న పాత్రకు సంతకం చేయడం అరుదుగా చూస్తుంటాం. అలనాటి తార సావిత్రి జీవితం ఆధారంగా తీసిన ‘మహానటి’ సినిమాలో సామ్‌ నటించారు. ‘మధురవాణి’గా సావిత్రి చివరి రోజుల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలని కష్టపడే పాత్రికేయురాలిగా మెప్పించారు. ఈ సినిమాలో సామ్‌ వింటేజ్‌ లుక్‌లో కనిపించారు. ఆమె పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ అందరికీ గుర్తుండి పోయింది. సావిత్రిలాంటి గొప్ప నటి జీవితాన్ని తెలిపే సినిమాలో తన భాగస్వామ్యం ఉండాలనే ఉద్దేశంతో ఇందులో నటించినట్లు ఓసారి సామ్‌ చెప్పారు.

సామ్‌ యూటర్న్‌

థానాయికా ప్రాధాన్యం ఉన్న సినిమాగా వచ్చిన ‘యూటర్న్‌’ విజయం సాధించింది. రచన అనే జర్నలిస్టుగా సామ్‌ కనిపించి, ప్రశంసలు అందుకున్నారు. రోడ్డుపై నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల జరిగే పరిణామాలు, వాటి వల్ల కుటుంబ సభ్యులుపడే బాధల నేపథ్యంలో సాగే చిత్రమిది. కథ మొత్తం దాదాపు రచన చుట్టూ తిరుగుతుంది. ఆది పినిశెట్టి, రాహుల్‌ రవీంద్రన్‌, భూమిక కీలక పాత్రలు పోషించారు.

భర్తతో మజిలీ

ర్తంటే ఆమెకు ప్రాణం.. కానీ భార్యపై కొంచెం కూడా ఇష్టం లేదా భర్తకు. అతడిలో ఎప్పటికైనా మార్పు వస్తుందని ఆశిస్తూ అలానే జీవితాన్ని గడిపేస్తుంటుంది. ఈ కథాంశంతో పెళ్లి తర్వాత సామ్‌-చైతన్య కలిసి నటించిన సినిమా ‘మజిలీ’. 2019లో వచ్చిన ఈ చిత్రం అభిమానులకు ట్రీట్‌ ఇచ్చింది. శ్రావణి అనే సాధారణ అమ్మాయిగా సామ్‌ అలరించారు. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కూడా విజయం సాధించింది.

అమ్మాయిగా మారే బామ్మ

పైకి అందమైన యువతిలా కనిపిస్తూ నటిస్తున్నది వృద్ధురాలన్న సంగతి గుర్తుపెట్టుకుని చేయడం అంత సులభమేమీ కాదు. నడక, మాట తీరు, చేష్టలు.. అన్నింటిలోనూ వ్యత్యాసం చూపించాలి. లేకపోతే సన్నివేశం పండదు, ప్రేక్షకుడు కనెక్ట్‌ అవ్వడు. ఈ విషయంలో సమంత వంద శాతం సక్సెస్‌ అయ్యారు. ‘ఓ బేబీ’ సినిమాలో సీనియర్‌ నటి లక్ష్మిగా పలికించే హావభావాలతో ఫిదా చేశారు. కొరియన్‌ సినిమా ‘మిస్‌గ్రానీ’కి రీమేక్‌ ఇది. నందినిరెడ్డి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో సామ్‌ నటన హైలైట్‌గా నిలిచిందని విమర్శకులు ప్రశంసల జల్లు కురిపించారు. అంతేకాదు చిత్రం కమర్షియల్‌గానూ సక్సెస్‌ అందుకుంది.

టు సినిమాలతోపాటు అటు సామాజిక సేవలోనూ సామ్‌ పాల్గొంటున్నారు. 2012లో ఆమె సొంతంగా ప్రత్యూష ఫౌండేషన్‌ స్థాపించారు. దీని ద్వారా మహిళలు, చిన్నారుల వైద్యానికి కావాల్సిన మందులను అందిస్తున్నారు. అంతేకాదు శస్త్ర చికిత్సలు కూడా చేయిస్తున్నారు. తను నటించే ప్రకటనలు, పాల్గొనే ప్రచార కార్యక్రమాల ద్వారా వచ్చిన మొత్తాన్ని సామ్‌ ఈ ఫౌండేషన్‌ కోసం ఉపయోగిస్తున్నారు. సామ్‌ తన పదేళ్ల కెరీర్‌లో 30కిపైగా అవార్డులు అందుకున్నారు. ఇటీవల ఆమె వెబ్‌ సిరీస్‌లోనూ నటించారు. ‘ది ఫ్యామిలీ మెన్‌’ సీజన్‌ 2లో సామ్‌ కనిపించనున్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రస్తుతం సమంత తన భర్త చైతన్యతో కలిసి ఇంట్లోనే ఉంటున్నారు.

-ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని