చింటూ జీ మరణవార్త నమ్మలేకపోతున్నాను!
close
Published : 30/04/2020 12:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చింటూ జీ మరణవార్త నమ్మలేకపోతున్నాను!

రిషీ కపూర్‌ మృతిపట్ల సెలబ్రిటీల సంతాపం

ముంబయి: బాలనటుడిగా, కథానాయకుడిగా, సహాయ నటుడిగా.. ఇలా అనేక పాత్రలతో ప్రతి ఒక్కరి మదిలో మరపురాని జ్ఞాపకాలను నింపిన బాలీవుడ్‌ దిగ్గజం రిషీ కపూర్‌. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో అలుపెరగని పోరాటం చేసిన ఆయన గురువారం ఉదయం ముంబయిలోని ఓ ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. బుధవారం రాత్రి శ్వాసకోశ సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయన్ని హెచ్‌ఎన్‌ రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స కొనసాగుతుండగా రిషీ కన్నుమూశారు. రిషీ కపూర్‌ ఆకస్మిక మరణవార్త తెలియడంతో సినీ, రాజకీయ పరిశ్రమ వర్గాలు తీవ్ర దిగ్ర్భాంతికి గురయ్యాయి. సోషల్‌మీడియా వేదికగా రిషీ కపూర్‌కు సంతాపం తెలియజేసింది.

‘‘బహుముఖ ప్రజ్ఞాశాలి, గొప్ప వ్యక్తి రిషీ కపూర్‌. ప్రతిభావంతుడు. మా ఇద్దరి మధ్య జరిగిన సంభాషణలను ఆయన తరచూ గుర్తు చేస్తుండేవారు. అలాగే సోషల్‌మీడియా వేదికగా కూడా మేమిద్దరం సంభాషించుకునేవాళ్లం. సినిమాల పట్ల, భారతదేశ వృద్ధి పట్ల ఆయన ఎంతో ఆసక్తి కనబరిచేవారు. ఆయన ఆకస్మిక మరణం నన్ను ఎంతగానో బాధకు గురి చేసింది. ఆయన కుటుంబానికి, అభిమానులకు సంతాపాన్ని తెలియజేస్తున్నాను’’ - ప్రధాని నరేంద్ర మోదీ

‘‘సినీ పరిశ్రమకు చెందిన మరో గొప్ప వ్యక్తి మృతి చెందారు. ఆయన ఆకస్మిక మరణం నన్ను ఎంతో బాధపెట్టింది. మనసులో ఉన్న విషయాన్ని ధైర్యంగా బయటకు చెప్పగల ఓ గొప్ప నటుడ్ని కోల్పోయాం. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను’’ -  తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు

‘‘నా ఆప్తుడు, మంచి నటుడు రిషీకపూర్‌ మరణవార్త నన్ను కలచివేసింది. ఆయన కెరీర్‌ ఎంతో మందికి స్ఫూర్తి. మంచి స్నేహితుడ్ని కోల్పోవడం నాకెంతో బాధగా ఉంది. రిషీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తున్నాను’’ - చిరంజీవి

‘‘లెజండరీ నటుడు రిషీ కపూర్‌ ఆకస్మిక మరణం ఎంతో బాధను కలిగించింది. ఆయన మరణం భారతీయ సినీ పరిశ్రమకు పెద్ద లోటు. ఆయన కుటుంబానికి నా సానుభూతిని తెలియచేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తున్నాను’’ - పవన్‌కల్యాణ్‌

‘‘రిషీకపూర్‌ మృతి చెందారనే వార్త విని ఎంతో బాధగా అనిపించింది. ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన్ని కలుస్తున్నాను. కలిసిన ప్రతిసారీ ఆయన అదే ఉత్సాహంతో ఉండేవారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తున్నాను’’ - సచిన్‌

‘రిషీ కపూర్‌ మరణవార్త విని నా హృదయం బద్దలైంది. మన సినిమా పరిశ్రమకు పూడ్చలేని మరో లోటు. గొప్ప టాలెంట్‌ ఉన్న వ్యక్తి. ఓ నిజమైన లెజెండ్‌. రణ్‌బీర్‌తోపాటు ఇతర కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. అలాగే రిషీ కపూర్‌ ఆత్మకు శాంతి చేకూరాలని భావిస్తున్నాను’ - మహేశ్‌బాబు

‘‘రెండు రోజుల్లోనే ఇలాంటి హృదయవిదారకమైన వార్తలు వినడం బాధగా ఉంది. ఇద్దరు గొప్ప నటుల్ని కోల్పోవడం ఎంతో విచారంగా అనిపిస్తుంది. అందర్నీ సంతోష పెట్టిన చిన్నారిగా రిషీ కపూర్‌ మన అందరీ హృదయాల్లో ఎప్పటికీ నిలిచే ఉంటారు. ఆయన్ని కలిసిన ప్రతిసారీ ఎన్నో గొప్ప విషయాలు నేర్చుకున్నాను. మీ మృతి మా కుటుంబానికి కూడా ఓ పెద్ద లోటు. కపూర్‌ కుటుంబానికి, స్నేహితులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’’ - వెంకటేశ్‌

ఇర్ఫాన్ ఖాన్, రిషీ కపూర్ లాంటి ఇద్దరు నట దిగ్గజాలు హఠాత్తుగా మనకు దూరమవడం చాలా బాధాకరం. భారతీయ సినిమాకు ఇది తీరని లోటు. వారి విశేష ప్రతిభ, చిత్రాల ద్వారా ఎప్పటికీ గుర్తుంటారు. వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మలకు శాంతి కలగాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను - నందమూరి బాలకృష్ణ

‘‘చింటూ జీ మరణ వార్తను నేను నమ్మలేకపోతున్నాను. ఎప్పుడూ చిరునవ్వుతో పలకరించే మంచి వ్యక్తి. మా ఇద్దరి మధ్య ఎంతో ప్రేమానుబంధం ఉంది. మిమ్మల్ని మిస్‌ అవుతున్నాను రిషీ. మీ కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నాను’’ - కమల్‌ హాసన్

‘‘నా హృదయం భారంగా మారింది. ఒక శకం ముగిసింది. రిషీ సర్‌ మీకున్న దయా హృదయం, మీలోని టాలెంట్‌ మరొకరికి సాధ్యం కాదు. మీ గురించి ఎంతో కొంత తెలుసుకున్నందుకు నాకెంతో గర్వంగా అనిపిస్తుంది. నీతూ ఇతర కుటుంబసభ్యులకు నా సానుభూతిని తెలియజేస్తున్నాను’’ - ప్రియాంక చోప్రా

‘‘ఈరోజు మనం ఓ గొప్ప వ్యక్తిని కోల్పోయాం. ఓ అద్భుత నటుడు, మంచి మనసున్న మనిషి, అలాగే కళామ్మాతల్లి ముద్దుబిడ్డ. మా జీవితాల్లో ఎంతో సంతోషాన్ని నింపినందుకు మీకు ధన్యవాదాలు. మిమ్మల్ని కోల్పోవడం నాకెంతో బాధగా ఉంది రిషీజీ’’ - అమీర్‌ఖాన్‌

‘‘రిషీ కపూర్‌తో కలిసి పనిచేసే గౌరవం ఓ సినిమాతో దక్కింది. విషయం ఏదైనా సరే గొప్పగా మాట్లాడే మంచి వ్యక్తి ఆయన. ఓ మంచి నటుడిని ఈ రోజు కోల్పోయాం. ఇప్పటికీ ఆయన మరణ వార్తను నమ్మలేకపోతున్నా’’ - మాధురీ దీక్షిత్‌

‘‘బాలనటుడిగా, యువ హృదయాలను కొల్లగొట్టిన హీరోగా, సహాయ నటుడిగా.. ఇలా ఎన్నో విధాలుగా ఆయన సినిమాతోనే జీవించారు. సుదూరమైన, స్ఫూర్తిని నింపిన ఆయన జీవితం ముగిసింది. ఎంత గొప్ప వాటికైనా ముగింపు అనేది ఉంటుంది’’ - హరీశ్‌ శంకర్‌

‘‘టాలెంట్‌ ఉన్న నటులు రిషీ కపూర్‌, ఇర్ఫాన్‌ ఖాన్‌ను కోల్పోవడం మన సినీ పరిశ్రమకు తీరని లోటు. ఆయన కుటుంబానికి నా సానుభూతిని తెలియజేస్తున్నాను’’ - మోహన్‌బాబు



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని