ఈ సినిమాలొస్తే థియేటర్‌లో సందడే సందడి
close
Published : 04/05/2020 10:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఈ సినిమాలొస్తే థియేటర్‌లో సందడే సందడి

కనుల విందుగా.. ‘పాన్‌ ఇండియా’..!

వివిధ భాషల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటీనటులను ఒకే సినిమాలో చూస్తే సినీ ప్రియులకు కనుల పండుగనే చెప్పాలి. ఒక భాషకే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను అలరించడమే లక్ష్యంగా సినీ పరిశ్రమలో కొంతకాలం నుంచి పాన్‌-ఇండియన్‌ సినిమాలు సందడి చేస్తున్నాయి. ‘బాహుబలి’ చిత్రంతో సినీ పరిశ్రమ హద్దులు చేరిపివేసిన రాజమౌళి  ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో మరోసారి రికార్డులు సృష్టించడానికి సిద్ధమయ్యారు. మరోవైపు దక్షిణాదితోపాటు బాలీవుడ్‌లో కూడా అభిమానులను సొంతం చేసుకున్న బన్నీ ‘పుష్ప’ చిత్రంతో మెప్పించనున్నారు. ఇలా చెప్పుకుంటే వెళ్తే మరెన్నో పాన్‌-ఇండియన్‌ సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాయి. మరి, త్వరలో థియేటర్‌లో సందడి చేయనున్న పాన్‌-ఇండియా సినిమాలపై ఓ లుక్కేద్దాం..

ఆర్‌ఆర్‌ఆర్‌

‘బాహుబలి’, ‘బాహుబలి-2’ చిత్రాల తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌: రౌద్రం రణం రుధిరం’. రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తెలుగుతోపాటు హిందీ, కన్నడ, మలయాళం, తమిళంలో విడుదల చేయనున్నారు. చారిత్రాత్మక నేపథ్యంలో సాగే ఈ యాక్షన్‌ కథా చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌, కొమరంభీమ్‌గా ఎన్టీఆర్‌ మెప్పించనున్నారు. దాదాపు రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియన్‌ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్‌, హాలీవుడ్‌ తారలు సందడి చేయనున్నారు. ఇప్పటికే బాలీవుడ్‌ నటుడు అజయ్‌దేవ్‌గణ్‌ సైతం ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొన్నారు. మరోవైపు బాలీవుడ్‌ నటి ఆలియాభట్‌, హాలీవుడ్‌ నటీమణులు ఒలీవియా మోరీస్‌, ఎలిసన్‌ డ్యూడీ, నటుడు రేయ్‌ స్టీవ్‌సన్‌ చిత్రీకరణలో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 8న ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తుంది.

కేజీఎఫ్‌ ఛాప్టర్‌ 2

‘కేజీఎఫ్‌’.. కన్నడ భాషలో తెరకెక్కి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎందరో సినీ ప్రియులను మెప్పించిన చిత్రం. యశ్‌ ప్రధాన పాత్రధారిగా ప్రశాంత్‌ నీల్‌ రూపొందించిన ఈ చిత్రానికి స్వీకెల్‌గా ‘కేజీఎఫ్‌ ఛాప్టర్‌2’ రానుంది. యాక్షన్‌ ప్రధానంగా సాగే ఈ చిత్రాన్ని మలయాళం, హిందీ, తమిళం, తెలుగు భాషల్లో విడుదల చేయనున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాలో బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌ ‘అధీర’ పాత్రలో కనిపించనున్నారు. అంతేకాకుండా బాలీవుడ్‌ నటి రవీనా టాండన్‌ కూడా ఓ కీలకపాత్రలో కనిపించనున్నారు. ఇటీవలే ‘కేజీఎఫ్‌ 2’ టీంలో టాలీవుడ్‌ నటుడు రావు రమేశ్ సైతం భాగమయ్యారు.

పుష్ప

‘అల..వైకుంఠపురములో..’ చిత్రం తర్వాత అల్లు అర్జున్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. స్టైలిష్‌ డైరెక్టర్‌ సుకుమార్‌-బన్నీ కాంబినేషన్‌లో వస్తున్న హ్యాట్రిక్‌ సినిమా ఇది. రష్మిక కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి ప్రతినాయకుడిగా కనిపించనున్నారంటూ ప్రచారం సాగుతోంది. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్‌ లుక్‌లో కనిపించనున్నారు. బన్నీకి వివిధ ప్రాంతాల్లో అభిమానులు ఉన్న నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెలుగు, మలయాళం, తమిళం, కన్నడతోపాటు హిందీలో కూడా విడుదల చేయనున్నారు.  

బ్రహ్మాస్త్ర

‘బ్రహ్మాస్త్ర’.. రణ్‌బీర్‌ కపూర్‌, ఆలియాభట్‌ జంటగా అమితాబ్‌ బచ్చన్‌, నాగార్జున కీలకపాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం. యాక్షన్‌ ఫాంటసీ చిత్రంగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకి అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కరణ్‌ జోహర్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మూడు భాగాలుగా రానున్న ఈ సినిమాలోని మొదటి భాగాన్ని ఈ ఏడాది డిసెంబర్‌ 4న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాలో షారుఖ్‌ ఖాన్‌ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారని ప్రచారం సాగుతోంది.

‘భారతీయుడు 2’

‘భారతీయుడు’.. కమల్‌హాసన్‌, శంకర్‌ కాంబినేషన్‌లో విడుదలైన ఈ బ్లాక్‌బస్టర్‌ చిత్రం. ప్రస్తుతం ఈ చిత్రానికి స్వీకెల్‌గా ‘భారతీయుడు 2’ తెరకెక్కుతోంది. దాదాపు 24 సంవత్సరాల తర్వాత కమల్‌-శంకర్‌ కాంబినేషన్‌లో రానున్న ఈ సినిమాలో కాజల్‌, సిద్ధార్థ్‌, రకుల్‌ ప్రీత్‌సింగ్‌, బాబీ సింహా సందడి చేయనున్నారు. లైకా ప్రొడెక్షన్స్‌ నిర్మిస్తున్నారు. అనిరుధ్‌ స్వరాలు అందిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా సెట్‌లో ఇటీవల ఘోర ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే.

ఫైటర్‌

‘ఇస్మార్ట్‌శంకర్’ సినిమా తర్వాత పూరీ జగన్నాథ్‌, టాలీవుడ్‌ సెన్సేషనల్‌ హీరో విజయ్‌ దేవరకొండతో ఓ సినిమాని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ముంబయిలో షూటింగ్‌ ప్రారంభమైన ఈసినిమాకి ‘ఫైటర్‌’ అనే పేరు ప్రచారంలో ఉంది. యాక్షన్‌ ప్రధానాంశంగా సాగే ఈ సినిమా కోసం విజయ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకున్నారు. అంతేకాకుండా ఈ సినిమాలో ఆయన విభిన్నమైన లుక్‌లో కనిపించనున్నారు. బాలీవుడ్‌ నటి అనన్యపాండే కథానాయికగా నటిస్తున్నారు. ఛార్మి నిర్మాత. విజయ్‌, పూరీ కెరీర్‌లో తెరకెక్కుతున్న మొదటి పాన్‌ ఇండియన్‌ చిత్రమిది.

ప్రభాస్‌-నాగ్‌ అశ్విన్‌

‘మహానటి’ సినిమాతో ప్రేక్షకులను మెప్పించారు దర్శకుడు నాగ్‌ అశ్విన్‌. త్వరలో ఆయన ప్రభాస్‌తో ఓ సినిమా చేయనున్నట్లు ప్రకటించారు. వైజయంతి మూవీస్‌ బ్యానర్‌పై తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాదిలో విడుదల చేయనున్నారు. అయితే ఈ సినిమా గురించి నాగ్‌ అశ్విన్‌ స్పందిస్తూ.. ‘ఈ ఏడాది ఆఖర్లో షూటింగ్ ప్రారంభిస్తాం. 2021లో చిత్రాన్ని విడుదల చేస్తాం. కొంతమంది పాన్‌-ఇండియా సినిమా అంటున్నారు. అది తప్పు.. పాన్‌-ఇండియా ఎప్పుడో కొట్టేశారు. ఇది పాన్‌-వరల్డ్‌ సినిమా’ అని చెప్పారు. మరోవైపు ప్రభాస్‌ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ సినిమాలో నటిస్తున్నారు. పూజాహెగ్డే కథానాయిక. వింటేజ్‌ లవ్‌స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి ‘జాన్‌’ అనే పేరు ప్రచారంలో ఉంది. ప్రభాస్‌కు ఉన్నక్రేజ్‌ దృష్ట్యా ఈ చిత్రాన్ని ఇతర భాషల్లోనూ విడుదల చేసే అవకాశం ఉంది.

పవన్‌-క్రిష్‌

‘మహానాయకుడు’ సినిమా తర్వాత క్రిష్‌ దర్శకత్వంలో పవన్‌కల్యాణ్‌ హీరోగా ఓ ప్రాజెక్ట్‌ ఓకే అయిన విషయం తెలిసిందే. ఇటీవల పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా రెగ్యూలర్‌ షూటింగ్‌ త్వరలో ప్రారంభం కానుంది. చారిత్రాత్మక నేపథ్యంలో సాగే చిత్రంగా పవన్‌-క్రిష్‌ సినిమా తెరకెక్కనుందని గత కొన్ని రోజులుగా ప్రచారం సాగుతోంది. అంతేకాకుండా ఈ చిత్రాన్ని పాన్‌-ఇండియా సినిమాగా విడుదల చేయనున్నట్లు టాక్‌ వినిపిస్తుంది. అయితే క్రిష్‌ మాత్రం ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు, ఇతర వివరాలను ఇంకా బయటపెట్టలేదు. మరోవైపు పవన్‌కల్యాణ్‌ ప్రస్తుతం ‘పింక్‌’ రీమేక్‌గా తెరకెక్కుతున్న ‘వకీల్‌ సాబ్‌’ చిత్రంలో నటిస్తున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని