కొత్త హీరోలకు కరోనా అడ్డంకి..!
close
Updated : 14/05/2020 11:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొత్త హీరోలకు కరోనా అడ్డంకి..!

నిరీక్షణ ఇంకెన్నాళ్లో..!

మరికొన్ని రోజుల్లో తమ తొలి సినిమా వెండితెరపై సందడి చేస్తుంది అనుకున్నారు వారంతా. కొన్ని ఏళ్లపాటు పడ్డ శ్రమకు ప్రతిఫలం దక్కబోతోందని సంబరపడ్డారు. ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందో అన్న.. కంగారుతో కూడిన ఉత్సుకతతో రోజులు లెక్కపెట్టుకుంటున్న సమయంలో కరోనా మహమ్మారి ఓ ఉపద్రవంలా వచ్చి పడింది. అంతే.. అరంగేట్ర సినిమా విడుదలకు అడ్డంకిగా మారింది. దీంతో కాబోయే తారలకు నిరీక్షణ తప్పడం లేదు. తిరిగి థియేటర్లు ఎప్పుడు ప్రారంభమౌతాయో తెలియని అయోమయంలో అందరూ ఉన్నారు. ఆరంభమైనా.. మునుపటి వైభోగం కనిపించదని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే ‘సవారి’, ‘అమృతరామం’ వంటి సినిమాల్ని ఓటీటీ ఫ్లాట్‌ఫాంలో విడుదల చేశారు. ఈ నేపథ్యంలో ఆగిపోయిన కొత్త హీరోలు, నటీమణులు, దర్శకుల సినిమాల్ని ఓ సారి చూద్దాం..

     

మెగాస్టార్‌ చిరంజీవి మేనల్లుడు వైష్ణవ్‌తేజ్‌ ‘ఉప్పెన’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించబోతున్నారు. గత ఏడాది జనవరి 21న ఈ సినిమా షూటింగ్‌ ఆరంభమైంది. 2020 ఏప్రిల్‌లో సినిమాను విడుదల చేయాలి అనుకున్నారు. కానీ కరోనా వైరస్ వల్ల ఆగిపోయింది. దీంతో ఇంకొన్నాళ్లు ఆగకతప్పడం లేదు. సాయిధరమ్‌ తేజ్‌ సోదరుడు వైష్ణవ్‌తేజ్‌. ఈ సినిమాతో బుచ్చిబాబు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. కృతి శెట్టి కథానాయిక. తమిళ స్టార్‌ విజయ్‌ సేతుపతి ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. వైష్ణవ్‌ తొలి సినిమా కావడం, దీన్ని నూతన దర్శకుడు తెరకెక్కిస్తుండటంతో సినిమాపై ఆసక్తి నెలకొంది. ఈ సినిమా పాటలకు కూడా విశేషమైన స్పందన లభిస్తోంది.

 

బుల్లితెర యాంకర్‌గా ఎందరో అభిమానుల్ని సొంతం చేసుకున్నారు ప్రదీప్‌. ఆయన ఇప్పటికే ‘వరుడు’, ‘100% లవ్‌’, ‘జులాయి’, ‘అత్తారింటికి దారేది..’ తదితర సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించారు. కాగా ఆయన తొలిసారి కథానాయకుడిగా నటించిన సినిమా ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’. మున్నా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అమృత అయ్యర్‌ కథానాయికగా నటించారు. అనూప్‌ రూబెన్స్‌ బాణీలు అందించారు. ఈ సినిమాలోని ‘నీలి నీలి ఆకాశం..’ పాట రికార్డు సృష్టించింది. 10 కోట్ల మందికిపైగా దీన్ని వీక్షించడం విశేషం. లాక్‌డౌన్‌ కారణంగా ఈ సినిమా విడుదల కూడా వాయిదా పడింది. నిజానికి మార్చిలో సినిమాను విడుదల చేయాలని భావించారు.

           

‘మహానటి’గా అందరి మన్ననలు పొందిన కథానాయిక కీర్తి సురేశ్‌ నటిస్తున్న సినిమా ‘మిస్‌ ఇండియా’. ఈ చిత్రంతో నరేంద్రనాథ్‌ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఈస్ట్‌ కోస్ట్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించింది. కథానాయికా ప్రాధాన్యం ఉన్న ఈ సినిమాలో కీర్తి సురేశ్‌ విభిన్నమైన పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్‌ 17న ఈ సినిమా విడుదల చేయాలని భావించారు. కానీ లాక్‌డౌన్‌ నేపథ్యంలో వాయిదా పడింది.

 

బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి కుమారుడు అహన్‌ శెట్టి త్వరలో హీరోగా బాలీవుడ్‌కు పరిచయం కాబోతున్నారు. తెలుగు హిట్‌ ‘ఆర్‌ఎక్స్‌ 100’కు హిందీ రీమేక్‌గా రాబోతున్న సినిమాలో ఆయన నటించారు. తారా సుతారియా కథానాయికగా నటించారు. ఈ సినిమాను ఏప్రిల్‌లో విడుదల చేయాలని భావించారు. కానీ లాక్‌డౌన్‌ వల్ల పరిస్థితులు మారిపోయాయి. ఇప్పటికే సునీల్ శెట్టి కుమార్తె అథియా శెట్టి నటిగా వెండితెరపై కనిపించిన సంగతి తెలిసిందే.

             


ప్రముఖ బుల్లితెర నటి క్రిస్టల్‌ డిసౌజా కథానాయికగా బాలీవుడ్‌కు పరిచయం కాబోతున్నారు. అమితాబ్‌ బచ్చన్‌, ఇమ్రాన్‌ హష్మి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘చెహ్రే’. రూమి జాఫరీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్‌ 24న విడుదల చేయాలని భావించారు. కానీ లాక్‌డౌన్‌ వల్ల వాయిదాపడింది.

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం
 


 


 

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని