15 ఏళ్లకే నటిగా మారి.. నిర్మాతగా రాణిస్తూ..!
close
Updated : 17/05/2020 14:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

15 ఏళ్లకే నటిగా మారి.. నిర్మాతగా రాణిస్తూ..!

ఛార్మింగ్‌ గర్ల్‌ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు

హైదరాబాద్‌: నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుని.. ప్రస్తుతం నిర్మాతగా పలు విభిన్న కథా చిత్రాలను సినీ ప్రియులకు అందిస్తున్నారు ఛార్మి. ఆదివారం ఛార్మి పుట్టిన రోజు పురస్కరించుకుని అభిమానులు, పలువురు సినీ ప్రముఖులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. 15 ఏళ్లకే వెండితెరపైకి అడుగుపెట్టిన ఛార్మి గురించి చాలామందికి తెలియని కొన్ని ఆసక్తికర విశేషాలను ఆమె నిర్మాణ సంస్థ పూరీ కనెక్ట్స్‌ సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది.

15 ఏళ్లకే భార్య పాత్రలో..

2002లో విడుదలైన ‘నీ తోడు కావాలి’ చిత్రంతో ఛార్మి కథానాయికగా వెండితెరకు పరిచయమయ్యారు. భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఛార్మి.. భార్య పాత్రలో కనిపించారు. నటనపరంగా తొలి చిత్రంతోనే ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు కొట్టేశారు. దీంతో ఆమెకు అవకాశాలు వరుసకట్టాయి. అలా దక్షిణాది భాషలతోపాటు హిందీ చిత్రాల్లో కూడా ఛార్మి నటించారు.

‘మంత్ర’ చిత్రానికి నంది వరించి..

బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్‌ లాంటి అగ్రకథానాయకుల చిత్రాలతోపాటు యువ హీరోలు ప్రభాస్‌, ఎన్టీఆర్‌, సుమంత్‌, నితిన్‌ సరసన కూడా ఛార్మి నటించారు. ‘మాస్‌’, ‘చక్రం’, ‘లక్ష్మి’, ‘రాఖీ’, ‘పౌర్ణమి’ చిత్రాలతోపాటు ‘అనుకోకుండా ఒకరోజు’, ‘మంత్ర’, ‘మంగళ’ లాంటి కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రాల్లో నటించి మెప్పించారు. సుమారు 50 సినిమాల్లో నటించిన ఛార్మి 2007లో విడుదలైన ‘మంత్ర’ సినిమాతో ఉత్తమ నటిగా నంది అవార్డును సొంతం చేసుకున్నారు. 2012లో విడుదలైన ‘మంగళ’ చిత్రానికి నంది స్పెషల్‌ జ్యూరీ అవార్డు కూడా వరించింది.

ఆరు భాషల్లో..

పంజాబీ కుటుంబానికి చెందిన ఛార్మికి మాతృభాషతోపాటు మరో ఐదు భాషలు తెలుసు. తెలుగు, ఇంగ్లిష్‌, హిందీ, మరాఠి, తమిళం భాషల్లో ఆమె మాట్లాడగలరు.

మావో..

ఛార్మి అందరితో కలివిడిగా ఉంటారనే విషయం తెలిసిందే. సినీ పరిశ్రమలోనే కాకుండా మిగిలిన రంగాల్లో కూడా ఆమెకు స్నేహితులు ఎక్కువ. అందువల్లే ఛార్మికి బాగా కావాల్సిన వారు ఆమెను ‘మావో’ అని పిలుస్తారు. అదే ఆమె ముద్దు పేరు.

మూగజీవులపై మక్కువ..

ఛార్మికి మూగజీవులంటే ఎంతో ఇష్టం. శునకాలతోపాటు పలు పక్షులనూ పెంచుకుంటున్నారు. వాటితో సరదాగా గడిపిన ఫొటోలను సైతం సోషల్‌మీడియా వేదికగా ఆమె షేర్‌ చేస్తుంటారు.

నిర్మాతగా.. 

పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జ్యోతిలక్ష్మి’ చిత్రంతో ఛార్మి నిర్మాతగా మారారు. 2015లో విడుదలైన ఈ సినిమాలో ఛార్మి టైటిల్‌ రోల్‌ పోషించారు. బాలకృష్ణ కథానాయకుడిగా తెరకెక్కిన ‘పైసా వసూల్‌’ చిత్రానికి కూడా ఆమె నిర్మాతగా పనిచేశారు. గతేడాది విడుదలైన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ చిత్రంతో నిర్మాతగా మాస్‌ విజయాన్ని సొంతం చేసుకున్నారు. 

కాగా, పుట్టినరోజు పురస్కరించుకుని పలువురు సెలబ్రిటీలు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ట్విటర్‌ వేదికగా ఛార్మిని విష్‌ చేశారు. లాక్‌డౌన్‌ కారణంగా షూటింగ్స్‌ లేకపోవడంతో ఈ ఏడాది పుట్టినరోజును కుటుంబసభ్యులతోనే జరుపుకొన్నారు. పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫొటోలను పూరీ కనెక్ట్స్ ట్విటర్‌ వేదికగా షేర్‌ చేసింది.
 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని