ఆన్‌స్క్రీన్‌.. నటీనటుల లాక్‌డౌన్‌
close
Updated : 27/05/2020 10:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆన్‌స్క్రీన్‌.. నటీనటుల లాక్‌డౌన్‌

ఇంట్లో లాక్‌ అయిపోయి.. నాలుగు గోడల మధ్య కాలం గడపడం మనకు సాధ్యమేనా?.. షాపింగ్‌లు, సినిమాలు, షికార్లకు దూరంగా ఉంటామని ఎప్పుడైనా ఊహించామా? కరోనా మహమ్మారి వల్ల ప్రజల జీవన శైలి మారిపోయింది. ఎప్పుడూ పనులతో బిజీగా గడిపే ప్రజలు కొన్నాళ్లు ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది. షాపింగ్‌లు, షికార్లు మానేసి నిర్బంధంలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొందరు ఈ లాక్‌డౌన్‌ కాలాన్ని ఎంజాయ్‌ చేస్తుంటే.. మరికొందరేమో ఇబ్బందిగా భావిస్తున్నారు. అయితే ఇప్పటికే అనేక సినిమాల్లో నటీనటులు పలు కారణాల వల్ల నిర్బంధంలో ఉన్నారు. హీరో-హీరోయిన్‌ ప్రేమించుకున్నారంటే కథానాయిక తండ్రి చేసే మొదటి పని ఆమెను ఇంట్లో క్వారంటైన్‌ చేయడం.. అదేనండీ గదిలో పెట్టి తాళం వేయడం. ఆమె ఎలాగో తప్పించుకుని కథానాయకుడిని కలవడంతో కథ సుఖాంతం అవుతుంది. కేవలం ఈ పాయింటే కాకుండా వివిధ కారణాలతో మన నటీనటులు ఆన్‌స్క్రీన్‌లో నిర్బంధంలో ఉన్నారు. అలా ఉన్న నటీనటులు ఎవరో చూద్దామా!

బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకున్న చిత్రం ‘బాహుబలి’. రెండు భాగాలుగా వచ్చిన ఈ చిత్రంలో భళ్లాలదేవుడు కోరుకున్న దేవసేన.. అమరేంద్ర బాహుబలిని ప్రేమిస్తుంది. అతడినే పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని మొదలు పెడుతుంది. మాహిష్మతి రాజ్యం చేతికి వచ్చినప్పటికీ.. బాహుబలి, దేవసేనలపై పగ పెంచుకుంటాడు భళ్లాలదేవుడు. కుట్రపన్ని కట్టప్పతో బాహుబలిని చంపిస్తాడు. తనను కాదన్న దేవసేనను పాతికేళ్లకు పైగా కారాగారంలో నిర్బంధిస్తాడు.

ఒకప్పుడు కథానాయికగా చిత్ర పరిశ్రమను ఏలిన రమ్యకృష్ణ కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన చిత్రం ‘నరసింహ’. ఇందులో ఆమె పాత్ర ‘నీలాంబరి’ సినిమాకి మరింత బలాన్ని చేకూర్చింది. తను ప్రేమించిన నరసింహ(రజనీ).. వసుంధర (సౌందర్య)ను పెళ్లి చేసుకున్నాడనే కోపంతో రమ్యకృష్ణ 18 సంవత్సరాలు ఒకే గదిలోనే ఉండిపోతారు. 1999లో విడుదలైన ఈ చిత్రం ఇప్పటికీ ఎవర్‌గ్రీన్‌గానే ఉంది.

నటుడు సోనూసూద్‌ను తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గర చేసిన సినిమా ‘అరుంధతి’. అనుష్క కథానాయికగా నటించిన ఈ సినిమాలో ఆయన ప్రతినాయకుడి పాత్రలో పశుపతిగా ప్రేక్షకులను విశేషంగా అలరించారు. స్త్రీలోలుడైన పశుపతిని దండించి ఊరి బహిష్కరణ చేస్తుంది అరుంధతి. పగతో క్షుద్ర విద్యను నేర్చుకుని అరుంధతిని అంతం చేయడానికి వచ్చి, అడ్డువచ్చిన వారిని చంపేస్తాడు. దీంతో అరుంధతి తెలివిగా పశుపతిని బంధించి బతికుండానే సమాధి చేస్తుంది. అలా అందులో కొన్నేళ్ల పాటు ప్రేతాత్మగా ఉండిపోతాడు.

ప్రభాస్‌, త్రిష కెరీర్‌కు మంచి బ్రేక్‌ ఇచ్చిన చిత్రం ‘వర్షం’. గోపీచంద్‌ ప్రతినాయకుడిగా మెప్పించారు. 2004లో వచ్చిన ఈ సినిమా మంచి టాక్‌ అందుకోవడంతో పాటు బాక్సాఫీసు వద్ద చక్కటి వసూళ్లు రాబట్టింది. ఇందులో త్రిషను పెళ్లి చేసుకోవాలని గోపీచంద్‌ ఆమెను కిడ్నాప్‌ చేస్తాడు. ఆమెను బలవంతంగా తన ఇంటికి తీసుకొస్తాడు. అలా కొన్ని రోజులపాటు ఆమె ఆయన ఇంట్లోనే నిర్బంధంలో ఉంటారు.

దక్షిణాదితోపాటు ఉత్తరాదిలోనూ గుర్తింపు పొందిన భామ ఇలియానా. ఆమె ‘దేవదాస్‌’ సినిమాతో కథానాయికగా పరిచయం అయ్యారు. రామ్‌ అరంగేట్ర చిత్రం కూడా ఇదే కావడం విశేషం. ఇందులో తన కుమార్తె పేదవాడ్ని ప్రేమిస్తోందని తెలుసుకున్న కాటమరాజు(షియాజీషిండే) తన కుమార్తె భానుమతి(ఇలియానా)ని గదిలో బంధిస్తాడు. రామ్‌ ఇండియా నుంచి అమెరికా వెళ్లేంత వరకు ఆమె గదిలోనే ఉంటుంది.

పూరీజగన్నాథ్‌-అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో వచ్చిన సూపర్‌హిట్‌ సినిమా ‘దేశముదురు’. హన్సిక ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఆస్తి కోసం మురుగేశన్‌(సుబ్బరాజు)కు ఇచ్చి పెళ్లి చేయడానికి వైశాలి(హన్సిక)ని కిడ్నాప్‌ చేసి గదిలో బంధిస్తారుఆండాళ్‌(తెలంగాణ శకుంతల), తంబిదురై( ప్రదీప్‌ రావత్)‌. దాంతో వైశాలిని ప్రేమించి బాలగోవిందం(అల్లు అర్జున్‌)రంగంలోకి దిగి ఆమెను అక్కడి నుంచి కాపాడి తీసుకొచ్చేస్తాడు. అల్లు అర్జున్‌ మరో చిత్రం ‘బద్రీనాథ్‌’లోనూ తమన్నాను విలన్‌ తన ఇంట్లో బంధిస్తాడు.

శ్రుతిహాసన్‌, సిద్ధార్థ్‌, మంచు లక్ష్మి ప్రధాన తారాగణంగా నటించిన సినిమా ‘అనగనగా ఓ ధీరుడు’. ఈ సినిమాలో మంచు లక్ష్మి ప్రతినాయిక ఐరేంద్రిగా కనిపించారు. ఆమె ముని మనవరాలి పాత్రను శ్రుతి హాసన్‌ పోషించారు. ఐరేంద్రి ప్రాణాలతో ఉండాలంటే ప్రియ(శ్రుతిహాసన్‌)‌ రక్తం కావాలన్న కారణంతో ఆమెను బంధిస్తుంది ఐరేంద్రి.

అల్లరి నరేశ్‌, రిచా పనాయ్‌ జంటగా ఇ.సత్తిబాబు దర్శకత్వం వచ్చిన చిత్రం ‘యముడికి మొగుడు’. 2012లో విడుదలైన ఈ సినిమా కామెడీ ఎంటర్‌టైనర్‌గా మంచి టాక్‌ అందుకుంది. ఇందులో యముడి(షియాజీ షిండే) కుమార్తె యమజ(రిచాయపనాయ్‌)ను సామాన్య మానవుడైన నరేశ్‌(అల్లరి నరేశ్‌) ప్రేమిస్తాడు. దీంతో యముడు.. యమజను తీసుకుని వెళ్లి తన ఆయుధమైన గదలో బంధిస్తాడు. 

ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే, మన తెలుగు సినిమాల్లో ఇలాంటి నిర్బంధ సన్నివేశాలు అనేకం ఉన్నాయి.

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

 

 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని