ఓటీటీ మాటే లేదు
close
Published : 27/04/2021 13:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఓటీటీ మాటే లేదు

థియేటర్లలో విడుదలకే మొగ్గు
వేచి చూద్దామంటున్న కొత్త చిత్రాల నిర్మాతలు

2020 లాక్‌డౌన్‌ సమయంలో ఓటీటీ వేదికల ద్వారా విడుదలైన తెలుగు సినిమాలు చాలానే. థియేటర్లు తెరుచుకుంటాయో? లేదో? అనే సందేహాలు... తెరచుకున్నా ప్రేక్షకులు వస్తారో? రారో? అనే భయాలతో కొద్దిమంది నిర్మాతలు నేరుగా ఓటీటీ వేదికల్లో సినిమాల్ని విడుదల చేశారు. కానీ ఈసారి  ఆ ఊసే లేదు. థియేటర్లు బంద్‌ అయినా.. కరోనా విజృంభణ కొనసాగుతున్నా... నిర్మాతలు ‘వేచి చూద్దాం’ అనే ధోరణిలో కనిపిస్తున్నారు. కాస్త ఆలస్యమైనా థియేటర్లలోనే విడుదల చేయాలనే సంకల్పంతో కనిపిస్తున్నారు.

రోనాకి ముందు వరకు తెలుగు ప్రేక్షకులపై ఓటీటీ వేదికల ప్రభావం అతి స్వల్పం. ప్రధాన నగరాల్లో కొద్దిమందే ఆ మాధ్యమాలపై ఆసక్తి చూపేవారు. గతేడాది లాక్‌డౌన్‌ తర్వాత ఆ లెక్కలన్నీ తారుమారయ్యాయి. థియేటర్‌లోనే సినిమాలు చూసే ప్రేక్షకులు సైతం ఓటీటీ వేదికలకి అలవాటు పడిపోయారు. నచ్చిన వేదిక సభ్యత్వం తీసుకోవడం... దాన్ని ఇద్దరు ముగ్గురు స్నేహితులు కలిసి పంచుకుంటూ నచ్చిన   సినిమాల్ని ఇంటిల్లిపాదీ కలిసి చూడటం అలవాటైపోయింది. తెలుగు సినిమాలే కాదు, ఆయా వేదికల్లో అందుబాటులో ఉన్న ప్రపంచ సినిమాల్ని, వెబ్‌సిరీస్‌ల్ని వేటినీ వదిలిపెట్టకుండా చూసేసినవాళ్లు చాలామందే. అది గమనించిన నిర్మాతలు తమ సినిమాల్ని ఓటీటీ వేదికల్లో విడుదల చేసుకోవడమే మేలనే అభిప్రాయానికొచ్చారు. ప్రేక్షకుల ఆదరణని దృష్టిలో ఉంచుకుని ఓటీటీ వేదికలు  రూ.వందల కోట్ల పెట్టుబడితో తెరకెక్కిన  సినిమాల్ని సైతం సొంతం చేసుకునేందుకు ఆసక్తి చూపించాయి. అలా నిర్మాతలకీ, ఓటీటీ యాజమాన్యాలకీ మధ్య బేరాలు కుదరడంతో చాలా చిత్రాలు ఆ వేదికల ద్వారా విడుదలయ్యాయి. తెలుగులో అయితే నాని -  సుధీర్‌బాబు కథానాయకుడిగా నటించిన ‘వి’, రాజ్‌ తరుణ్‌ ‘ఒరేయ్‌ బుజ్జిగా’, అనుష్క ‘నిశ్శబ్దం’, సత్యదేవ్‌ ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ మొదలుకొని ‘కృష్ణ అండ్‌ హిజ్‌ లీల’, ‘భానుమతి రామకృష్ణ’, ‘పెంగ్విన్‌’ తదితర చిత్రాలు రకరకాల వేదికల ద్వారా విడుదలై ప్రేక్షకుల్ని పలకరించాయి.   

ఈ సారి అలా కాదు..

ఇంచుమించు ఈసారి చిత్రసీమలో గతేడాది తరహా పరిస్థితులే తలెత్తాయి. తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల థియేటర్లు బంద్‌ అయ్యాయి. విడుదలలు ఆగిపోయాయి. కొన్నిచోట్ల సినిమాల ప్రదర్శనలు కొనసాగుతున్నా..ప్రేక్షకులు థియేటర్లవైపు వెళ్లడానికే ఆసక్తి చూపడం లేదు. వినోదం కోసం మళ్లీ ఓటీటీని ఆశ్రయిస్తున్న ప్రేక్షకుల సంఖ్య పెరిగింది. అయినా సరే... కొత్త సినిమాల్ని గతేడాది తరహాలో ఆ వేదికల ద్వారా విడుదల చేయడానికి ఆసక్తి చూపడం లేదు నిర్మాతలు. కాస్త ఆలస్యమైనా వేచి చూసి థియేటర్లలోనే విడుదల చేస్తాం అంటున్నారు.

ఆ విజయాలే భరోసా... 

లాక్‌డౌన్‌ ముగిశాక... ముఖ్యంగా నాలుగు నెలల కాలంలో విడుదలైన కొన్ని సినిమాలు ఘన విజయాల్ని సొంతం చేసుకున్నాయి. బాగున్న సినిమాలకి వసూళ్ల వర్షం కురిసింది. సినిమా బాగుందంటే ప్రేక్షకులు దేన్నీ లెక్క చేయకుండా థియేటర్లకి వస్తారనే సంగతి  రుజువైంది. సంక్రాంతికి విడుదలైన ‘క్రాక్‌’ మొదలుకొని మొన్నటి ‘వకీల్‌సాబ్‌’ వరకు చిన్న, పెద్ద అనే తేడా లేకుండా పలు సినిమాలు విజయ బావుటా ఎగురవేశాయి. అందుకే ఇప్పుడు కొత్త సినిమాల్ని సిద్ధం  చేసుకున్న నిర్మాతలంతా... కాస్త ఆలస్యమైనా థియేటర్లలోనే విడుదల చేయడానికి మొగ్గు చూపుతున్నారు. బాలీవుడ్‌లో అయితే ‘రాధే’లాంటి చిత్రాలు అందుబాటులో ఉన్న థియేటర్లతో పాటు, ఓటీటీలోనూ పే పర్‌ వ్యూ పద్ధతిలో విడుదలకి సిద్ధమైంది. తెలుగు సినీ  పరిశ్రమ ఆ ఊసే లేదంటోంది. కరోనా తర్వాత దేశంలో ఎక్కువ లాభాలు ఆర్జించిన పరిశ్రమ తెలుగే. అందుకే రెండో దశ కరోనా తర్వాత మునుపటిలాగే థియేట్రికల్‌ వ్యాపారంలో పుంజుకుంటామనే ధీమాతో ఉన్నాయి తెలుగు సినీ వర్గాలు. ‘లవ్‌స్టోరి’, ‘టక్‌ జగదీష్‌’, ‘విరాటపర్వం’, ‘ఇష్క్‌’ తదితర సినిమాలు ఇప్పటికే విడుదలకి సిద్ధంగా ఉన్నాయి. ‘దృశ్యం2’, ‘నారప్ప’, ‘ఖిలాడి’, ‘అఖండ’, ‘ఆచార్య’ చిత్రాలు తుదిదశకు చేరుకున్నాయి. ఇవన్నీ మేలో విడుదల కోసం సిద్ధమైనవే.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని