కథా బలం రీమేక్‌ ఫలం
close
Published : 04/05/2021 19:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కథా బలం రీమేక్‌ ఫలం

తెలుగులో ఇప్పుడు ఏ దర్శకుడిని పలకరించినా నా దగ్గర నాలుగైదు బౌండెడ్‌ స్క్రిప్టులు ఉన్నాయనే మాటే వినిపిస్తోంది. ‘ఈ కథ నచ్చలేదా? అయితే మరొకటి చెబుతా వినండి’ అంటూ వెంటనే కొత్తవి బయటికి తీస్తుంటారు దర్శకులు. ఇలాంటి పరిస్థితుల్లోనూ... మన చిత్రసీమలో పొరుగు కథల జోరు ఎక్కువగానే కనిపిస్తోంది. తమిళం, మలయాళం, కన్నడ, హిందీ... ఇలా ప్రత్యేకంగా ఒక భాషతో సంబంధం లేకుండా, ఆఖరికి కొరియా కథలూ తరచూ రీమేక్‌ కోసం దిగుమతి అవుతున్నాయి. మన నేపథ్యానికి తగ్గట్టుగా మారిపోయి ప్రేక్షకుల్ని అలరించేందుకు ముస్తాబవుతున్నాయి. విజయవంతమైన కథలకి ఉన్న బలం అది. మన దగ్గరున్నాయా? లేవా? అనేది కాదు... ఒక చోట బలంగా ప్రేక్షకుల్ని మెప్పించిన ఆ కథల్ని చూశాక మన ప్రేక్షకులకూ చెప్పాలనే ఆత్రుత హీరోలు, దర్శకనిర్మాతల్లో పెరిగిపోతుంటుంది. అలాంటి సందర్భాల్లోనే రీమేక్‌ చిత్రాలు పట్టాలెక్కుతుంటాయి.

అగ్ర హీరోల అడుగులు
పవన్‌కల్యాణ్‌ విరామం తర్వాత మళ్లీ కెమెరా ముందుకొచ్చారు. రీ ఎంట్రీ చిత్రం కోసం ఆయన ఎంచుకున్నది రీమేక్‌ సినిమానే. ఇటీవల విడుదలైన ‘వకీల్‌సాబ్‌’ హిందీలో విజయవంతమైన ‘పింక్‌’ ఆధారంగానే తెరకెక్కింది. ఆ చిత్రం తెలుగులోనూ విజయాన్ని సొంతం చేసుకుంది. పవన్‌కల్యాణ్‌ ప్రస్తుతం చేస్తున్న మరో సినిమా రీమేకే. మలయాళంలో విజయవంతమైన ‘అయ్యప్పనుమ్‌ కోశియుమ్‌’ సినిమా తెలుగులో పవన్‌కల్యాణ్‌ - రానా హీరోలుగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దీనికి త్రివిక్రమ్‌ రచన చేస్తుండగా, సాగర్‌ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు.

*  రీమేక్‌ సినిమాలు చేయడంలో ఎప్పుడూ ముందుండే కథానాయకుడు వెంకటేష్‌. ఆయన చేతిలో ఇప్పుడున్న సినిమాలు రెండూ రీమేక్‌గా రూపొందుతున్నవే. తమిళంలో విజయవంతమైన ‘అసురన్‌’కి రీమేక్‌గా ‘నారప్ప’ రూపొందుతుండగా మలయాళంలో విజయవంతమైన ‘దృశ్యం2’కి రీమేక్‌గా అదే పేరుతో, అదే బృందంతో వెంకటేష్‌ సినిమాని చేశారు. ఆ రెండు చిత్రాలూ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

* మరో అగ్ర హీరో చిరంజీవి చేతిలోనూ రెండు రీమేక్‌ కథలున్నాయి. మలయాళంలో విజయవంతమైన ‘లూసిఫర్‌’ తెలుగులో చిరు కథానాయకుడిగా తెరకెక్కనుంది. మోహన్‌రాజా దర్శకత్వం వహించనున్నారు. తమిళ చిత్రం ‘వేదాలం’ తెలుగులో చిరంజీవి హీరోగా రూపొందనుంది. ఆ చిత్రం మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో తెరకెక్కనుంది.

యువతరమూ అదే బాట
కొన్నేళ్ల కిందట సీనియర్‌ హీరోలే ఎక్కువగా రీమేక్‌ సినిమాల్లో నటించేవాళ్లు. వాళ్ల ఇమేజ్‌కీ, వయసుకు తగ్గట్టుగా కథలు అరుదుగా తయారవుతుంటాయని భావించి... పొరుగున బాగా ఆడిన సినిమాల్ని వెంటనే రీమేక్‌ కోసమని దిగుమతి చేసుకునేవారు. ఇప్పుడు యువతరం హీరోలూ వీటికి సై అంటున్నారు. నితిన్‌ కథానాయకుడిగా ప్రస్తుతం తెరకెక్కుతున్న ‘మాస్ట్రో’ రీమేకే. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా హిందీలో విజయవంతమైన ‘అంధాదున్‌’కి రీమేక్‌గా రూపొందుతోంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ తమిళంలో ధనుష్‌ కథానాయకుడిగా తెరకెక్కిన ‘కర్ణన్‌’ రీమేక్‌లో బెల్లంకొండ నటించనున్నారు. మరోపక్క తెలుగులో విజయవంతమైన ‘ఛత్రపతి’ సినిమా కూడా, హిందీలో బెల్లంకొండ కథానాయకుడిగా రూపొందుతున్న విషయం తెలిసిందే.
మరికొన్ని..
కన్నడలో విజయవంతమైన ‘లవ్‌ మాక్‌టైల్‌’ తెలుగులో సత్యదేవ్‌, తమన్నా జోడీగా ‘గుర్తుందా శీతాకాలం’ పేరుతో రూపొందుతోంది. తమిళంలో విజయవంతమైన ‘ఓ మై కడవులే’ తెలుగులో విష్వక్‌సేన్‌ హీరోగా తెరకెక్కుతోంది. హిందీ చిత్రం ‘డ్రీమ్‌గాళ్‌’ రాజ్‌తరుణ్‌ కథానాయకుడిగా తెలుగులో రీమేక్‌ అవుతోంది. కొరియన్‌ చిత్రం ‘మిడ్‌నైట్‌ రన్నర్స్‌’ తెలుగులో నివేదా థామస్‌, రెజీనా ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోంది. మలయాళంలో విజయవంతమైన ‘కప్పేలా’ సినిమాని తెలుగులో రీమేక్‌ చేసేందుకు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ హక్కుల్ని కొనుగోలు చేసింది. కన్నడ చిత్రం ‘బెల్‌బాటమ్‌’ కూడా తెలుగులో రీమేక్‌ కానుంది


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని