సాధువులపై దాడి చేసి.. కర్రలతో కొట్టి..
close
Published : 21/04/2020 01:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సాధువులపై దాడి చేసి.. కర్రలతో కొట్టి..

ముంబయి: లాక్‌డౌన్‌ అమలవుతుండగా ఇద్దరు సాధువులు, వారి డ్రైవర్‌పై మహారాష్ట్రలోని పాల్ఘర్‌ జిల్లాలో మూకదాడి జరగడం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. వారు ముగ్గురూ మరణించడంతో పరిస్థితులు అత్యంత సున్నితంగా మారాయి. నిందితులకు కఠిన శిక్షలు పడేలా చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్‌ఠాక్రే స్పష్టం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఘటన గురించి ఆరా తీశారు. ఉత్తర్‌ప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ సైతం ఉద్దవ్‌తో సంభాషించడం గమనార్హం.

ముంబయిలోని కందివలికి చెందిన చిక్నె మహారాజ్‌ కల్పవృక్షగిరి (70), సుశీల్‌గిరి మహరాజ్‌ (35), డ్రైవర్‌ నీలేశ్‌ తెగడె (30)లు అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఈ నెల 16న కారులో కేంద్రపాలితప్రాంతమైన దాద్రానగర్‌కు బయల్దేరారు. గుజరాత్‌లోని సూరత్‌ మీదుగా వారు వెళ్లాల్సి ఉంది. ఈ క్రమంలో పాల్ఘర్‌ జిల్లాకు రాగానే వందల మంది ఆ కారును అడ్డుకున్నారు. వారిని బయటకు లాగి కర్రలతో తీవ్రంగా దాడి చేశారు. కొందరు పోలీసులు సైతం గాయపడ్డారు. కాగా సాధువులను కాపాడటంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని తెలుస్తోంది.

కఠిన చర్యలు: ఉద్దవ్‌

ఘటన జరిగిన వెంటనే అత్యున్నత స్థాయి దర్యాప్తు ఆదేశించామని మహారాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. మూకదాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం ఉద్దవ్‌ ఠాక్రే హామీ ఇచ్చారు. ‘పాల్ఘర్‌ ఘటనపై వెంటనే చర్యలు తీసుకున్నాం. ఇద్దరు సాధువులు, డ్రైవర్‌, పోలీసులపై దాడి చేసిన వారిని పోలీసులు అదే రోజు అరెస్టు చేశారు. ఇలాంటివి చోటు చేసుకోవడం సిగ్గుచేటు. నిందితులకు శిక్ష తప్పదు’ అని ఆయన ట్వీట్‌ చేశారు. ‘పాల్ఘర్‌ ఘటనలో దాడి చేసిన వారూ, బాధితులు వేర్వేరు మతానికి చెందినవారు కాదు. సోషల్‌ మీడియా ద్వారా ఎవరైనా మత విద్వేషాన్ని రెచ్చిగొడుతున్నారేమో పరిశీలించాలని పోలీసుల్ని ఆదేశించాం.  దాడికి పాల్పడ్డవారిలో 101 మందిని పోలీసులు అరెస్టు చేశారు’ అని మహా హోం మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ అన్నారు.

ఆరా తీసిన అమిత్‌ షా

మహారాష్ట్ర సీఎం ఉద్దవ్‌ ఠాక్రేకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సోమవారం ఫోన్‌ చేశారు. పాల్ఘర్‌ ఘటనపై ఆరా తీశారు. అనంతరం ఠాక్రే ఓ వీడియో సందేశం విడుదల చేశారు. మూకదాడి గురించి అమిత్‌ షాకు వివరించానని తెలిపారు. ఘటనకు మతం రంగు పులిమేందుకు ప్రయత్నించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరానన్నారు. తన ప్రభుత్వం దోషులను వదలిపెట్టదని షాకు స్పష్టం చేశానన్నారు.

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ సైతం ఠాక్రేతో ఫోన్‌లో మాట్లాడటం గమనార్హం. ‘సాధువుల హత్యలపై మహారాష్ట్ర సీఎం ఉద్దవ్‌ ఠాక్రేతో నిన్న మాట్లాడాను. కారకులకు కఠిన శిక్ష విధించాలని కోరాను. ఇప్పటికే కొందరిని అరెస్టు చేశామని ఆయన నాకు చెప్పారు. కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు’ అని యోగి హిందీలో ట్వీట్లు చేశారు.

పోలీసుల సస్పెన్షన్‌

పాల్ఘర్‌ మూకదాడి జరుగుతున్నప్పుడు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఇద్దరు పోలీసులను ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. దాడి సమయంలో పోలీసుల పాత్రపై విచారణకు ఆదేశించామని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కాళిదాస్‌ తెలిపారు. లాక్‌డౌన్‌లో ఆ ముగ్గురు ముంబయి నుంచి ఎలా వచ్చారో దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. పోలీసులపై విచారణ తర్వాత కాసా పోలీస్‌ స్టేషన్‌ ఏఎస్సై ఆనంద్‌ కాలె, ఎస్సై సుధీర్‌ కటారెను సస్పెండ్‌ చేసినట్టు తెలిసింది. పోలీసులు ఈ ఘటనలో మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. 101 మందిని అరెస్టు చేశారు. వారిని ఏప్రిల్‌ 30 వరకు పోలీసుల కస్టడీకి పంపించారు. తొమ్మిది మంది జువైనల్స్‌ను రిమాండ్‌ హోమ్‌కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి సోషల్‌ మీడియాలో కొన్ని వీడియోలు వైరల్‌ అవుతున్నాయి.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని