ఉపాధి పోయింది..ఊపిరి ఆగిపోయింది..
close
Published : 16/06/2020 01:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఉపాధి పోయింది..ఊపిరి ఆగిపోయింది..

పట్నా: అతనో సాధారణ ఆటోడ్రైవర్..మూడు చక్రాలు తిరిగితే కానీ పూట గడవని పరిస్థితి. లాక్‌డౌన్‌ వల్ల ప్రజారవాణాపై ఆంక్షలు ఉండటంతో ఉపాధి కోల్పోయి ఇంటికే పరిమితమయ్యాడు. చేతిలో డబ్బు లేదు..తినటానికి ఇంట్లో తిండిలేదు. ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. ఏం చేసయినా తనను నమ్ముకున్న వారికి తిండి పెట్టాలనుకున్నాడు. అప్పుడే అతనికి ఒక ఆలోచన వచ్చింది..దాంతో తన కుటుంబానికి కావాల్సిన సరుకులు ఇంటి వద్దకే వచ్చి చేరాయి. ఇక తిండికి లోటు లేదు.. అయితే తినేందుకు తను మాత్రం లేడు. లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయిన ఎన్నో కుటుంబాల్లో చోటుచేసుకున్న పరిస్థితులకు అద్దం పట్టేలా ఉన్న ఈ ఘటన బిహార్‌ రాజధాని పట్నాలో చోటుచేసుకుంది. 

కుటుంబసభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పట్నా నగరం శివారు ప్రాంతమైన షాపూర్‌కు చెందిన 25 ఏళ్ల ఆటోడ్రైవర్‌ లోన్‌ తీసుకుని ఆటో కొనుగోలు చేశాడు. కరోనా నియంత్రణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ అమలు చేయడంతో ఉపాధి కోల్పోయాడు. ప్రభుత్వం ఇచ్చే నిత్యావసరాలు పొందేందుకు అతని కుటుంబానికి రేషన్‌ కార్డు లేదు. ఎంత వెతికినా చేసేందుకు పని దొరకలేదు. తను చనిపోతే కుటుంబసభ్యులకు ప్రభుత్వం ఆదుకుంటుందని భావించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన రాష్ట్రంలో నిరుద్యోగానికి అద్దం పడుతోందని ప్రతిపక్ష పార్టీలు ఆందోళనలు చేపట్టాయి. దీంతో మేల్కొన్న అధికార యంత్రాంగం బాధితుడి కుటుంబానికి 25 కిలోల బియ్యం, గోధుమలు, నిత్యావసరాలను అందజేసింది. అయితే కొడుకు మృతితో ఆదాయం కోల్పోయిన తమ కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని మృతుడి తండ్రి విజ్ఞప్తి చేశారు. లాక్‌డౌన్‌ కారణంగా వేలాది మంది వలస కార్మికులు తమ సొంత ప్రాంతాలకు తిరుగుపయనమవుతున్నారు. వీరిలో ఎక్కువ మంది బిహార్‌ రాష్ట్రానికి చెందిన వారు. కొద్ది రోజుల క్రితం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పి ప్రజలకు ఉపాధి కల్పించాలని పారిశ్రామివేత్తలను కోరిన విషయం తెలిసిందే.   మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని