డికాక్‌ మెరిసె ముంబయి మురిసె
close
Published : 30/04/2021 02:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

డికాక్‌ మెరిసె ముంబయి మురిసె

రాజస్థాన్‌పై రోహిత్‌సేన విజయం
ఆకట్టుకున్న రాహుల్‌ చాహర్‌

ఇది కదా ముంబయి ఇండియన్స్‌ అంటే! గత రెండు మ్యాచ్‌ల్లో మొదట బ్యాటింగ్‌లో పరుగులు చేయలేక.. ఆ తర్వాత లక్ష్యాన్ని కాపాడుకోలేక ఓటముల పాలై నిరాశపర్చిన జట్టు తిరిగి పంజా విసిరింది. చెన్నైలో వరుసగా రెండు పరాజయాల తర్వాత దిల్లీలో ఆడిన తొలి మ్యాచ్‌లోనే గెలుపు రుచి చూసింది. బౌలింగ్‌లో బుమ్రా తిరిగి జోరు ప్రదర్శించగా.. బ్యాటింగ్‌లో డికాక్‌ మళ్లీ ఫామ్‌ అందుకోగా.. బ్యాటింగ్‌ ఆర్డర్లో ముందు వచ్చిన కృనాల్‌ సత్తాచాటగా.. రాజస్థాన్‌ రాయల్స్‌ను ముంబయి చిత్తుచేసింది. ఆరు మ్యాచ్‌ల్లో రాజస్థాన్‌కిది నాలుగో ఓటమి కాగా.. ముంబయికిది మూడో గెలుపు.

దిల్లీ

ఐపీఎల్‌-14లో ముంబయి ఇండియన్స్‌ మళ్లీ మురిసింది. మైదానంతో పాటు ఆ జట్టు రాత కూడా మారింది. గురువారం మధ్యాహ్న మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో    రాజస్థాన్‌ రాయల్స్‌ను ఓడించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌ 20 ఓవర్లలో 4 వికెట్లకు 171 పరుగులు చేసింది. ఓపెనర్‌ బట్లర్‌ (41; 32 బంతుల్లో 3×4, 3×6), కెప్టెన్‌ శాంసన్‌ (42; 27 బంతుల్లో 5×4) రాణించారు. ప్రత్యర్థి బౌలర్లలో రాహుల్‌ చాహర్‌ (2/33) ఆకట్టుకున్నాడు. బుమ్రా (1/15) కట్టుదిట్టంగా బంతులేశాడు. అనంతరం ఛేదనలో ముంబయి 18.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ డికాక్‌ (70 నాటౌట్‌; 50 బంతుల్లో 6×4, 2×6) అజేయ అర్ధశతకంతో సత్తాచాటాడు.
ఇబ్బంది లేకుండా..: ఛేదనలో ముంబయికి ఎలాంటి ఇబ్బంది లేకపోవడానికి ముఖ్య కారణం డికాక్‌, కృనాల్‌ బ్యాటింగే. ఇన్నింగ్స్‌కు డికాక్‌ ఇరుసులా మారితే.. ఆశ్చర్యంగా బ్యాటింగ్‌ ఆర్డర్లో పొలార్డ్‌, హార్దిక్‌ కంటే ముందుగా నాలుగో స్థానంలో వచ్చిన కృనాల్‌  (39; 26 బంతుల్లో 2×4, 2×6) తన పాత్రకు సరైన న్యాయం చేశాడు. మూడో వికెట్‌కు ఈ జోడీ 63 పరుగులు జోడించి ప్రత్యర్థి నుంచి మ్యాచ్‌ను లాగేసుకుంది. అంతకుముందు క్రీజులో ఉన్నంత సేపు కెప్టెన్‌ రోహిత్‌ (14) ఇబ్బంది పడినప్పటికీ.. డికాక్‌ స్వేచ్ఛగా బ్యాటింగ్‌ చేశాడు.రోహిత్‌ కూడా ఓ సిక్సర్‌తో జోరు అందుకున్నట్లే కనిపించినా.. తొలి పవర్‌ప్లే చివరి బంతికి మోరిస్‌ బౌలింగ్‌లో సులువైన క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. క్రీజులో అడుగుపెట్టగానే సూర్య కుమార్‌ (16) బౌండరీలతో దూకుడు ప్రదర్శించాడు. దీంతో ముంబయి ఛేదన సాఫీగానే సాగుతుందనుకునే దశలో సూర్యను ఔట్‌ చేసిన మోరిస్‌ (2/33) ప్రత్యర్థిని మళ్లీ దెబ్బకొట్టాడు. 10 ఓవర్లకు ఆ జట్టు 87/2తో నిలిచింది. ఆ దశలో కృనాల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ నడిపించే బాధ్యతను డికాక్‌ తీసుకున్నాడు. అదే క్రమంలో అతను 35 బంతుల్లో అర్ధశతకం చేరుకున్నాడు. 12వ ఓవర్లో జట్టు స్కోరు 100 దాటింది. చివరి 7 ఓవర్లలో 61 పరుగులు చేయాల్సిన స్థితిలో ముంబయి విజయం ఖాయమనిపించింది. కృనాల్‌ కచ్చితత్వంతో భారీ షాట్లు ఆడాడు. విజయానికి చివరి 4 ఓవర్లలో 32 పరుగులు అవసరమైన దశలో ముస్తాఫిజుర్‌ (1/37) బౌలింగ్‌లో ఓ సిక్సర్‌ కొట్టిన అతను ఆ వెంటనే ఔటైపోయాడు. కానీ మోరిస్‌ వేసిన 18వ ఓవర్లో తొలి రెండు బంతులను పొలార్డ్‌ (16 నాటౌట్‌) 6, 4గా మలిచాడు. మూడో బంతి అతని హెల్మెట్‌కు బలంగా తాకి బౌండరీకి వెళ్లింది. ఆ తర్వాతి ఓవర్లో డికాక్‌, పొలార్డ్‌ చెరో ఫోర్‌తో మ్యాచ్‌ ముగించారు.
ఆరంభం అదిరినా..: రాజస్థాన్‌కు మంచి ఆరంభం దక్కినప్పటికీ.. ఆఖర్లో వేగంగా ఆడలేకపోవడంతో అనుకున్న దానికంటే ఓ 20 పరుగులు తక్కువే చేసింది. ఓపెనర్లు బట్లర్‌, యశస్వి జైస్వాల్‌ (32; 20 బంతుల్లో 2×4, 2×6) చెలరేగడంతో ఈ సీజన్లోనే మొదటిసారిగా ఒక్క వికెట్‌ కోల్పోకుండా పవర్‌ప్లేను ముగించింది. అగ్రశ్రేణి పేస్‌ ద్వయం బౌల్ట్‌ (1/37), బుమ్రా కట్టుదిట్టంగా బంతులేయడంతో జాగ్రత్తగా ఆడిన ఈ ఓపెనర్లు.. జయంత్‌ (0/37) వేసిన అయిదో ఓవర్‌ నుంచి బాదుడు మొదలెట్టింది. తొలి ఆరు ఓవర్లు ముగిసే సరికి జట్టు 47/0తో నిలిచింది. రాజస్థాన్‌ జోరుగా సాగుతున్న సమయంలో రాహుల్‌ స్పిన్‌తో మాయ చేశాడు. తన వరుస ఓవర్లలో ఓపెనర్లను పెవిలియన్‌ చేర్చాడు. క్రీజులోకి వస్తూనే బాదుడు ప్రారంభించిన కెప్టెన్‌ శాంసన్‌ ఫామ్‌ కొనసాగించాడు. కానీ మరో ఎండ్‌లో దూబె (35; 31 బంతుల్లో 2×4, 2×6) షాట్లు కొట్టేందుకు తీవ్రంగా శ్రమించాడు. దీంతో 15 ఓవర్లకు ఆ జట్టు స్కోరు.. 126/2. ఆ దశలో బౌల్ట్‌ వేసిన ఆ తర్వాతి ఓవర్లో శాంసన్‌ వరుసగా రెండు ఫోర్లతో ఇన్నింగ్స్‌ వేగం పెంచేందుకు ప్రయత్నించాడు. కానీ 17వ ఓవర్లో బుమ్రా 5 పరుగులే ఇవ్వడం, ఆ తర్వాతి ఓవర్లో దూకుడు మీదున్న శాంసన్‌ ఔటవడంతో రాజస్థాన్‌ భారీస్కోరు కష్టమే అనిపించింది. అందుకు తగినట్లే 19వ ఓవర్లో కేవలం నాలుగు పరుగులే ఇచ్చిన బుమ్రా.. దూబేను ఔట్‌ చేశాడు. ఇన్నింగ్స్‌ చివరి ఓవర్లో 12 పరుగులు రావడంతో జట్టు స్కోరు 170 దాటింది.


* ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌ రాయల్స్‌ 171 పరుగులు చేసింది. గత రెండు ఐపీఎల్‌ మ్యాచ్‌ల్లోనూ తొలి ఇన్నింగ్స్‌లో సరిగ్గా ఇదే స్కోరు నమోదవడం విశేషం. బుధవారం సీఎస్కేతో మ్యాచ్‌లో మొదట సన్‌రైజర్స్‌ 171/3 స్కోరు చేయగా.. మంగళవారం దిల్లీ క్యాపిటల్స్‌తో పోరులో ఆర్సీబీ 171 (5 వికెట్లకు) పరుగులు చేసింది.


రాజస్థాన్‌ రాయల్స్‌ ఇన్నింగ్స్‌: బట్లర్‌ (స్టంప్డ్‌) డికాక్‌ (బి) చాహర్‌ 41; జైస్వాల్‌ (సి) అండ్‌ (బి) చాహర్‌ 32; శాంసన్‌ (బి) బౌల్ట్‌ 42; దూబె (సి) అండ్‌ (బి) బుమ్రా 35; మిల్లర్‌ నాటౌట్‌ 7; పరాగ్‌ నాటౌట్‌ 8; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం: (20 ఓవర్లలో 4 వికెట్లకు) 171; వికెట్ల పతనం: 1-66, 2-91, 3-148, 4-158; బౌలింగ్‌: బౌల్ట్‌ 4-0-37-1; బుమ్రా 4-0-15-1; జయంత్‌ 3-0-37-0; కౌల్టర్‌నైల్‌ 4-0-35-0; రాహుల్‌ చాహర్‌ 4-0-33-2; కృనాల్‌ 1-0-12-0
ముంబయి ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ (సి)  సకారియా (బి) మోరిస్‌ 14; డికాక్‌ నాటౌట్‌ 70; సూర్యకుమార్‌ (సి) బట్లర్‌ (బి) మోరిస్‌ 16; కృనాల్‌ (బి) ముస్తాఫిజుర్‌ 39; పొలార్డ్‌ నాటౌట్‌ 16; ఎక్స్‌ట్రాలు 17; మొత్తం: (18.3 ఓవర్లలో 3 వికెట్లకు) 172; వికెట్ల పతనం: 1-49, 2-83, 3-146; బౌలింగ్‌: చేతన్‌ సకారియా 3-0-18-0;  ఉనద్కత్‌ 4-0-33-0; ముస్తాఫిజుర్‌ 3.3-0-37-1; మోరిస్‌ 4-0-33-2; తెవాతియా 3-0-30-0; శివమ్‌ దూబె 1-0-6-0


 


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని