వార్నర్‌పై వేటు
close
Published : 02/05/2021 01:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వార్నర్‌పై వేటు

కెప్టెన్‌గా తొలగింపు
సన్‌రైజర్స్‌ కఠిన నిర్ణయం
విలియమ్సన్‌కు పగ్గాలు
దిల్లీ

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చేది.. డేవిడ్‌ వార్నర్‌. కెప్టెన్‌గా, ఆటగాడిగా.. అతనికి, ఆ జట్టుకు విడదీయరాని అనుబంధం ఉంది. ‘‘వార్నర్‌ అన్న’’ అంటూ తెలుగు అభిమానులు అతణ్ని సొంతవ్యక్తిగా భావించడానికి కారణం అదే. సారథిగా ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌కు ఇప్పటివరకూ ఏకైక ట్రోఫీ అందించిన అతను.. బ్యాట్స్‌మన్‌గా ఒంటిచేత్తో జట్టుకు ఎన్నో గొప్ప విజయాలు కట్టబెట్టాడు. కానీ ఈ సీజన్లో విఫలమవుతున్నాడంటూ కెప్టెన్‌గా అతణ్ని తప్పించిన సన్‌రైజర్స్‌ షాకిచ్చింది. అతని స్థానంలో మిగిలిన మ్యాచ్‌లకు సారథిగా విలియమ్సన్‌ కొనసాగుతాడని ప్రకటించింది.

ఐపీఎల్‌ 14వ సీజన్లో పేలవ ప్రదర్శన కొనసాగిస్తున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. దిద్దుబాటు చర్యల్లో భాగంగా కెప్టెన్‌ వార్నర్‌పై కఠినంగా వ్యవహరించి వేటు వేసింది. ఈ సీజన్‌లో మిగతా మ్యాచ్‌లకు కేన్‌ విలియమ్సన్‌ సారథిగా కొనసాగుతాడని శనివారం ప్రకటించి ఆశ్చర్యపరిచింది. ‘‘ఆదివారం రాజస్థాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌కు విలియమ్సన్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ప్రకటించాలనుకుంటుంది. ఐపీఎల్‌ 2021లో మిగతా మ్యాచ్‌లకూ అతనే సారథిగా కొనసాగుతాడు. అంతే కాకుండా రాజస్థాన్‌తో మ్యాచ్‌కు విదేశీ ఆటగాళ్ల కూర్పులో మార్పులు చేయాలని జట్టు మేనేజ్‌మెంట్‌ నిర్ణయించింది. గత కొన్నేళ్లుగా జట్టుపై వార్నర్‌ ప్రభావాన్ని గౌరవించిన మేనేజ్‌మెంట్‌కు ఈ నిర్ణయం అంత సులువైంది కాదు. ఈ మిగిలిన సీజన్‌లో జట్టు విజయాల కోసం అతను మైదానంలో, బయట సహకారం కొనసాగిస్తాడనే నమ్మకంతో ఉన్నాం’’ అని ఓ పత్రిక ప్రకటనను సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఫ్రాంఛైజీ ట్విట్టర్‌లో పోస్టు చేసింది.
ఎందుకు?
ఈ సీజన్‌లో ఇప్పటివరకూ ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్‌ ఒక్క విజయం మాత్రమే సాధించి పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది. కెప్టెన్‌గా జట్టుకు విజయాలు అందించలేకపోతున్న వార్నర్‌.. బ్యాట్స్‌మన్‌గానూ విఫలమవుతున్నాడు. ఆరు ఇన్నింగ్స్‌లో వరుసగా 3, 54, 36, 37, 6, 57 పరుగులు చేశాడు. ఈ గణాంకాల పరంగా చూస్తే అతని ప్రదర్శన మరీ తీసికట్టుగా లేకపోయినా జట్టు ఆశించిన స్థాయిలో మాత్రం తను రాణించట్లేదు. అయితే కేవలం కెప్టెన్సీ వైఫల్యం, బ్యాట్స్‌మన్‌గా పరుగులు చేయకపోవడంతోనే అతణ్ని సారథిగా తొలగించారని చెప్పలేం. ఎందుకంటే గతంలోనూ జట్టు ఇలా వెనకబడ్డపుడు.. తన నాయకత్వంతో, బ్యాటింగ్‌తో తిరిగి విజయాల బాట పట్టించాడు. ఈ నేపథ్యంలో అతణ్ని ఇప్పుడు కెప్టెన్సీ నుంచి తొలగించడానికి ప్రదర్శన ఒక్కటే కారణం కాదని మేనేజ్‌మెంట్‌తో ఉన్న విభేధాలు కూడా కారణమని తెలుస్తోంది. ఈ సీజన్లో కొన్ని మ్యాచ్‌లకు మనీశ్‌ పాండేను తుదిజట్టులోకి తీసుకోకపోవడంపై జట్టు సెలక్టర్లపై వార్నర్‌ అసంతృప్తి వ్యక్తం చేశాడు. మరికొన్ని విషయాల్లోనూ మేనేజ్‌మెంట్‌తో అతనికి చెడిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. వార్నర్‌కు చివరికి తుది జట్టులోనూ చోటు దక్కకపోవచ్చేమో అన్న అనుమానాలు పెరుగుతున్నాయి.
అతని ప్రభావం..
2014లో సన్‌రైజర్స్‌తో చేరిన వార్నర్‌.. 2015లో జట్టు పగ్గాలు స్వీకరించాడు. 2016లో జట్టును విజేతగా నిలిపాడు. ఇప్పటివరకూ ఐపీఎల్‌లో ఆ జట్టుకిదే ఏకైక టైటిల్‌. ఆ తర్వాతి ఏడాది ప్లేఆఫ్స్‌ చేర్చాడు. బాల్‌ టాంపరింగ్‌ నిషేధం వల్ల 2018 సీజన్‌కు దూరమైన అతను.. 2019లో ఆటగాడిగానే కొనసాగాడు. నిరుడు తిరిగి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టి జట్టును ప్లేఆఫ్స్‌ తీసుకెళ్లాడు. ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు (5447) చేసిన విదేశీ ఆటగాళ్లలో అగ్రస్థానం అతనిదే. 50 అర్ధసెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్‌మన్‌గా కొనసాగుతున్నాడు. 2014 నుంచి ఆడిన ప్రతి సీజన్‌లోనూ కనీసం 500 పరుగులు చేశాడు. అత్యధిక సార్లు ఆరెంజ్‌ క్యాప్‌ (2015, 2017, 2019) అందుకున్న ఆటగాడూ అతనే. దూకుడైన బ్యాటింగ్‌తో.. నిలకడగా ఓపెనింగ్‌లో రాణిస్తూ జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. 2016లో ఆ జట్టు విజేతగా నిలవడంలో అతనిదే కీలక పాత్ర.
మార్పు మంచికేనా?
ఇప్పటికే ఆరు మ్యాచ్‌ల్లో ఒకే విజయంతో ఉన్న సన్‌రైజర్స్‌ ప్లేఆఫ్‌ అవకాశాలు సంక్లిష్టంగానే కనిపిస్తున్నాయి. ఆ జట్టు ప్లేఆఫ్‌ రేసులో నిలవాలంటే ఆడబోయే ఎనిమిది మ్యాచ్‌ల్లో ఏడింట్లో నెగ్గాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో కెప్టెన్‌గా వార్నర్‌ను తప్పించి ఆ భారాన్ని విలియమ్సన్‌పై మోపడం ఏ మేరకు సమంజసమో అర్థం కావట్లేదు. ఇప్పటికే ఓటముల బాధలో ఉన్న జట్టుకు.. ఈ పరిణామం మరింత ప్రతికూలంగా మారే ప్రమాదం లేకపోలేదు. న్యూజిలాండ్‌ సారథిగా అంతర్జాతీయ క్రికెట్లో మంచి పేరున్న విలియమ్సన్‌ నాయకత్వ లక్షణాలను ప్రశ్నించే అవసరం లేదు. వార్నర్‌ గైర్హాజరీలో 2018లో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన అతను జట్టును ఫైనల్‌ చేర్చాడు. మొత్తంగా ఐపీఎల్‌లో 26 మ్యాచ్‌లకు సారథిగా వ్యవహరించిన అతను 14 విజయాలు సాధించాడు. అయితే కెప్టెన్‌ మారగానే జట్టు గెలుపు బాట పడుతుందని చెప్పలేం. అందుకు తుది జట్టు కూర్పు ముఖ్యం. అది సరిగ్గా ఉండట్లేదనే వార్నర్‌ అసంతృప్తి వ్యక్తం చేశాడు. మరోవైపు ఆటగాడిగానూ అతణ్ని జట్టుకు దూరం పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. తన స్థానంలో జేసన్‌ రాయ్‌ లేదా హోల్డర్‌ ఆడే వీలుంది. ఈ పరిస్థితుల నడుమ జట్టు అద్భుత ప్రదర్శన చేస్తుందనే ఆశలైతే కనిపించడం లేదనే చెప్పాలి. ఇక వార్నర్‌పై వేటు వేసిన సన్‌రైజర్స్‌ను అభిమానులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ప్రపంచ అగ్రశ్రేణి ఆటగాడైన వార్నర్‌ విషయంలో అలా ప్రవర్తించడం సరికాదంటూ విమర్శలు చేస్తున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని