ధావన్‌ ధనాధన్‌
close
Published : 03/05/2021 02:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ధావన్‌ ధనాధన్‌

దిల్లీ చేతిలో పంజాబ్‌ చిత్తు
రాణించిన పృథ్వీ, అక్షర్‌

దిల్లీ అదరహో. సూపర్‌ఫామ్‌ను కొనసాగిస్తోన్న పంత్‌ జట్టు ప్లేఆఫ్స్‌ దిశగా వడివడిగా అడుగులేస్తోంది. ఆల్‌రౌండ్‌ ఆధిపత్యంతో ఆరో విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికీ దూసుకెళ్లింది. బంతితో రాణించి, బ్యాటుతో దంచేసిని దిల్లీ ఆదివారం పంజాబ్‌ను చిత్తుగా ఓడించింది. ధావన్‌ బాధ్యతాయుత, ధాటైన బ్యాటింగ్‌తో దిల్లీ పని తేలికైంది. మయాంక్‌ అగర్వాల్‌ సూపర్‌ ఇన్నింగ్స్‌ వృథా అయింది. పంజాబ్‌కు ఇది అయిదో ఓటమి.

అహ్మదాబాద్‌

దిల్లీ క్యాపిటల్స్‌ సత్తా చాటింది. సాధికారికంగా ఆడిన ఆ జట్టు 7 వికెట్ల తేడాతో పంజాబ్‌ కింగ్స్‌పై విజయం సాధించింది. మయాంక్‌ అగర్వాల్‌ (99 నాటౌట్‌; 58 బంతుల్లో 8×4, 4×6) చెలరేగడంతో మొదట పంజాబ్‌ 6 వికెట్లకు 166 పరుగులు చేసింది. రబాడ (3/36), అక్షర్‌ పటేల్‌ (1/21) బంతితో పంజాబ్‌ను దెబ్బతీశారు. శిఖర్‌ ధావన్‌ (69 నాటౌట్‌; 47 బంతుల్లో 6×4, 2×6), పృథ్వీ షా (39; 22 బంతుల్లో 3×4, 3×6)  మెరవడంతో లక్ష్నాన్ని దిల్లీ 17.4 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు కోల్పోయి అలవోకగా ఛేదించింది.
మెరిసిన ధావన్‌: ఫామ్‌ కొనసాగిస్తూ పృథ్వీ షా చెలరేగడంతో ఛేదనలో దిల్లీకి కళ్లు చెదిరే ఆరంభం లభించింది. కళ్లు చెదిరే షట్లతో అలరించిన షా..  షమి వేసిన ఇన్నింగ్స్‌ రెండో ఓవర్లో వరుసగా 6, 4, 4 కొట్టాడు. ఆ తర్వాత కూడా అతడి దూకుడేమీ తగ్గలేదు. బౌలర్లపై ఎదురుదాడికి దిగుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. మరోవైపు ధావన్‌ కూడా వీలైనప్పుడు బౌండరీ సాధించడంతో దిల్లీ ఆరు ఓవర్లలో 63/0తో తిరుగులేని స్థితిలో నిలిచింది. కానీ ఏడో ఓవర్లో ఎడమచేతి వాటం స్పినర్‌ బరార్‌ ఓ చక్కని డెలివరీతో పృథ్వీ షాను బౌల్డ్‌ చేయడంతో పరుగుల వేగానికి కాసేపు కళ్లెం పడింది. కానీ ధావన్‌ తొందరపడలేదు. బాధ్యతాయుతంగా ఆడాడు. నియంత్రణతో ఆడుతూనే దూకుడును ప్రదర్శిస్తూ.. స్మిత్‌ (24; 22 బంతుల్లో 1×4)తో కలిసి జట్టును లక్ష్యం దిశగా నడిపించాడు. అతడితో కలిసి రెండో వికెట్‌కు 48 పరుగులు జోడించాడు. 13వ ఓవర్లో స్మిత్‌ నిష్క్రమించేటప్పటికి స్కోరు 111. కానీ పంజాబ్‌కు ఒత్తిడి పెంచే అవకాశం ఇవ్వలేదు ధావన్‌. బిష్ణోయ్‌ బౌలింగ్‌లో సిక్స్‌, రెండు ఫోర్లు బాది జట్టును లక్ష్యానికి మరింత చేరువ చేశాడు. చివరి ఆరు ఓవర్లలో విజయానికి దిల్లీ చేయాల్సింది 41 పరుగులే. ధావన్‌ ఎలాంటి తడబాటు లేకుండా పంత్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించాడు. 17వ ఓవర్లో జట్టు స్కోరు 147 వద్ద పంత్‌ (14) మూడో వికెట్‌ రూపంలో నిష్క్రమించినా... దిల్లీకి ఆందోళన చెందాల్సిన అవసరం లేకపోయింది. మరోవైపు ధావన్‌ ఉండగా.. హెట్‌మయర్‌ (16 నాటౌట్‌; 4 బంతుల్లో 1×4, 2×6) భారీ షాట్లు ఆడడంతో త్వరగానే పని పూర్తయిపోయింది.

పంజాబ్‌ కట్టడి: ఇన్నింగ్స్‌ చాలా భాగం సాగిన తీరు చూస్తే అంతకుముందు పంజాబ్‌ మెరుగైన స్కోరు సాధించినట్లే. ఆ జట్టుకు పోటీ పడదగ్గ స్కోరు అందించిన ఘనత మయాంక్‌ అగర్వాల్‌దే. రబాడ దెబ్బతీయడంతో పవర్‌ప్లే ముగిసే సరికి పంజాబ్‌ 39కే రెండు వికెట్లు కోల్పోయింది. మయాంక్‌ అగర్వాల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ ఆరంభించిన ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (12) త్వరగానే నిష్క్రమించాడు. నాలుగో ఓవర్లో రబాడ అతణ్ని ఔట్‌ చేశాడు. రబాడే తన తర్వాతి ఓవర్లో ఫుల్‌టాస్‌తో గేల్‌ (13)ను బౌల్డ్‌ చేశాడు. మరో వైపు మయాంక్‌ నిలిచినా బ్యాట్‌ ఝుళిపించలేకపోయాడు. మలన్‌ (26; 26 బంతుల్లో 1×4, 1×6) కూడా అంతే.. ఎక్కువగా సింగిల్స్‌కే పరిమితమయ్యాడు. అవేష్‌ ఖాన్‌, అక్షర్‌ కూడా పొదుపుగా బౌలింగ్‌ చేశారు. 10 ఓవర్లకు స్కోరు 63/2. ఆ తర్వాత కూడా పరిస్థితిలో మార్పేమీ లేదు. 14వ ఓవర్లో అక్షర్‌.. మలన్‌ను బౌల్డ్‌ చేయగా.. అదే ఓవర్లో సమన్వయ లోపంతో దీపక్‌ హుడా (1) రనౌటయ్యాడు. అప్పటికి స్కోరు 88 పరుగులు మాత్రమే. కానీ ఊహించింనదానికంటే మెరుగైన స్కోరుతోనే పంజాబ్‌ ఇన్నింగ్స్‌ను ముగించింది. చివరి ఆరు ఓవర్లలో 76   పరుగులు పిండుకుంది. ఇందుకు ప్రధాన కారణం మయాంక్‌ అగర్వాల్‌. అతడు గేర్‌ మార్చడంతోనే స్కోరు వేగం బాగా పెరిగింది. 15వ ఓవర్లో రబాడ బంతిని మిడ్‌ వికెట్లోకి సిక్స్‌ కొట్టిన మయాంక్‌.. ఆ తర్వాత ఇషాంత్‌ బౌలింగ్‌లో 4, 6 కొట్టాడు. అక్షర్‌ బౌలింగ్‌లో వరుసగా రెండు బంతులను బౌండరీ దాటించాడు. రబాడ వేసిన 19వ ఓవర్లో ఓ సిక్స్‌ కొట్టిన అతడు.. ఆఖరి ఓవర్లో అవేష్‌ ఖాన్‌ చివరి మూడు బంతులకు వరుసగా 4, 6, 4 రాబట్టి ఇన్నింగ్స్‌కు మెరుపు ముగింపునిచ్చాడు. మరోవైపు షారుక్‌ ఖాన్‌, జోర్డాన్‌ ఔటైనా మయాంక్‌ జోరు కొనసాగింది. పంజాబ్‌ చివరి 76 పరుగుల్లో 62 మయాంక్‌వే..

పంజాబ్‌ ఇన్నింగ్స్‌: ప్రభ్‌సిమ్రన్‌సింగ్‌ (సి) స్మిత్‌ (బి) రబాడ 12; మయాంక్‌ అగర్వాల్‌ నాటౌట్‌ 99; గేల్‌ (బి) రబాడ 13; మలన్‌ (బి) అక్షర్‌ 26; దీపక్‌ హుడా రనౌట్‌ 1; షారుక్‌ ఖాన్‌ (సి) హెట్‌మయర్‌ (బి) అవేష్‌ ఖాన్‌ 4; జోర్డాన్‌ (సి) లలిత్‌ యాదవ్‌ (బి) రబాడ 2; హర్‌ప్రీత్‌ బరార్‌ నాటౌట్‌ 4; ఎక్స్‌ట్రాలు 5 మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 166; వికెట్ల పతనం: 1-17, 2-35, 3-87, 4-88, 5-129, 6-143; బౌలింగ్‌: ఇషాంత్‌ శర్మ 4-1-37-0; స్టాయినిస్‌ 1-0-6-0; రబాడ 4-0-36-3; అవేష్‌ ఖాన్‌ 4-0-39-1; లలిత్‌ యాదవ్‌ 3-0-25-0; అక్షర్‌ పటేల్‌ 4-0-21-1
దిల్లీ ఇన్నింగ్స్‌: పృథ్వీ షా (బి) బరార్‌ 39; ధావన్‌ నాటౌట్‌ 69; స్మిత్‌ (సి) మలన్‌ (బి) మెరిడిత్‌ 24; పంత్‌ (సి) మయాంక్‌ (బి) జోర్డాన్‌ 14; హెట్‌మయర్‌ నాటౌట్‌ 16; ఎక్స్‌ట్రాలు 4 మొత్తం: (17.4 ఓవర్లలో 3 వికెట్లకు) 167; వికెట్ల పతనం: 1-63, 2-111, 3-147; బౌలింగ్‌: మెరిడిత్‌ 3.4-0-35-1; షమి 3-0-37-0; బిష్ణోయ్‌ 4-0-42-0; జోర్డాన్‌ 2-0-21-1; హర్‌ప్రీత్‌ బరార్‌ 3-0-19-1; దీపక్‌ హుడా 2-0-11-0



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని