33 ఏళ్ల రికార్డు బద్దలు
close
Published : 01/08/2021 02:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

33 ఏళ్ల రికార్డు బద్దలు

మహిళల 100 మీ. స్వర్ణం ఎలేన్‌ థాంప్సన్‌దే
ఫ్రేజర్‌కు రజతమే.. షెరికాకు కాంస్యం
మూడు పతకాలూ జమైకా అథ్లెట్లవే

టోక్యో: అనుకున్నదే అయింది. మహిళల వంద మీటర్ల పరుగులో జమైకా అథ్లెట్లదే ఆధిపత్యం. స్వర్ణం, రజతం, కాంస్యం.. ఏ పతకాన్ని వేరే వాళ్లకు వదల్లేదు ఆ దేశ అమ్మాయిలు. రియోలో స్వర్ణం గెలిచి, ఈసారి హాట్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన ఎలేన్‌ థాంప్సన్‌ హెరా.. అంచనాలకు తగ్గ ప్రదర్శనే చేసింది. 33 ఏళ్ల నాటి ఒలింపిక్‌ రికార్డును బద్దలు కొడుతూ ఆమె స్వర్ణం గెలవడం విశేషం. ఎలేన్‌ 10.61 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుంది. దీంతో 1988 సియోల్‌ ఒలింపిక్స్‌లో 10.62 సెకన్ల టైమింగ్‌తో ఫ్లోరెన్స్‌ గ్రిఫిత్‌ జాయ్‌నర్‌ (అమెరికా) నెలకొల్పిన రికార్డు బద్దలైంది. ఫ్లోరెన్స్‌ తర్వాత ఇన్నేళ్లలో ఒలింపిక్స్‌లో ఏ అథ్లెట్‌ 10.7 సెకన్ల లోపు టైమింగే నమోదు చేయలేదు. మహిళల 100 మీ.లో ప్రపంచ రికార్డు సైతం ఫ్లోరెన్స్‌ పేరిటే ఉంది. సియోల్‌ ఒలింపిక్స్‌ జరిగిన 1988లోనే ఆమె 10.49 సెకన్ల టైమింగ్‌తో రికార్డు నెలకొల్పింది. ఒలింపిక్స్‌ 100 మీ.లో మూడో స్వర్ణంతో చరిత్ర సృష్టించాలనుకున్న షెల్లీ ఆన్‌ ఫ్రేజర్‌ ఆశలకు ఎలేన్‌ గండికొట్టింది. ఆమెను రజతానికి పరిమితం చేసింది. ఫ్రేజర్‌ 10.74 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుంది. ఒలింపిక్స్‌లో తొలిసారి 100 మీ.లో పోటీ పడ్డ షెరికా జాక్సన్‌ 10.76 సెకన్ల టైమింగ్‌తో కాంస్యం గెలిచింది. రేసు సగం వరకు ఫ్రేజర్‌తో సమానంగానే ఎలేన్‌ సాగినా.. మధ్య నుంచి ముందంజ వేసింది. షెరికా ఆరంభంలో పతకానికి పోటీలోనే ఉన్నట్లు కనిపించలేదు. కానీ రెండో అర్ధంలో గొప్పగా పుంజుకుని మూడో స్థానం సాధించింది. 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌లోనూ మహిళల 100 మీ.లో మూడు పతకాలూ జమైకాకే సొంతం అయ్యాయి.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని