Virat Kohli: కోహ్లీ.. ఎందుకీ నిర్ణయం
close
Updated : 17/09/2021 09:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Virat Kohli: కోహ్లీ.. ఎందుకీ నిర్ణయం

ఈనాడు క్రీడావిభాగం

కోహ్లి వన్డే, టీ20 పగ్గాలు వదిలేస్తున్నాడట.. ఇటీవల ఒక రోజంతా జోరుగా ప్రచారం సాగిన వార్త ఇది. కానీ ఆ వదంతుల్ని బీసీసీఐ కొట్టి పారేసింది. కానీ రెండు రోజుల తిరిగేసరికి.. తాను టీ20 పగ్గాలు వదిలేస్తున్నట్లు ప్రకటించి ఆశ్చర్యానికి గురి చేశాడు కోహ్లి. మరి విరాట్‌ ఈ నిర్ణయానికి ఎందుకొచ్చాడు..? ఇప్పుడే ఎందుకీ నిర్ణయాన్ని ప్రకటించాడు..?

మేటి బ్యాట్స్‌మెన్‌గా పేరున్న చాలామంది కెప్టెన్సీ భారాన్ని మోయలేక విడిచిపెట్టిన వాళ్లే. కానీ కోహ్లి మాత్రంకెప్టెన్సీ తనకే మాత్రం భారం కాదని చాటుతూ బ్యాట్‌తో గొప్పగా రాణించాడు. కానీ గత రెండేళ్లుగా అతని ప్రదర్శన స్థాయికి తగ్గట్లు లేదన్నది నిజం. మూడు ఫార్మాట్లలోనూ నిరాశపరుస్తున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో గత 53 ఇన్నింగ్స్‌ల్లో ఒక్క సెంచరీ కూడా చేయలేదు. ఇదే సమయంలో పరిమిత ఓవర్ల క్రికెట్లో విరాట్‌ కెప్టెన్సీపై విమర్శలు పెరుగుతున్నాయి. విరాట్‌ ఇప్పటిదాకా ఒక్క ఐసీసీ ట్రోఫీగా అందుకోలేకపోయాడు. ఐపీఎల్‌లో ఆర్సీబీని ఒక్కసారి కూడా విజేతగా నిలపకపోవడాన్ని అతని నాయకత్వ లోపంగా చూస్తున్నారు. మరోవైపు రోహిత్‌ నాయకత్వంలో ముంబయి అయిదుసార్లు టైటిల్‌ గెలిచింది. దీంతో టీ20లకు రోహిత్‌ను సారథిగా నియమించాలన్న డిమాండ్‌ పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే కోహ్లి నిర్ణయం తీసుకున్నాడనిపిస్తోంది.

ఇప్పుడే ఎందుకు?: భారత క్రికెట్లో గతంలో ఓటమికి బాధ్యత వహిస్తూ కెప్టెన్సీకి ఆటగాళ్లు రాజీనామా చేసే సంస్కృతి ఉండేది. కానీ 2007 తర్వాత అలాంటి పరిణామాలు ఎప్పుడూ చోటు చేసుకోలేదు. నాయకత్వ బదలాయింపు సాఫీగా సాగిపోతోంది. ధోని చేతుల్లో నుంచి కోహ్లి అలాగే పగ్గాలు స్వీకరించాడు. కోహ్లి టీ20 కెప్టెన్‌గా దిగిపోతానని ప్రకటించడం వెనక కూడా ఇదే సానుకూల వైఖరి కనిపిస్తోంది. ఒకవేళ కోహ్లి ఇప్పుడీ ప్రకటన చేయకుండా, ప్రపంచకప్‌కు వెళ్లి అక్కడ జట్టు టైటిల్‌ గెలవకపోతే.. కెప్టెన్‌గా అతణ్ని తప్పించాలనే డిమాండ్‌ బలపడుతుంది. ఆ స్థితిలో కెప్టెన్సీకి గుడ్‌బై చెబితే అదొక అవమానంలా కనిపించొచ్చు. అది వివాదంగా మారొచ్చు. ఒకవేళ టీమ్‌ఇండియా ప్రపంచకప్‌ గెలిస్తే.. కోహ్లి సగర్వంగా టీ20 నాయకత్వ బాధ్యతల తప్పుకొన్నట్లవుతుంది. అందుకే కోహ్లి ఇప్పుడే ఈ నిర్ణయం ప్రకటించినట్లు తెలుస్తోంది.

వారసుడెవరు?: కోహ్లి ప్రకటనతో ఇప్పుడిక టీ20ల్లో అతని వారసుడు ఎవరనే చర్చ జోరుగా సాగుతోంది. ఐపీఎల్‌లో ముంబయిని అయిదుసార్లు విజేతగా నిలపడమే పేరు తెచ్చుకోవడమే కాక.. కోహ్లి అందుబాటులో లేనపుడు భారత జట్టును చక్కగా నడిపించిన రోహిత్‌  పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. కానీ కోహ్లి కంటే రెండేళ్లు పెద్దవాడు, ఇంకో మూణ్నాలుగేళ్లలో రిటైరయ్యే అవకాశమున్న 34 ఏళ్ల రోహిత్‌కు కుర్రాళ్ల ఆటైన టీ20 ఫార్మాట్లో కెప్టెన్సీ అప్పగించడం సరైందేనా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకుని రాహుల్‌, శ్రేయస్‌, పంత్‌ లాంటి యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. మరి బీసీసీఐ ఏం చేస్తుందో చూడాలి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని