మళ్లీ జరిగితే చేతులు కట్టుకుని కూర్చోం:పవన్‌
close
Published : 15/01/2020 00:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మళ్లీ జరిగితే చేతులు కట్టుకుని కూర్చోం:పవన్‌

కాకినాడ: తమవైపు నుంచి ఎలాంటి కవ్వింపు లేకున్నా వైకాపా నేతలు దూషించి దాడి చేశారని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆరోపించారు. వైకాపా నేతల భాష దారుణంగా ఉందన్నారు. కాకినాడలో ఇటీవల వైకాపా దాడిలో గాయపడిన జనసేన కార్యకర్తలను పవన్‌ పరామర్శించారు. అనంతరం హెలికాన్‌ టైమ్స్‌ వద్ద  నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కారణం లేకుండా తమపై దాడికి పాల్పడితే పోలీసు శాఖ చోద్యం చూడటం బాధ కలిగించిందన్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. నిరసనలు తెలిపే హక్కు తమకూ ఉందన్నారు.

ద్వారంపూడిపై కేసు నమోదు చేయాలి

కాకినాడ ఘటనకు బాధ్యుడిగా స్థానిక ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డిపై కేసు నమోదు చేయాలని పవన్‌ డిమాండ్‌ చేశారు. తాము శాంతిభద్రతల సమస్య సృష్టిస్తే మీరెవరూ ఉండలేరని వ్యాఖ్యానించారు. ‘ఇంకోసారి జనసేన కార్యకర్తలపై ఇలాంటి దాడులు జరిగితే మేం చేతులు కట్టుకొని కూర్చోబోం’ అని హెచ్చరించారు. తాము చాలా బాధ్యతగా రాజకీయాలు చేస్తున్నామని చెప్పారు. ఈ దాడులకు కారణమైన వైకాపా నేతలు, కార్యకర్తలపై కేసులు నమోదు చేయాలన్నారు. ఈ ఘటనకు బాధ్యులను చేస్తూ కారణమైన ఇద్దరు పోలీసు అధికారులను సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. 

ఫ్యాక్షన్‌ సంస్కృతికి ప్రజలు సహకరించరు

సంక్రాంతి సమయంలో ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని పవన్‌ అన్నారు. పండుగ వాతావరణం కలుషితమవడానికి వైకాపా నేతల భాషే కారణమని.. ఈ తరహా భాష వాడటం ఇదే ఆఖరిసారి కావాలన్నారు. కేసులు పెడతామంటే జనసేన ఎప్పుడూ భయపడదని చెప్పారు. తెగించే రాజకీయాల్లోకి వచ్చామని ఆయన స్పష్టం చేశారు. వైకాపా నేతలు ఇదే పంథా కొనసాగిస్తే ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. అధికారం ఎల్లవేళలా ఉండదనే విషయాన్ని వాళ్లు గుర్తు పెట్టుకోవాలన్నారు. పాలెగాళ్ల రాజ్యం, ఫ్యాక్షన్‌ సంస్కృతి తెస్తామంటే ప్రజలు సహించరని.. సుస్థిరపాలన ఇవ్వాలని వైకాపా ప్రభుత్వానికి పవన్‌ సూచించారు.

భాజపాతో కలిసి వెళ్లడంపై ఈనెల 16న కీలక భేటీ

రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కేంద్ర ప్రభుత్వ పెద్దలు, భాజపా నేతలతో చర్చించామని పవన్‌ చెప్పారు. దిల్లీ పర్యటన వివరాలను ఆయన వివరించారు. రాజధాని రైతుల సమస్యలు, రాష్ట్రంలో పెట్టుబడులు వెనక్కిపోవడం, అమరావతిలో 144 సెక్షన్‌ విధించడం తదితర అంశాలపై చెప్పామని తెలిపారు. దీనిపై కొద్దిరోజులుగా సంభాషణలు జరుగుతున్నాయని తెలిపారు. ఏ ఆశయాలతో ప్రధాని మోదీ ముందుకెళ్తున్నారో ఏపీలో మాత్రం ఆ పరిస్థితి లేదని వివరించామన్నారు. రాష్ట్రానికి బలమైన సహాయ సహకారాలు కావాలని.. దీనిపై దృష్టి సారించాలని భాజపాను కోరామని పవన్‌ చెప్పారు. ఈనెల 16న ఉదయం 11 గంటలకు విజయవాడలో కీలక సమావేశం ఏర్పాటుచేసి భాజపాతో కలిసి వెళ్లడంపై సంయుక్త ప్రకటన చేస్తామని ఆయన స్పష్టం చేశారు.  

రాపాకపై ఎలాంటి ఒత్తిడులు ఉన్నాయో?

అధికార వికేంద్రీకరణపై ఎన్నికల ముందే వైకాపా చెప్పాల్సిందని పవన్‌ అన్నారు. రాజధాని.. విశాఖ ప్రజలు కోరుకున్నది కాదని, పొలాలు ఉన్నందున వైకాపా నాయకులు కోరుకున్నారని ఆరోపించారు. జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ వైకాపాతో సన్నిహితంగా ఉంటున్నారనే ప్రశ్నకు ఆయనపై ఎలాంటి ఒత్తిడులు ఉన్నాయో అని పవన్‌ వ్యాఖ్యానించారు. 

ఇవీ చదవండి..!

కార్యకర్తలను పరామర్శించిన పవన్‌

ఫొటో గ్యాలరీ

పవన్‌ రాక.. పోలీసుల మోహరింపు! 

కాకినాడలో వైకాపా వీరంగం

 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని