మీకు చేతకాకపోతే.. తప్పుకోండి!
close
Updated : 16/01/2020 10:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మీకు చేతకాకపోతే.. తప్పుకోండి!

రాజధానిని మేము నిర్మించి చూపిస్తాం..
ముఖాముఖిలో కన్నాలక్ష్మీ నారాయణ వ్యాఖ్య

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి అనుభవరాహిత్యం, నియంతృత్వ ధోరణి వల్ల ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతుందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నాలక్ష్మీ నారాయణ విమర్శించారు. అమరావతి విషయంలో జగన్ చేసిన ప్రకటన వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. రాజధాని వ్యవహారంపై త్వరలోనే పార్టీ తరఫున పోరుబాట పడతామని ఆయన వెల్లడించారు. అధికార పార్టీ నేతల వ్యాఖ్యలు, జనసేనతో చెలిమి, భాజపా రాజకీయ కార్యచరణపై కన్నాలక్ష్మీనారాయణతో ముఖాముఖి. 

ప్రశ్న(ప్ర): అమరావతిని రాజధానిగా కొనసాగించాలనే అంశంపై మీ కార్యచరణ ఎలా ఉండబోతుంది?

జవాబు(జ): మొట్టమొదటగా రాష్ట్రంలోని జిల్లా అధ్యక్షులతో సమావేశాలు ఏర్పాటు చేసి, వారితో చర్చించిన తర్వాతే కార్యచరణ ప్రణాళికను ప్రకటిస్తాము.

ప్ర: రాజధాని  విషయమై రాష్ట్రంలో మిగిలిన ప్రతిపక్ష పార్టీలతో పోలిస్తే, మీ వైఖరి ఎలా ఉండబోతుంది?

జ: ఇన్ని రోజులు సీఏఏ(పౌరసత్వ సవరణ చట్టం)కి సంబంధించి కేంద్ర పార్టీ పెద్దలు మాకిచ్చిన కార్యచరణతో బిజీగా గడిపాం. ఇక మీదట రాజధాని అంశంలో ప్రత్యక్షంగా రైతులతో కలిసి పోరాడుతాం. మా పార్టీతో కలిసి పోరాడటానికి ఏ పార్టీ ముందుకొచ్చినా, మా కార్యచరణతో వారిని కలుపుకొని వెళ్తాం. అంతేకాని మేము ఏపార్టీతో కలవం. తెదేపాను అసలు కలుపుకొనే ప్రసక్తే లేదు. 

ప్ర: ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసిన రాజధాని అమరావతి. దీంతో రైతులు మీ పార్టీపైనే ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. వారికి ఎలాంటి భరోసా ఇవ్వనున్నారు?

జ: రాష్ట్ర ప్రభుత్వ పాలనలో ఎవరికి అన్యాయం జరిగినా మేము సహించేది లేదు. వారి తరఫున తప్పకుండా ప్రభుత్వంపై పోరాటానికి దిగుతాం. ఇప్పుడు రాజధాని విషయంలో కూడా  రైతుల వెన్నంటే ఉంటాం. కేంద్ర నాయకత్వం సైతం రాష్ట్ర పరిస్థితులను తీక్షణంగా గమనిస్తుంది. 

ప్ర: రాజధాని కోసం పోరాటం చేస్తున్న రైతులను కించపరిచే విధంగా అధికార పార్టీ నాయకుల వ్యాఖ్యలు ఉన్నాయి. దీన్ని మీరు ఏవిధంగా పరిగణిస్తున్నారు? 

జ: కేవలం ఒక అసమర్థుడు మాత్రమే ఇలాంటి వ్యాఖ్యలకు పూనుకుంటాడు. సమర్థుడు పని చేసి చూపుతాడు. ప్రజలను అగౌరవపరచడం చాలా దురదృష్టకరం. ఇప్పుడుకాకున్నా కచ్చితంగా వారికి ఒక రోజు సమాధానం చెప్పి తీరాలి. మళ్లీ స్థానిక సంస్థ ఎన్నికల్లో  ఓట్ల కోసం వారు ప్రజల దగ్గరకే వెళ్లాలి. రాజశేఖర్‌ రెడ్డి గారిని గుర్తుంచుకొని ప్రజలు ఆ పార్టీకి ఓట్లు వేసి గెలిపించారు. ఏడు నెలల్లోనే ఇంత నరకం చూపిస్తే.. 2024లో ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతారు. ఆ పార్టీని ప్రజలు పూర్తిగా మర్చిపోతారు.

ప్ర: మూడు రాజధానుల ప్రకటన ఇతర ప్రాంతాల ప్రజలకు సౌకర్యమని మీరు భావిస్తున్నారా?

జ: మూడు రాజధానుల ప్రకటన విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి మూర్ఖంగా ఆలోచించడం మానేసి  పునరాలోచించాలని కోరుతున్నాం. ముఖ్యమంత్రి మారినప్పుడల్లా రాజధాని మార్చడం అనేది భావ్యం కాదు.  ఒకప్పుడు అన్ని ప్రాంతాల ప్రజలకు అమోదయోగ్యమని భావించాకే రాజధాని ఖరారు చేశారు. వైకాపా సైతం ఒప్పుకుంది. ఇప్పుడు అధికార పార్టీ పోకడ వల్ల రాష్ట్ర అభివృద్ధి కుంటుపడే అవకాశం ఉంది. అలానే ప్రజలు తీవ్ర ఇబ్బందిపడాల్సి వస్తుంది. 

ప్ర: అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో రాజధాని మార్చడం వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందుతుందా?

జ: గత ప్రభుత్వంపై కక్ష సాధించేందుకు మాత్రమే అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో రాజధానులు మారుస్తున్నారు. ఇలాంటి చర్యలు రాష్ట్రానికి ఉపయోగపడటం అటుంచితే... ప్రజలు తీవ్ర నష్టపోతారు. 

ప్ర: ‘రాష్ట్ర భాజాపా నేతలు కేంద్రంతో మాట్లాడి రూ.లక్షా తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇప్పించమనండి, రాజధాని అమరావతిలోనే కొనసాగిస్తాం అని’ చెప్పిన మంత్రి  వెల్లంపల్లి శ్రీనివాస్‌ వ్యాఖ్యలను మీరు ఏవిధంగా తీసుకుంటారు?

జ: గత ప్రభుత్వం  విఫలమైంది. ఇప్పుడు అధికార పార్టీ నాయకులు అసమర్థులని వారే ఒప్పుకుంటున్నారు.  మీకు రాజధాని నిర్మించడం చేతకాకపోతే తప్పుకోండి... మేము కట్టి చూపిస్తాం. 

ప్ర: భాజపాతో జనసేన కలిసి పనిచేసేందుకు సిద్ధమైంది. దీనిపై మీ అభిప్రాయం?

జ:జేపీ నడ్డాతో పవన్‌ కల్యాణ్‌ దిల్లీ వెళ్లి మాట్లాడారు. ఈ విషయమై పార్టీ పెద్దలు ఎలా చెబితే అలా చేస్తాం. వారి ఆదేశాల మేరకు మేము నడుచుకుంటాం. 

 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని