2024లో వచ్చేది మా ప్రభుత్వమే: పవన్‌
close
Published : 17/01/2020 00:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

2024లో వచ్చేది మా ప్రభుత్వమే: పవన్‌

విజయవాడ: రాష్ట్ర భవిష్యత్తు, ప్రయోజనాల కోసం భాజపాతో కలిసి నడిచేందుకు ముందుకొచ్చామని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. ఈ అంశంపై భాజపా పెద్దలతో గత కొన్నాళ్లుగా చర్చలు జరుపుతూ వచ్చానని చెప్పారు. రెండు పార్టీల మధ్య ఉన్న చిన్నచిన్న సమస్యలు పరిష్కరించుకుంటామన్నారు. విజయవాడలోని మురళి ఫార్చ్యూన్‌ హోటల్‌లో భాజపా నేతలతో కీలక భేటీ ముగిసిన అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో పవన్‌ మాట్లాడారు. భాజపాతో గతంలో ఏర్పడిన అంతరాలను తొలగించుకున్నామన్నారు. తెదేపా, వైకాపా ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని ఆయన వివరించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో భాజపా-జనసేన ప్రభుత్వాన్ని స్థాపిస్తామని పవన్‌ ధీమా వ్యక్తం చేశారు.

తృతీయ ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారు

‘‘ప్రజలు విసిగిపోయారు. ఇప్పుడు పాలెగాళ్ల రాజ్యం.. అంతకుముందు అవకతవకలు, అవినీతితో కూడిన పరిపాలన. ప్రజలు తృతీయ ప్రత్యామ్నాయాన్ని కోరుకుంటున్నారు. దాన్నే భాజపా-జనసేన అందించబోతున్నాయి. ఈ కలయికకు అండగా నిలబడిన ప్రధాని మోదీ, అమిత్‌షాకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాం. ఏపీలోనే కాకుండా అవసరమున్న ప్రతిచోటా మనస్ఫూర్తిగా, సంపూర్ణంగా కలిసి పనిచేస్తామని వారికి హామీ ఇచ్చాం. రెండు పార్టీల నాయకుల మధ్య సమన్వయం కోసం కమిటీని ఏర్పాటు చేసుకుంటాం. స్థానిక ఎన్నికలతో పాటు సార్వత్రిక ఎన్నికల్లోనూ భాజపాతో కలిసే వెళ్తాం’’ అని పవన్‌ వివరించారు.

రాజధాని తరలిస్తే చూస్తూ ఊరుకోం

‘‘గతంలో రాజకీయంగా అభిప్రాయాలు తీసుకున్న తర్వాత రాజధానిగా అమరావతిని నిర్ణయించారు. ఇప్పుడు ఏకపక్షంగా తరలిస్తారని అనుకోను. కులతత్వం, కుటుంబపాలనతో నిండిన రాజకీయ వ్యవస్థను మా కూటమితో ప్రక్షాళన చేస్తాం. అంతపెద్ద రాజధాని సాధ్యం కాదని అప్పుడే చెప్పా. 33వేల ఎకరాలు ఎందుకని అడిగా. ఇప్పుడు అవే అనుమానాలు నిజమయ్యాయి.. రైతులు రోడ్డున పడ్డారు. రాజధానిని తరలిస్తే రోడ్లపైకి రావడమే కాదు.. అవసరమైతే న్యాయపోరాటం చేస్తాం. అమరావతిని తరలిస్తే చూస్తూ కూర్చోము.. తెగించే నాయకత్వం ఉంది’’ అన్నారు.

ప్రత్యేక ప్యాకేజీకి తెదేపా అంగీకరించక పోవాల్సింది!

‘‘రాష్ట్రానికి మూడు రాజధానులు అనడం ప్రజలను మభ్యపెట్టడమే. హైకోర్టు పెడితే దాన్ని రాజధాని అనరు. హైకోర్టును తరలించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ప్రత్యేక హోదా విషయంలో తెదేపా బాధ్యత వహించాలి. అప్పట్లో వాళ్లు ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించకపోతే బాగుండేది. ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి 22 మంది ఎంపీలున్న వైకాపానే అడగాలి’’ అని పవన్‌ వ్యాఖ్యానించారు.

సీఏఏపై కొందరు అపోహలు సృష్టిస్తున్నారు

‘‘అఖండ భారతంగా ఉన్న మనదేశం నుంచి పాకిస్థాన్‌ విడిపోయింది. పాక్‌ ఇస్లాం దేశంగా చెప్పుకుంటున్నా.. మన దేశాన్ని హిందూ దేశంగా చెప్పలేదు. బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌ దేశాల్లో వెనుకబడిన వర్గాలు, దళితులు ఇబ్బందులు పడుతున్నారు. అలాంటివారు ఇబ్బందులు పడకుండా ప్రధాని మోదీ చర్యలు తీసుకుంటామన్నారు. ఇక్కడి ముస్లింలకు పౌరసత్వం రద్దు చేస్తారని కొందరు అపోహలు సృష్టిస్తున్నారు. అది పూర్తిగా అవాస్తవం.. మన దేశంలో ముస్లింలకు ఎలాంటి ఇబ్బందీ లేదు’’ అని చెప్పారు.

వైకాపా ప్రభుత్వం అన్ని అంశాల్లో విఫలం: సునీల్‌ దేవ్‌ధర్‌

సంక్రాంతి సమయంలో భాజపా-జనసేన మధ్య పొత్తు కుదరడటం శుభకరమని భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ సునీల్‌ దేవ్‌ధర్‌ అన్నారు. ఏపీ రాజకీయాల్లో ఇవాళ చరిత్రాత్మకమైన రోజని చెప్పారు. రాష్ట్రంలో చీకట్లు తగ్గి వెలుగులు పెరగనున్నాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం అన్ని అంశాల్లో విఫలమైందని..వైకాపా, తెదేపాతో తమకు ఎలాంటి అవగాహన లేదని చెప్పారు. సిద్ధాంతపరమైన ఏకాభిప్రాయంతోనే భాజపా-జనసేన మధ్య పొత్తు కుదిరిందని ఆయన స్పష్టం చేశారు.

మిగతా ఏ పార్టీలతోనూ సంబంధాల్లేవ్‌: జీవీఎల్‌

ఏపీ రాజకీయాల్లో ఈరోజు చరిత్రాత్మక నిర్ణయం జరిగిందని భాజపా ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు అన్నారు. రాష్ట్ర రాజకీయాలను ప్రక్షాళన చేయడంలో రెండు పార్టీల కలయిక శుభ పరిణామంగా భావిస్తున్నామన్నారు. రాష్ట్రంలో జనసేనతో తప్ప ఏ ఇతర పార్టీలతోనూ భాజపాకు రాజకీయ సంబంధాలు లేవని ఆయన స్పష్టం చేశారు. వచ్చే నాలుగున్నరేళ్లపాటు ప్రజా సమస్యలపై పోటీ చేసి ప్రత్యామ్నాయ రాజకీయశక్తిగా ఎదుగుతామన్నారు. భాజపాతో కలిసి పనిచేయాలని నిర్ణయించినందుకు పవన్‌కు జీవీఎల్‌ అభినందలు చెప్పారు. ఏపీలో అద్భుత రాజకీయ ఫలితాలు సృష్టించగలమని..అభివృద్ధినే ఆధారంగా చేసుకుని ఈ కూటమిని ప్రజలు ఆదరిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. 

 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని