వైకాపా ప్రభుత్వాన్ని కూల్చేవరకు నిద్రపోం:పవన్‌
close
Updated : 21/01/2020 16:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వైకాపా ప్రభుత్వాన్ని కూల్చేవరకు నిద్రపోం:పవన్‌

అమరావతి: వైకాపా వినాశనం మొదలైంది.. భవిష్యత్తులో వైకాపా మనుగడ ఉండదని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. నిన్న పోలీసుల దాడిలో గాయపడిన రాజధాని రైతులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారినుద్దేశించి మాట్లాడారు. కనికరం లేకుండా పోలీసుల లాఠీఛార్జి చేయడం తనకు కంటతడి పెట్టిస్తోందన్నారు. రాజధాని రైతుల గురించి వైకాపా నేతలు వాడిన పదజాలం ఆ పార్టీ ఆలోచనా విధానమేనన్నారు. ఏపీకి అమరావతే శాశ్వత రాజధానిగా ఉంటుందని హామీ ఇచ్చారు.

శాశ్వత రాజధాని అమరావతే!

‘‘ఇంతమంది రైతులతో కన్నీళ్లు పెట్టించారు. వైకాపా నేతలు ఫ్యాక్షన్‌ సంస్కృతిని ప్రతిబింబిస్తున్నారు. రాజధాని ఇక్కడే ఉండాలని సమష్టిగా నిర్ణయం జరిగింది. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ చేస్తే కేసులు పెట్టండి. ఒకే సామాజికవర్గం, ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ అంటూ ప్రచారం చేస్తున్నారు. చరిత్రలో ఎప్పుడూ ఇంతమంది ఆడపడుచులను హింసించింది లేదు. ఇంతపెద్ద ఎత్తున భూములు ఇవ్వడం జరగలేదు. వైకాపా వాళ్లకు అమరావతిలో భూములు ఉంటే రాజధాని మార్చరు. ఇక్కడి నుంచి రాజధాని కదలదు. ధర్మంపై నిలబడితే అది మనల్ని కాపాడుతుంది. అమరావతి పరిరక్షణ సమితితో కలిసి పనిచేస్తాం. రైతులకు మాటిస్తున్నా.. ఎన్ని రాజధానులు మార్చినా శాశ్వత రాజధాని అమరావతే. విశాఖలో భూములు కొని అక్కడికి రాజధాని మారుస్తున్నారు. రైతుల బాధ వింటుంటే ఆవేదన కలుగుతోంది. పాశవికంగా రైతులపై దాడులు చేశారు. వారిని పరామర్శించేందుకు కూడా అనుమతించలేదు. పోలీస్‌ శాఖను వైకాపా నేతలు వ్యక్తిగతానికి వాడుకుంటున్నారు. వైకాపా ప్రభుత్వాన్ని కూల్చేవరకు జనసేన నిద్రపోదు. మీ శరీరంపై తాకిన దెబ్బలు నా గుండెలకు బాగా తాకాయి. అమరావతి ఇక్కడే ఉంటుంది.. మీకు అండగా నేనుంటా’’ అన్నారు.

రేపు దిల్లీకి పవన్‌

‘‘రేపు దిల్లీకి వెళ్తున్నా.. రాజధాని మార్పుపై అన్నీ వివరిస్తాను. కానీ ఒకటి మాటిస్తున్నా.. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అమరావతిని శాశ్వతంగా ఉంచేలా పోరాటం చేస్తాం. అన్ని భయాలూ పక్కన పెట్టండి. నేను అవకాశవాద రాజకీయాలు చేయను. ప్రజలకు మనశ్శాంతి కల్గించే రాజకీయాలు చేస్తా’’ అని పవన్‌ అన్నారు.

 

 

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని