దిల్లీలో పవన్‌.. వారంలో రెండోసారి..!
close
Updated : 22/01/2020 18:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దిల్లీలో పవన్‌.. వారంలో రెండోసారి..!

నిర్మలా సీతారామన్‌తో భాజపా- జనసేన బృందం భేటీ

దిల్లీ: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ హస్తిన చేరుకున్నారు.  ఏపీ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని పవన్‌ తీవ్రంగా వ్యతిరేకించిన నేపథ్యంలో ఆయన దిల్లీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. నిన్న రైతులతో జరిగిన సమావేశంలో అమరావతే ఏపీకి శాశ్వత రాజధానిగా ఉంటుందంటూ వ్యాఖ్యానించిన పవన్‌.. వారం రోజుల వ్యవధిలోనే భాజపా అధిష్ఠానంతో భేటీ కోసం మరోసారి దిల్లీకి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.  రాజధాని మార్పు ఉండబోదంటూ ఆయన చేసిన వ్యాఖ్యల వెనుక ఉన్న ఆంతర్యమేంటి? భాజపా నేతలతో ఆయన ఏయే అంశాలపై చర్చిస్తారు? అమరావతిపై జనసేన, భాజపా భవిష్యత్తు ఉమ్మడి కార్యాచరణ ఎలా ఉండబోతోందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే భాజపా, జనసేన రెండు పార్టీలూ రాజధానిగా అమరావతే ఉండాలంటూ డిమాండ్‌ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో పవన్‌ వెంట ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ ఉన్నారు. ఇప్పటికే భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు దిల్లీలోనే ఉండటంతో ఇరు పార్టీలూ ఇకపై రాష్ట్రంలో ఎలాంటి ఏ అజెండాతో ముందుకెళ్లాలనే అంశంపైనా నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.

మరోవైపు, జనసేన- భాజపా బృందం దిల్లీలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయింది. రాష్ట్రంలో మూడు రాజధానుల అంశం, ఆర్థిక పరిస్థితులు, అభివృద్ధి అంశాలపై ఆమెతో చర్చిస్తున్నట్టు సమాచారం.  ఏపీలో భాజపా, జనసేన కలిసి ముందుకెళ్లాలని నిర్ణయించిన నేపథ్యంలో మర్యాదపూర్వకంగానే ఈ భేటీ జరిగినట్టు తెలుస్తోంది. ఇటీవల భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమై ఇరు పార్టీలూ కలిసి నడవాలని నిర్ణయించుకున్న అంశానికి కొనసాగింపుగానే ఈ భేటీ జరుగుతున్నట్టు భాజపా వర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్ర అభివృద్ధికి ఎలాంటి చర్యలు చేపట్టాలి? గత ఐదేళ్ల నుంచి ఇప్పటివరకు కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ నుంచి రాష్ట్రానికి వచ్చిన నిధులు వివరాలు, వాటిని సద్వినియోగం చేసుకొనే రీతిలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిందా? లేదా? అనే అంశాలపై చర్చించేందుకు పవన్‌ ఆమెతో భేటీ అయినట్టు తెలుస్తోంది. ఈ భేటీ సాయంత్రం 4గంటల వరకు కొనసాగనుంది. ఆ తర్వాత భాజపా, జనసేన నేతల బృందం మీడియాతో మాట్లాడనుంది. నిర్మలా సీతారామన్‌తో భేటీ అయిన వారిలో భాజపా నుంచి కన్నా లక్ష్మీనారాయణ, సునీల్‌ దేవధర్‌, జీవీఎల్‌ నరసింహారావు, పురంధేశ్వరి ఉన్నారు. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని