కొత్తవి రాకుండా..ఉన్నవి పోతున్నాయి:పవన్‌
close
Updated : 06/02/2020 19:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొత్తవి రాకుండా..ఉన్నవి పోతున్నాయి:పవన్‌

అమరావతి: రాష్ట్రంలో కొత్త పరిశ్రమల స్థాపనకు సానుకూల పరిస్థితులు నెలకొల్పాల్సిన ప్రభుత్వం ఆ బాధ్యతను విస్మరిస్తోందని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు. కొత్తవి రాకపోగా.. ఉన్న పరిశ్రమలు, సాఫ్ట్‌వేర్‌ సంస్థలు రాష్ట్రాన్ని వీడి వెళ్లిపోతున్నాయని ఆయన ఆరోపించారు. కరవు ప్రాంతమైన అనంతపురం జిల్లా నుంచి కియా మోటార్స్‌ పరిశ్రమలోని యూనిట్లు పొరుగు రాష్ట్రానికి తరలిపోతున్నాయంటూ వస్తున్న వార్తలు విస్మయాన్ని కలిగిస్తున్నాయన్నారు. ఈ మేరకు పవన్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. కియా తరలిపోతోందనే వార్తను ప్రపంచానికి తెలియజేసిన ‘రాయిటర్స్‌’ ఆషామాషీ సంస్థ కాదన్నారు. ప్రముఖ ఆటోమొబైల్‌ సంస్థగా ఉన్న కియా.. తన ప్లాంట్‌ను విస్తరిస్తుందనుకుంటే ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్లేందుకు సిద్ధపడటం ప్రభుత్వ విధాన లోపాలను తెలియజేస్తోందని పవన్‌ ఆక్షేపించారు.

విశాఖలో మిలీనియం టవర్స్‌ నుంచి సాఫ్ట్‌వేర్‌ సంస్థలను ఖాళీ చేయించడం ఆ రంగం ఇకపై ఏపీ వైపు చూడకుండా చేయడమే అవుతుందని పవన్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఒక సంస్థ నూతనంగా పెట్టుబడి పెట్టి కార్యకలాపాలు మొదలు పెట్టేందుకు రూ.కోట్ల వ్యయం అవుతుందన్నారు. ఉపాధి కల్పనకు ఆస్కారం ఉన్న రంగాలను ప్రోత్సహించకపోగా నిరుత్సాహకర పరిస్థితులు సృష్టిస్తే ఆర్థికాభివృద్ధి ఏ విధంగా సాధ్యమవుతుందని పవన్‌ ప్రశ్నించారు. ప్రకాశం జిల్లాలో రూ.24వేల కోట్ల పెట్టుబడితో కాగితం పరిశ్రమ స్థాపిస్తామని ఒప్పందం చేసుకున్న ఏషియన్‌ పేపర్స్‌ అండ్‌ పల్ప్‌ పరిశ్రమ మహారాష్ట్రకు వెళ్లిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా రాష్ట్రానికి రావాల్సినవి.. ఇప్పటికే ఉన్నవీ తరలిపోతుంటే ఏ విధంగా ఏపీ పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని ప్రశ్నించారు. ఉపాధి అవకాశాలు పెంచి వలసలు అరికట్టాల్సిన ప్రభుత్వం ఆ బాధ్యతలను వదిలేసి రద్దులు, కూల్చివేతలు, తరలింపులు అంటోందన్నారు. నిర్మాణాత్మక ఆలోచనలు, ప్రణాళికలు లేని పాలకపక్షాన్ని చూసే పారిశ్రామిక సంస్థలు రాష్ట్రం నుంచి తరలిపోతున్నాయనే విషయాన్ని ప్రభుత్వం గ్రహించాలని పవన్‌ ఎద్దేవా చేశారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని