కేజ్రీవాల్‌ ప్రభుత్వంపై శివసేన ప్రశంసలు
close
Published : 08/02/2020 00:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కేజ్రీవాల్‌ ప్రభుత్వంపై శివసేన ప్రశంసలు

ముంబయి: మరికొన్ని గంటల్లో దిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్‌)పై శివసేన ప్రశంసల వర్షం కురిపించింది. గత ఐదేళ్ల పాలనలో ఆప్‌ ప్రభుత్వం అనేక ఆదర్శవంతమైన కార్యక్రమాలు చేపట్టిందని కొనియాడింది. దిల్లీలో చేపడుతున్న విధానాల్ని కేంద్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాల్లోనూ అమలు చేస్తే బాగుండేదని హితవు పలికింది. దిల్లీ ప్రజలకు ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ ఇచ్చిన హామీల్ని నెరవేర్చినందుకు ఆయన్ని ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌ షా సత్కరించాల్సిందని వ్యాఖ్యానించింది. కానీ, అలా చేయకుండా ‘హిందూ-ముస్లిం’ అంశాన్ని లేవనెత్తుతూ ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు భాజపా నాయకులు, మంత్రులు ప్రయత్నిస్తున్నారని విమర్శించింది. ఈ మేరకు నేడు అధికారిక పత్రిక సామ్నాలో శివసేన సంపాదకీయం ప్రచురించింది. 

మహారాష్ట్ర, ఝార్ఖండ్‌లో ఓటమి చవిచూసిన భాజపా.. దిల్లీలో గెలిచేందుకు ఉవ్విళ్లూరడంలో తప్పు లేదని శివసేన అభిప్రాయపడింది. ఈ క్రమంలో 200 మంది ఎంపీల్ని, భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని, కేంద్ర మంత్రుల్ని రంగంలోకి దింపిందని గుర్తుచేసింది. అయినా కేజ్రీవాలే బలమైన అభ్యర్థిగా ఉన్నారని అభిప్రాయపడింది. పాలనాపరమైన పరిమితులు ఉన్నప్పటికీ.. మెరుగైన విద్య, వైద్య ఆరోగ్యం, కనీస వసతులు కల్పించడంలో కేజ్రీవాల్‌ విజయవంతమయ్యారని ప్రశంసించింది. పేద పిల్లలు చదువుతున్న ప్రభుత్వ పాఠశాలలు ఆదర్శ విద్యాలయాలుగా నిలుస్తున్నాయని పేర్కొంది. బస్తీ దవాఖానాలు మెరుగైన సేవలు అదిస్తున్నాయని తెలిపింది. హామీ ఇచ్చినట్లుగా తాగునీరు, విద్యుత్తు ఛార్జీ ప్రయోజనాలు కల్పిస్తోందని గుర్తుచేసింది. 

ప్రచారంలో భాగంగా కేజ్రీవాల్‌ని భాజపా నాయకులు ‘ఉగ్రవాది’గా అభిర్ణించడాన్ని శివసేన తప్పుబట్టింది. అదే నిజమైతే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించింది. ప్రచారంలో భాగంగా ప్రధాని చేస్తున్న ఆరోపణల్లో కాస్త సంయమనం పాటించాలని.. పదవికి ఉన్న హుందాతనాన్ని తగ్గించొద్దని హితవు పలికింది. ఎండిన సరస్సులో కమలం వికసించాలని చూస్తోందని వ్యాఖ్యానించింది. గత ఐదేళ్లలో తాను చేసిన అభివృద్ధిని చూసి ఓటేయాలంటున్న కేజ్రీవాల్‌ రాజకీయాల్లో కొత్త ఒరవడిని సృష్టిస్తున్నారని అభిప్రాయపడింది. దిల్లీ ప్రజలకు సరైన అవగాహన ఉందని.. వారికి ఎవరూ సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని