మందడంలో పవన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు
close
Published : 16/02/2020 00:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మందడంలో పవన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

మందడం: ప్రజల నమ్మకాన్ని పోగొట్టుకొని ఏ ప్రభుత్వమూ మనుగడ సాగించలేదని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. మందడంలో రైతులు, మహిళల నిరసనకు ఆయన సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా రాజధాని మహిళలు తమ సమస్యలను జనసేనానికి వివరించారు. అనంతరం పవన్‌ మాట్లాడుతూ.. అధికార వికేంద్రీకరణపై జగన్‌ ఎన్నికలకు ముందే ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. పదవిలో లేకుంటే ఒకలా.. ఉంటే మరోలా మాట్లాడతారా? అని ప్రభుత్వాన్ని నిలదీశారు. రాజధాని ఉద్యమంలో రైతులకు అండగా పోరాటం చేస్తానని పవన్‌ పునరుద్ఘాటించారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర వైపు వెళ్లినప్పుడు అక్కడి ప్రజలు అమరావతి రైతుల కన్నీళ్లపై రాజధాని వస్తే మాకేం ఆనందం ఉంటుందని అంటున్నారని పవన్‌ చెప్పారు.  

రోజూ వార్తల్లో కనిపించే వ్యక్తినికాదు!
‘‘నాకు అధికారం లేదు.. ఉన్న ఒక్క ఎమ్మెల్యే ఉన్నారో, లేదో తెలియదు. నేను ఓట్ల కోసం రాలేదు.. మీకు ఆసరాగా ఉండాలని వచ్చా. రైతులపై జరిగిన దాడిని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాను. నేను ప్రతిరోజూ వార్తల్లో కనిపించే వ్యక్తిని కాదు. పత్రికల్లో  కనిపించడం కోసం వార్తలను సృష్టించను.. లేని వార్తలను సృష్టించను. ఉన్న సమస్యను బలంగా వినిపిస్తా. జగన్‌ ఇప్పుడే కళ్లు తెరిచిన పసిపాపలా మాట్లాడుతున్నారు.  రాజకీయ క్రీడలో పోలీసులు భాగం కాకూడదు’’ అని పవన్‌ అన్నారు.

సీఎం.. ఏ రాజధానికి నిధులడిగారు?
‘‘రాజధాని తరలింపును రియల్‌ ఎస్టేట్‌ క్రీడలా మార్చారు. మూడు రాజధానుల అంశం సమ్మతం కాదని కేంద్ర పెద్దలు చెప్పారు. భాజపాతో పొత్తు పెట్టుకొనేటప్పుడే దీనిపై స్పష్టత తీసుకున్నా. బేషరతుగా భాజపాతో పొత్తు పెట్టుకున్నాం.. సీట్ల గురించి మాట్లాడలేదు. అమరావతి విషయంలో మాత్రం స్పష్టత తీసుకున్నా. జనసేన, భాజపా అమరావతికి కట్టుబడి ఉన్నాయి. రాజధానికి నిధులు అడిగామని సీఎం జగన్‌ అంటున్నారు. ఏ రాజధానికి నిధులు అడిగారో సమాధానం చెప్పాలి. మళ్లీ విశాఖలో భూములు ఎందుకు తీసుకుంటున్నారు?’’ అని జనసేనాని ప్రశ్నించారు.

పొత్తులపై వైకాపా నేతలవన్నీ అబద్ధాలే..
‘‘పొత్తులపై వైకాపా నేతల వ్యాఖ్యలన్నీ అబద్ధాలే. భాజపా, వైకాపా పొత్తు పెట్టుకుంటే అందులో నేనుండను. భాజపా అలాంటి పనిచేస్తుందని భావించడం లేదు. ఒకవేళ రాజధాని మార్చినా మళ్లీ అమరావతికే తీసుకొస్తాం. రాజధాని తరలింపు వివాదానికి చంద్రబాబు, జగన్‌దే బాధ్యత. రాజధాని భూములను ఇళ్లస్థలాలకు ఇస్తామనడం సరికాదు. రాజధాని రైతులు తమ భూములను నవరత్నాల కోసం ఇవ్వలేదు. అమరావతిని కదిలించే శక్తి జగన్‌కు లేదు. రాజధాని అమరావతికి భాజపా, జనసేన కట్టుబడి ఉన్నాయి. రాజధాని అమరావతిగా ఉంటుందని ఒప్పందం రాసుకున్నాం.  ఇంత పెట్టుబడిపెట్టాక రాజధాని తరలింపు సరికాదు’’ అని పవన్‌ అన్నారు. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని