పోలవరం పనులపై సీఎం జగన్‌ సమీక్ష
close
Published : 29/04/2020 20:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పోలవరం పనులపై సీఎం జగన్‌ సమీక్ష

లాక్‌డౌన్‌ తర్వాత పనులు వేగవంతం చేయాలని సూచన

అమరావతి: లాక్‌డౌన్‌ ముగిసిన అనంతరం పోలవరం ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని అధికారులకు సీఎం జగన్‌ ఆదేశించారు. ఇందుకోసం అన్ని అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. స్టీల్, సిమెంట్‌ కొరత లేకుండా చూసుకోవాలన్నారు. జూన్ నెలాఖరులోగా పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వేను పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రాజెక్టుతో పాటు పునరావాస కార్యక్రమాల పనులను సైతం వేగవతం చేయాలని ఆదేశించారు. ఈ మేరకు పోలవరం ప్రాజెక్టు పనులపై సీఎం సమీక్షించారు. మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్, పలువురు అధికారులు హాజరయ్యారు. 

త్వరలో లాక్‌డౌన్ నుంచి మినహాయింపు వచ్చే అవకాశం ఉండటంతో పోలవరం ప్రాజెక్టు పనులను వేగవంతం చేసే అంశంపై ప్రధానంగా అధికారులతో సీఎం జగన్ చర్చించారు. ప్రస్తుతం ప్రాజెక్టు వద్ద నిర్మాణ పరిస్ధితిని అధికారులు సీఎంకు వివరించారు. వేసవి కాలంలోనే పనులు వేగంగా చేసేందుకు అవకాశం ఉంటుందని, లాక్‌డౌన్‌ కారణంగా నెల రోజులుగా ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయని అధికారులు సీఎంకు వివరించారు. కరోనా వల్ల నెలరోజులకు పైగా విలువైన సమయం పోయిందన్నారు. లాక్‌డౌన్‌ వల్ల ప్రాజెక్టు నిర్మాణానికి వినియోగించే సిమెంట్‌, స్టీల్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని వివరించారు. ఏప్రిల్‌ 20 నుంచి పరిస్థితులు మెరుగుపడ్డాయని తెలిపారు. ఇప్పుడిప్పుడే సిమెంటు, స్టీల్‌ సరఫరా మొదలవుతోందని సీఎం దృష్టికి తెచ్చారు. పోలవరం ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేయాల్సిన ఆవశ్యకతను దృష్టిలో పెట్టుకుని సిమెంటు, స్టీల్‌ సరఫరాకు ఎక్కడా ఇబ్బందులు రాకుండా చూడాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.

జూన్ నెలాఖరులోపు ప్రాజెక్టు స్పిల్‌వేను పూర్తిచేయడానికి ప్రయత్నాలు చేయాలని సీఎం జగన్‌ ఆదేశించారు. డిజైన్ల అప్రూవల్స్‌ వీలైనంత త్వరగా తెప్పించాలన్నారు. గతేడాది గోదావరికి భారీగా వరదలు వచ్చి పలు కుటుంబాలు ముంపుబారిన పడ్డాయని, ఈ సారి ఆ పరిస్థితి రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. ప్రాజెక్టు నిర్మాణంతో ముంపునకు గురైన ప్రతి కుటుంబాన్ని కూడా శరవేగంతో తరలించాలని సీఎం ఆదేశించారు. వారికి సంబంధించిన సహాయ పునరావాస కార్యక్రమాలు చేపట్టాలని నిర్దేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యంగా తీసుకున్న అవుకు టన్నెల్‌-2, వలిగొండ, నెల్లూరు బ్యారేజీ, సంగం బ్యారేజీ, వంశధార-నాగావళి లింకు పనులపైనా సీఎం  జగన్ సమీక్షించారు. నిర్దేశించుకున్న కాలంలోగా పనులు పూర్తికావాలని ఆదేశించారు. 2020లో ఈ 6 ప్రాజెక్టులు తప్పనిసరిగా ప్రారంభం అవుతాయని అధికారులు సీఎంకు హామీ ఇచ్చారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని