‘రామ్‌ నామ్‌ సత్య హై’ నినాదాలతో..  
close
Updated : 14/04/2020 05:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘రామ్‌ నామ్‌ సత్య హై’ నినాదాలతో..  

లాక్‌డౌన్‌ వేళ వెల్లివిరిసిన మత సామరస్యం

జైపూర్‌: మతం కంటే మానవత్వం గొప్పదని లాక్‌డౌన్‌ వేళలో ఎన్నో సంఘటనలు నిరూపిస్తున్నాయి. ఇటీవల మధ్యప్రదేశ్‌లోని ఓ హిందూ వృద్ధురాలి అంత్యక్రియల్లో ముస్లిం యువకులు సాయం చేసి మత సామరస్యానికి ప్రతీకగా నిలిచారు. తాజాగా అలాంటి సంఘటనే రాజస్థాన్‌లోని జైపూర్‌లో పునరావృతం అయింది. క్యాన్సర్‌తో మరణించిన 35 ఏళ్ల రాజేంద్ర బాగ్రి దహన సంస్కారాల్లో ముస్లింలు పాల్గొని అందరికీ ఆదర్శంగా నిలిచారు. హిందూ సంప్రదాయంలో ‘రామ్‌ నామ్‌ సత్య హై’ నినాదాలతో మృతదేహాన్ని శ్మశానవాటికకి తీసుకెళ్లారు.

వివరాల్లోకి వెళితే..జైపూర్‌లోని భట్టా బస్తీలో ఉంటున్న రాజేంద్ర గత కొన్ని రోజులుగా క్యాన్సర్‌తో పోరాడుతున్నాడు. అనారోగ్య సమస్యలు మరింత పెరగడంతో ఆదివారం రాత్రి మరణించాడు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో దహన సంస్కారాలకు సాయం చేయడానికి బంధువులు ఎవరూ రాలేదు. అతడి భార్య, పిల్లలు, సోదరుడు మాత్రమే ఉన్నారు. దీంతో ఇంటి సమీపంలో నివసించే ముస్లింలు అంత్యక్రియల్లో సాయం చేయడానికి పూనుకున్నారు. వాటికి కావాల్సిన ఏర్పాట్లు చేశారు. హిందూ సంప్రదాయం ప్రకారం ‘రామ్‌ నామ్‌ సత్య హై’ అనే నినాదాలతో మృతదేహాన్ని భుజాలపై మోసి మత సామరస్యాన్ని చాటుకున్నారు. కొంత దూరం మోసుకెళ్లిన తర్వాత మృతదేహాన్ని వ్యాన్‌లో శ్మశానవాటికకి తరలించారు.

‘‘గత కొంత కాలం నుంచి అతడు క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. అతడికి ఇక్కడ బంధువులు ఎవరూ లేరు. దీంతో అతడి అంత్యక్రియల్లో సాయం చేయాలని మేమంతా నిర్ణయించుకున్నాం. కులం, మతం కంటే మానవత్వం గొప్పదని భావించే వ్యక్తులు ఉంటారని చెప్పడానికి ఇదే నిదర్శనం’’ అని అంత్యక్రియల్లో పాల్గొన్న ఓ ముస్లిం తెలిపారు. ‘‘కర్ఫూ నేపథ్యంలో అయిదుగురికి మాత్రమే దహన సంస్కారాల్లో పాల్గొనడానికి అనుమతి ఇచ్చాం. సమీపంలో నివసిస్తున్న ముస్లింలు రాజేంద్ర కుటుంబానికి సాయం చేశారు. అన్ని ఏర్పాట్లు చేశారు. చితికి అతడి సోదరుడు నిప్పు అంటించారు’’ అని పోలీసు అధికారి శివనారాయణ్‌ వెల్లడించారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని