విశాఖ దుర్ఘటన హృదయ విదారకం: పవన్‌
close
Published : 07/05/2020 12:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

విశాఖ దుర్ఘటన హృదయ విదారకం: పవన్‌

అమరావతి: విశాఖ సమీపంలోని ఆర్‌.ఆర్‌.వెంకటాపురంలో ఎల్‌జీ పాలీమర్స్‌ పరిశ్రమ నుంచి రసాయన వాయువు లీకేజీ దుర్ఘటన హృదయ విదారకం అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ‘పరిశ్రమ నుంచి విష వాయువులు విడుదలై అయిదు కిలోమీటర్ల మేర ప్రజలు భయకంపితులు కావడం... 8 మంది మృతి చెందటం.. వందల మంది తీవ్ర అస్వస్థతకు లోనవడం హృదయవిదారకం. మృతుల కుటుంబాలకు నా తరఫున, జనసేన తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. అస్వస్థతకు గురైనవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. వారికి ప్రభుత్వం మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలి. మృతుల కుటుంబాలకు ఆర్థికసాయం అందించాలి’ అని పవన్‌ విజ్ఞప్తి చేశారు. 

విశాఖ పరిధిలోని పరిశ్రమల్లో తరచూ ప్రమాదాలు చోటు చేసుకొంటున్నాయని పవన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణం పరిశ్రమల్లోని రక్షణ, కాలుష్య నియంత్రణ చర్యలను పరిశీలించాలని ఆయన డిమాండ్‌ చేశారు. పరిశ్రమల నుంచి విష రసాయనాలు, వ్యర్థాలు వెలువడుతుండటంతో ప్రజలు అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారన్నారు. చర్యలు తీసుకోవాలని అధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేస్తున్నా స్పందించక పోవడంవల్లే ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయని పవన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఇలాంటి పరిశ్రమల విషయంలో నిర్లక్ష్యం వహించకుండా ప్రజారోగ్యం పట్ల, పర్యావరణ పరిరక్షణపట్ల బాధ్యతగా ఉండాలని.. ఇలాంటి ఘటనలపై కఠినంగా వ్యవహరించాలని పవన్‌ విజ్ఞప్తి చేశారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని